ఒక చుక్క మంచి నీటి కోసం

ఇంకొన్ని బాపట్ల జ్ఞాపకాలు

ఇంజనీరింగ్ కాలేజి రాకతో బాపట్లలో ఇళ్ళ మార్కెట్టు మీద తీవ్రమైన వత్తిడి వచ్చింది. పేరుకి మునిసిపాలిటీయే కానీ అదొక గ్లోరిఫైడ్ పల్లెటూరుగా ఉండేది ఆ రోజుల్లో. చాలా కాలంగా ఉన్న ఏజీ కాలేజి, ఆర్ట్సు కాలేజి జనాభా ఇంచుమించు అందరూ అక్కడ ఇళ్ళు కట్టుకుని స్థిరపడిపోయారు. ఇంజనీరింగ్ కాలేజి హాస్టలు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అంచేత తొంభై శాతం విద్యార్ధులు ఊళ్ళో అద్దెకి ఉంటూండే వాళ్ళు. దాంతో అద్దె ఇళ్ళకి గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది స్టూడెంట్సు ఉండటం ఊరివాళ్ళకి అలవాటై "బ్రహ్మచారులకి అద్దెకివ్వం" అనేవాళ్ళు కాదు గానీ, అసలు ఇళ్ళు ఖాళీగా కనబడేవి కావు. మాకు ఆ పోర్షను దొరకటమే గగనమై పోయింది.

మేము ఆ ఇంట్లో ప్రవేశించేప్పటికి అప్పుడే వారం పది రోజులుగా కాలేజి నడుస్తోంది, క్లాసులకి వెళ్ళొస్తున్నాం. ఆ ఇంట్లో వెనకాల దొడ్డిలో ఒక ఉప్పు నీళ్ళ బావి మాత్రం ఉండేది, మంచి నీళ్ళ వసతి లేదు. మరెలాగ అని ఇంటివాళ్ళని అడిగితే తాము పక్క వీధిలో ఉన్న పబ్లిక్ కుళాయి నించి రెండేసి బిందెలు తెచ్చుకుంటామని చెప్పారు. పాపం ఆడవాళ్ళే అక్కణ్ణించి తెచ్చుకుంటుంటే మగ ధీరులం, మనం ఒక కూజాడు నీళ్ళు తెచ్చుకోలేమా అని మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం. ఆ రోజు కూజా కొనుక్కొచ్చుకున్నాం.

మర్నాడు పొద్దున్నే లేచి నోట్లో బ్రష్షు పెట్టుకుని, మొదటిసారి నా వంతుగా కూజా పట్టుకుని పక్క వీధి పంపు దగ్గిర కెళ్ళాను. వేషం వేరే చెప్పక్కర్లేదుగా .. లుంగీ, జుబ్బా, భుజాన ఒక తువాలు, కాళ్ళకి హవాయి చెప్పులు. మామూలుగా ఏ పబ్లిక్ కుళాయి దగ్గరైనా కనిపించే సీనే ఈ కుళాయి దగ్గిర కూడా .. అప్పటికే ఒక అరడజను మంది అమ్మలక్కలు కుళాయి చుట్టూ గుంపుగా రణగొణధ్వనులుతో మాట్లాడుకుంటూ, కొండొకచో పోట్లాడుకుంటూ, బిందెల్లో, తప్పేలాల్లో, బక్కెట్లలో నీళ్ళు నింపుకుంటున్నారు. కూజా కింద పెట్టి, బ్రష్షుని నవుల్తూ "కిం కర్తవ్యం" అని ఆలోచనలో పడ్డాను. ఇంతలో ఒక పుణ్యాత్మురాలు నా దుస్థితిని గమనించి, "రండి బాబూ" అని మిగతా స్త్రీలని అదిలించి కుళాయి దగ్గర చోటు చేసింది. మనసులోనే ఆవిడకి దణ్ణం పెట్టుకుని, గబగబా పంపు దగ్గిరే మొహం కడిగేసుకుని, కూజా పంపుకింద పెట్టి అటూ ఇటూ చూస్తూ నిలబడ్డా.

