కబుర్లు - మార్చి 30

ఇందాక రేడియోలో విన్నా .. ఏకాంత కారావాస శిక్ష (Solitary Confinement) నేరస్తులకి పిచ్చెక్కిస్తోందని ఒక పరిశోధనలో కనుగొన్నారని. ఈ పరిశోధన గురింఛి రాసిన వైద్యుని పేరు, అతుల్ గవాండే అని విని అరె, ఇదేదో భారతీయ పేర్లా ఉందే అనుకున్నా. ఇతగాని విద్యా వైజ్ఞానిక ప్రతిభాపాటవాలు అచ్చెరువు గొలుపుతున్నాయి. భారతీయ అమెరికను వైద్యుల్లో వైద్యమే కాక ఇతరత్రా ప్రతిభ కలిగుండడం డా. గుప్తాగారి గుత్తం కాదన్నమాట. సంతోషమే!

అదలా ఉండగా కాసేపు ఆలోచన అసలీ నేరమూ శిక్షా (Crime and Punishment) అనే ప్రాథమిక ఆలోచన మీదికి తిరిగింది. మొదట అసలెవరు నిశ్చయించారో ఫలానా పని చెయ్యడం నేరం, ఈ పని చేసినవారిని శిక్షించాలి అని. అలాగే చెరలో పెట్టడం కూడా. పురాణాలు వాటిల్లో సంగతి నాకు తెలియదు గానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో కొన్ని భయంకరమైన శిక్షల గురించి చెప్తాడు. రాచరికం ఉన్న రోజుల్లో రాజద్రోహం మిగుల సహించరాని నేరంగా ఉంటుండేది. దానికి శిక్షలు కూడా అతి బీభత్సంగా ఉంటుండేవి. మానవ లోకంలో జరిగే నేరాలూ, వాటికి మానవులు వేసే శిక్షలూ సరిపోక, పాపాల్నీ, వాటికి శిక్షగా నరకాల్ని (ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏడో పధ్నాలుగో ఉన్నాయి!) సృష్టించుకున్నాడు మనిషి. వీడికి ఎక్కడా ఏ కోశానా సుఖపడాలనే ఉద్దేశం ఉన్నట్టు లేదు చూస్తే. అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటా, ఏదన్నా ఇతరగ్రహ వాసులొచ్చి మన మతాల్ని (అన్నిటినీ) గనక స్టడీ చేస్తే ఇదే అనుకుంటారు.

ఫ్రెంచి నవలాకారుడు డ్యూమా రాసిన కౌంటాఫ్ మాంటెక్రిస్టో నవల్లో ఫ్రెంచి దేశస్తుడైన కథానాయకుడు ఒకచోట .. హబ్బే మనవేం శిక్షలూ! శిక్షలంటే ప్రాచ్య దేశాల వాళ్ళని చెప్పుకోవాలి. చైనా, ఇండియా, అరేబియా లాంటి దేశాల్లో వేసే శిక్షలుంటాయి చూస్కోండి, నా సామి రంగ, శిక్ష అమలవుతుండగా చూడ్డందాకా ఎందుకు, అసలు దాని వర్ణన వింటేనే మీకు కడూపులో తిప్పి కాళ్ళొణుకుతాయి .. అంటాడు. రష్యను నవలాకారుడు దోస్తోయెవ్‌స్కీ నేరమూ శిక్షా (Crime and Punishment) అని ఏకంగా ఒక నవలే రాసి పారేశ్శాడు, చదివారా ఎవరన్నా?

మిగతా శిక్షలన్నీ మాయమయ్యి, పిడుక్కీ బిచ్చానికీ ఒకటే మంత్రం లాగా, ఏ నేరానికైనా జెయిలే శిక్షగా ఎప్పుడు తయారైందో? బహుశా శిక్షలు కూడా మానవీయంగా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనలోంచి ఈ అవిడియా పుట్టిందేమో? అమెరికాలో జెయిళ్ళని కరెక్షనల్ ఫెసిలిటీ అంటారు. జెయిలుకెళ్ళినవాడు తదనుభవం ద్వారా తన దుష్టబుద్ధి మానుకుని బాగుపడి చెచ్చేట్టు. మానవీయ జెయిళ్ళ గురించి మనవాడు నాగేష్ కుకునూర్ తీన్ దీవారే అని మంచి సినిమా తీశాడు.

ఏదేమైనా, ఈ నేరమూ శిక్షా కాన్సెప్టు కొంచెం ఆలోచించాల్సిందే.

ఏవిటో ఒక ఆలోచన వెంట ఇంకొకటి తరుముకొచ్చి ఈ కబుర్లంతా కొంచెం బీభత్స ప్రధాన దృశ్యంగా తయారైంది. క్షమించాలి. ఇదొక్కటే కాదు నేను చెప్పాలనుకున్న కబుర్లు ఇంకా ఉన్నాయ్.

