కబుర్లు - డిశం 8

సుమారు నెల్రోజుల క్రితం, అమెరికా అధ్యక్షునిగా బరాకొబామా ఎన్నికైన నేపథ్యంలో చారిత్రక నిర్ణయం అని ఒక టపా రాశాను. ఈ ఆదివారం పొద్దున రేడియోలో అనుభవజ్ఞుడైన వ్యాఖ్యాత యువాన్ విలియమ్స్ అమెరికాలో జాతి సంబంధాల్ని గురించి మాట్లాడుతూ, నేను ఆ టపాలో చెప్పడానికి ప్రయత్నించిన ముఖ్య విషయాన్నే తన విశ్లేషణలో నొక్కి చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది.

భారతీయ సాంప్రదాయ సంగీతం (దీన్నే కొందరు శాస్త్రీయ సంగీతం అంటారు) ఆఫ్ఘనిస్తానులో కూడా ప్రాచుర్యం పొందిందని చాలా కొద్దిమందికి తెలుసు. పశ్చిమాన్నుంచి ఇరాను (పెర్శియా) ప్రభావం వలన, మత సంబంధాల వలన ఎక్కువగా సూఫీ సంగీతము ప్రాచుర్యం పొందింది అక్కడ. బహుశా ఎప్పుడో మొగల్ చక్రవర్తుల పాలనలో ఇటునించి హిందుస్తాని సంగీత ప్రభావం అక్కడిదాకా చేరి ఉంటుంది. కాల క్రమేణా పోషణ లేక సన్నగిల్లినా అక్కడక్కడా అకస్మాత్తుగా మెరిసి ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఇక్కడ వివిలో చదువుకునేప్పుడు వివి వారు ఏదో ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రవిశంకర్ సితార్ వాదన కచేరీ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి భారతీయ విద్యార్ధులము చాలా మంది స్వఛ్ఛంద సేవకులుగా పనిచేశాము. కచేరీ మొదలై పోయింది. నేనొక ప్రధాన ద్వారం దగ్గర కాపలా ఉన్నాను. ఒక యువకుడు హడావుడిగా టిక్కెట్టు కొనుక్కుని వచ్చాడు. ఇక్కడ కచేరీ మొదలై పోయినాక లోపలికి వెళ్ళనివ్వరు. మొదటి ఐదారు నిమిషాల తరవాత ఒక బుల్లి విరామం ఇస్తారు .. లేటుగా వచ్చిన వారు ఆ సమయంలోనే లోపలికి వెళ్ళొచ్చు. అలా ఈ అబ్బాయి అక్కడ తలుపు దగ్గర నిలబడి పోయాడు. ఆ సమయంలో వాడితో కాసేపు ముచ్చటించాను. అతను ఆఫ్ఘను అనీ, వాళ్ళ కుటుంబంలో హిందుస్తానీ సంగీత ఆస్వాదన వంశ పారంపర్యంగా వస్తున్నదనీ, ఈ కచేరీకి హాజరయ్యేందుకు అతగాడు సుమారు 120 మైళ్ళు డ్రైవు చేసుకుని వచ్చాడని తెలిసి నిర్ఘాంతపోయాను.
ఇవ్వాళ్ళ పొద్దున రేడియోలో వినబడిన ఆఫ్ఘను హిందుస్తానీ సంగీతపు తునక మీరూ రుచి చూడవచ్చు.

గత వారంలో బుజ్జిగాడు (ప్రభాస్, పూరీ) అనే ఒక యెదవ సినిమా, నిశాంత్ (అమ్రీష్ పురీ, గిరీష్ కర్నాడ్, శ్యాం బెనగల్) అనే ఆర్టు సినిమా చూశాను. త్రిషాని తెలుగు సినిమాల్లో హీరోయినుగా పరిచయం చేసిన వాణ్ణి జూబిలీహిల్స్ చెక్ పోస్టు దగ్గర కొరత వెయ్యాలి. ఏమాట కామాట ప్రభాస్ నటనలో కాస్త ఇంప్రూవ్ అయినట్టున్నాడు. ఇంక అంతకంటే ఆ సినిమా గురించి చెప్పేందుకు ఏవీ లేదు. నిశాంత్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉంది. అది ఇంకో సారి తీరిగ్గా చెబుతా సందర్భోచితంగా.

