బ్లాగ్విషయం - గ్రంధాలయాలు - 2

మొదటి భాగం తరువాయి

ఎనిమిదో తరగతికి బిషప్ గ్రాసీ హైస్కూలుకి చేరుకున్నా. దీన్నీ గుణదల బోర్డింగ్ స్కూలు అని కూడా అనేవారు. పరమ రౌడీల స్కూలు అని ఆ రోజుల్లో విజయవాడలో ప్రతీతి. నేను ఈ స్కూలుకి వచ్చే సమయానికి సరిగ్గా మా బడికి ఎదురుకుండానే రామగోపాల్ అనే సినిమా హాలు కట్టారు. నగరంలో ముఖ్యమైన థియేటర్లలో ఆడేసిన సినిమాలు ఒక్కోవారం మాత్రం ఈ హాల్లో ఆడేవి.

అప్పటిదాకా చదువుకున్నది కో ఎడ్యుకేషను. పాఠం చెప్పింది లేడీ టీచర్లు. ఇక్కడ బడి ప్రాంగణంలోకి అడుగెట్టాక గుండెలినిండా గాలి పీల్చినా ఎక్కడా ఆడ వాసన కూడా చొరరాని మగ కీకారణ్యం .. కాదు కాదు మగ ఎడారి. ఎలాగో అలవాటు పడ్డాను. కొందరు పాతబడి నించి పాత స్నేహితులు అవలంబనగా ఉండగా కొత్త స్నేహితులు కొందరు ఏర్పడ్డారు. చూస్తూ చూస్తూ ఉండగానే ఎనిమిదో తరగతి ముగిసింది.

పాతబళ్ళోనూ కొత్తబళ్ళోనూ కొంచెం బాగా చదువుతాననీ బుద్ధిమంతుణ్ణనీ పేరు. అంచేత విద్యార్ధుల తరపునించి ప్రత్యేకమైన పని ఏవన్నా ఉందంటే క్లాసులో మేస్టారు నన్ను పిలుస్తూ ఉండటం పరిపాటి. అలాంటిది మేము తొమ్మిది చుదువ్తూ ఉండగా ఒకరోజు బడి అటెండరు ఒక చీటీ పట్టుకొచ్చి మేస్టారికిచ్చాడు. ఆయన, "ఒరే రామకృష్ణా, హెడ్‌మేస్టారు పిలుస్తున్నారు." అని నా ముఖ్య స్నేహితుణ్ణి పిలిచారు. వాడు లేచి అటెండరుతో వెళ్ళాడు. ఆ పీరియడు తరవాత మధ్యాన్నపు ఇంటార్వల్. ఇంటర్వల్లో రామకృష్ణ వొచ్చి కలిశాడు. విషయమేవిటంటే .. మా బడికి ఒక లైబ్రరీ ఉంది (ఆ విషయం మా కెవ్వరికీ ఇంతవరకూ తెలీదు). లైబ్రేరియను ఎవరు లేకపోవటం వల్ల ఇన్నాళ్ళూ అది నడవలేదు. సరికొత్తగా ఒక లైబ్రేరియన్ ఎపాయింటై వచ్చారు. మా రామకృష్ణ వాళ్ళ నాన్నగారు ఇంకో బళ్ళో మేస్టరుగా పని చేస్తార్లే, ఈ లైబ్రేరియను గారు కూడా ఆ బడిలో పని చేసేవారు. మా బడి లైబ్రరీ చాలా కాలం పట్టించుకోక పోవడం మూలాన చాలా హీన స్థితిలో ఉంది. ఆ పుస్తకాలన్నిటినీ బూజు దులిపి లైబ్రరీని ఒహ కొలిక్కి తీసుకు రావడానికి కొందరు "ఒబీడియెంట్ స్టూడెంట్" లని సహాయం పంపమని లైబ్రేరియన్ హెడ్ మాస్టారిని కోరాడు. అలాగ రాంకిష్టిగాడూ, వాడితోపాటు నాలాంటి మరి కొందరమూ మా బడి లైబ్రరీ అనే కోటలో పాగా వేశాం.

