రొటీను - వెరైటీ

సంఘజీవి ఐన మానవడు కొంతైనా రొటీనుకి అలవాటు పడతాడనుకుంటా - ప్రతి రోజూ ఇంచుమించుగా ఒకే టైముకి లేవటం - లేవంగానో కాఫీనో టీనో తాగడం, ఒకే టైముకి ఆఫీసుకి వెళ్ళడం .. ఇలా ఒక దిన చర్య ఏర్పడిపోతుంది. ఒక్కోసారి మనిషి దీనికి ఎంత అలవాటు పడిపోతాడంటే - అదొక ఎడిక్షను లాగా - ఆ సమయానికి ఆ పని జరక్క పోతే ఏమీ తోచదు. రిటరైన పెద్దాయన తనకి తోచక ఇంట్లోవాళ్ళని ఎలా కాల్చుకు తింటాడో అన్న టైపులో చాలా కథలు రాశారు మనవాళ్ళు, ఇట్లాంటి సందర్భం ఆధారంగానే.

రొటీనుకి వ్యతిరేక భావన వెరైటీ. మన తెలుగు సినిమాల టైపులో కాదు .. రోజూ చేసే అలవాటు పనికి భిన్నంగా చెయ్యడం. ఎంత రొటీను మనిషైనా, కొద్దిగా వెరైటీ కోరుకుంటాడు. పొద్దునే ఆరింటికల్లా లేచి ఎనిమిదింటికల్లా ఆఫీసులో ఉండే వాళ్ళు శనాదివారాల్లో కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం. రోజూ ఎవరికి వాళ్ళు రెందు బ్రెడ్డు ముక్కలు మింగి పరిగెత్తే వాళ్ళు ఆదివారం నాడు కుటుంబమంతా కలిసి బయటికెళ్ళి "కావల్సినంత మెక్కు" బ్రేక్ ఫాస్ట్ తినడమో, లేక ఇంట్లోనే దోసెలు వేసుకోవడమో. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు "వెకేషన్" పేరిట విహార యాత్రలు. ఇక్కడ కొన్ని ఆఫీసుల్లో ఒక పద్ధతి ఉంది casual Friday అని. మామూలు రోజుల్లో వ్యాపారోచితమైన ఉడుపులు ధరించాలి - శుక్రవారం నాడు మాత్రం జీన్సు, టి షర్టు, టెన్నిసు బూట్లు లాంటివి వేసుకోవచ్చు - అందుగ్గాను ఒకటో ఐదో డాలర్లు ముడుపు చెల్లించాలి. అలా వసూలైన సొమ్ముని ఉద్యోగస్తులందరూ కలిసి ఎంచుకున్న ఒక స్థానిక స్వఛ్ఛంద సంస్థకి విరాళంగా ఇస్తారు.

రొటీను అనగానే అదేదో జాలిపడవలసినది అసహ్యించుకోదగినది అనే భావం స్ఫురిస్తుంది. జాలి ఉట్టిపడుతున్న గొంతుతో "వాళ్ళు అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు" అంటాడు తిలక్. అంటే అన్నాడు గానీ, నా మట్టుకి నాకు కొంచెం రొటీను ఉండడం మంచిదే అనిపిస్తుంది. ఆధునిక నాగరిక జీవితంలో బుర్ర ఏక కాలంలో అనేక సమస్యల్ని గురించి ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని పనులైనా రొటీనుగా చేసుకుపోవడం అలవాటైతే రోజూ దాన్ని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు - ఆ సమయం, ఆ ఆలోచన వేరే పనికి, ఇంకా ఉపయోగమైన పనికి వినియోగించ వచ్చు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాల్సిన వ్యక్తులు, రచయితల్ని కళాకారుల్ని చూసీ అసూయ పడతారు - వాళ్ళకి రొటీను లేదని. అది పొరబాటు. దివంగత వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు డెబ్భై ఏళ్ళ వయసులో ఉదయం రెండేసి గంటలు సాధన చేసే వారట. పేరుపొందిన ఏ రచయిత ఏ గాయకుడు ఏ కళాకారుడి జీవితాన్ని చూసినా క్రమం తప్పకుండా నిరంతరం సాధన చెయ్యటం కనిపిస్తుంది. వాళ్ళకి అవసరమైన రొటీను వాళ్ళకి ఉంటుంది.

