బ్లాగ్విషయం - గ్రంధాలయాలు - 1

ఎన్ని గ్రంధాలయాలని చెప్పను?

చిన్నప్పుడు మా బడి వీధిలో నాపరాతి గచ్చు రీడింగ్ రూము దగ్గిర్నించి విదేశంలో విశ్వవిద్యాలయాల బృహద్గ్రంధాలయల మీదుగా నేడు బహు చిన్నవైనా అత్యాధునికమైన తంత్ర వనరులతో అలరారే ఇక్కడి స్థానిక గ్రంధాలయాల వరకూ .. నా జీవితంలో గ్రంధాలయాల పాత్ర తలుచుకోడం అంటే ఆల్మోస్టు నా జీవితమంతా నెమరేసుకోవడమే. ఈ కథ ఒక్క టపాతో ముగిసేది కాదు, విడతలుగా రాసుకోవాల్సిందే.

మా బడి ఇంటినించి సుమారు ఒక అరమైలు దూరం ఉండేది. అప్పుడప్పుడూ బస్సులో వెళ్ళినా సాధారణంగా నడిచే వెళ్ళటం. నేను నాలుగో క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా .. ఆ వీధిలో ఒక గుమ్మం ముందు బంతి పూల తోరణం కట్టి "నేడే ప్రారంభోత్సవం" అనే చిన్న బేనరొకటి కట్టి ఉంది. మేము బడికి వెళ్ళే వేళకి ఇంతే. సాయంత్రం తిరిగి వస్తుంటే అక్కడ చాలా మంది ఉన్నారు. కొంచెం తెలిసినట్లుగా కనిపించిన ఒకాయన్ని అడిగాం ఏం జరుగుతోందని. ఇక్కడ గ్రంధాలయం తెరుస్తున్నాం, మీరు కూడా వచ్చి చదువు కోవచ్చు అని చెప్పాడాయన. పిల్లల పుస్తకాలు కూడా ఉంటాయా అని ఆత్రంగా అడిగాను. ఆయన కొంచెం నవ్వి "ప్రస్తుతానికి వార్తా పత్రికలూ వార పత్రికలూ అవీ ఉంటాయి. నెమ్మది మీద అన్ని రకాల పుస్తకాలూ సమకూరుస్తాం" అన్నాడు. మాకు అప్పటీకి తెలీదు, ఆయనే ఈ గ్రంధాలయ వ్యవస్థాపకుడూ ఆ యిల్లు ఆయనదే.

మర్నాడు మేం బడికి వెళుతుంటే అక్కడే అరుగు మీద కూర్చుని ఉన్నాడాయన. మమ్మల్ని పిలిచాడు. లోపల చాపలు పరిచి ఉన్నాయి. ఒక టేబుల్ మీద తెలుగు దిన పత్రికలు దొంతర పెట్టి ఉన్నాయి. ఒక కొత్త నోటుబుక్కు, ఒక కొత్త పెన్సిలు రెండూ ట్వైన్‌ దారంతో ముడేసి బల్ల కోడుకి కట్టేసి ఉన్నై, ఎవరూ ఎత్తుకు పోకుండా. అన్నీ మాకు చూపించి, రోజూ వచ్చి మేమక్కడ పత్రికలు చదువుకోవచ్చనీ, వచ్చే నెల నించీ చందమామ లాంటీ పత్రికలు కూడా తెప్పిస్తాననీ, మాకు నచ్చిన విషయాల్ని ఆ నోటుబుక్కులో రాయాలనీ చెప్పాడాయన - వొట్టినే మన పేరు రాసేస్తే చాలదట.