సరిగ్గా కుళాయి కి ఎదురుగా వీధికి అవతలి పక్క ఒక పెద్ద రెండంతస్తుల మేడ ఉంది. పై అంతస్తులో ఇంటికి ముందు కొంత జాగా ఓపెన్ టెరేస్ లాగా ఉంది. ఆ జాగాలో పిట్ట గోడ వెంబడి ముగ్గురు కాలేజీ వయసు అమ్మాయిలు నిలబడి దంతధావనం చేస్తున్నారు. నైటీలు వేసుకుని ఉన్నారు. మరీ అలా పొద్దున్నే అమ్మాయిల్ని చూడ్డం మర్యాద కాదు అనుకుంటూనే కొంచెం చూశాను. ఒక డౌటొచ్చింది .. ఇంచుమించు ఒకే వయసున్న ముగ్గురమ్మాయిలు ఒకే ఇంట్లో ఎలా ఉన్నారబ్బా అని. ఇంకాసేపట్లో ఇంకో డౌటొచ్చింది వీళ్ళ మొహాలు ఎక్కడో చూసినట్టున్నాయే అని. ఆ గుర్తొచ్చింది .. వీళ్ళని కాలేజిలో చూశాను .. అంటే .. వీళ్ళు మా కాలేజి విద్యార్ధినులు. ట్యూబులైటు వెలిగింది. ఆ మేడ ఇల్లు కాదు .. మా కాలేజీవారు ఊళ్ళో అద్దెకి తీసుకున్న ఆడపిల్లల హాస్టలు. అంతే, ఒక్క వుదుటున కూజా పట్టుకుని పరుగున ఇంటికొచ్చి పడ్డాను.

నా అనుమానాన్ని మా ఇంటి ఓనరు నివృత్తి చేశాడు .. కుళాయి కెదురుగా ఆ మేడ మా కాలేజి ఆడపిల్లల హాస్టలే! చచ్చాం. ఇప్పుడెలా? మేమున్న ఇంటెదురుగా ఒక ముచ్చటైన డాబా ఇల్లుంది. వాళ్ళింట్లో మంచినీళ్ళ పంపుందని ఓనరు చెప్పాడు. అడగందే అమ్మైనా పెట్టదు గదా, అడిగి చూద్దాం అనుకుని ఆ సాయంత్రం ఎదురింటికి వెళ్ళి తలుపు తట్టాను. ఇంటాయన ఇంట్లోనే ఉన్నాడు. "మేం మీ ఎదురింట్లో కొత్తగా అద్దెకి దిగాం. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో రోజూ ఒక కూజాడు నీళ్ళు పట్టుకుంటాం" అని చాలా మర్యాదగా అడిగాను. ఆయన రౌడీ వెధవని చూసినట్టు నన్నొక డర్టీలుక్కేసి, "లేడీసుంటారండీ. వీలుకాదు" అనేశాడు. హమ్మ ఎదురింటాయనా, మీ ఆడలేడీసుని మేమేం కొరుక్కు తినంలే బాబూ అని మనసులోనే తిట్టుకుని, చేసేదేం లేక పైకొక వెర్రి నవ్వు నవ్వి వెనక్కి వచ్చేశా.

నేనూ నా రూమ్మేట్లూ మా వరండాలో సెటిలై, తలా ఒక సిగిరెట్టూ ముట్టించి బుర్రకి పదును పెట్టాము. ఈ మంచి నీళ్ళ సమస్య చాలా క్లిష్ట సమస్య అయి కూర్చుంది. వాళ్ళు మొదట్లో నా ఎడ్వంచర్లు చూసి నవ్వినా, ఆడపిల్లల హాస్టలు ముందున్న పబ్లిక్ కుళాయికి లుంగీలో (పోనీ పేంటు షర్టులో ఐనా) వెళ్ళి నీళ్ళు పట్టుకు రావడానికి వాళ్ళకీ ధైర్యం చాల్లేదు. ఇంతలో మా ఓనరు కొడుకు (నాకు డేవిడ్ బూన్ అని బిరుదిచ్చినవాడే) తన వానర సైన్యంతో కొబ్బరి మట్ట క్రికెట్ మొదలెట్టాడు. వాళ్ళ ఆట చూస్తుంటే ఐడియా వచ్చింది - నీళ్ళు తేవడానికి ఈ పిల్లగాణ్ణి నియోగిస్తే! ఇంట్లో చేరి ఒక రోజేగా ఐంది, ఇంకా వాడికి మేం మేస్టర్లమనే భయం ఏర్పడలేదు. అందుకని పిలవంగానే వచ్చాడు. నెలకి పది రూపాయలిస్తే పొద్దున్నే వాడు పబ్లిక్ కుళాయి నించి మాకొక కూజా నీళ్ళు తెచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆ తరవాత వాడు ఎక్కడ మేం చదువు చెప్పేస్తామో అని మొహం చాటేసినా, పాపం మంచి నీళ్ళు మాత్రం క్రమం తప్పకుండా తెచ్చేవాడు. నెలనెలా డబ్బులకి మాత్రం వాళ్ళమ్మని పంపేవాడు. అలా మాకు ఆ తొమ్మిది పది నెల్లపాటు నీటి సమస్య తీరింది.


కొసమెరుపు 1: నెమ్మది మీద తెలిసిన విషయం, ఎదురింటాయనకి ఇద్దరు పెళ్ళి కావలసిన కూతుళ్ళున్నారు. పాపం ఆయన భయం ఆయనది.

