కబుర్లు - ఫిబ్రవరి 9

మొన్నెప్పుడో రాత్రి పొద్దుపోయేదాకా చదువుతూ కూరుచున్నాను. ఇంట్లో అందరూ ఎప్పుడో నిద్రపోయారు. ఇక నేనూ పడుకుందామని లైటు తీసేసేప్పటికి కిటికీ తెరల్లోంచి తెల్లని కాంతి దోబూచులోడుతోంది. కిటికీ దగ్గరకెళ్ళి పరదాల్ని ఒత్తిగించి బయటికి చూశాను. వెన్నెల పిండారబోసినట్టుంది అంటే ఏవిటో మొదటి సారి అనుభవమైంది. .. రెండు వారాల క్రితం వరస్సగా రోజూ మంచు కురిసి బాగా ఒక అడుగు మందాన పేరుకు పోయింది. అప్పణ్ణించీ రోజువారీ గరిష్ఠ ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానాన్ని దాటి పైకి రానే లేదు, మొన్నటి దాకా. ఆ రోజే .. సిగ్గు పడుతూ పడుతూనే ముప్ఫయ్యైదు దాటింది. మంచు కరుగుతోంది. కనుచూపు మేర నేలంతా అలా కరుగుతూ కరుగుతూ మైమరచిన తెల్లటి మంచు. పైన మబ్బు లేని ఆకాశంలోంచి వెన్నెల వరద .. ఆ నింగి కురిసే తెలుపు ఎక్కడ అంతమవుతోందో, ఈ నేల పరుచుకున్న తెలుపు ఎక్కడ మొదలవుతోందో అర్ధం కాని ఆద్యంతరహిత స్థితి.

పండు వెన్నెలకి, పుచ్చపువ్వు లాంటి వెన్నెలకి శరదృతువు, అందులోనూ కార్తీకమాసం పెట్టింది పేరు. మాఘ చంద్రుడు ఇంత దయకురిపిస్తాడని గమనించ లేదెప్పుడూ. మిషిగన్ లో ఈ నెలలో ఆకాశం మేఘావృతం కాకుండా ఉండడం చాలా అరుదు. ఇవ్వాళ్ళ (సోమవారం) మాఘ పౌర్ణమి.

అన్నమాచార్య సంకీర్తనల్ని అభిమానించి ఆస్వాదించే చాలా మందికి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి తెలిసే ఉంటుంది. వేదవేదాంగాలు, అనేక భాషలు క్షుణ్ణంగా నేర్చిన మహా పండితుడు. గాత్రంలోనూ వయిలిన్ లోనూ నిధి, స్వయంగా వాగ్గేయ కారుడు. అన్నమాచార్య ప్రాజెక్టు తొలి డైరెక్టరుగా మరుగున పడిన అనేక అన్నమయ్య సంకీర్తనల సాహిత్యాన్ని పరిష్కరించి స్వరపరిచి మనకందించారు. అటుపైన బాలమురళి, నూకల, నేదునూరి, వోలేటి వంటి సమర్ధవంతులైన సంగీతజ్ఞులని రావించి తన పర్యవేక్షణలో కొన్ని వందల సంకీర్తనలకి స్వరరచన చేయించారు. వారి మనుమడు శ్రీ నందనందన్ తాతగారి స్మృత్యర్ధం వారి జీవిత విశేషాలతో, కొన్ని ఫొటోలతో సహా ఈ గూడు నిర్మించారు. వారికి హార్దిక అభినందనలు, మరియు ధన్యవాదాలు. త్వరలో కొన్ని శ్రవ్య మాలికలు కూడా అలంకరిస్తారని ఆశిద్దాము.

ఐఐటీలు నిజంగా అత్యుత్తమస్థాయిని అందుకుంటున్నాయా అని కొంతకాలం క్రితం ఈ బ్లాగులో చర్చించాము. ఇదే ప్రశ్నని ఒక ఐఐటీలో ఆచార్యులుగా పనిచేస్తున్న మా అన్నయ్యని అడిగాను. ఆయన ఇచ్చిన సమాధానం ఇది:
సాంకేతిక పరిశోధన ఫలితాల దృష్ట్యా చూస్తే ఐఐటీలనించి వచ్చినది పేరొందిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో జరిగిన ప్రగతితో ఏ మాత్రం సరితూగదు. గత 10 - 20 ఏళ్ళల్లో అనేక ఐటీ, ఇతర కొత్త సాంకేతికాల కంపెనీలు అమెరికాలోనూ భారద్దేశంలోనూ ఆకాశానికి దూసుకుపోతున్న తరుణంలో పాత్రికేయులు ఈ కంపెనీల వ్యవహారాల్ని నిశిత దృష్టితో చూడగా, చాలా కంపెనీల వ్యవస్థాపకులు ఐఐటీ స్నాతకులై ఉండడం తెలియవచింది. దాంతో మీడియాలో ఐఐటీలని గురించిన మోత బాగా మోగింది.
ఐఐటీల వల్ల రెండు ఘనకార్యాలు నెరవేరుతున్నాయి. ఒకటి .. ప్రవేశ పరీక్షలకి ఒక ఒరవడి ఉంది. లెక్కలు, విశ్లేషణ ప్రక్రియల్లో బాగా పరిణతి చెందిన విద్యార్ధులు మాత్రమే JEE, GATE పరీక్షల్లో విజయం సాధించి ప్రవేశించ గలరు. ఇది మొదటి మెట్టు. అలా ప్రవేశం సాధించిన విద్యార్ధులకి ఆ విశ్లేషణా శక్తిని మరింత పదును పెట్టుకునే బోధన కార్యక్రమాన్ని ఐఐటీలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయి. ఈ రెండిటి వల్లా, ఐఐటీలు ఇచ్చే ఉన్నత స్థాయి సాంకేతిక విద్య ఈ దేశంలో ఏ కళాశాలా విశ్వవిద్యాలయం ఇవ్వలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఐతే, ఐఐటిల సామర్ధ్యం అంత వరకే. ఈ సంస్థల్లోని ఆచార్యులు చాలా మంది రీసెర్చి పరిశోధన గురించి శ్రమ పడినా, గత యాభయ్యేళ్ళలోనూ ఈ సంస్థల నించి గొప్ప సంకేతిక డిస్కవరీలు ఏమీ రాలేదు. రీసెర్చే పరమావధి అయిన BARC, ISRO ఇత్యాది ప్రభుత్వ సంస్థలు, ఏదో పడుతూ లేస్తూనే ఇంతకంటే మంచి ఫలితాల్ని సాధించ గలిగాయి.