రొటీను వల్ల ఇన్ని లాభాలుంటే మళ్ళీ ఇంక వెరైటీ ఎందుకు? అన్ని పనులూ రొటీనుగా చేసుకుంటూ పోవచ్చుగా? అక్కడే ఉంది తమాషా. పరిణామ క్రమంలో వచ్చిన పరిణత కారణంగా కొంత సంక్లిష్టత ఉంటే గానీ తృప్తి చెందదు మనిషి బుర్ర. కొత్త అనుభవాలు, కొత్త సమస్యలు ఎదురైనప్పుడు బుద్ధి చమత్కృత మౌతుంది. మేధ వికసిస్తుంది. వెరసి ఆ అనుభవం మనిషికి తృప్తినిస్తుంది.

అందుకోసం కావాలి వెరైటీ - అలాగని రొటీనుని వొదిలెయ్యక్కర్లేదు.

Comments

Anonymous said…
బాగా చెప్పారు, వెరైటీ లేని జీవితం ఊహించుకోవటమే కష్టంగా ఉంది. నాకు రోటీన్ కర్ణాటక సంగీతమైతే, వెరైటీ అడపాదడపా ఊపునిచ్చే పాశ్చాత్య సంగీతం అనిపిస్తుంది. సుబ్బలక్ష్మి కావాలి, రెహ్మానూ కావాలి. రెండు అవిభాజ్యమైనవి.
రాధిక said…
రోజూ వెరైటీ గా ఎమన్నా చేసినా కొన్నాళ్ళకి అదీ రొటీన్ అయిపోతుంది కదా.అందుకే రొటీన్ ఎక్కువ గా వుండి అప్పుడప్పుడు వెరైటీ కోరుకొంటే బాగుంటుంది.అది జీవితం లో అయినా సినిమాల్లో అయినా. అన్నట్టు ఏమిటీ మధ్య అందరూ రొటీన్.వెరైటి అంటూ మొదలు పెడుతున్నారు.కొంపదీసి బ్లాగులు రాయడం రొటీన్ గా ఫీల్ అయి వెరైటీ కోరుకుంటున్నారా?
Naga said…
బాగుంది. మొదట్లో రొటీనూ అనే పదాన్ని విపరీతంగా వ్యతిరేకించి చివరికి అది కూడా రొటీనయ్యి, తగిన ఫలాలు రాక, ఇప్పుడు రొటీనుగా ఏం పని చేద్దామన్నా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. బ్లాగుల్ని రెండు సంవత్సరాలుగా రాస్తున్నానని గ్రహించి ఈ మధ్యే నా రొటీను-అలవాటుకు కొంత ఉపశమనం పొందాను.

