చల్తీకానాం గాడీ .. ఎగ్జాం కా నాం సప్ప్లీ

నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజిలో పాఠాలు చెబుతున్న రోజుల్లో (1,2) అప్పుడప్పుడే వీసీఆర్లు, విడియో కేసెట్లు అద్దెకివ్వడం అదొక వ్యాపారంగా మొదలవుతోంది. బాపట్లకంతకీ అప్పటికి ఒక్క షాపు కూడా లేదు. కాస్త స్థితిపరులు, పెద్ద ఉద్యోగస్తులు (అంటే ఏజీ కాలేజి ఆచార్యులు, ఇంజనీరింగ్ కాలేజి ఆచార్యులు, బేంకాఫీసర్లు, ఇత్యాదులు) వాళ్ళ ఇళ్ళల్లో కలర్ టీవీలు మాత్రం ఉండేవి. ఐతే దూరదర్శన్ ఒకటే దిక్కు.

కాలేజీలో ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే, అంటే ఇంకా నెల కూడా కాలేదు, కాలేజి గేటు బయట పాకషాపులో టీతాగుతుంటే ఒక కుర్రాడొచ్చి నమస్కారం పెట్టాడు. చూడ్డానికి స్టైలుగా, కళాశాల విద్యార్ధిలాగా ఉన్నాడు, కానీ నేను పాఠం చెప్పే క్లాసుల్లో కుర్రవాడైతే కాదు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. మీతో పనుంది సార్, మీ ఇల్లెక్కడో చెప్పండి అన్నాడు. చెప్పొద్దూ, నాక్కొంచెం భయమేసింది. ఏంట్రా వీడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండా డైరెక్టుగా ఇంటికొస్తానంటున్నాడూ అని. ఐనా వాడు నా సైజులో సగం కూడా లేడు, పర్లేదని ధైర్యం తెచ్చుకుని, అసలు సంగతేంటో చెప్పు అన్నా. మనోడు ఆల్రెడీ ఒకటికి మూడు సార్లు మొదటి సంవత్సరపు ఇంజనీరింగ్ డ్రాయింగ్ పరీక్ష డింకీ కొట్టాడు. అయ్యగారు అసలుకి మూడో సంవత్సరం మొదలు బెట్టవలసింది, డ్రాయింగ్ సప్ప్లీ మిగిలిపోవడంతో చతికిలబడ్డాడు. నాతో వచ్చిన రాచకార్యమేంటంటే .. మీరు గ్రహించేశారు .. నేనా సబ్జక్టు ట్యూషను చెప్పాలి.

అదేంటోయ్, పెద్ద మేష్టార్లనెవర్నన్నా అడగొచ్చు కదా అన్నా. లేద్సార్, భయం సార్, ఐనా వాళ్ళు చెప్పరు అన్నాడు. పైగా ఇంకో మాటన్నాడు .. మొదటేడు మరి వాళ్ళే చెప్పారు సార్, అందుకనే ఫెయిలైనా అన్నాడు. ఇంకేం చెప్తాం? అవునోయ్, నేను ఫస్టియరోళ్ళకి డ్రాయింగ్ క్లాసు తీసుకుంటున్నా గానీ, లెక్కప్రకారం అది ఒక సీనియర్ లెక్చరర్కి సహాయకుడిగా మాత్రమే. అంచేత నేను డైరక్టుగా డ్రాయింగ్ పాథం చెప్పింది లేదు. మరి నేను అంతకంటే బాగా చెబుతానని నీకెందు కనిపించింది అన్నా? లేద్సార్, నేను కనుకున్నాన్సార్, మీరు బాగ చెప్తారంట సార్ .. అని సమాధానం.

సరే, ఇంక చేసేదేవుంది? ఎట్టాగూ మధ్యాన్నం నిద్ర లేచిన దగ్గర్నించీ ఫస్టుషో మొదలయ్యేదాకా బోరు కొడుతూనే ఉంది, వీళ్ళతో కాసేపు కాలక్షేపం అవుతుందని మూడింటికి రమ్మన్నా.

