కబుర్లు - ఏప్రిల్ 6

"చూచు వారలకు చూడ ముచ్చటగ"

మొన్న మా స్థానిక దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిపిస్తూ, జీలకర్రా బెల్లం తంతు పూర్తికాగానే శాస్త్రిగారు దీనితో సీతారాములు దంపతులైనట్టు మైకులో ప్రకటించారు. వెంటనే హాల్లో ఉన్న భక్తులందరూ చప్పట్లు కొట్టి తమ హర్షామోదాల్ని తెలియజేశారు.

నాకిది భలే ఆశ్చర్యమనిపించింది.

దీన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇటువంటిదే ఇంకొక సందర్భం గుర్తొచ్చింది. సుమారు ఐదేళ్ళ క్రితం చికడపల్లి త్యాగరాజ గానసభలో ఒక డాన్సు స్కూలు వారి వార్షికోత్సవం చూడ్డానికి వెళ్ళాను. సీతాకళ్యాణం ఆ రోజు ముఖ్య ప్రదర్శన. పది నించీ పద్ధెనిమిది మధ్య వయసున్న పిల్లలు, చక్కటి కాస్ట్యూములు, మేకప్ తో, చాలా బాగా ప్రదర్శించారు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ రక్షణలో తాటకనీ సుబాహుణ్ణీ వధించి మారీచుణ్ణి పారదోలడం, ఉరుములు మెరుపుల స్పెషలెఫెక్ట్సూ .. అంతా మంచి హంగామాగా జరిపించారు. ఎట్టకేలకి యజ్ఞం ముగిసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులని వెంట బెట్టుకుని మిథిలా నగరానికి చేరుకున్నాడు.

సీతా స్వయంవరం జరుగుతోంది. అప్పటికప్పుడే జనక మహారాజు కొలువు తీరి ఉన్నాడు. గొప్ప గొప్ప రాజులంతా ఉన్నారు సభలో. ఈ శివధనువుని ఎక్కుబెట్టిన వాన్ని నా కూతురు సీత వరిస్తుందని జనకుడు ప్రకటించాడు. (అది ఉత్తుత్తి విల్లే, భరతనాట్యం కదా, ప్రాపులుండవు, అంతా అభినయమే!) రాజాధిరాజులు, తేజ ప్రతాపులు, మీసాలు దువ్వుతూ, తొడలు చరుస్తూ లేచి వెళ్తున్నారు. భంగపడి తిరిగి వస్తున్నారు. అందరి పనీ అయ్యింది. ముని కనుసైగ తెలిసి దశరథసూనుడు మదనవిరోధి శరాసనాన్ని సమీపిస్తున్నాడు. పాలబుగ్గల వాడు .. ఇంకా పసితనపు ఛాయలు వీడనే లేదు .. మహామహా బాహుబలులే ఎత్తలేని శివధనువుని ఇతను ఎత్తగలడా? ప్రేక్షకులలో ఉత్కంఠ! ధనువుని చేరుకున్నాడు. వొంగి పట్టుకున్నాడు. అవలీలగా పైకెత్తాడు. ఒక్క ఉదుటున వంచి నారి బిగించ బోయాడు. ఫెళ్ళుమనె విల్లు .. .. (అంతా ఏక్షనే, చెప్పానుగా అక్కడ నిజంగా విల్లు లేదు). అంతే, ప్రేక్షకులంధరూ లేచి నించుని మరీ రెండు నిమిషాల పాటు ఆపకుండ చప్పట్లు కొట్టి వాళ్ళ మోదాన్నీ, ఆమోదాన్నీ ప్రకటించారు.

