అప్పుడేం చేస్తారు - 2

అసలు విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పిట్ట కథ.

సాంప్రదాయికంగానే కాక, నిజ్జంగా, భౌతికంగా గూడా వసంతం వచ్చేసిందోచ్.
పోయిన శుక్రవారం నాడు వెర్నల్ ఈక్వినాక్స్. ఏంటో ఆ సంగతి మరిచే పోయాను. దానికి తోడు మొన్న సోంవారం కబుర్లు కూడా రాయలేదు. తీరా వరాసగా నాలుగు రోజుల పాటు బయట ఉష్ణోగ్రత నలభైలు యాభైలతో బంతులాడుతుంటే, ఎందుకబ్బా ఇంత తుళ్ళింత అని వింత పడుతుంటే హఠాత్తుగా వెలిగింది. అమెరికాలో సాంప్రదాయికంగా మార్చి 21 నించీ వసంతం ప్రవేశించినట్టే. అయినా మిషిగన్‌లో ఈ కబుర్లు నమ్మే వీల్లేదు, ప్రత్యక్ష తార్కాణం లేకుండా.

అసలింత ముఖ్యమైన రోజుని ఎట్లా మర్చిపోయానబ్బా అనుకున్నా. మొన్నెప్పుడో ఈ బ్లాగులో ఫలాని రోజున ఫలాని పూర్ణిమ అని రాస్తే, ఎవరో వ్యాఖ్యాత కామెంటారు .. అమెరికాలో ఉన్నా ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటున్నారో అని. ఏం, అమెరికాలో ఉంటే చంద్రుడు కనబడ్డా, పున్నమి రాదా? నగరీకరణ ఒక్కటే కాదు, ఇదే, ఈ పట్టించుకోక పోవడంతో కూడా మనం ప్రకృతికి దూరమైపోతున్నాం. ప్రాచీనమైన నాగరికతలన్నీ ఈ ప్రాకృతిక, ఖగోళ సంఘటనలకి ప్రత్యేకత కల్పించాయి. అవే మన పండుగలయ్యాయి. ఉదాహరణకి చూడండి, భారద్దేశంలో హోలీతో మొదలెట్టి విషు వరకూ ఎన్ని వసంతోత్సవాలో!

ఏదేమైనా, మొత్తానికి వసంతం వచ్చేసినట్టే. (ఈ తరవాత కూడా మీ వూళ్ళో మంచు పడితే నా పూచీ ఏమీ లేదు!)

పోయిన గురువారం "అప్పుడేం చేస్తారు" టపాకి మంచి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు వచ్చాయి. కానీ స్పందించిన వారిలో చాలా చాలా కొద్ది మంది మాత్రమే నేనడిగిన ప్రశ్నలోని పూర్తి సారాన్ని గ్రహించ గలిగారు. ఆ స్థితిని అనుభవించామని చెప్పిన నాగప్రసాద్, జీడిపప్పుగార్లు కూడా సమస్యని సీరియస్ గా తీసుకున్నట్టు కనబళ్ళేదు. పెళ్ళైన స్త్రీలకి ఈ పరిస్థితి కొంతకాలమైనా అనుభవమయ్యి ఉంటుందేమో ననుకున్నాను. ఇదేమీ సెక్సిస్టు బయాస్ స్టేట్మెంటు కాదు, కంగారు పడకండి. అమ్మాయి ఏం చదువులు చదువుకున్నా, పెళ్ళంటూ అయ్యాక, కనీసం ప్రస్తుతానికి మన సమాజంలో ఇంకా మొగుడి ఉద్యోగమే ప్రధానోద్యోగం కాబట్టి, దానికి తగిన మార్పులు జరుగుతున్న సమయంలో స్త్రీ ఉద్యోగం చెయ్యని పరిస్థితిలో ఉంటుంది కదా. ఆ కబుర్లేవీ వినబడక పోవడం నాక్కొంచెం ఆశ్చర్యం కలిగించింది. సరే, అది పక్కన పెట్టండి.

ఇప్పుడు రాయబోయే మాటల్తో నేను ఎవరి ఆశయాలనూ, అభిరుచులనూ, నిజాయితీనీ పరిశీలనకి పెట్టడం లేదనీ, శంకించడంలేదనీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దయచేసి కొంచెం ఆవేశపడకుండా చదవండి.

ఇక్కడ వ్యాఖ్యలు రాసిన అందరూ, బహు కొద్దిమంది తప్ప, ఈ సమస్యని శలవల్లో ఏం చేస్తాము అన్నట్టుగా చూసినట్టే కనిపిస్తోంది నాకు. హాబీల మీద ఇప్పుడు వెచ్చిస్తున్న దానికంటే ఎక్కువ సమయం వెచ్చించ గలరేమో గానీ అదే మాత్రం పూర్తి సమయం పాటు చెయ్యలేరు. ఎన్ని వేరు వేరు హాబీలు పెట్టుకున్నా సరే. ఫ్రీలాన్సుగా దేశోద్ధరణ పనులు, లేదా ఇంకేవో పనులు చేస్తామనుకుంటే, వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోవద్దూ?