మొదటి విడత ఎన్నికల రోజుకి సంబంధించి నామినేషన్లు ముగియబోతున్న సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు బాగా ఊపందుకున్నాయి. వేడికోళ్ళు, పడిగాపులు, విజయగర్వాలు, భగ్న హృదయాలు, బావురుమని ఏడుపులు, ఉన్మాద ప్రేలాపనలు, విలయ తాండవాలు .. ఓహ్, పేపరు ఏ పేజీ తీసినా నవరసభరితంగా .. ఇక్కడ మా వూళ్ళో పార్టీకి వెళ్ళినా అక్కడి పార్టీల గోలే! మధ్యలో పాపం బుడ్డోడికి కారు ప్రమాదం .. గత యెన్నికల్లో వుట్టి పుణ్యానికి అన్యాయంగా సౌందర్య ప్రాణాలు కోల్పోయింది. వాడి సుడి బావుంది .. బుడ్డోడు స్వల్ప గాయాల్తో బయట పడినట్టే. ఆ యాక్సిడెంటు వివరాలు తెలిసిన ఒక డాక్టరుగారు నిన్న ఇక్కడ చెబుతున్నారు, కొంచెం అటూ ఇటూ అయుంటే శరీరం మొత్తం పక్షవాతం వచ్చుండేదట.

అవునూ యెన్నికలంటే గుర్తొచ్చింది, మన బ్లాగ్సోదరులు భావకుడన్ గారు తన అభిమాన పార్టీ తన అంచనాలకి దిగజారితే ఎలా అని క్షణికంగా బెంబేలు పడి మళ్ళీ ఎలా సర్దుకున్నారో ఇక్కడ చూడండి. పనిలో పనిగా విరోధి నామ సంవత్సర రాశిఫలాల్ని గురించి బరాకేశుడేదో మంత్రోపదేశం చేస్తున్నాడు .. ఓ లుక్కెయ్యండి. ఆంధ్రామృతం రామకృష్ణరావుగారు రాశి ఫలాల్ని తేటతెలుగు పద్యాల్లో పొదిగిన తీరునీ గమనించండి. అదే దారిన వెళ్ళి మన బ్లాగాస్థాన చమత్కార శిరోమణి విరోధికి స్వాగతమిచ్చే సొగసు తిలకించండి. సరే పొద్దులో వెల్లి విరుస్తున్న కవితా సంబరాలు సరే సరి. మిగతాదంతా ఏమోగాని, కవులకీ పద్యాలకీ ఈ కొత్త సంవత్సరం బాగా వృద్ధిదాయకంగా ఉన్నట్టు కనిపిస్తోంది!

తుదిపలుకు
బాస్కెటు బాలు గేము చూసి పరవశించే బాస్కెటు కేసులారా! శనివారం రాత్రి ఎవరన్నా విల్లనోవా పిట్సుబర్గ్ గేం చూశారా? మీ వేళ్ళకి గోళ్ళు మిగిలున్నాయా?

Comments

"వీడికి ఎక్కడా ఏ కోశానా సుఖపడాలనే ఉద్దేశం ఉన్నట్టు లేదు చూస్తే. అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటా, ఏదన్నా ఇతరగ్రహ వాసులొచ్చి మన మతాల్ని (అన్నిటినీ) గనక స్టడీ చేస్తే ఇదే అనుకుంటారు."

:)))

ఈసారి మీ నేరము-శిక్ష కాన్సెప్ట్ బావుంది.. ఇదేదో విజయనిర్మల కొత్తసినిమా ప్రమోషన్ కి పనికిరావొచ్చు :-)

డా. గుప్తా గారు నిజంగానే బహుముఖ ప్రజ్ఞాశాలి.. US Surgeon General పదవి గుమ్మం వరకూ వచ్చి వెళ్ళిపోవడం బాధాకరమైన విషయం!

బరాకేశుడా!! అసలే కంఫ్యూజనుతో బుర్ర గోకింగ్స్.. మళ్ళీ ఈ పేరేమిటి!?
అమెరికానే కాదండీ ఎక్కడైనా జైళ్ళ ముఖ్యోద్దేశ్యం కరెక్షన్ ఫెసిలిటీ నే కదా. కాకపోతే మన వాళ్ళు ఆ విషయం మర్చిపోయి అర్ధాన్ని మార్చేసారు అంతే.

ఈ సారి బోలెడు కబుర్లు చెప్పారు :) అన్నీ బాగున్నాయ్..
ఏమోనండీ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే ఒకరకమయిన విరక్తి కలుగుతోంది.

అవునూ గుప్తా గారు వ్యక్తిగత కారణాలవల్ల తనంతట తాను పదవి వద్దనుకున్నారని విన్నానే?
ఈసారి బోలెడు కబుర్లు ఎక్కడా బోరు కొట్టకుండా చెప్పారు. బాగున్నాయి.చిన్నమాట గోళ్ళతో పాటి ఒక పన్ను కూడా విరిగిపోయింది.:)
మురళి said…
నేరము-శిక్ష పేరుతో వచ్చిన ఓ చిత్ర రాజాన్ని చూసిన జ్ఞాపకం.. ఇప్పుడు ఆలోచిస్తే ఏదో లీలగా గుర్తొస్తోంది.. బాగున్నాయండి కబుర్లు.
Unknown said…
చిన్నప్పుడెప్పుడో చదివాను క్రైమ్ అండ్ పనిష్మెంట్. పుస్తకాల బీరువాలో ఎదురుగానే వుంది.మీ బ్లాగు చదివాక మళ్ళీ ఓ సారి చదవమని ఊరిస్తూంది.
Anonymous said…
నాకు తెలిసి "వోహ్ సుబాహ్ కభీ తో ఆయేగి" అన్న సినిమా(రాజ్ కపూర్ & మాలా సిన్ హా) "క్రైం & పనిష్మెంట్" మీద ఆధారపడినదే!