అదేదో జానపద కథల్లో మూసి ఉన్న గదిలోకి వెళ్ళోద్దని ముసలి అవ్వ ఆంక్ష పెట్టినా హీరో ఆ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడో అద్భుత ప్రపంచం ఆవిష్కరించ బడుతుందే .. అలా ఉంది నా పరిస్థితి ఆ లైబ్రరీ గదిలో. వారానికో రెండు గంటలు లైబ్రరీ సర్దటం అనే మిష మీద లోపల దూరడం, పని కూడా చేశాం అనుకోండి, స్వామికార్యమూ స్వకార్యమూ అన్నట్టు, చదువుకోటానికి పుస్తకాలు తెచ్చుకోవడమూనూ. లైబ్రరీ సర్దుడు పూర్తయ్యి ఒక కొలిక్కి వచ్చాక బడి విద్యార్ధులందరికీ పుస్తకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ పద్ధతి ఎలా ఉండేదంటే, కిటికీ బయట ఒక్కొక్క క్లాసు పిల్లకాయలు లైనులో నించునే వాళ్ళు. లైబ్రేరియను ఒక పుస్తకాల దొంతర పక్కన పెట్టుకుని కిటికీ లోపల కూర్చునేవాడు. చేతికందిన పుస్తకం ఇచ్చేవాడు, ఇక మారు బేరం లేదు.

మేము మాత్రం, ఒక నెల రోజులు లైబ్రరీ సర్దాము అన్న చనువుతో, లైబ్రరీ మీద సార్వకాలిక హక్కులు సంపాదించుకున్నాం. ఈ లైబ్రరీ పీరియడు సమయంలో మాలో ఇద్దరు లైబ్రేరియనుతో పాటు సహాయకులుగా లోపలికి వెళ్ళటమూ, కావలసిన పుస్తకాలు తెచ్చుకోవడము. అఫ్కోర్సు, మాక్కూడా తడవకి ఒక పుస్తకం కంటే ఎక్కువ ఇచ్చేవాడు కాదనుకోండి. ఇక్కడే ప్రపంచ సాహిత్యానికి నాకు తెర తీసినట్టయింది. ఇక్కడే నాకు తొలిసారిగా నండూరి రామమోహన రావుగారి అనువాదాల ద్వారా టాం సాయరూ, హకల్ బెరీఫిన్నూ పరిచయమయ్యారు. షేక్స్పియరు నాటకాల సంక్షిప్త కథలూ ఇత్యాదిగా అనేక ఆంగ్ల క్లాసిక్సన్నీ తెలుగులోనే అవుపోశన పట్టేశా. ఇహ తెలుగు నవలికలు, నవలలు లెక్కలేదు. కానీ నాకు అప్పటికి ఇంకా రాజకుమారుల టైపు సాహస గాధలంటేనే ఆసక్తిగా ఉండేది, సాంఘిక కధలకంటే.

సరిగ్గా ఈ సమయంలో నాకు ముగ్గురు పరిశోధకులు పరిచయమయ్యారు. ఇప్పుడు తల్చుకుంటే ఈ పుస్తకాలు మా బడి లైబ్రరీలో ఉండటం నాకు చాలా ఆశ్చర్య కలిగిస్తోంది. మాది కేథొలిక్ మిషనరీ బడే అయినా, ఒకానొక కాలంలో గొప్ప బడిగా పేరుండినా, మేం చదివే సమయానికి అదంతా గత వైభవం అయిపోయింది. నిర్మల కాన్వెంటు లాంటి ఇతర ఫేషనబుల్ మిషనరీ బడుల లాగా ఉండేది కాదు మా బడి. మరి అలాంటి చోట ఈ సరికొత్త అమెరికన్ ప్రచురణలు ఎలా వచ్చాయో నాకు అంతుపట్టని రహస్యం. మొత్తానికి ఈ ముగ్గురు పరిశోధకుల పరిచయంతో నా సాహిత్యాభిలాష ఒక్క గంతు వేసి పైకెగిరిందని చెప్పొచ్చు. ఒక్ఖ దెబ్బతో రాజకుమారులు, ఎగిరే రెక్కల గుర్రాలూ మీద మోజు తగ్గి, మిస్టరీలూ, క్లూలు, లాజికల్ డిడక్షన్ల మీద మనసు లగ్నమైంది. అహ, అంటే అసలు పూర్తిగా పోయిందని కాదు, ఈ రోజుక్కూడా అప్పుడప్పుడూ నాస్టాల్జియా కోసం మాయమంత్రాల పుస్తకాలు చదువుతాననుకోండి.

