ఫేంటసీ కథ కమామిషు

ఈసారి కథా కమామిషు వ్యవహారంలో జరిగిన జాప్యాలస్యానికి అందర్నీ, ముఖ్యంగా కథలు రాసిన వారిని క్షమాపణలు వేడుతున్నాను.

మనం ఈదుతున్నాం చెంచాడు భవసాగరం
ఇచ్చిన అంశాన్ని ఆసరాగా చేసుకుని, ఈనాటి ఒక గృహిణి మనోభావాలకి అద్దం పడుతూ, ఒక కలలాగా మంచి ఫేంటసీ అల్లారు రమణిగారు. ఆ ఫేంటసీలోనే, మొగాళ్ళు కాస్త తమ భార్యల బాధని అర్ధం చేసుకోవాలని మెత్తమెత్తగానే చురకలు కూడా వేసేశారు. ముఖ్యంగా, కథ మొదణ్ణించీ చివరి దాకా ముఖ్య పాత్ర అయిన లక్ష్మి మనస్తత్వం చాలా చక్కగా తీర్చి దిద్దారు. నిజంగా కథలో తప్పు పట్టేందుకు ఏమీ లేదు. అక్కడక్కడా రచయిత్రి వాక్కుగానో, పాత్రల వాక్కుగానో తోంగి చూసిన సామెతలు సమయోచితంగా చురుక్కుమన్నాయి. వైకుంఠంలో నాథునితో సంభాషణలో లక్ష్మీ దేవి నొక్కిన సన్నాయి నొక్కులు కూడా బాగున్నాయి. ఒక చిన్న గమనిక. మన పురాణాల ప్రకారం బ్రహ్మ విష్నువుకి కొడుకవుతాడు గనక ఆ వరసలు అలా నిలిపి ఉంటే బాగుండేది.
ఇది వరకు కథాంశాల మీద రాసిన కథలకన్నా ఈ రచనలో మంచి పరిణతి కనిపిస్తున్నది. రమణి గారికి అభినందనలు.
ఐతే, పోటీ విషయానికొస్తే, పలువురు గమనించినట్లు, పోటీకి ప్రకటించిన విషయం, రచయిత్రి చెప్పదల్చుకున్న కథకి ఒక చిన్న పార్శ్వంగా మిగిలిపోయింది గానీ కథకి కేంద్రం కాలేదు. పైగా, బ్రహ్మ మగవారి తలరాతలు మార్చడం అనే అంశం వల్ల వచ్చే ఫలితాల్ని ఒకట్రెండు చిన్న దృశ్యాలో చూపించారు గానీ, ఆ ఘటన ఫలితం కథలో ముఖ్య పాత్రలైన లక్ష్మి శ్రీనివాసులకి ఏమీ తగల్లేదు.

కాసనోవా 2020
ఒక అజ్ఞాత రచయిత సమర్పించిన అద్భుతమైన సైన్సు ఫిక్షన్ ఫేంటసీ కథనం ఇది. ఎవరన్నా కాస్త సాహసి అయిన నిర్మాత, క్రాంతదర్శి అయిన దర్శకుడు ఉంటే మంచి రసవత్తరమైన సినిమా తియ్యొచ్చు. ఈ రచయిత ఊహా బలానికి హేట్సాఫ్ అనకుండా ఉండలేకపోతున్నా. అనేకానేక అభినందనలు.
తమాషాగా, బ్రహ్మ సృష్టించిన ఈ మగ తలరాతని తన టెక్నికల్ జీనియస్సుతో కథానాయకుడు జయించినట్టుగా ఊహించి రచయిత మంచి పథకమే వేశారు. ఐనా, ఈ కథకి కూడా నేనిచ్చిన కథాంశం ఒక చిన్న పార్శ్వంగా ఉండిపోయింది తప్ప కథలో ముఖ్య భాగం కాదు.అందుకని దీనికీ బహుమతి లభిచదు.
ఇటువంటి భవిష్యత్, సైన్సు ఫిక్షను కథలు రాసేప్పుడు రచయిత కొంత సంయమనం పాటించాలి. ఎటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఎలా పరస్పరం ఫిట్ అవుతున్నాయని సరి చూసుకుంటూ ఉండాలి. ఉదా .. ఎవరో ఇద్దరి మధ్యన సంభాషణలాగా మొదలైన కథలో, ఆ సంభాషణ ప్రసక్తి మధ్యలో గానీ చివర్లో గానీ మళ్ళీ రాదు. దొంగల స్థావరంలో సంభాషణలు, జరిగిన సంఘటనలు మరీ అడివిరాముడు సినిమా టైపులో ఉన్నై. మొదటి అధ్యాయంలో పదే పదే సూచనగా కనిపించే ఎర్రగొర్రె పిల్లకి మిగతా కథలో ఏమీ ప్రాముఖ్యత లేనట్టుంది. ఇట్లాంటివి కథనిండా మరి కొన్ని. వీటి మీద దృష్టి పెట్టి, అదే రకమైన పదునైన కథనంతో రాస్తే, ఈ రచయిత తెలుగులో అద్భుతమైన సైన్సు ఫిక్షను సృష్టించ గలరు, సందేహం లేదు.

