కాసిని కబుర్లు

ఎప్పుడు కొత్త టపా రాయాలన్నా .. ఏదో ఒక వత్తిడి. చాలా క్లెవరుగా రాయాలనో, లేక వినోద చమత్కార భరితంగా రాయాలనో, .. ఈ వత్తిళ్ళు లేకుండా, మిత్రులతో కాసేపు పిచ్చాపాటీ చెప్పుకున్నట్టు, ఈ గత వారం పది రోజుల్లో నా దృష్టికి వచ్చిన వింతలు విశేషాలూ చెప్పుకుంటూ ఒక టపా హాయిగా ఎందుకు రాసుకోకూడదూ అని ఈ తెల్లారు జామున ఈ బ్రిలియంటైడియా వచ్చేసింది.

మన రానారె రాసిన కథ పేరు గలవాడేను మనిషోయ్ ఈ నెల తెలుగు నాడి మాస పత్రికలో పునః ప్రచురితమైంది. ఇతగాడు ఈ మంచి కథ రాయడానికి కాస్తో కూస్తో నేను కూడా కారణమైనందుకు పిచ్చ సంతోషంగా ఉంది నాకు. నా యువమిత్రుడికి హార్దికాభినందనలు. ముందు జాలపత్రిక ఈమాటలోనూ, ఇప్పుడు అచ్చుపత్రిక నాడిలోనూ కథలు ప్రచురించడంతో రచయితగా రానారె ఇంకో మెట్టు పైకెక్కాడు. ఆ బాధ్యతని గుర్తించుకుని సాహితీ క్షేత్రంలో ఇంకా మంచి కథలు విరివిగా పండిస్తాడని నా ఆశ, ఆశీస్సులు కూడా. బ్లాగర్లకీ బ్లాగ్విజిటర్లకీ రానారె చిరపరిచితుడే అయ్యుండచ్చు. ఒకేళ కొత్తోళ్ళకి తెలీదేమో .. నామిని చిత్తూరు మాండలికానికి సాటి వచ్చేట్టుగా కడప జిల్లా గ్రామీణ జీవితాన్ని తనదైన భాషలో తెరకెక్కిస్తున్న వీరబెల్లె వీరుడు రానారె.

పని లేనప్పుడల్లా యూట్యూబులో దూరి కెలుకుతూ ఉంటాను .. ఒక్కోసారి భలే విచిత్రమైన వింతైన విడియోలు బయట పడుతుంటాయి. అలా ఇవ్వాళ్ళ పొద్దున్న సాక్షాత్కరించిన శివస్తోత్రం మీరూ కాసేపు ఆనందిస్తారేమోనని.

తూలిక మాలతి గారు రాసిన రెండు పుస్తకాలు ఈ వారంలో చేతికందాయి.
1. Telugu Women Writers, 1950-1975, Andhra Pradesh, India. A Critical Study.
2. All I Wanted was to Read and other stories.
పుస్తకాలు దొరికే వివరాలు ఇక్కడ.

చదవాలి తీరిక చేసుకుని. చదవంగానే ముందు మీకే చెబుతా ఆ కబుర్లు విన్నవీకన్నవీలో. ప్రస్తుతానికి పెయొలీనీ మూడో నవల బ్రిసింగర్ నడిమధ్యలో ఉన్నా. సినిమాలేవీ చూళ్ళేదు ఈ మధ్యలో.

అనట్టు జాలపత్రిక ఈమాట సెప్టెంబరు సంచికలో సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజస్వామిని గురించి గొర్తి సాయిబ్రహ్మానందం గారు
మంచి వ్యాసం మొదలు పెట్టారు. అనేక మూల గ్రంధాల్ని పరిశోధించి, ఏది ఆధారాలతో ఋజువు చేయగల చరిత్ర, ఏది శిష్యుల భక్తి సృష్టించిన కల్పన అన్న విచక్షణతో త్యాగరాజు జీవిత విశేషాల్ని ఈ వ్యాస పరంపరలో వెలువరించేందుకు శ్రీ గొర్తి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. కర్ణాటక సంగీతం, చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం.

ప్రస్తుతానికి కబుర్లు ఇంతే. త్వరలో మళ్ళీ కలుద్దాం.

Comments

మీ ఆలోచన బాగుంది. ఇలానే అప్పుడప్పుడు కాసిన్ని సరదా సరదా కబుర్లు చెపుతుండండి. అసలు బ్లాగులో టపాలు అలానే రాయాలి-సహజంగా, స్వతాహాగా మనస్సుకి ఏది తోస్తే అది, ఏది నచ్చితే అది....అంతే కాని పరిశోధనలు చేసి, లెక్కలు వేసి, .....అబ్బ విసుగొచ్చేస్తుంది :))
Purnima said…
Quite Informative! Thank you!
కాస్తోకూస్తో కారణం కావడమేమిటి గురూజీ, అది ఒక కథగా తయారయింది మీ సాధింపుల వల్లే. :)

దాని తాలూకు నాకందిన అభినందలు మీ చలువే. విమర్శలు నా తొందరపాటు వల్ల, మీ మాట వినకపోవడం వల్లా వచ్చినవి. మీ ఆశీస్సులను మరోసారి అందుకున్నాను. ధన్యోస్మి.