సరే, ఇక ఆ రోజు నించీ సాయంత్రం ఇంటీకి వచ్చే దారిలో కనీసం ఓ పావుగంట అక్కడ పేపర్లు తిరగెయ్యడం అలవాటయింది. పేపరు చివరి పేజీలో పెద్దగా వేసే మా అభిమాన హీరోల సినిమాల ప్రకటనలు చూసి వాటీని చించి దాచుకోవాలనే కోరిక బలంగా ఉన్నా కూడా మేం నిగ్రహంగానే ఉన్నాం. ఒక రోజు పొద్దున మేం బడికి వెళుతుంటే ఆయన పిలిచాడు. మేం దగ్గిరికి వెళ్తూనే తిట్లంకించుకున్నాడు. ఏంటంటే ఎవరో ఆకతాయి వెధవలు పేపర్లని చించనే చించారు. రెగ్యులర్ గా అక్కడికి వచ్చేది మేమే కాబట్టి మమ్మల్ని పట్టుకున్నాడు ఈ పెద్దమనిషి. మాకు రోషం మహా మండి పోయింది. ఇహ ఆ రోజు నించీ ఆయన చుట్టు పక్కల లేకుండా చూసి లోపలికి దూరి ఆ నోటు బుక్కులో మాకొచ్చిన బూతులన్నీ రాసేసి పారిపోయేవాళ్ళం. రెండో నెలకల్లా ఈ గ్రంధాలయం మూతబడింది. స్థానే ఒక చిల్లరకొట్టు వెలిసింది.

ఇంచుమించు ఈ సమయంలోనే నాకు ఒక క్రైస్తవ బాలల గ్రంధాలయమూ ఒక సోవియట్ బాలల గ్రంధాలయమూ కూడ పరిచయమయ్యాయి. మొదటిది ఒక పాస్టరు గారింట్లోనే. అందుకని అంతా పకడ్బందీగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. ఆ పుస్తకాలు చక్కటి కాగితంతో బైండుతో, రంగు బొమ్మలతో చాలా అందంగా ఉండేవి. అక్కడే నేను అబ్రహాము, మోజెస్ ఇత్యాదుల కథలు మొదటిసారి చదివాను. మా బడి ఉండేది చుట్టుగుంట దగ్గిర విశాలాంధ్ర పత్రికాఫీసు ఉన్న రోడ్డులో. అంచేత ఆ చుట్టు పక్కల కమ్యూనిస్టు పార్టీ ప్రాభవం బలంగానే ఉండేది. అక్కడే ఈ సోవియట్ బాలల లైబ్రరీ కూడా. అందులో సోవియట్ బాలల సాహిత్యం మొదటి సారి పరిచయమైంది. ఆ పుస్తకాలు కూడా చాలా చక్కటీ కాగితంతో చక్కటి బొమ్మల్తో ఉండేవి. కథల్లో పాత్రల పేర్లు మీషా, శోష్కా .. అని ఇలా తమాషాగా ఉండేవి. నేనూ నా స్నేహితులు ఒకరికొకరు ఇలాంటి పేర్లు పెట్టుకుని పిలిచుకునే వాళ్ళం. కాకపోతే ఈ రెండు రకాల పుస్తకాల్లోనూ భాష మాత్రం చందమామ లాంటి పత్రికల్లో మాకు అలవాటైన భాష కాదు, చాలా తమాషాగా ఉండేవి. ఆ విచిత్రమైన భాషకి ఆశ్చర్య పడుతూనే కథలంటే ఉన్న పిచ్చి వల్ల క్రమం తప్పకుండా ఈ రెండు లైబ్రరీలనీ దర్శిస్తూ ఉండేవాణ్ణి.

Comments

BHARAT said…
ee Tapa ku sambamdam lekunda vyakhya raastunnanduku kshaminchaali ... April 1 tedina meeru naa blogu lo comment raasaaru daaniki mikkili dhanyavadhalu ....naaku vacchina modati comment ide (naa mitrula nunchi kakunda ) adi kotthapaali gaari nunchi ante chaala anandam gaa undi kaani sad part entante nenu aa comment ee roje chuskunna ...
okaanoka mee cinema blog lo mee abhiprayaniki vyatikrekam raasinaa kuda meeru badulu icchaaru ade comments section lo , nenu naa vivarana iddamani chaala matter type chesa kaani due to techincal fault that was lost
basically nenu konchem baddakist ni malli try cheyya ledu ....