కొసమెరుపు 2: సందుమొగలోనో, పెద్ద బజారులోనో ఎదురింటాయన ఎదురుపడుతూనే ఉండేవాడు గానీ ఎప్పుడూ పలకరించిన పాపాన పోలేదు. మాకు మాత్రం ఏం తక్కువని మేమూ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలా ఉండగా కొన్ని నెలలు గడిచాక మా డిపార్టుమెంటు మేస్టారొకాయనకి పెళ్ళైంది బాపట్లలోనే. మేం కూడా వెళ్ళాం. అక్కడ ఎదురింటాయన ఆడపెళ్ళివారి తరపున మర్యాదలు చేస్తూ కనబడ్డాడు. మాతో ఉన్న సీనియర్ మేస్టర్లు మమ్మల్ని పరిచయం చేశారు. అప్పుడర్ధమైంది ఆయనకి మేం స్టూడెంట్లము కాదూ, లెక్చరర్లమని. పెళ్ళినించి వచ్చేస్తూంటే చెప్పాడాయన .. కావలసినప్పుడు వాళ్ళింట్లో మంచి నీళ్ళు పట్టుకోవచ్చనీ.

Comments

rākeśvara said…
చాలా సరదాగా వున్నాయండి మీ చిన్నటౌను అనుభవాలు.
Murali Nandula said…
మీ ఙ్ఞాపకాలు పాతవయినా, మాకు, ఆ కాలమాన ప్రదేశాల సంగతులు తెలుసుకోవటం, ఒక క్రొత్త అనుభవం. తప్పక వ్రాస్తూండగలరు!
Srini said…
మాల్గుడి డేస్ లాగా మీ టపాలు కూడా చదువుతుంటే అప్పటి కాలమాన పరిస్థితులు కళ్లముందు కదలాడుతున్నాయి. తప్పక ఇలాగే వ్రాస్తూండగలరు.
రాధిక said…
ఆ ఆడ స్టూడెంటులు గానీ మిమ్మల్ని అప్పటికే చూసుంటే వాళ్ళకి ఒక సంవత్సరం పాటూ పండుగే.[నవ్వుకోడానికి మంచి టాపిక్కులా]
Sriram said…
బాపట్లకెళ్ళడంతోటే నుడికారం కూడా మారిపోయింది. పిట్టగోడ, సందుమొగ...మర్చిపోయిన మాటలు. అక్కడక్కడ రమణగారు తొంగి చూసారు కూడా (హమ్మ ఎందురింటాయన). థేంక్యూ థేంక్యూ.....
అవును, అప్పటిదాకా జరిగిన అనుభవాలకి, ఆ తరవాత జరిగిన అనుభవాలకీ చాలా భిన్నమైనది బాపట్ల జీవితం. ఇంక మనం స్టూడెంట్లం కాదు అనే ఎరిక మనసుకెక్కటం ఒక ముఖ్యమైన పరిణామం. చిన్న ఊరు కావటం, చేసేది ఇంజనీరింగ్ కాలేజిలో లెక్చరరు ఉద్యోగం కావటంతో మనం చేసే ప్రతి పనినీ వెయ్యి కళ్ళు గమనిస్తుంటాయి, అందులో సగం మా కాలేజి విద్యార్ధులవే అని గ్రహింపుకొచ్చేప్పటికి పెద్దరికం తెచ్చి పెట్టుకోక తప్పలేదు.
@రాధిక - ఆహా, ఇంకో రెండు రోజులు అక్కడ నీళ్ళు పట్టుకోడానికి వెళ్ళుంటే అంతపనీ జరిగుండేదే. అదృష్టవశాత్తూ అది జరగలేదు.
Unknown said…
భలే ఇంటరెస్టింగుగా ఉన్నాయి మేష్టారూ...
అందులోనూ అమ్మాయిల ఎపిసోడ్లు కూడానూ ;)
pi said…
:). Vintha anubhavaalu. Naaku college lo thappa, college tarvaatha inlaanti anubhavaalu eduravaledu.
CH Gowri Kumar said…
బాపట్లలో ఏ సంవత్స్రం నుంచి ఏ సంఅత్సరం వరకు ఉన్నారు మీరు? నేను బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీలో 1996-2000 batchలో చదివాను.

