కబుర్లు - జనవరి 5

చాన్నాళ్ళ క్రితం "రొటీను వెరైటీ" అని ఒక టపా రాసుకున్నా. అందులో రాసుకున్న నిర్ధారణ, నా విషయంలోనే ఇంత సత్యమని మాత్రం నేనస్సలు అనుకోలేదు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన మూడు వారాల శలవ రానూ వచ్చింది, ఐపోనూ ఐపోయింది. నేను ఈ శలవల్లో చేసేద్దామనుకున్న ఘనకార్యాలు మాత్రం, ఫ్లారిడాకి వెకేషను ట్రిప్పు వెయ్యడం తప్పించి, ఒక్కటంటే ఒక్ఖటి కూడా చెయ్యలేదు! బయణ్ణించి ప్రేరణలూ వత్తిళ్ళూ లేకుండా ఘనకార్యాలు సాధించాలి అనుకునే వారికి చాలా క్రమ శిక్షణా, మనోనిగ్రహమూ ఉండాలి సుమా. నాకవి లేవని మరోసారి అనుభవంలోకి వచ్చింది. :(
సరే పోన్లే, ఏమీ చెయ్యని ఖాళీ సమయం కూడా అప్పుడప్పుడూ కాస్త అనుభవిస్తూ ఉండాలి అని సర్ది చెప్పుకుని, మళ్ళీ రేపణ్ణించీ (ఇది ఆది వారం సాయంత్రం రాస్తున్నా) రొటీనుకి రెడీ ఐపోతున్నా.

మనం పెద్దగా ప్రయాస పడపోకుండానే కొత్త సంవత్సరం వచ్చేసింది, దానంతట అదే. కొత్త సంవత్సరం అనగానే ఠంచనుగా జరిగే జాతర .. ప్రతిజ్ఞలు .. అదే, న్యూ యియర్ రిసొల్యూషన్స్. మొన్నెవరో మన బ్లాగర్లే అన్నారు .. New year resolutions are like government rules .. they are made to be broken అని :) ఈ జ్ఞానోదయం నాకు ఎప్పుడోనే కలిగి ఈ ప్రతిజ్ఞలు చెయ్యడం మానేశా. కానీ, మొన్నటి జనవరి 1 కి ముందు ఒక రోజు రేడియోలో .. అసలు ప్రతిజ్ఞలు చేసుకోని వారితో పోలిస్తే, ప్రతిజ్ఞ చేసుకున్న వారు అధిక శాతంలో తమ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు .. అని ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్తగారు చెప్పారు. ఉదాహరణకి ఒక జనాభాలో అందరూ బరువు తగ్గాలి అని అనుకుంటున్నారు, కానీ అందులోంచి ఒక వంద మంది మాత్రం కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నారు అనుకోండి. ఈ వందమందిలోనూ సుమారు 43 - 46 మంది తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నారట. ప్రతిజ్ఞ తీసుకోని మిగతా జనాభాలో లక్ష్యాన్ని చేరుకునేది 4 శాతం మించదుట. సరే ఐతే .. జయమ్ము నిశ్చయమ్మురా, ప్రతిజ్ఞల్ చేసుకొమ్మురా అని నేనూ ఎడా పెడా ప్రతిజ్ఞలు చేసి పారేశాను.

కొత్త సంవత్సరంతో పాటు పుట్టింది పుస్తకం.నెట్ .. కొత్త సంవత్సరం ఐతే మనం శ్రమపడకుండానే పుట్టేసింది గానీ, ఈ సైటుకి పురుడు పోసేందుకు చాలా మంది చాలా శ్రమ పడ్డారు. వారం రోజులైనా వయసులేని ఈ బుజ్జి పాప అప్పుడే బోల్డన్ని మంచి మంచి వ్యాసాల్తో ముస్తాబై పోయి అలరారుతోంది. పుస్తక ప్రేమికులందరికీ ఒక మంచి ఆకర్షణగా ఎదుగుతుంది అనడంలో ఏం సందేహం లేదు. తెలుగు బ్లాగులనే మానస సరోవరంలో పుట్టిన ఇంకో జాతి కమలం ఈ పుస్తకాల గూడు.

ఈమాట కొత్త సంచిక విడుదలైంది. ఓ లుక్కెయ్యండి.