తరవాత్తరవాత చిన్నవయసులో ఇంగ్లీషు పుస్తకాలు బాగా చదివిన మిత్రులు చాలా మంది తగిలారు, వాళ్ళెవ్వరూ కూడా ఈ పుస్తకాలు చదివుండలేదు. వాళ్ళేవో నేన్సీ డ్రూ, ఎనిడ్ బ్లైటన్ ఇత్యాది కథల పేర్లు చెప్పేవారు. అవన్నీ ముగ్గురు పరిశోధకుల కాలి గోటికి సాటి రావనేది నా నిశ్చితాభిప్రాయం. డెటెక్టివ్ సాహిత్యంతో అలా మొదలైన నా టీనేజి ప్రేమాయణం ఇప్పటికీ ఏమాత్రం తీక్ష్ణత తగ్గకుండా కొనసాగుతోంది. (సశేషం)

Comments

యమా చదివిస్తుంది(తెలుగులో)too interesting and curiosity generating(English)మొత్తం మీద మీబాల్యదశలో కొన్ని పుటలు జాను గారి పుణ్యమా అని చదవగలుగుతున్నాం :)నువ్వెప్పుడు రాస్తున్నావ్ అని అడక్కండి...
సరి.. సరి.. ఇటు అన్నమయ్య పదాలూ, త్యాగయ్య రాగాలతో పాటు అటు పరిశోధకులనీ, మంత్ర తంత్రాలనీ వదలలేదన్నమాట. మీరు హేరీపాటర్ అభిమాని అని ఇప్పుడే తెలుసుకున్నా. మీ గ్రంధాలయ వ్యాసంగం ఎలా ముందుకెళ్ళిందో ఆసక్తితో ఎదురు చూస్తూంటాం.
ఆ రౌడీల స్కూల్లో అన్ని మంచి పుస్తకాలు ఉన్నాయా! కూల్ గా అసలు! మా స్కూల్లో ఇంగ్లీషు బుక్స్ అంటే ఏ థామస్ అల్వా ఎడిసనో, న్యూటనో కనిపించేవాళ్ళు!!
Ramani Rao said…
మొత్తానికి మీ స్వామి(స్వ)కార్య ప్రహసనం వల్ల మంచి జ్ఞానాన్ని ఆపాదించుకొన్నారన్నమాట.
బాగుందండీ! ఇలాంటివి కాకపోయినా, పుస్తకాలు చదివే అలవాటు బాగా వుండేది ఆ దశలో. తరువాత మార్కుల, ర్యాంకుల చదువులొచ్చాయి. మరి ఇంటర్మీడియట్ లాంటి కీలక దశల్లో మరో పుస్తకం మీ చేతిలో కనబడకూడదనే నిబంధన విధించిన పరిస్థితులు మీకెప్పుడూ ఎదురు కాలేదా? ప్రపంచాన్ని మనం నేరుగా చూడలేకున్నా, ప్రపంచ ప్రజల జీవితాలను చూపే కిటికీలు పుస్తకాలు. చదవాల్సిన వయసులో వాటిని చదవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా నాలాంటి నత్తనడక చదువరులకు.
Anonymous said…
మీ గ్రంథాలయప్రవేశం గ్రేట్. ఆమధ్య నాపదోక్లాసు నేస్తురాలు ఆనాటి పాతకథలు చెప్తుంటే ఇలాటి అనుభూతే కలుగుతోంది. ఏమైనా లైబ్రరీ కంటె ఘనమైన బడీ, గుడీ కూడా లేవు. అభినందనలు.

మాలతి