Nenu kuda chinnappudu baaga pustakaalu patrikalu chadividaani mukhyam gaa "baalamitra" , monne ee madhy maa nanna maa chuttalatho oka maata annaaru " maa peddodu paper chadavatam chusi (akari printer address tho saha) " nenu paper chadavatam modalettaaa ani
Anonymous said…
సోవియట్ వారి పిల్లల పుస్తకాల వల్లే కొంత మేరకు ఒక తరం వారికి తెలుగు భాషభి్మానం పెరిగింది అని అంటే అది బహుశ అతిశయోక్తి కాక పోవచ్చు.

వచనం కన్నా బొమ్మలే ఎక్కువగా ఉండేవి. ధర కూడ తక్కువ. జానపద కధలు ఎక్కువగానే ఉన్నా, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా బాగనే అందుబాటులో ఉండేవి. ఉదా: యాకోవ్ పెరెల్మాణ్ (Yakov Perelman) "నిత్యజీవితంలో భౌతికశాస్త్రం".

బహుశ ఆ తరం వారిలో ఏర్పడ్డ భాషాభిమానం ఈ తరం వారిలో తగ్గడానికి చదివించే పుస్తకాలు, తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఒక ఉద్యమం గా వెలువడక పొ్వడం కూడ "ఒక" కారణం అయిఉండవచ్చు.

ఏమైనా చదువరిగారిచ్చిన విషయం మీరన్నట్టు ఒక టపాలో రాయడం కష్టమే!

మీ ్టపా శీర్షికలో ఇది మొదటిది (...గ్రంధాలయాలు - 1) అన్నదే కుతూహలాన్ని రేపింది.
Bharat - :-)
పోస్టులు తెలుగులో రాసినట్టే వ్యాఖ్యలు కూడ తెలుగులో రాయడం అభ్యసించండి.
నెటిజెన్‌ - సోవియట్ బాలల గ్రంధాలయంలో కథల పుస్తకాల సంగతి అలా ఉండగా, ఇక హైస్కూలికి వచ్చాక, కొంచెం పాకెట్ మనీ అంటూ ఆడుతూ ఉండగా విశాలాంధ్ర బుక్ హౌసులో సోవియట్ పుస్తకాల మీద ఖర్చు పెట్టేవాణ్ణి. అది ఇంకో కథ అవుతుంది. బైదవే, ఈ టాపిక్ ని ఇచ్చింది చావాకి్రణ్ , చదువరి కాదు.
Anonymous said…
కిరణ్ గారికి క్షమాపణలతో; పొరబాటుని దిద్దినందుకు మీకు నెనర్లు!
Ramani Rao said…
గ్రంధాలయాల గురించి రాసిన టపా లో మీ చిన్నప్పటి అనుభవాలు చాలా బాగున్నాయి కొత్తపాళీగారు. బహుశా ప్రతివారికి గ్రంధాలయం లో ఈ అనుభవం ఇలా ఎదురవుతుందేమో.. మా ఇంటిదగ్గర గ్రంధాలయంలో కూడా ఇలా ఓ నోట్ బూక్ ,కలం పెట్టి ఓ పెద్దాయన కాపలా వుండేవారు, పత్రికలేమన్నా తీసుకొంటే ఇదే తంతు, ఏ పేజీ చిపేస్తామో, ఎంటో అనుకొంటూ.. నాకు చాలా గుర్తుకొచ్చేస్తున్నాయి., ఇది చదువుతుంటే. ఏది ఏమైనా బాల్యానుభవాలు, భలే మధుర స్మృతులు.
Naga said…
గ్రంధాలయం అంటేనే నాకు పుస్తక-భక్తి మెండుగా తన్నుకొస్తుంది, కాకపోతే ఇంటర్నెట్టు వచ్చిన తరువాత భక్తి కొంచెం తగ్గింది! ఒకప్పుడు కేవలం పుస్తకాలు మాత్రమే తీసుకునే వాడిని, ఇప్పుడు సినిమాలు, వీడియోలు, మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్), గేమ్స్ అన్నీ దొరుకుతున్నాయి.
DG said…
"ఆ రోజు నించీ ఆయన చుట్టు పక్కల లేకుండా చూసి లోపలికి దూరి ఆ నోటు బుక్కులో మాకొచ్చిన బూతులన్నీ రాసేసి పారిపోయేవాళ్ళం. రెండో నెలకల్లా ఈ గ్రంధాలయం మూతబడింది. స్థానే ఒక చిల్లరకొట్టు వెలిసింది."
-----