ఈ ప్రశ్నల్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం.
ముందుగా ఫ్రీలాన్సు పని. మనవల్ల ఆ సంస్థకో ప్రాజెక్టుకో నిజంగా ఏదన్నా ప్రయోజనం జరగాలి అంటే మనం కొంత నిర్దిష్టమైన సమయాన్ని, రోజుకింతనో, వారానికింతనో, నిక్కచ్చిగా కమిటవ్వాలి, ఔనా? అంటే, అది మళ్ళీ ఉద్యోగంలాగా ఉన్నట్టే కాదూ? పోనీ మనిష్టం వచ్చిన సమయానికి హాజరవుతామంటే, వాళ్ళు ఒప్పుకోవద్దూ?

ఇక హాబీల సంగతి. ఉదాహరణగా నన్నే తీసుకోండి. నేను నాట్యం నేర్చుకుంటాను. నాట్యం చెయ్యడమంటే నాకు చాలా ఇష్టం, అందులో ఏమీ సందేహం లేదు. క్లాసుకి వెళ్తాను. గురువుగారు కొత్త పాఠం చెబుతారు. అది సాధన చెయ్యాలి. రొజంతా చెయ్యడం ఎలాగూ సాధ్యం కాదు గానీ రోజులో కొంత సేపయినా సాధన చెయ్యాలి. అంటే కోంత క్రమశిక్షణ కావాలి. ఈ క్రమశిక్షణ ఎలా వస్తుంది, ఎందుకొస్తుంది? నేనిది సాధన చేసి నేర్చుకుంటే నాకీ కీర్తన మొత్తం నాట్యం చెయ్యడం వచ్చు అనే తృప్తి ఒకటి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం జరిగితే అందులో నేనీ నాట్యం ప్రదర్శించొచ్చు. నా మిత్రులకి చేసి చూపించొచ్చు. సాధన చేసేందుకు అవసరమైన క్రమశిక్షణకి పునాది ఈ తృప్తి అనే ప్రోత్సాహకం .. ఇది నా మోటివేషన్. ఇప్పుడు నేను నాట్యం చేస్తే ఏమి, చెయ్యక పోతే ఏమి? ఆల్రెడీ కొంతకాలంగా ఆ గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నాను గనక, ఇహ నేను చెయ్యనండి అంటే ఆ గురువుగారు కొంచెం బాధ పడతారు. నన్ను బాగా తెలిసిన కొద్దిమంది బంధు మిత్రులు అయ్యో అదేమీ, బాగా చేసేవారు గదా అని కొద్దిగా విచారం వెలిబుచ్చుతారు. అంతేగానీ ఏ అత్యవసరమైన పరిణామాలు జరగకుండా ఆగిపోవడంలేదు. అంటే, ఈ తృప్తి నాకు కావాలి అనే అవసరం నాలోపలినించి రావాలి.

అవసరం - ప్రోత్సాహకం - క్రమశిక్షణ.
Need - Motivation - Discipline

ఈ మూడూ కావాలి ఏ పని సంపూర్ణంగా, విజయవంతంగా చెయ్యాలన్నా. ఉద్యోగంలో వ్యాపారంలో మనం చేసే పనులన్నిటికీ డబ్బు సంపాదన, కుటుంబపోషణ అనే లక్ష్యాలు ఈ మూడిటినీ కల్పిస్తాయి. శలవరోజుల్లో, ఇతర ఖాలీ సమయాల్లో మనం చేపట్టే హాబీల విషయంలో కూడా .. అరే, ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఎప్పటికో అనే ఒక తొందర, ఉద్యోగానికి సంబంధించిన ఒక తొందర మనతో ఆ పెయింటింగ్ నో, ఆ మ్యూజిక్ విడియో రీమిక్సింగ్ నో పూర్తి చేయిస్తుంది, గమనించండి. రేపు, లేక వచ్చే సోంవారం మళ్ళీ ఆఫీసుకి వెళ్ళిపోవాలి అనే తొందర లేకుంటే, మీరివ్వాళ్ళ రాత్రి మూడింటి దాకా కూర్చుని ఆ నవల చదవడం పూర్తి చేస్తారా?

మరి ఏ బయటి వత్తిడి, ఏ ఎదురుచూపు లేనప్పుడు ఆ అవసరం ఎక్కణ్ణించి వస్తుంది?

