కబుర్లు - మార్చి 2

ఈ గడిచిన వారం రాశి ఫలాల్లో మిత్రసందర్శనం రాసి పెట్టి ఉంది. ఒకటికి రెండు సార్లు ఈ వారంలో పాత మిత్రుల్ని కలుసుకుని ఆప్యాయంగా తీరిగ్గా ముచ్చటించుకునే అవకాశం చిక్కింది. శివరాత్రి సోమవారంనాడు ముగిసినా మా స్థానిక దేవాలయం వారు ఉద్యోగస్తులైన భక్తుల సౌకర్యార్ధం కొన్ని ప్రత్యేక అభిషేకాలు పూజలు ఈ వారాంతంలో నిర్వహించారు. దానిలో భాగంగా స్థానిక నాట్య గురువు శ్రీమతి సుధా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి శిష్యులు పలువురు ఆ నటరాజ మూర్తిని నాట్యాంజలితో మెప్పించారు శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో. చూడ ముచ్చటగా ఉంది. పూర్వకాలంలో మన దేవాలయాలు కేవలం పూజకే కాక విద్యకీ సంస్కృతికీ సాంఘిక జీవనానికీ మూలస్థానాలుగా విరాజిల్లుతుండేవి. వేదాధ్యయనమూ, సంగీత నాట్యాది కళలూ దేవాలయాల్లో విలసిల్లుతుండేవి. ఇప్పుడు ఈ ప్రవాస దేశంలో మళ్ళీ హిందూ దేవాలయాలు అటువంటి పాత్ర పోషించవలసి ఉంది ప్రవాస భారతీయ సాంస్కృతిక చైతన్యం విషయమై.

చెంచులు గిరిజనులు అని చాలా మంది వినే ఉంటారు. బహుశా పేపర్లలోనో పాఠ్య పుస్తకాల్లోనో చదివుంటారేమో. ఆంత్రొపాలజీ సమాచారాన్ని బట్టి వీళ్ళు అనాదిగా ఈ ఆంధ్ర దేశపు ఆడవుల్లో నివాసముంటున్న ప్రజలని తెలుస్తోంది. కర్నూలు చిత్తూరు జిల్లాల్లో వ్యాపించి ఉన్న నల్లమల అడవుల ప్రాంతమంతా పరుచుకుని ఉన్నారు ప్రస్తుతం. చాలా ముభావమైన స్వభావం వారిది. సాంఘికంగా కలవడానికి ఇష్టపడరు. ఇంచుమించు పసి పిల్లలవంటి అమాయకత్వం కలిగిన మనస్తత్వం వారు. దురదృష్టవశాత్తూ నల్లమల తీవ్రవాద ఉద్యమానికి నెలవు అయిన నేపథ్యంలో అటు పోలీసు వ్యవస్థ నించీ ఇటు ఉద్యమకారుల నించీ రెండు వేపులా దెబ్బలు తింటూ అడకత్తెరలో పోకచెక్క మాదిరి చిన్నాభిన్నం అవుతున్నారు తమది కాని తప్పుకి ప్రాణాలు వొడ్డుతూ. ఈ చెంచుల ఘోషని మనసుకి పట్టించుకుని తన కలంతో వారికి గళాన్నిస్తూ ఒక పాత్రికేయుడు స్వేఛ్ఛకోసం అంటూ కొత్తగా బ్లాగు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గారిని స్వాగతిస్తున్నాను. చెంచుల నిజ పరిస్థితిని గురించి వారు చెప్పే మాటలు చదువుదాం. ఏమైనా సహాయం చెయ్యగలిగితే చేద్దాం.