నా బ్లాగులో కొత్త టపా రాయడం కోసం మీరు పడే బాధే అప్పుడప్పుడూ నేనూ పడుతుంటాను. ప్రతి టపాలోనూ ఏదో కొంచెం చమత్కారం వుండాలనుకునే అత్యాశను తగ్గించుకుని మీలాగా ఈరోజో రేపో నేనూ ఒకట్రెండు కబుర్లు చెబుతా. వినండి.
అసలు సిసలు బ్లాగు టపా! మనసులో ఏమేమున్నాయో అన్నిటినీ ఎక్కించేయడం!!

మీ ఆలోచనలతోపాటుగా మధ్య మధ్య చాక్లెట్లు పంచినందుకు థాంక్స్ :-)
కొత్తటపా రాయడం కోసం మీరు పడే బాధే నా బ్లాగులో అప్పుడప్పుడూ నేనూ పడుతుంటాను ... అని రాయాల్సింది. వాక్యం ఒకలా మొదలుపెట్టి ఇంకోలా ముగించాను, తెలుగుభాష మనకిచ్చే ఈ వాక్యనిర్మాణ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేస్తూ. :-)
మాలతి said…
బాగుంది. బ్లాగంటే ఏమిటో పదిమందికీ మరోసారి చెప్పేసారు. నాపుస్తకాలమాట కూడా చేర్చినందుకు ధన్యవాదాలు.
oremuna said…
ప్రయోగం బాగుంది. కాకుంటే మీ భాష ఇంకా పుస్తకం భాషే :)
టపా అంటే ఇదే రా !! అని చెప్పారుగా....బాగుంది కొత్తపాళీ గారు...
అదే మరి..
మనమేమన్నా పరీక్షలకు రాస్తున్నామా? ఎంత బిజీగా ఉన్నా, కాస్త సరదా కబుర్లతో అందరిని పలకరించితే సరి..బుర్రలో ఉన్న విషయాలు చెప్పేసాక అది కూడా ఖాళీ అవుతుంది.కొత్త సంగతులు చేర్చుకోవచ్చు...
అదే అనుకున్నా. నిన్న ప్రమదలు చేసిన మూకుమ్మడి దాడిలో కొన్ని సమ్మోహనాస్త్రాలు విరిశాయి. వాటిల్లో నాకు అంత సమ్మోహనంగా కనిపించినది విషయ సాంద్రతో, చమత్కారమో కాదు. వారు రాసిందేదో వారి మనసులోంచి వచ్చింది అనిపించడమే దానిక్కారణం.
రాంనాథా .. నీ వాక్య నిర్మాణ కౌశలమ్మును మెచ్చితిని :) నీ ందోటి వెర్షనులో తేడా అర్ధం ఏం రాలేదులే గానీ, ఈ మధ్య కొన్ని కొన్ని చోట్ల నాకూ ఇలా అనిపించింది - ఈ వాక్యం రాసిన మనిషి దాన్ని తిరిగి చదువుకున్నాడా అసలు? అని.
ఒరెమూనా - పుస్తకభాష యనగా నేమి? భాష యెట్లుండవలెనని తమ యభిప్రాయము?
ఇంతకీ ఎవరూ గొర్తిగారి త్యాగరాజు వ్యాసం చదవలేదా?
Ramani Rao said…
నిన్న 'కాసిని కబుర్లు ' అన్న టైటిల్ చూసి, ఈ కాసిని కబుర్లు వినాలంటే, చక్కటి, చిక్కటి కమ్మని కాఫీ, ఓ నాలుగు బిస్కెట్స్ కావాల్సిందే అనుకొని అవి తెచ్చుకొని మీ కబుర్లు వింటూ మీ బ్లాగు ముందు కూర్చున్నానా! కాఫీ కమ్మదనమో, మీ కబుర్ల మాయో తెలియలేదు కాని వ్యాఖ్య రాయాలన్న విషయం తట్టలేదు నా చిన్ని మెదడుకి. "కబుర్లేంటి ఇంత తొందరగా అయిపోయాయి"? అనిపించింది కాసేపు. చక్కటి కబుర్లు చెప్పారు.
రానారే గారికి అభినందనలు. సహకరించిన మీకు అభినందనలు. శివ స్తోత్రం బాగుంది. తూలిక గారికి కూడా ప్రత్యేక అభినందనలు.
అర్రెరే!! నేను కూడా కాసిని కబుర్లు చెప్పేసానోచ్.
క:- ఆర్యా ! బాగున్నారా!
సూర్యోదయమవకమునుపె చూచెదనయ మీ
ధుర్యత్వము ప్రకటించెడి
మర్యాదను కొలుపు రచన మన బ్లాగులలో.
very good. keep it up. wish you all success.
namastE,
chuinta ramaa krishnaa raavu.
{andhraamrutham blog}
Purnima said…
అన్ని కుదిరి ఇవ్వాల్టికి గొర్తి గారు రాసిన వ్యాసం పూర్తి చేశాను. తక్కిన భాగాలకోసం ఎదురుచూడాలి. నాకిప్పటి వరకూ ఆయన పెద్ద సంగీతకారులన్న విషయం తప్పించి మిగితావేవీ తెలియవు. ఈ వ్యాసం ద్వారా చాలా విషయాలు తెలిసాయి.

పరిచయం చేసినందుకు నెనర్లు!