మాకు సుమారు అరవై మైళ్ళ దూరంలో ఉన్న ఏనార్బరు నగరంలో UMS అని ఒక సంస్థ ఉంది. సెప్టెంబరు నెలనించీ మేనెల దాకా రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం దీని ప్రధాన కర్తవ్యం. డిసెంబరులో, క్రిస్మసు పందగని పురస్కరించుకుని వీళ్ళు జరిపే ఒకే ఒక కార్యక్రమం మెస్సాయా .. బైబులు లోని వివిధ వాక్యాల సముదాయానికి జెర్మను సంగీత కారుడు హేండెల్ స్వరపరిచిన స్వర సాహిత్య సంకలనం ఇది. క్రీస్తు అవతారాన్ని గురించి ఒక ఆధ్యాతంక స్థాయిలో కథలాగా చెప్పుకొస్తుంది. సుమారు నూట యాభై మంది గాయనీ గాయకులతో కూడిన UMS Choral Union వారు అద్భుతంగా గానం చేసిన ఈ కచేరీని చారిత్రాత్మక హిల్ ఆడిటోరియములో నిన్న రాత్రి విని వచ్చాను. ఒకే ఒక మాట .. అద్భుతం!

Comments

బాగున్నాయండీ కబుర్లు ఎప్పటిలానే, ఆఫ్ఘను హిందుస్తానీ సంగీతం గురించి నేను మొదటి సారి వినడం good to know.
నిశాంత్ లో అనంత్ నాగ్ తన అసమర్థకోపాన్ని (impotent range)పిచ్చిమొక్కలపై చూపుతూ వీరంగం చేసే దృశ్యాన్ని భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒకానొక ఉత్తమ దృశ్యంగా చెప్పుకుంటారు.ఈ చిత్రం నిజంగా గొప్ప చిత్రం. మీ నుంచీ ఒక మంచి విశ్లేషణని ఆశించొచ్చన్నమాట! బ్లాగులోకం దానికోసం వేచివుంటుంది.
KumarN said…
" సుమారు నూట యాభై మంది గాయనీ గాయకులతో కూడిన UMS Choral Union వారు అద్భుతంగా గానం చేసిన ఈ కచేరీని చారిత్రాత్మక హిల్ ఆడిటోరియములో నిన్న రాత్రి విని వచ్చాను"

I am really jealous.
వేణూశ్రీకాంత్ .. కదా!
మహేశ్ .. అనంత్ నాగ్ విలన్లలో ఒకడు. మీ ఉద్దేశం గిరీష్ కర్నాడ్. విశ్లేషణ రాయాలనే ప్రయత్నం, సంకల్పం.
Kumar .. You should .. feel jealous that is :)
@కొత్తపాళీ: అవునౌవు...గిరీష్ కర్నాడే!
మేధ said…
ఓహ్.. ఆఫ్ఘన్ లో కూడా మన(భారతీయ) సంగీతం ఉందా.. ఈ రోజు తెలుసుకున్న క్రొత్త విషయం.. :)

బుజ్జిగాడు సినిమా చూశారా...!!!! మీ ఓపికకి జోహార్లు..!

>>" సుమారు నూట యాభై మంది గాయనీ గాయకులతో కూడిన UMS Choral Union వారు అద్భుతంగా గానం చేసిన ఈ కచేరీని చారిత్రాత్మక హిల్ ఆడిటోరియములో నిన్న రాత్రి విని వచ్చాను"

నాకు కూడా కుమార్ గారిలానే జెలసీ గా ఉంది..
Bolloju Baba said…
కొరత/కొర్రు ఒకటే నన్న విషయం తెలిసింది. అనుమానం వచ్చి బ్రౌన్ నిఘంటువు చూసా కూడా.

థాంక్యూ సారు.
కొత్తపాళీగారు,
ఏంటండి. ఛార్మీని హీరోయిన్ చేసినవాళ్లని RTC X Roads దగ్గర ఉరి తీయాలంటారు. త్రిషని హీరోయిన్ చేసినవాళ్లని Jubilee Hills చెక్ పోస్ట్ అంటారు.. మరి ఆ త్రిషకి జాతీయ ఉత్తమనటిగా అవార్డ్ ఇచ్చనవాళ్లని ఏం చేయాలంటారు?? మీరిలా అంటే మన యూత్ ఏం కావాలి. ఫీల్ ఐపోరు...
నిజమే, ఫీలవుతారు. కానీ నేను హీరోయిన్లని ఏం చెయ్యమనలేదు. పరిచయం చేసి మనల్ని ఈ హింసకి గురి అయ్యేందుకు మొదటి కారకుణ్ణి మాత్రం శిక్షించమన్నాను. మనలో మాట ఈ త్రిష దేభ్యం కంటే చార్మి చాలా బెట్రు.
KumarN said…
ఏంటి గురూగారూ, మీకు త్రిషా అంటే ప్రేమ చాలా ఎక్కువున్నట్లుందే?

కారణాలు చెప్పారు కాదు.. :-). అతడు సినిమాలో మహేష్ చెప్పిన కారణాలేనా మీవి కూడా?

నిజమే ఛార్మీ చాలా బెటర్.