బాపట్ల ఫోటోలు కొన్ని (పాత ఫోతోలు - ఇప్పటివి కావు):
http://csec96.freeservers.com/bapatla.html
http://csec96.freeservers.com/college2/home.html
Gowri Kumar - please read the preceding post too. Thank you for the pictures.
Ramani Rao said…
నిజంగానే నిజమా కొత్తపాళిగారు బహుముఖ ప్రజ్ఞాశాలి.. అన్నమాట!! తెలియజేసిన మీకు.(శ్రీ కృష్ణదేవరాయలు) ...ధన్యవాదములు.. బ్లాగ్ ద్వార మా అందరికి సూచనలు .. సలహాలు ఇస్తూ మాకు మార్గదర్శం అయిన గురువుగారు కొత్తపాళిగారికి వినమ్రంగా అందజేస్తున్న వందనములు.. [నేను నిజంగానే కొత్తపాళిగారు ఏ కళాశాల విధ్యార్దో (రచనల బట్టి) అనుకొన్నాను తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడితే.. (మీరిచ్చిన సలహాలు .. సూచనల విషయంలో) క్షమించండి కొత్తపాళిగారు..]
Ramani Rao said…
ఈమధ్య మా (బ్లాగ్) మీద కొంచం కినుక వహించినట్లున్నారు కొత్తపాళిగారు.. సలహాలు.. సూచనలు...అభిప్రాయాలు.. వెరసి వ్యాఖ్యలు??
Anonymous said…
ఇప్పుడే స్మైల్గారి టపాలో మీ ఫోటో చూశాను, మీరు Drexel లో PhD చేశారు కదూ?
@Srinivas.. అవునండీ. తమరెవరు?

@Rama ..cinnacUpEM lEdu. ceppa dalcukunnadi ceppavalasiMdi unnappuDu tappaka cebutAnu.
Anonymous said…
వందనాలు కొత్తపాళీ గారు,

మీ బహుముఖ ప్రఙ్ణ గురించి ఇదిగో ఇప్పుడే తెలిసింది. ఇన్ని విద్యలు సాధించడానికి ఎన్నాళ్ళు పట్టింది గురూజీ? కొంచం వివరంగా రాయకూడదూ, మా లాంటి వాళ్ళకు స్ఫూర్తిగా ఉంటుంది. ఏమంటారు?
rākeśvara said…
తరగతి పరిమాణం మూడు నుంచి వందకి పెరిగినట్టుంది :)
Dr. కో.పా అన్నమాట ! చాలా చదువు చదివారు. ఇలాంటి సమయాలలో నాకు Fight Club లో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది.
Tyler : How's it working out for you?
Narr.: What?
Tyler : Being clever?
@ప్రసాదం .. అంత స్ఫూర్తి చెందేంత ఏం లేదండీ. నేను చేసిన చేస్తున్న పనుల వివరాలు విశేషాలు ఈ బ్లాగు టపాల్లో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మా డాన్సు టీచరు గారిని గురించి కొంత చెప్పాలి .. అది నెమ్మది మీద బ్లాగుతాను.
@రాకేశ్వరా .. :-))
బాపట్ల కబుర్లు బావున్నాయి.
మీ బహుముఖ ప్రజ్ఞకు వందనం.
Ramani Rao said…
Thank you sir!! have a good day.
మళ్ళీ అప్పటి బాపట్ల కళ్లముందు కనిపిస్తుంది మీ జ్ఞాపకాలు చదువుతుంటే; ఇప్పటికి అంతేలేండి, అవే రోడ్లు, అవే సందులు, అవే ఇరుకులు. విద్యాపరంగా తప్పితే ఆ ఊరిలో ఇంకే వేరే అభివృద్ది ఏమి లేదు.

బాపట్ల గురించి నేను కూడ కొన్ని విషయాలు బ్లాగాలి, ఎప్పటికో మరి!! ముందుగా మీ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థుల దుశ్చర్యల గురించి!!!!!
Unknown said…
కిసుక్కు హి హి.. బాపట్ల బ్రహ్మచారి బాధలు బాగున్నాయి ;-)
ahiri said…
Thank you.Venkat tells me a lot about you blog too.
బాగునాయీ మీ జ్ఞాపకాలు...బాపట్లని ఒకసారి నా కళ్ల ముందు ఉంచారుగా...నేను కూడా త్వరలో రాస్తాను బాపట్ల గుర్నించి..ఇంకా నా స్కూల్ విషయాలే చాలా ఉన్నయీ..ఐతే మీరు ఏ సబ్జెక్ట్ చెప్పేవారు....నేను చదివింది ఆ కళాశాలలోనే
మాధవ్ said…
bapatla lo e department meedhi endhukante nenu akkade chadivaanu..
asha said…
చాలా బాగున్నాయి మీ కబుర్లు.
హహహ బాగున్నాయండీ కబుర్లు :)
Ruth said…
హ హా... టపా చివరికొచ్చే వరకూ నేను కూడా మీరు విద్యార్ధే అనుకున్నాను సుమండీ! బాగున్నాయి కబుర్లు