ఉత్తమ చిత్రంగా మొన్ననే సరికొత్త ఆస్కారుని గెలుచుకున్న నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ చూసి వస్తున్నా.
పుస్తకాన్నించి తెరకు అనువదించిన స్క్రీన్‌ప్లేకూ, ఉత్తమ దర్శకత్వానికీ, సహాయ పాత్రలో నటనకూ కూడా మరో మూడు ఆస్కార్లని బుట్టలో వేసుకుందిది.
అంతే కాక ఇంతట్లోనే IMDB వాళ్ళ చూసి తీరాల్సిన చిత్రాల పట్టికలో 39 వ స్థానాన్ని ఆక్రమించింది.
కొంచెం అయోమయమూ కొంత అలజడీ ప్రస్తుతం నా మనస్థితి. అవునది సినిమాయే, అదొక కల్పిత కథే .. అయినా .. ఈ అలజడి.
పుస్తకాన్నించి తెరకు అనువదించిన స్క్రీన్‌ప్లేకూ, ఉత్తమ దర్శకత్వానికీ, సహాయ పాత్రలో నటనకూ కూడా మరో మూడు ఆస్కార్లని బుట్టలో వేసుకుందిది.
అంతే కాక ఇంతట్లోనే IMDB వాళ్ళ చూసి తీరాల్సిన చిత్రాల పట్టికలో 39 వ స్థానాన్ని ఆక్రమించింది.
కొంచెం అయోమయమూ కొంత అలజడీ ప్రస్తుతం నా మనస్థితి. అవునది సినిమాయే, అదొక కల్పిత కథే .. అయినా .. ఈ అలజడి.
అదే కదా గొప్ప సినిమా పనితనం!
మీకు లాగానే ఇంకా చాలా మంది ఈ సినిమా చూసే ఉద్దేశంతో ఉండొచ్చు, పైగా ఇదొక క్రైం థ్రిల్లర్ కాబట్టి ఏంజరుగుతుందో నేను చెప్పను, చెప్పి మీ అనుభూతిని పాడు చెయ్యను. కాకపోతే సినిమా బాగోగుల్ని మాట్లాడుకోటానికి కొద్దిగా నేపథ్యమైనా తెలియాలి కాబట్టి ఆ నేపథ్యం మాత్రం ఇస్తాను.
టెక్సస్ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దు దగ్గర్లో ఒక చిన్న వూళ్ళో లెవెలిన్ (జాష్ బ్రాలిన్) ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ బతుకుతున్నాడు. పెళ్ళాం కార్లా జీన్ (కెల్లీ మెక్డానల్డ్) ఒక్కత్తే, ఇంకా పిల్లలు లేరు. వీడు ఉద్యోగానికి పోకుండా చెట్లూ పుట్టలూ పట్టుకుని తిరుగుతూ, వేటాడ్డానికి ఏవన్నా దొరుకుతుందేమో అని చూస్తుంటాడు. ఒక మధ్యాన్నం పూట ఆలాగే విశాల మైదానంలో తుప్పలెంబడి పడి తిరుగుతుండగా వాడికి బైనాక్యులర్స్ లో ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. నాలుగైదు చిన్న లారీలు (ఇక్కడ పికప్ ట్రక్కులంటారు) ఆగి ఉన్నాయి. చుట్టూ ఒక పది మంది దాకా జనం చచ్చినట్టు పడున్నారు. వీడు అతి జాగ్రత్తగా అక్కడకెళ్ళి చూస్తాడు. ఒక ట్రక్కు వెనక నిండా నీట్ గా పేక్ చేసిన మాదక ద్రవ్యం పేకెట్లు. అంటే .. చుట్టు పక్కలెక్కడో డబ్బు కూడ ఉంటుంది. కాస్త వెదికితే ఒక నల్ల సూట్‌కేసులో అదీ దొరికింది. సంతోషంగా అక్కడ దొరికిన కొన్ని తుపాకుల్నీ మొలలో దోపుకుని ఆ సూట్‌కేసు పట్టుకుని ఇంటికెళ్ళిపోయాడు వాడు. త్వరలోనే వాడికి అర్ధమవుతుంది ఆ డబ్బుల సోంత దారులు అతి భయంకరమైన హంతకుణ్ణి (హావియే బార్దెం) వీణ్ణి పట్టుకోడానికి నియోగించారని. కథలో మూడో కోణం ఆ చిన్న పల్లెకి పోలీసధికారి షెరిఫ్ టాం బెల్ (టామీ లీ జోన్స్). లెవెలిన్ సూట్‌కేసు పుచ్చుకుని పారిపోయినాక, హంతకుడు వాణ్ణి వెంటాడూతున్నప్పుడు, అంత ఆలస్యంగా ఈయనకి అసలు విషయం తెలుస్తుంది. లెవెలిన్ గెలుస్తాడా, హంతకుడు గెలుస్తాడా, షెరిఫ్ బెల్ గెలుస్తాడా అనేది మన ఫ్రెండు జీవి అన్నట్టు .. దట్ ఈజ్ ద రెస్ట్ ఆఫ్‌ద స్టోరీ.
