అమ్మ 1: ఆవిర్భవించిన రోజు

సుజలాం సుఫలాం మలయజ శీతలాం సశ్య శ్యామలాం
శుభ్ర జ్యోత్స్న పులకిత యామినీం
పుల్ల కుసుమిత దృమదళా శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం ... వరదాం ... వందే మాతరం

మనసుని ఆనందడోలికల్లో ఊగిసలాడించే దేశ్ రాగం ... మాతృ వందనం.

సాగర మేఖల చుట్టుకొని, సురగంగ చీరెగా మలచుకొని,
గీతా గానం పాడుకుని, మన దేవికి ఇవ్వాలి హారతులు ..
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా ..

అరవయ్యొక్కేళ్ళ పండు ముత్తైదువా మా తల్లి .. మహాసముద్రపు అలల నురుగులు ఆమె పాదాల మంజీరాలు.

సారే జహా సె అఛ్ఛా హిందూసితా హమారా ..

పసి పిల్లలకి వాళ్ళ అమ్మ మొహమే అత్యంత సుందరంగా కనబడుతుందట .. హమారా వతన్ .. హిందూస్తాన్ .. బహు సుందరమైనది.

జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత పూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా
జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి ..

అరొందలకి పైబడిన భాషల్లో, ఏ భాషలో అమ్మా అని పిలిచినా ఓయని కమ్మగా పలికే ఆ అమ్మ గొంతులో ధ్వనించే భాష ఆప్యాయతే.

ఏదేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
.. లేదురా ఇటువంటి భూదేవి ఎందూ ..

ప్రపంచంలో ఎటువైపు వెళ్ళినా, ఏ దేశాలు తిరిగినా, ఎన్ని ఐశ్వర్యాలు చూసినా, ఎన్ని భోగాలు అనుభవించినా .. తిరిగి మాతృభూమి మీద కాలు మోపగానే అదొక పులకింత. ఆ గాలి తగలగానే అదొక పరవశం. ఇది నేల మహిమా? గాలి మహిమా? మనుషుల మహిమా?

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ ..
దేశమును ప్రేమించుమన్నా ..

మనుషులే, మనుషులే, ముమ్మాటికీ మన మనుషులే. మనుషుల్ని ప్రేమిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. వట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి మేలు తలపెడదాం. మన సత్సంకల్ప బలాన్ని చేతల్లో చూపిద్దాం.

అమ్మా నీకు దండాలు
మా తుఝే సలాం
తాయే వణక్కం
వందే మాతరం

Comments

sneha said…
"మనుషుల్ని ప్రేమిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. వట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి మేలు తలపెడదాం. మన సత్సంకల్ప బలాన్ని చేతల్లో చూపిద్దాం."
చాలా బాగ చెప్పారండి.
Anonymous said…
చాలా బాగుందండీ. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమ్మకి నీరాజనం.
ఇందాకా ఒకాయన (భారతీయుడే) అంటున్నాడు - దేశభక్తి అనే వ్యవహారం బల ప్రదర్శనకు, మనుషుల్లో వేర్పాటు వాదానికీ దారితీస్తుంది, మానవత్వమే అసలైన భక్తి అని. నిజమేనేమో అనిపించింది.
Anonymous said…
ఈ 21వ శతాబ్దంలో మనిషి నా ప్రపంచం, నా దేశం, నా రాష్ట్రం, నా మతం, నా కులం, నా కుటుంబం మీదుగా నేనొక్కడినే వైపు దూసుకుపోతున్నాడు. భార్యా పిల్లలు తప్ప చాలా కుటుంబాల్లో అమ్మ,నాన్న కుటుంబంలో భాగమే కాదు. ఇప్పుడు మిగిలిన దేశభక్తి అంతా రాజకీయనాయకుల ఉపన్యాసాల్లోనూ, వేర్పాటువాదుల ఉద్రేకపూరిత ఉపన్యాసాల్లోనూ మిగిలింది. నెమ్మదిగా మనిషి 'నేను' తప్ప ఈ ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదు అన్న భావంలోకి వెళ్ళిపోతున్నాడు. నిజంగా మహాత్ముడే మళ్ళీ వచ్చినా మనల్ని మళ్ళీ ముందుకు నడిపించగలడా అని అప్పుడప్పుడు అనిపిస్తోంది. వేర్పాటువాదం వైపు కాదు - దేశభక్తివైపు. మొదటి పని చెయ్యడానికి మనకి ఊరికొక కె.సి.ఆర్. ఉన్నాడు.
దానికితోడు అభిమానం అంటే దురభిమానం అన్నది మన మినిమం లెవెలు. నీ సమూహాన్ని (కులం,మతం,రాష్ట్రం,దేశం ఏదైనా) ప్రేమించడం అంటే మిగతా అన్నిటినీ ద్వేషించు అన్నది మాత్రమే మనకు తెలిసిన స్థాయి. దీనితో అసలు అభిమానం కలిగిఉండడం అంటేనే తప్పు - అసలు ఎవరిమీదా అభిమానం ఉండక్కరలేదు (అంటే లౌక్యంగా సర్వ మానవాళినీ ఒకేలా చూడు అంటామనుకోండి - అందరినీ ప్రేమించడం ఎలాగూ కుదరదు కాబట్టి ఎవ్వరినీ ప్రేమించక్కరలేదు.) అన్న రెండో extreme వాదం బయలుదేరింది.
అమ్మా! నా అస్తిత్వానికే కారణం నువ్వు. నేను పుట్టింది నీ నేలమీద - పెరిగింది నీ పాలు తాగి - బతికింది నీ గాలి పీల్చి - వందేమాతరం అని నీకు దండం పెట్టడం దేశభక్తి కాదు తల్లీ - నేను మనిషినే - జంతువును కాదు అని నాకు నేను చెప్పుకునే ఏకైక మార్గం.
కొత్తపాళీగారూ, మంచి టపా. అమ్మలేకపోతే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి. అమ్మ తుఝే సలాం.
Ramani Rao said…
కడుపులొ బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలిన్చు మా తల్లి.
త్యాగయ్య గొంతులో తారడు నాదాలు,
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండేదాక,