రాధిక గారన్నట్టు బ్లాగులు రాయడం ఎవరికైనా రొటీనుగా అనిపిస్తే, వెరైటీగా వికీని రాయవచ్చు అని నా సలహా. పుణ్యం + స్త్రీ /పురుషార్థం రెండు కలిసి వస్తాయి.
Unknown said…
మీరు రొటీన్ వెరయిటీ గురించి మాట్లాడగానే నాకు అదేదో సినిమాలో బ్రహ్మానందం చేసిన పాత్ర వెరయిటీ పుల్లయ్య గుర్తొచ్చింది.
Anonymous said…
ఆ సినిమా పేరు "మా అల్లుడు వెరీ గుడ్డు". రాజేంద్రప్రసాద్ సినిమా. అందులో బ్రహ్మానందం పేరు "వెరైటీ పుల్లయ్య" (ముద్దుగా వీ.పీ అని అంటారు). అన్నీ వెరైటీగా కావాలంటాడు. ఒక సంస్థ వాళ్ళు అతనికి సన్మానం చెయ్యాలని సంకల్పిస్తారు. బ్రహ్మానందం కారు దిగంగానే "రారా వీపీ వేస్తాం టోపీ" అని రాసుంటుంది. పూల దండ బదులు చెప్పుల దండ. ముత్తైదువుల స్వాగతం బదులు, విధవల స్వాగతం. ఆసనం బదులు చాప. పూలగుత్తి ఇవ్వడానికి బదులు చేతిలో కాలీ-ఫ్లవరు. నెత్తిన కిరీటం. శాలువా బదులు రగ్గు. చప్పట్లు కొట్టాల్సిన జనాలు చిటికెలు....అలా సన్మానం అంతా వెరైటీనే. సినిమా సుమారేగానీ, అందులో బ్రహ్మానందం క్యామెడీ అదుర్స్.
Thanks kotta paali gaaru...meeru cheppina marpulu cheyadam jarigindi....madura mani iyer di vinaledandi nenu....me daggara unte pampedi...

thanks
deepthi.
Ramani Rao said…
This comment has been removed by the author.
Ramani Rao said…
చాలా కాజువల్ గా (అన్ని బ్లాగ్ లు చదివేంత రోటీన్ గా) మీ రొటీన్ - వరైటీ చదివాను.... నిజ్జం చెప్పాలంటే అవాక్కయ్యాను!! మంచి సాహిత్యం.. సందర్భోచిత వాక్య ప్రయోగం ...మీరా నా బ్లాగ్ చూసి కామెంట్స్ ఇచ్చింది(కాంప్లిమెంట్ అనుకోవచ్చా?) అని... ఆవగింజకి ... అణుబాంబు కి వున్నంత వ్యత్యాసం వుంది...నేనింకా చాలా చిన్నదానిని(బ్లాగులు రాయడం విషయంలో ) ... మీకున్నంత పరిశోధన .. పరిశీలానాత్మక దృష్టి నాలో లేవండీ.. చాల బాగ వివరించారు రొటీన్ ...వెరైటీ ల గురించి...
leo said…
ముగ్గురు వక్తలు రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నాం కొత్త పాళీ గారు.
Anonymous said…
కొత్తపాళీ గారు,

భానుమతి గారి "పక్కల నిలబడి" నా భానుమతి గారి టపా కి జత చేశాను. మీకు కావాలంటే మెయిల్ చేస్తాను. మరొకటి మాత్రం దొరకలేదు.
నా మట్టుకు నాకు రొటీనూ నచ్చుతుంది. వెరైటీ కూడా నచ్చుతుంది. దేని అందం దానిదే.

మంచి టపా చదివాను.

కొత్త రవికిరణ్
KumarN said…
"పరిణామ క్రమంలో వచ్చిన పరిణత కారణంగా కొంత సంక్లిష్టత ఉంటే గానీ తృప్తి చెందదు మనిషి బుర్ర. కొత్త అనుభవాలు, కొత్త సమస్యలు ఎదురైనప్పుడు బుద్ధి చమత్కృత మౌతుంది. మేధ వికసిస్తుంది. వెరసి ఆ అనుభవం మనిషికి తృప్తినిస్తుంది".

ఆ వ్యాక్యాలు క్లుప్తంగా, బాగా చెప్పారు.అదే విషయం నేను రాయాలంటే, నాకో రెండు పేరాలు కావాల్సి వచ్చేవి.

ఎప్పటికప్పుడు కొంచెమన్నా మెంటల్ స్టిమ్యులస్ లేకపోవడమనేది, మనిషి కున్న సవా లక్ష కష్టాల్లో, అదో కష్టం.