కథంతా టెక్సస్ లో మెక్సికో సరిహద్దుకి దగ్గర్లో జరుగుతుంది. ఆ ఎండి వడలిపోయిన నేల తత్వాన్ని సినిమా పొడుగునా స్టేజి వెనక వేలాడే తెరలాగా అద్భుతంగా ఉపయోగించారు. అలాగే శబ్దాన్ని కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించారు. నటనలో అందరూ బాగా రాణించారు. వెటరన్నటుడు జోన్స్ కి ఇది చాలా సూక్ష్మమైన విశేషాలతో నిండిన పాత్ర, చాలా సమర్ధవంతంగా పోషించాడాయన. ఇక ముఖ్య పాత్రల్లో బ్రాలిన్, బార్దెం అద్భుతంగా నటించారు. మనస్తాపం, పశ్చాత్తాపం లాంటీ ఇమోషన్లు ఏమాత్రం లేని హంతకుడిగా బార్దెం ఇదివరలో ఇటువంటి పాత్రలో మహా నటుడు ఏంథనీ హాప్కిన్స్ ని తలపించాడు. ఇప్పటికీ ఆ పాత్రని తలుచుకుంటే వెన్నులో ఒక జలదరింపు పుడుతుంది. కెల్లీ కూడా పాత్రోచితంగా చేసిందనే చెప్పాలి. అమెరికాలో టెక్సస్ లో జరుగుతున్న ఈ కథలో ఆ ప్రాంతపు పాత్రలుగా స్పేనిష్ నటుడు బార్దెం, ఆంగ్లేయ నటి కెల్లీ మెక్డానల్డ్ పరమ సహజమైన టెక్సస్ యాసతో మాట్లాడి రక్తి కట్టించారు.
నన్ను కలచి వేస్తున్న అలజడి అసలు కథలోనే .. లేదా స్క్రీన్ ప్లే లోనే ఉంది. కోయెన్ సోదరుల సినిమాలు ఇదివరకు కొన్ని చూశాను. వాళ్ళ సినిమాలన్నా, దర్శకత్వపు పద్ధతీ, కథనపు శైలీ అన్నా నాకొక కుతూహలమూ, కొంత అభిమానమూ. నేను చూశిన అన్ని సినిమాల్లోనూ .. ఇదంతా ఒక తమాషా సుమా .. అనేలాంటి ఒక హాస్యపు వీచిక అంతర్గతంగా ఉంటూ వస్తోంది. ఎంతో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నా, కసాయి పాత్రలున్నా వాటన్నిటి వెనకా దాగీ దాగని ఒక కొంటె నవ్వు మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఐతే ఈ సినిమాలో ఆ కొంటె నవ్వు లేదు. ఆ హాస్యం లేదు. అంతా పరమ సీరియస్. ఇది కేవలం ఆట కాదు. గెలిపూ ఓటమిల మధ్య తేడా, చావు బతుకుల మధ్య తేడా, నేరానికీ చట్టానికీ మధ్య తేడా, ఆశకీ క్రౌర్యానికీ తెలివికీ మధ్య తేడా, యవ్వనానికీ వృద్ధాప్యానికీ మధ్య తేడా - అందుకే .. ఈ దేశంలో ఇక వృద్ధులు వైదొలగాలి.
మనసులో అలజడి .. ప్రస్తుతానికి స్టీరియోలో మహానుభావుడు, చచ్చి ఏ లోకానున్నాడో, రామనాథన్ గారి గొంతులో శహన రాగం వింటూంటే కొంత ఊరట.
Comments