నీ ఆటలే ఆడుతాం ,నీ పాటలే పాడుతాం

61 యేళ్ళ తల్లి పండు ముత్తైదువకివే నీరాజనాలు
Naga said…
మీ "అమ్మ" వేరు, నా "అమ్మ" వేరు :)
స్నేహ, నాగమురళి - ధన్యవాదాలు.
రానారె - మానవత్వం అంటే ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది.
కృష్ణమోహన్ - మీ వివరణ బావుంది. నా మనసుకి దగ్గరగా ఉంది.
రమణి - మీరు నవంబరు గీతాన్ని ఆగస్టులో పాడినట్లున్నారు! :) నేనేం అభ్యంతర పెట్టట్లేదు లేండి. అమ్మలందరూ ఒక్కటే .. తెలుగు తల్లి అయితేనేమి, తల్లి భారతి అయితేనేమి? :)
నాగన్న - అమ్మలు వేరయితేనేం, మీరు అమ్ములెక్కుపెట్తకుంటె చాలు :)
"అరొందలకి పైబడిన భాషల్లో, ఏ భాషలో అమ్మా అని పిలిచినా ఓయని కమ్మగా పలికే ఆ అమ్మ గొంతులో ధ్వనించే భాష ఆప్యాయతే...."
చాలా బాగా చెప్పారు. నిజంగా ఆ ఆప్యాయత ఇంకెక్కడా దొరకదు.
అమ్మానాన్న ఇద్దరూ గొప్పవారే అమ్మకన్నా నాన్న కొంచెం ఎక్కువ గొప్పవాడు.
"వట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి మేలు తలపెడదాం. మన సత్సంకల్ప బలాన్ని చేతల్లో చూపిద్దాం."

ఎవరెవరు ఏమేమి చేసారో చెప్పండి.. మీ అందరి అనుభవాలను పంచండి.. మిగతా వారందిరికి స్ఫూర్తిని ఇవ్వండి.
రాఘవ said…
భారతమాతకు జేజేలు.

తాడేపల్లివారూ, ముళ్లపూడివారిని గుర్తుచేశారు. భార్యాభర్తలిద్దరూ సమానమే... కాకపోతే భర్త కొంచెం ఎక్కువ సమానం :)
rākeśvara said…
ఎఁవిటబ్బా ఈ హడావిడంతా అనుకున్నాను. ఆగష్టు పదిహేననా..
దేశం తల్లయితే.. దేశ సుఖాన్ని.. సౌభాగ్యాన్ని దోచుకునే వారేమౌతారు..

"ఎందుకు రాకేశా ఎందుకు ఎప్పుడూ నకారాత్మకంగా ఆలోచిస్తావు" అనడిగితే.. ఆ ప్రశ్న సమాధానం కోసమే నేనెదురుచూస్తున్నా..
rākeśvara said…
@ రానారె
what makes great poets is not what is national in them but what is universal in them అన్న భావం వున్న వ్యాఖ్యను నేను ఎక్కడో చదివాను.
అదిముమ్మాటికీ నిజం. కానీ దేశం అనేది ఒక ఆదర్శానికి ఆచరణాత్మక ప్రత్యామ్నాయం. Its a practical alternative to that ideal. As hungry objects of flesh this is the highest we can aspire to.
"దేశం అనేది ఒక ఆదర్శానికి ఆచరణాత్మక ప్రత్యామ్నాయం"
ఏవి చెప్పావు రాకేశ్వరా! వేసుకో వీరతాడు .. సుమారు ఏడాదిన్నర క్రితం తెలుగు బ్లాగు మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ తెలుగు మీద నువ్వు సాధించిన పట్టు చూస్తే ముచ్చటేస్తోంది.
rākeśvara said…
అయ్యో ఎంటి సార్ నా గురించి ఇంత తెలిసి కూడా పప్పులో కాలేశినట్టున్నారే..

ఆదర్శం = ideal
ఆచరణాత్మక = practical
ప్రత్యామ్నాయం = alternative

నేనూ, నా ఆలోచనలూ పెరిగిందంతా ఆంగ్లంలోనే (దురదృష్టవసాత్తు) కాబట్టి ముందు ఆంగ్లంలో ఆలోచించి దాన్ని తెలుగులో వ్రాస్తాను. వెనక అది చేయడానికి నా దగ్గర పదసంపద వుండేది కాదు. ఇప్పుడు ఇలా సంస్కృత పదాలు వాడి కప్పిపుచ్చుకుంటున్నాను. పై వాక్యంలో పెద్ద తెలుగు కూడా ఏం లేదని గమనించగలరు. అప్పటికీ - As hungry objects of flesh, this is the highest we can aspire to - అనే దాన్ని తెలుగులో వ్రాయలేక అట్టే వదిలేశాను.

మనలాంటి వారి ఆంగ్ల తెలుగుకి, రానారె తాబాసు చదువరి గార్ల జాణ తెనుగుకి తేడా లేదూ? నా మటుకు, ఈ జనమకు ఈ అర్థపాండిత్యంతో సరిపెట్టుకోవలసిందే. అందుకే ఆంగ్లం ఒక స్తాయికి మించి నేర్చుకోకూడదనుకుంట!

అన్నట్టు, నేను తెలుగు బ్లాగు పెట్టి మూడేండ్ల వ్వస్తుంది.