ఇంతకు ముందోసారి కబుర్లలో సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు గానం చేసిన ఒక రాగమాలిక శ్లోకం సంగతి ప్రస్తావించాను. మొత్తానికి దాన్ని తెరకెక్కించే పని పూర్తి చేశాను. విని ఆనందించండి!
Get this widget | Track details | eSnips Social DNA

Comments

మంచు, వెన్నెల గురించి మీరు రాసిన విధానం బాగుందండీ..
మబ్బు లేని ఆకాశంలోంచి వెన్నెల వరద
ఈ వాక్యం నాకు భలే నచ్చింది
నీహారహారాలు దాల్చిన మిషిగన్‌ మాఘ వెన్నెలాకాశం మీలో అద్వైతాన్ని ఆవిష్కరించిందంటారు. బాగుంది.
"ఆ రోజే .. సిగ్గు పడుతూ పడుతూనే ముప్ఫయ్యైదు దాటింది."
:))

నేదునూరి గారి రాగమాలిక మాత్రం చాలా బావుంది! ధన్యవాదాలు..
Sujata M said…
Did u read Five point someone ? It is widely believed that IITs make the best muggers top ! There is no significant contribution from IITs in the history of Indian S & T. It is institutions like the Anna University, that produce good scientists and researchers, many of whom stay in India.
simply superb baaga varniMcharu mee kavi hrudayam ardhamayyiMdi:)
GKK said…
’నుచూపు మేర నేలంతా అలా కరుగుతూ కరుగుతూ మైమరచిన తెల్లటి మంచు. పైన మబ్బు లేని ఆకాశంలోంచి వెన్నెల వరద .. ఆ నింగి కురిసే తెలుపు ఎక్కడ అంతమవుతోందో, ఈ నేల పరుచుకున్న తెలుపు ఎక్కడ మొదలవుతోందో అర్ధం కాని ఆద్యంతరహిత స్థితి."

చాలా బాగుంది.
gaddeswarup said…
Thanks for the link to Rallapalli site; he is one of my favourite Telugu scholars. I hope that they will also give links to his books which are available online (Vemana, salivahana gatha saptasati and a few articles) and make more digitally available.
వర్ణన చాలా బాగుంది. :)
Unknown said…
కొత్తపాళీ గారికి,

ఐఐటి ల గురించి మీ అన్నయ్య గారన్న మాటలు వాస్తవమే. వీటిల్లో మొదటి నుండీ బోధనకి ఉన్న ప్రాముఖ్యత పరిశోధనకి లేకపోవడం వలన దాంట్లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. ఈమధ్య కొన్నిచోట్ల ఇది మెరుగవుతోంది.

అన్నా యూనివర్సిటీలోనూ, ఆంధ్రా యూనివర్సిటీలోనూ చదివిన వాళ్ళలో గొప్పవాళ్ళు లేరనను. మన దేశం సైన్సులో సాధించినది అలాంటి చోట్ల చదివిన వారి మూలంగానే నన్నా తిరుగు వాదించను.

కాని పైన సుజాత గారన్నది - "IITs make the best muggers top !" - ఎంత మాత్రమూ నిజం కాదు. ఐఐటి ల నుండి చాలా తెలివయిన వాళ్ళు వచ్చారు. నేను పనిచేసే రంగంలో ప్రపంచ స్థాయిలో పేరున్న పది మంది భారతీయుల పేర్లు చెప్పమంటే, వాళ్ళంతా ఐఐటి/ఐఐయస్సీ ల నుండి వస్తే ఆశ్చర్యపోను.

కొడవళ్ళ హనుమంతరావు
వ్యాఖ్యానించిన మిత్రులందరికీ ధన్యవాదములు.
శ్రమ తీసుకుని వచ్చిన హనుమగారికి ప్రత్యేకంగా. మీ ఫీల్డులో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఐఐట్ స్నాతకులు ఐనందుకు సంతోషం.
మురళి said…
రచయిత్రి సి. మృణాళిని (తాంబూలం, కోమలి గాంధారం ) అనంత కృష్ణ శర్మ గారి మనవరాలు. ఓ ఇంటర్వ్యూ లో ఆవిడే చెప్పారు, ఆలిండియా రేడియో కి 'ఆకాశవాణి' అని తెలుగు పేరు పెట్టింది శర్మగారేనని.
కొత్త పాళి గారు!!
మీ కబుర్లు బావున్నయి, ప్రయానం కొనసాగిస్తుండడి.
మీ
ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)