అందరికీ విరోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Comments

Anonymous said…
మీకూ మీ కుటుంబానికీ, ఉగాది శుభాకాంక్షలండీ.
సుజాత said…
మీ కిందటి టపాలోని రెండో పేరాలోని కొంత భాగాన్ని దాదాపు చాలా మంది వదిలేశారే అని నేనూ అనుకున్నానండి!

మీరు నాట్యం నేర్చుకుంటున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది.స్ఫూర్తి దాయకంగా ఉంది. ఈ టపా చాలా బాగుంది.
cbrao said…
"మరి ఏ బయటి వత్తిడి, ఏ ఎదురుచూపు లేనప్పుడు ఆ అవసరం ఎక్కణ్ణించి వస్తుంది?" -ఆసక్తి మనలను అలా చేయించేలా చేస్తుంది. నిజానికి ఇంత సమయం వెచ్చించి బ్లాగితే మీకేమొస్తుంది? కొన్ని పనులు మన స్వీయానందంకోసం, తృప్తి కోసం చేస్తాము. ఉద్యోగ విరమణ చేసి నేను చాలా సంవత్సరాలయ్యింది. ఏ ఒత్తిడీ అవసరం లేకుండా పలు విషయాలపై దీప్తిధార లో వ్యాసాలు ప్రచురించటం జరిగింది, కేవలం ఆసక్తి వలనే.
బాగా చెప్పారు, ఆ మూడింటితోపాటు ఆహ్లాదం కూడా మనసుకి కలిగినపుడే సాధనకి అది తలవంచుతుంది. క్రమశిక్షణ అలవరచుకుంటుంది. ఒక స్థాయికి ఎదికాక ప్రోత్సాహం కన్నా ప్రోధ్బలం అవసరపడుతుంది. అది ఏరకంగా మనసుని చేరుతుందో చెప్పలేం. నా వరకు నేను కవితలు వ్రాయటం ఆపిన ఎన్నో ఏళ్ళ తరువాత తిరిగి మొదలిడటం మటుక ఆదే అనుభవం.

విరోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తేడా తెలుస్తూనే ఉంది.

ఇంతకుముందు కారుదిగ్గానే, వళ్ళంతా కప్పుకొనిఉన్నా, అడుగులు వడి వడిగా పడేవి..ఇప్పుడు వేసుకున్న కోటు బరువనిపిస్తోంది.. కాసేపు బయటే ఉందామనిపిస్తోంది..

ఇకపోతే

ఏపనయినా లేదా పన్లనయినా, అవి ఎంతిష్టమయినవయినా, ఒక నిర్దిష్ట మయిన సమయం అంటూ లేకుండా చెయ్యాల్సి రావటం నరకం. వాటిని ఆస్వాదించలేము..

అంతర్లీనంగా ఉన్న క్రమశిక్షణే మన జీవికకి ఆక్సిజన్.. లేకుంటే పిచ్చెక్కదూ!!
Hima bindu said…
మీకు నాట్యం ఆనందం అనిపిస్తే ఇంకొకరికి మురిఖివాడలో ప్రజల్ని ఆరోగ్యం ,విద్య ఆవశ్యకత గురించి ఎడ్యుకేట్ చేయడంలో ఆనందం పొందవచ్చు . వారికి వున్నా వుద్యోగ భాద్యత వల్ల రోజు వారిని కలవలేక పోవచ్చు .ప్రాజెక్ట్ లో చేరవలసిన అవసరం వుండదు . ,చేరితే మరో వుద్యోగమే కదా! మనీ అవసరం లేనప్పుడు ,భాద్యత లేనప్పుడు ఒక్కొక్కరు వారు చెప్పిన ప్రకారం వినియోగించుకుంటారని నా అభిప్రాయం.
SAMEEHA said…
కొత్తపాళీ వారికి ఉగాది శుభాకాంక్షలు :)
asha said…
అయ్యో! నేను ముందు టపాకు స్వీయానుభవం వల్లే
చెప్పాను. గత తొమ్మిది నెలలుగా ఇంటి దగ్గర
ఉండటం వల్ల పిచ్చెక్కింది.
మీకు ఉగాది శుభాకాంక్షలు.
కొత్త పాళీ గారూ..
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ విరోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.!
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.
కొత్తపాళీగారు,
మీరు చెప్పేది నాకు సరిగ్గా అర్దం కాలేదు. అంటే ఉద్యోగం చేసేవాళ్లకు మాత్రమే తీరని కోరికలుంటాయనా? నాలాంటి గృహిణుల సంగతేంటి. అస్సలు లెక్కలో లేనట్టా? మాకు కూడ ఇలా చేయాలని ఉండదని మీ ఉద్ధేశ్యం?? అంటే అన్నారంటారు, స్త్రీవాదులని తీవ్రవాద ముద్ర వేస్తారు. .. చెప్పుకుంటూ పోతే వ్యాఖ్య కాస్తా వ్యాసం అయ్యేట్టు ఉంది .
ఉంటా మరి..