కథ కథ కందిత్తు
దైవానిక ఈ అంశానికి రాసిన కథలో చాలా మంచి పరిణతి కనిపిస్తోంది, కథకి ఒక సెంట్రల్ థీం, దాన్ని నడిపింఛడానికి పన్నిన వ్యూహము, తదనుగుణంగా ఎన్నుకున్న పాత్రలు ఈ కథకి వనె తెచ్చాయి. భార్యా భర్తల పాత్రలు రెండూ, ఒకరి తరవాత మరొకరు నేను అని కథ నడిపించడం చాలా కష్టమైన పని. అది సమర్ధవంతంగానే నిర్వహించారు. దేవుడు భక్తురాలికి వరమిచ్చే సన్నివేశం కూడా, దేవత నోటి ద్వారా వ్యంగ్య ధోరణిలో చెప్పించి మంచి సందర్భోచితమైన హాస్యం పండించారు. ముగింపు కొంచెం మణిరత్నం సినిమా ష్టైల్లో సుఖాంతమైనట్టుంది. ఈయన కూడా ఇది కలే అని తేల్చేశారు. ఈ కథ కూడా ఇచ్చిన అంశాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. పెళ్ళిళ్ళు పాడవడం వల్ల స్త్రీలకే కోపం కలిగినట్టు చూపించడం ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా, మంచి వ్యంగ్య కథల్ని ఈయన కలం నించి ఆశించవచ్చు.

శాపమైన వరం (ఓ కాకరకాయ)
ఈ సారి వికట సింగు, ఐ మీన్, వికట కవి గారు తెరంగేట్రం చేశారు. కథాంశానికి ఆయన చేసిన ఊహ, కథనం మంచి హాస్య భరితంగా ఉన్నాయి. కానీ కథ చెప్పే విధానంలో పట్టు లోపించి వదులు వదులుగా ఉంది. పాత్రల పేర్లు, జరిగిన వింత సంఘటనల పరిణామాల్ని కల్పించడంలో మంచి సృజనాత్మకత చూపించారు. సంఘటనల మధ్య కార్య కారణ సంబంధం, పాత్రల మనస్తత్వ చిత్రణ, సెటైరు పాలు ఎక్కువై, కథా రూపానికి దూరంగా వెళ్ళిపోయాయి. ఇంకాస్త శ్రద్ధ పడితే ఈయన సమకాలీన విషయాలపై మంచి సెటైర్లు రాయగలరు.

జ్యోతి గారు వ్యక్తిగత వేగు ద్వారా పంపారు తన కథని. కథ స్వరూపాన్ని ఊహించడంలో నా ఊహకి అతి దగ్గరగా వచ్చారు. నేనిచ్చిన కథాంశాన్ని యథా తథంగా స్వీకరించి అనేక జంటల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేశారు. అలాగే అదే ఫెంటసీ ఆలోచనని పొడిగించి స్త్రీల ఘోర తపస్సుకి దీటుగా మగవారితో యజ్ఞాలు చేయించారు. ఐతే, ఈ కథలో కూడా సంఘటనల మధ్య కార్య కారణ సంబంధాల్ని సరిగ్గా పట్టించుకోక పోవడం, పాత్రలకి ఒక వ్యక్తిత్వం లేకపోవడం వంటి లోపాలు మిగిలాయి. ఏదేమైనా, ఇదివరకటి రచనల మీద భాషలోనూ, రచనా వ్యూహంలోనూ చాలా ఇంప్రూవ్‌మెంట్ కనబడుతోంది.