ఇదేమైనా తెలియని విషయమా? భూమి పుట్టినప్పటినించీ ఎన్నో రామాయణాలు జరిగాయి. ప్రతి రామాయణంలోనూ రాముడే శివధనువు విరిచాడు గదా! ఎప్పుడూ సీత రాముణ్ణే వరించింది గదా! పోనీ ఇంకో రాజెవరన్నా ఆ విల్లు ఎక్కుపెట్టడం గానీ, రాముడు చెయ్యలేక పోవడం గానీ ఏ రామాయణంలోనూ జరగలేదు గదా! ఇందులో మనకి తెలియని సస్పెన్సు గానీ, సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు సైతం ఎదురు చూడని లాస్ట్ మినిట్ ట్విస్టుగానీ ఏమీ లేదే! మరి ఆ దృశ్యంలో ఎందుకు ప్రేక్షకుల్లో అంత ఆనందాతిశయం?

వాల్మీకి సామాన్యుడు కాదు సుమా. సీత చేతిని రాముడి చేతులో పెట్టి పాణిగ్రహణం చేయిస్తూన్న జనకమహారాజు నోట ఒక గొప్ప శ్లోకం చెప్పిస్తాడు ..
"ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ"

"రామచంద్రా, ఈమె ఎవరో కాదు, సీత. మీరు ఆది దంపతులు. లోకకళ్యాణార్ధం ఇలా ఈ మానవ జన్మ ఎత్తడానికి తాత్కాలికంగా విడివడినారు, అంతే. నీలో సగభాగమైన ఈ సీతను నీకు చేర్చి నా వంతు పాత్రని నిర్వర్తిస్తున్నాను. ఈమె పాణిని గ్రహించి లోకకళ్యాణం కావించు రామా!"
(ఒక మిత్రులు చెప్పారు, సంస్కృతంలో మహాపండితులైన వారి తాతగారు వాల్మీకి రామాయణం పురాణం చెబుతూ కేవలం ఈ ఒక్క శ్లోకాన్ని గురించి మూడు రోజులు చెప్పేవారట.)

అదీ జరిగిన విషయం. అదేదో తమ కళ్ళ ముందు జరగడం .. ఆ హాల్లో ప్రేక్షకుల ఆనందానికీ, గుడిలో భక్తుల ఆనందానికీ అదీ కారణం.

సీతా కళ్యాణ వైభోగమే!

Comments

తరాలు మారవచ్చు గాక, లేక యుగాలే మారిపోవచ్చు గాక, సీతారామ కళ్యాణం మాత్రం ఎప్పటికీ నిత్యనూతనముగానే ఉంటుందండీ. ఆ అలౌకిక భావము అలానే నిలిచిఉంటుంది.
Krishna said…
చాలా బాగుంది ! భాపు గారి "సీతా కల్యాణం" సినెమా మల్లి చూసినట్టు ఉంది. త్యాగరాజ కీర్తన జత చేసినందుకు క్రుతజ్ఞతలు .
I used to enjoy the radio commentary from Vijayawada AIR from Bhadrachalam. They too used to quote different slokas and used to comment on their inner meanings, not sure how many of them are still continuing it.

It used to better than the live telecast of DD :-) (of course it is the same case with Cricket commentaries on radio Vs TV)
jayachandra said…
బాగా వ్రాశారు.శుభా కాంక్షలు.
Sanath Sripathi said…
అతి సమాన్యమైన 20*20 మ్యాచు ఫైనల్సే ఎన్ని సార్లు చూసినా తనివితీరదూ.. మ్యాచులూ, హైలైట్లూ చూసి చూసి ఆ సీడీలు కాస్తా అరిగిపోయేదాకా వదిలిపెట్టం.

అల్లాంటిది రామ కళ్యాణం, అందునా ప్రత్యక్షం గా జరిగేది చూస్తూంటే ఇక ఆనందాతిరేకం ఆగుతుందా?