వాడు నిజంగా అసాధ్యుడు. మధ్యాన్నం తనతోబాటు ఇంకో నలుగుర్ని వేసుకొచ్చాడు. వాళ్ళల్లో ముగ్గురు ఇంకా ఫస్టియరు వాళ్ళే, కాకపోతే నా సెక్షను వాళ్ళు కాదు. ఓరి మీ దుంపల్తెగ, సప్ప్లీ కేండేట్లంటే అనుకోవచ్చు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళెవరూ లేరు. మీకేం పోయేకాలం? అన్నా. లేద్సార్, ఆ సార్ చెప్పేది అర్ధం కావట్లేదు, మీరెట్టన్నా హెల్ప్ చెయ్యాల్సార్. మీ సీనియర్ మాస్టారికి తెలిస్తే డిపార్టుమెంట్లో నా పరువు దక్కదురా బాబూ అన్నా. అబ్బే, మెమెందుకు చెప్తాం సార్, మూడో కంటి వాడికి తెలీదు అని హామీ ఇచ్చారు. వాళ్ళ పిచ్చి గానీ, బాపట్ల లాంటి వూళ్ళో, ఇట్లాంటివి దాచడం కుదురుతుందని ఎలా అనుకున్నారో అసలు. మొత్తానికి వాళ్ళు క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు డ్రాయింగ్ ట్యూషను కి రావడం మొదలెట్టారు. కానీ వాళ్ళ సీనియర్ మాస్టర్ నించి నాకేం ప్రాబ్లం రాలేదు, దేవుడి దయవల్ల.

వీళ్ళతో మంచి కాలక్షేపం అవుతూ ఉండేది. చూస్తుండగానే సప్ప్లీ పరిక్షలు దగ్గరకొచ్చినై. అందుకని ఆ ఆదివారం ఇంటికి విజయవాడెళ్ళడం మానేసి నాగప్రసాదునీ వాడి తోటి సప్ప్లీ కేండేటూనీ సాయంత్రం రమ్మన్నా, ఇంకో రెండు గంటలు రుబ్బుదామని. వాళ్ళోచ్చి కూర్చున్నారు, పాఠం మొదలు పెడుతుండగా, ఎక్కణ్ణించో లీలగా .. ఒక పాట వినవచ్చింది .. బాజూ ఊఊఊఊ .. బాబూ సంఝో ఇషారే, హారన్ పుకారే .. హమ్మ్ చల్తీ కా నాం గాడీ సినిమాలో మొదటి దృశ్యంలో పాట. హఠాత్తుగా బుర్రలో లైటు వెలిగింది. అంతకు ముందువారంలో గొప్ప గాయకనటుడు, నటగాయకుడు, కిషోర్ కుమార్ పరమపదించాడు! ఆయన గౌరవార్ధం ఈ ఆదివారం దూరదర్శన్లో ముందు ప్రకటించిన ఏదో చెత్త హిందీ సినిమాకి బదులు ఈ చిత్రరాజాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ జ్ఞానోదయం కావడమేవిటి, క్షణంలో డ్రాయింగ్ పుస్తకాలు బంద్, ఉత్తర క్షణంలో సైకిలు మీదున్నా. నాగప్రసాద్ దీనంగా సార్! రేపు సప్ప్లీ అన్నాడు. ఓరి వెర్రి నాయనా, రేపు సప్ప్లీ పోతే మార్చిలో ఇంకో సప్ప్లీ వస్తుంది. ఇప్పుడు చల్తీకానాం గాడీ వొదులుకుంటే మళ్ళీ ఎప్పటికి దొరికేను! చలో ఆఫీసర్సు క్లబ్బుకి అని సైకిలు దౌడాయించాను. తనవెంటన్ సిరి లచ్చి వెంటన్ టైపులో .. నా వెనకనే నారూమ్మేటూ, మరియూ స్టూడెంట్లిద్దరూనూ. మేం నిజంగా ఆఫీసర్లం కాకపోయినా, నేనూ నా రూమ్మేటూ బ్రిడ్జి బాగా ఆడేవాళ్ళం, అందుకని క్లబ్బుకి రానిచ్చేవారు. సుమారు తొమ్మిది దాకా సినిమా చూసి ఆనందించాము. కానీ అది మరీ పొడుగాటి సినిమా కావడంతో వార్తలు ఇట్లాంటి చెత్త కోసం సినిమా ఆపేశాడు. క్లబ్బు కట్టేస్తున్నారు. మాకూ ఆకళ్ళేస్తున్నాయి. మెస్సుకి పోయి తినాలి. అంత రాత్రి పూటా ఎక్కడీకెళ్తాం టీవీ కోసం. అలా కింకర్తవ్య విమూఢతలోనే భోజనం పూర్తి చేశాం. నా దిగాలు మొహం చూసి నాగప్రసాద్ ఏదో నిశ్చయానికొచ్చిన వాడిలా మాతో రండి సార్ అని తను అద్దెకున్న ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు ఒక ఏజీకాలేజి ఆచార్యుల ఇంటో అద్దెకున్నారు. వెళ్ళి వాళ్ళ ఓనర్ని అడిగి పర్మిషన్ సంపాయించి నాకూ నా రూమ్మేటుకీ మిగిలిన సినిమా చూసే అవకాశం కల్పించాడు. తరవాత తెల్సిన విషయం .. తను వారింట్లో అద్దెకున్న ఇన్ని నెలల్లోనూ ఎప్పుడూ టీవీచూస్తానని వారిని అడగలేదుట! అలా నా గురుదక్షిణ ఇచ్చుకున్నాడు నాగప్రసాద్.