1956 నించీ 2006 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రని సమీక్షించుకుంటూ ఒక సమాచార, విశ్లేషణా గ్రంధం వెలువడింది. దీన్ని సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ రిసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ (CDRC) వారు ప్రచురించారు. ఆంగ్లంలో, 568 పేజీలతో .. చరిత్ర, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సౌకర్యాలు, సామాజిక పరిణామాలు, విద్యా వైద్యా రంగాలు .. ఇత్యాది విషయాలపై, సుమారు నలభై విశ్లేషణాత్మక వ్యాసాలు, అనేక పట్టికలతో .. దేశంలో ఏం జరుగుతోంది అని, ఆషామాషీగా కాకుండా కొంచెం సీరియస్ గా పట్టించుకునే వాళ్ళందరి దగ్గరా ఉండాల్సిన పుస్తకం. మేలు ప్రతి రూ 895. విద్యార్ధి ప్రతి రూ 225.
reachcdrc at yahoo dot com లేదా 040-6684 3495 ద్వారా కాపీలు పొందవచ్చు.

హైదరాబాదు పుస్తకాల పండగలో మన బ్లాగర్లు ధనధన లాడించేశారు. ఆదివారం (జనవరి 4) సాయంత్రం విజయవాడ పుస్తకాల పండగలో జరిగిన చిన్న ప్రదర్శన కూడా విజయవంత మైందని మా మామగారు చెప్పారు. ఎంతో శ్రమపడి ఈ విజయానికి కారకులైన అందరికీ పేరుపేరునా అభినందనలు. మరి ఇక్కణ్ణించి ఎక్కడికి? ఇంకేమైనా చెయ్యగలమా మనం? ఈ వేడి చల్లారకుండానే మన భవిష్యత్ ప్రణాళిక నిర్మించుకుందాం రమ్మంటున్నారు చదువరి గారు ఈతెలుగులో. మీ గొంతు కూడా కలపండి అక్కడ.

Comments

శ్రీ said…
రేడియోలో ఆ ప్రోగ్రాం నేనూ విన్నాను,చాలా ఆశ్చర్యమేసింది అంత % లో ప్రతిజ్ఞలు నిలబడుతున్నాయంటే!ప్రతి సంవత్సరమూ నా ప్రతిజ్ఞలు మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాయి.ఈసారి అయిన చూడాలి ఎంతవరకు నిలబడుతాయో!

మన డెట్రాయిట్లో కుడా ప్రతి DTA సమావేశంలో మనమూ e-తెలుగు లాంటి స్టాలు పెడదామంటారా? ఇక్కడి వాళ్ళకి బ్లాగుల పరిచయం కలుగుతూ ఉంటుంది,ఏమంటారు?
jhansi papudesi said…
బాగుండారా??

వచ్చేస్తా వుండా .... కాస్కోండి
మేధ said…
>>పెద్ద ప్రయాస పడకుండానే సంవత్సరం వచ్చేసింది
నిజమే.. కానీ ఏదో మనమే దాన్ని తీసుకు వచ్చిన ఫీలింగ్!

అయితే చాలానే ప్రతిజ్ఞలు చేసారన్నమాట! మరి వాటిల్లో, బ్లాగులో ప్రతీ వారం తప్పకుండా కబుర్లు వ్రాయాలని ఉందా లేదా..?!
అయితే చాలానే ప్రతిజ్ఞలు చేసారన్నమాట! మరి వాటిల్లో, బ్లాగులో ప్రతీ వారం తప్పకుండా కబుర్లు వ్రాయాలని ఉందా లేదా..?!

మేధా, వద్దు వద్దు ఇది మాత్రం ప్రతిజ్ఞల్లో వద్దు :)
రవి said…
బావున్నాయ్ కబుర్లు. అయితే, సంవత్సరం మొత్తం కబుర్లతో సరిపెట్టరనే ఆశిస్తాను.
కబుర్లు బాగున్నాయండీ... నిజమే ప్రతిఙ్ఞలు చేసాం కదా అని కొంత వరకు అయినా పాటిస్తాం ఏదో ఓ మోటివేషన్ అంతే...
Ramani Rao said…
బావున్నాయ్ కబుర్లు:)