చిన్నప్పటి రోజులు గుర్తు చేసారు. ధన్యవాదాలు.
Krishna said…
నా కొత్త బ్లాగు లో కొత్త టపా ఒకటి -
చిరంజీవి కి కోడి గుడ్లు - బాలయ్య కి చెప్పులు - జగన్ కి గుడ్లు, చెప్పులు - ఎన్.టి.ఆర్ కి యాక్సిడెంటు ఒక సారి చూసి మీ ఆభిప్రాయం తెలియచెయండి
చక్కగా వర్ణించారు. హరికథ విన్న రోజులు గుర్తొచ్చాయి.
మేధ said…
సీతారామ కళ్యాణం అంటే, అదేదో మన ఇంట్లో కళ్యాణం జరుగుతున్నంత ఆనందంగా ఉంటుంది! మా బమ్మ గారి హడావిడి అయితే చెప్పక్కర్లేదు.. ఆ రోజు గుమ్మాలకి పసుపు-కుంకుమ పెట్టి, ఇంకా పూజ - ప్రసదాలు భారీ ఎత్తున చేస్తుంది.. తను మామూలుగా అయితే, సాయంత్రం పూజ చేయదు, కానీ శ్రీరామనవమి రోజు మాత్రం సాయంత్రం కూడా మడి కట్టుకుని పూజ చేస్తుంది! ఎందుకలా అంటే, రాముల వారి కళ్యాణం కదటే ఈ రోజు అంటుంది :)

>>ఇందులో మనకి తెలియని సస్పెన్సు గానీ, సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు సైతం ఎదురు చూడని లాస్ట్ మినిట్ ట్విస్టుగానీ ఏమీ లేదే!
నాకు ఈ విషయం చాలాసార్లు సందేహం వస్తూ ఉంటుంది.. పురాణాల్లో కధలన్నీ, చందమామ పుస్తకాల దగ్గర నుండి, ఈ రోజు టి.వి. సీరియల్స్ వరకూ చూస్తూనే ఉన్నాం.. తెలియని విషయాలు ఏమీ ఉండవు.. అయినా కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాము, అస్సలు బోర్ కొట్టదు! ఎందుకంటారు...?!
చాలా బాగా రాసారు అండి
మురళి said…
బాగా తెలిసినా విషయమే అయినా చూసిన ప్రతిసారీ ప్రత్యేకంగా అనిపించడమే సీతా రామ కల్యాణం ప్రత్యేకత ఏమో.. కీర్తన చాలా బాగుందండి..
Naga Pochiraju said…
Sree bhaashyam vaaru kooDA ee padyaaniki bOleDu bhaashyaalu ceppaaru
Ennela said…
ఏమి రామ కథ శబరీ శబరీ, ఏదీ మరియొక సారీ
రవి said…
పిడకలవేట కొక్కరైనా కావాలి కదా. ఈ సారికి ఆ బాధ్యత నాది. :) కోదండరామాలయం ఆవరణలో సీతాకల్యాణం చాలా సార్లు చూశాను నేను. అయితే నా ఆసక్తి ఉట్లమాను పైనే ఎక్కువ, పాల్గొనకపోయినా.:) (ఉట్లమాను అంటే - ఒక కంబానికి పైన డబ్బుసంచీ కట్టి ఆ కంబం ఎక్కి ఎవరు తీసుకోగలిగితే వాళ్ళకు. ఎక్కనివ్వకుండా క్రిందనుండి బురదచల్లడం, కాళ్ళు పట్టుకుని లాగడం వగైరా..:)సరిగ్గా కల్యాణం ముగిసే సమయానికి ప్రసాదవితరణ సమయానికి తిరిగి వచ్చే వాళ్ళం.

అదంతా పక్కన పెడితే రామాయణం ఎప్పుడూ ఆశ్చర్యమే నాకు. సీతాకల్యాణానికి సంబంధించి - వివాహ సమయానికి సీత వయసు ఆరేళ్ళను భవభూతి ఉత్తరరామచరితమ్ వ్యాఖ్యానంలో వస్తుంది. (రామాయణంలో ఎలా ఉందో నేను చదవలేదు) అంత చిన్న అమ్మాయికి మహా దార్శనికుడైన జనకుడు స్వయంవరం నిశ్చయం చేయడం ఏమిటో అంతగా నాకు అర్థం కాలేదు.