మీ మూలానే లైబ్రరీ మూతబడిందనీ, దానిక్కారణం పరోక్షంగా మీరేననీ మీకెప్పుడైనా అనిపిస్తూ ఉంటూందా?

బూతులు రాస్తారనేనా మీరు మీ బ్లాగుని మోడరేట్ చేసారూ? ;-) ఏదైనా పాత ఎక్స్పీరియన్సు ఇప్పుడు పనికొస్తోంది కదా?
Bolloju Baba said…
కొత్తపాలీ గారికి
పేరు చూసినతరువాత తాపీ ధర్మారావు గారు మదిలో మెదిలారు. మంచి పేరు పెట్టుకున్నారు. పాతపాళీ ధర్మారావుగారు కూడా బహుముఖ ప్రజ్ణాశాలి. అదేవిధంగా మీబ్లాగులోని విషయాలను చూస్తుంటె, భిన్న విషయాలపట్ల మీ పరిజ్జ్నానాన్ని ప్రశంసించకుండా వుండలేకపోతున్నాను.

నాకవితపై స్పందించినందుకు ధన్యవాదములు.

బొల్లోజు బాబా
బాగుందండీ గ్రందాలయం మీదుగా మీ జీవిత ప్రయాణం
te-thulika మరియు రమణి - ధన్యవాదాలు. అన్నట్టు రమణి గారూ, బాల్యం అనంగానే మీరు మధుర స్మృతులు అంటారు. ఏమో, వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అవి కూడా మిగతా జీవితంలాగే ఉన్నాయి, ప్రత్యేకంగా మధురస్మృతులు అని అనిపించవు ఎప్పుడూ.
నాగరాజా - ఇక్కడి స్థానిక గ్రంథాలయాల కథ నాలుగో అధ్యాయంలో కానీ మొదలు కాదు. బహుశా స్థానిక గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నది మన తప్పటడుగుల గిరి అనుకుంటా. ఆ అనుభవం గురించి ఆయన ఆల్రెడీ ఎప్పుడోనో బ్లాగేశారు :-)
RSD - మేం చేసిన వెధవ పని వల్లనే ఆ లైబ్రరీ మూతపడిందని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోకపోవడమే కాదు, కారణం మేము కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇక నా బ్లాగుల్లో మాడరేషను సంగతి - మీరు నా ఇతర బ్లాగులు చూస్తే, నాకు వ్యతిరేకంగా (కొండొకచో అవసరానికి మించిన పరుష పదజాలంతో) రాసిన వ్యాఖ్యల్ని కూడా ప్రచురించానని గమనించ గలరు.
బాబా గారూ - మీకు నా రాతలు నచ్చినందుకు ధన్యుణ్ణి. నా బ్లాగు పేరు ఇలా పెట్టడానికి ప్రేరన తాపీవారి రచనే.
జాన్ గారూ - ధన్యవాదాలు.
శ్రీ said…
బాగుందండీ మీ గ్రంధాలయాలతో మీ పరిచయం.మిషా పుస్తకం నాకూ పరిచయం,మంచి రంగురంగులతో పుస్తకం అందంగా ఉండేది!