సృష్టి 25.0 అను జానపద పౌరాణిక సైన్స్ ఫిక్షను కథ
ఈ పోటీతో కథకుడిగా తెరంగేట్రం చేసిన చివుకుల కృష్ణమోహన్ చమత్కృతులతోనూ, రచనా వ్యూహంతోనూ పాఠకుల్ని అలరించే విధంగా కథని మలచారు. కథాంశాన్ని వాడుకున్న పద్ధతి కూడా నా మనసులో ఉన్న దృశ్యానికి బాగా దగ్గరగా వచ్చింది. సంభాషణల్లోని యెకసెక్కాలు అలనాటి సెటైరు అతిరథుల్ని తలపిస్తున్నాయి. ముఖ్యమైన లోపం, కథద్వారా సందేశం ఇవ్వాలనుకోవడమే గాక, కథకుడిగా చొరబడి మరీ ఇవ్వ బూనడం. ఇంత చక్కటి కథనం చదివాక ఇది హరాయించుకోవడం కొంచెం కష్టం. అక్కడక్కడా సంభాషణల్లో, నుడికారాలు ధ్వనించే చోట్ల, అన్ని పాత్రలూ కృష్ణమోహన్ లాగానే మాట్లాడుతుంటాయి. ఏదేమైనా, ప్రయత్నం కొనసాగిస్తే మన బ్లాగ్లోకం నించి ఇంకో మంచి కథా రచయిత పుడతారని నాకు ఏ మాత్రం సందేహం లేదు.

ఈ సారి బహుమతి కృష్ణమోహన్ కి.

పాల్గొన్న రచయితలందరికీ మరొక్కసారి అభినందనలు.
ప్రస్తుతానికి ఈ కథ రాసే పోటీల్ని కట్టి పెడుతున్నాను. మళ్ళి ఎప్పుడన్నా సందర్భోచితంగా ప్రయత్నిద్దాము.

Comments

Purnima said…
WOW.. that was ore or less expected!


Congratulations Krishnamohan gaaru!!
Ramani Rao said…
అభినందనలు కృష్ణ మోహన్ గారు.
Naga Pochiraju said…
ఇది చాలా అన్యాయం కొత్తపాళి గారు
మీరు కథా ఇతివృత్తం ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచీ ఎంతో కాలం గా వాడకుండా అట్టే పెట్టినా నా బుర్ర కాస్త ఆలోచించడం మొదలు పెట్టింది
ఇప్పుడు మీరు ఇతివృత్తాలు ఇవ్వడం పక్కన పెడితే నాకు చాలా కష్టం గా ఉంటుంది
దయచేసి కొత్త ఇతివృత్తం ఇవ్వండి
కృష్ణమోహన్ గారు, అభినందనలు.

రాయటం ఒకెత్తయితే, అన్నీ చదివి తల తిప్పడం, కడుపు తిప్పడం లాంటివి తట్టుకుంటూ .... వాటి లోటుపాట్లు చెప్పటం, అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది. కొత్తపాళీ గారు, మీకు ధన్యవాదాలు.
చాలా బాగుంది.మీకు బ్లాగ్లోకం తరపున "దీపావళి" శుభాకాంక్షలు....

శ్రీసత్య...
@లలితా స్రవంతి పోచిరాజు .. అసలు ఇవ్వను అనడం లేదు. మళ్ళీ ఇస్తాను ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు.
Anonymous said…
@పూర్ణిమ,రమణి,వికటకవి - ధన్యవాదాలు.
@వికటకవి - నిజమే, రాయడం ఏముంది ఏదో ఒకటి రాసిపడేస్తాం. దానిని చదివి మనకి ఉపయోగకరమైన సలహా ఇవ్వాలంటే మనకంటా కొత్తపాళీ పడిన కష్టం ఎంతో ఎక్కువ. కొత్తపాళీగారూ, ధన్యవాదాలు.
ఆర్యా! మీ వ్రాతలు నిత్య నూతనంగా వుండి కొత్త పాళీ యెప్పుడూ కొత్త పాళీయేనని ఋజువు చేస్తున్నాయి.
మీ బ్లాగులో పైన " బ్లాగులందు తెలుగు బ్లాగు వేరయా " అని వ్రాశారు. దానిని " బ్లాగు లందు తెలుగు బ్లాగులే వేరయా. " అని వ్రాస్తే ఆటవెలది మొదటి పాదమై విన సొంపుగాను, చదువ సొంపుగాను ఉంటుంది కదండీ. అలా మార్పు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
నమస్తే.
{ ఆంధ్రామృతం బ్లాగు }
ఆర్యా! మీ వ్రాతలు నిత్య నూతనంగా వుండి కొత్త పాళీ యెప్పుడూ కొత్త పాళీయేనని ఋజువు చేస్తున్నాయి.
మీ బ్లాగులో పైన " బ్లాగులందు తెలుగు బ్లాగు వేరయా " అని వ్రాశారు. దానిని " బ్లాగు లందు తెలుగు బ్లాగులే వేరయా. " అని వ్రాస్తే ఆటవెలది మొదటి పాదమై విన సొంపుగాను, చదువ సొంపుగాను ఉంటుంది కదండీ. అలా మార్పు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
నమస్తే.
{ ఆంధ్రామృతం బ్లాగు }