ఇంతకీ డ్రాయింగ్ సప్ప్లీ పాసయ్యాడో లేదో!

Comments

మురళి said…
ఇది అన్యాయం.. సినిమా చూపించినందుకైనా అతను పరీక్షా పాస్ అయ్యాడో లేదో తెలుసుకోవాల్సింది మీరు..
asha said…
మురళిగారు చెప్పింది నిజమేనండి.
అంత కష్టపడి సినిమా చూపిస్తే పాస్ అయ్యాడో, లేదో
తెలుసుకోపోతే ఎలా?
Padmarpita said…
నాగప్రసాద్ గారు... పాపం అయ్యారు,
బిచారా ఔర్ అనాడీ!!!
అంత కష్టపడి సినిమా చూసారు కాబట్టే మీకిప్పటివరకూ గుర్తుండిపోయింది.

పాపం నాగప్రసాద్ ...
అన్నగారూ!! నాగప్రసాద్ పాసయ్యాడో లేదో తెలియకపోతే ఎలా? ఈ రోజంతా అతనిగురించే ఆలోచిస్తుంటా.
మంచి జ్ఞాపకం!!!
ఖచ్చితంగా పాసయ్యుంటాడు. ఎందుకంటే, "నాగప్రసాద్" అనే పేరు గల వాళ్ళందరూ సప్లీల్లో "కింగ్" లు. నేను కూడా మా కాలేజీలో కింగ్ నే. :).
మోహన said…
>>ఓరి వెర్రి నాయనా, రేపు సప్ప్లీ పోతే మార్చిలో ఇంకో సప్ప్లీ వస్తుంది.