ఈ జాలం బలే తమాషా చేస్తుంది. మదిలో ఒకదానికోటి పొంతనలేని ఆలోచనలు ఒకదాని తోకపట్టుకుని ఇంకోటి అలా అనంతమైన గొలుసు కట్టినట్టే .. ఎక్కడో మొదలై ఎక్కడో తేల్తాం. ఇదిలా ఉంటే .. ఈ తెలుగు బ్లాగుజాలం అదో వింత ప్రపంచం, ఎంత చిన్నదో అంత పెద్దదీనూ. ఇంతా చేసి బాగా హడావుడి చేస్తున్నది రెండేళ్ళుగానే. ఇంతలోనే ఎన్నో బ్లాగులు మొదలై ఆగిపోయాయి కూడా. ఎక్కడో ఒక మారుమూల చిన్న బురద గుంటలో ఒక బుల్లి తెల్ల తామర పుడుతుంది, విచ్చుకుంటుంది, గుబాళిస్తుంది. పంకజమిత్రుడు మొహం చాటెయ్యగానే వాలిపోతుంది. కానీ ఒక్కో సారి, ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా మీరు అక్కడ నిలబడితే ఆ పాత పరిమళం మీ ముక్కుపుటాలి గిలి పెడుతుంది. అలాంటి నిన్నటి తెలుగు బ్లాగు పంకజం గుబాళింపిది.

అన్నట్టూ కొన్నాళ్ళుగా ఒక ముఖ్యమైన విషయం చెబుదామనుకుంటూ మర్చిపోతున్నా. ఇది ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారికి. ఇదొక రేడీయో ప్రోగ్రాములో విన్నా. ఒకవేళ మీ తప్పేమీ లేకుండా మీ ఉద్యోగము పోయినట్లయితే (అమంగళము ప్రతిహతమౌగాక) మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు కొన్ని సదుపాయాల్ని అందుకోవచ్చు. దీనికి వీసా స్టేటస్ కీ ఏమీ సంబంధం ఉండకపోవచ్చు. ఈ నియమాలు రాష్ట్రాన్నించి రాష్ట్రానికి మారుతుంటాయి. అంచేత మీ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో కనుక్కోండి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లాగానే ఈ నిరుద్యోగ సదుపాయం కూడా బీమా చెల్లింపే. అంచేత ఇది తీసుకోవలసి వచ్చినందుకు ఏమీ కించపడనక్కరలేదు కూడాను. ఇదెవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం కాదు. కష్టతరమైన సమయములో ఇది వ్యవస్థ ఇస్తున్న ఒక చిన్న చేయూత అని భావించండి. అంతే.

అన్ని రకాల రుసరుసలు కసబిసల తరవాత ఈ వారంలో మన బ్లాగరులు హాస్యానికి పెద్దపీట వెయ్యడానికి నిశ్చయించినట్లున్నారు. చదువరిగారు ఇలా తెరతియ్యగా, బ్లాగాడిస్తా రవి గారు ఆగాగు ఆచార్యదేవా అంటూ సుయోధనుడితో తెలంగాణా స్లోగన్లు పలికించారు. ఇక బ్లాగరులంతా యథాశక్తి హాస్యవృష్టి కురిపిస్తారని ఆశిస్తాను. పనిలో పనిగా జల్లెడవారు కొత్త డిజైను వెలయించారు. ఓ లుక్కెయ్యండి.

Comments

రవి said…
"అంచేత మీ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో కనుక్కోండి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లాగానే ఈ నిరుద్యోగ సదుపాయం కూడా బీమా చెల్లింపే. అంచేత ఇది తీసుకోవలసి వచ్చినందుకు ఏమీ కించపడనక్కరలేదు కూడాను."

మంచి సమాచారం. మంచి సూచనా కూడాను. కబుర్లలో కాస్త, సంస్కృతి, కాస్త ప్రోత్సాహం, కాస్త సమాచారం కలగలిపి చక్క్గగా ఉన్నాయి.

బ్లాగ్లోకంలో ఒకప్పుడు మేధ, ప్రవీణ్ ల ట్రావెలాగుడులు, విహారి విసుర్లూ, ప్రవీణ్ సాంకేతిక టపాలు, అశ్విన్ కళాత్మక చిత్రాలు, రాధిక గారి చక్కనైన కవితలు, రమణి, సుజాత గార్ల చక్కటి టపాలు, భగవాన్ గారి కార్టూన్లు, (చాలా బ్లాగులు మర్చిపోయాను. అన్నీ చెప్పటం సాధ్యం కాదు)...ఇలా ఎంతో వైవిధ్య భరితంగా ఉండేది. చక్కటి సమన్వయమూ ఉండేది. ఒక్క కుటుంబంలా ఉండేది, ఒక్క ముక్కలో చెప్పాలంటే. తిరిగి వసంతం రావాలి. వస్తుంది.
మురళి said…
చక్కని బ్లాగులు పరిచయం చేశారు..