హ హ హ.. గురువంటే మీలా ఉండాలి గురువుగారూ.. జోక్ కాదు. నిజంగానే!
నాగప్రసాద్ పాసయ్యాడో లేదో నాకు తెల్సు. ఆ సస్పెన్సు పాఠకులకి మాత్రమే :)
హ హ సస్పెన్స్ మాకేననమాట :) ఏదేమైనా మీరు సినిమా కోసం రద్దు చేసిన ఒక్క క్లాస్ వలన ఫలితం తారు మారయ్యే అవకాశం లేదు కదా.. మొత్తానికి మీ శిష్యుడి గురుదక్షిణ బాగుంది.
Anonymous said…
హతోస్మి!ఎంత అదైతే మాత్రం మరీ ఇంత ఇదా...?:)
మాధవ్ said…
గురువుగారు మీరు ఏ బ్యాచ్ కి పాఠాలు చెప్పేవారో చెప్తారా..నేనూ బాపట్లలోనే చదివా అందుకే..
Vani said…
ఒక ఏడాది ఉన్నా బాపట్ల అలా గుర్తు వస్తూనే ఉంటుంది. మా వూరా మజాకా ?
సముద్రం గాలి, భావనారాయణ స్వామి కోవెల, కమ్మని మల్లెలు, సంపెంగలు, తమలపాకులు, బాదాం పాలు , పాలకోవా, జీడి పప్పు, పార్కులు, లైబ్రరీలు , పిచ్చి సినిమా హాళ్ళు, ప్రశాంతం గా ప్రపంచం ఎంత పరుగెత్తినా మేమింటే అన్నట్లు ఉండే ప్రజలు :). , వావ్, వెళ్ళాలి రెండు నెలలు అయింది ..
@మోహన .. కదా!
@aswinisri .. దేన్ని గురించి ఎంత ఏది? :)
@మాధవ్ .. మీ ప్రొఫైలు బొమ్మ చూస్తే, నేను పాఠం చెప్పిన టైములో మీకు నామకరణం జరుగుతూండి ఉండచ్చనిపిస్తోంది :) నేను పాఠం చెప్పిన సమయం గురించి మొదటి పోస్టులో మంచి క్లూనే ఉంది.
@మైత్రేయి .. నిజం. బాపట్ల చాలా గుర్తొస్తుంది.
Bolloju Baba said…
మైత్రేయగారూ,

సముద్రం గాలి, భావనారాయణ స్వామి కోవెల, కమ్మని మల్లెలు, సంపెంగలు, తమలపాకులు, బాదాం పాలు , పాలకోవా, జీడి పప్పు, పార్కులు, లైబ్రరీలు , పిచ్చి సినిమా హాళ్ళు, ప్రశాంతం గా ప్రపంచం ఎంత పరుగెత్తినా మేమింటే అన్నట్లు ఉండే ప్రజలు :).

పైవన్నీ మావూరిలో కూడా ఉన్నాయి. భావనారాయణ స్వామి కోవెలతో సహా (జయప్రభగారి కవితలోలాగే).... సరదాగా.

గురువుగారూ
పరీక్షల హాంగ్ ఓవర్ ఇప్పుడే దిగుతుందనుకొంటుంటే, మళ్లా మీరు..... :-)
బొల్లోజు బాబా
అయ్యో, నాగప్రసాద్ సంగతేమైందో ఏమిటో? ఎలా తెలుసుకోడం?
బావుందండీ, శిష్యుడు గారికి 'డ్రాయింగు' మీద భక్తి, గురువుగారికి సినిమా మీద ఆసక్తి. మొత్తమ్మీద ఇద్దరూ కళాపోషకులే!

నాగప్రసాద్: :)
Bhaskar said…
హమ్మయ్య ... లక్కీగా మొదటి ప్రయత్నంలొనే పాసవటంవల్ల ఈ గ్రూపు లొ నేను లెను..
Anonymous said…
నాగ ప్రసాద్ ఖచ్చితంగ పాసై ఉంటాడు.. :-) :-) :-)
నాగ ప్రసాద్ విషయం నాకు తెలియాలి..తెలియాలి
మాధవ్ said…
అవును నిజమేనండి నాది 2002-2006 బ్యాచ్
బాపట్ల జ్ఞాపకాలని ఒక్కసారి మళ్ళీ రేకెత్తించారు. భావనారాయణస్వామి గుడిదాకా రోజూ కలరింగుకెళ్ళుంటే ఎవరైనా పాసయిపోతారు ..:))