కథ రాయండి!

తెల్ల కాగితం
పల్లెటూరిలో ఒక పదేళ్ళ పిల్లాడు.
భయంకరమైన పేదరికం.
వాడు ప్రాథమిక పాఠశాలలో నాలుగో క్లాసో ఐదో క్లాసో చదువుకుంటున్నాడు.
వాడికెప్పుడూ రాసుకునేందుకు ఒక సైడు వాడిన కాగితాలు కుట్టిన పుస్తకాలే.
ఎప్పుడూ కొత్త నోటు బుక్కు కానీ తెల్లకాగితం కానీ వాడిన పాపాన పోలే.
ఒకసారి ఎవరో ఆఫీసర్లు వచ్చి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసరు ఫైల్లోంచి జారి పడిన తెల్ల కాగితం వాడికి దొరికింది.
వాడి మనసు ఉప్పొంగి పోయింది ఆనందంతో.
దాన్ని భద్రంగా దాచుకున్నాడు.
ఏ సందర్భంలో చివరికి దాన్ని ఉపయోగించాల్సి వచ్చింది?

ఈ ఇతివృత్తంతో ఒక చక్కటి కథ రాయండి.

గడువు మార్చి 16 ఆదివారం.

రాసిన కథని మీ బ్లాగులో పెట్టినా సరే, ఏదన్నా వెబ్జీను (ఈమాట, పొద్దు, ప్రాణహిత)కి పంపినా సరే, లేక సరాసరి నాకు పంపినా సరే - మీ యిష్టం. ఏదేమైనా నాకో మెయిలు
పంపడం మరిచిపోకండి.

నాకు నచ్చిన కథకి ఒక మంచి తెలుగు కథల పుస్తకం బహుమతి ఇస్తాను.

సూచన: కథ చెప్పటం పిల్లవాడి గొంతులో పూర్తిగా పిల్లవాడి దృక్పథం నించి చెబితే బాగా బలంగా వస్తుందని నాకనిపిస్తోంది. కానీ అలాగే రాయాలని ఏం లేదు. తెల్లకాగితం అని నేనూరికే ప్రతిపాదిస్తున్నా. మీకిష్టమైన పేరు పెట్టొచ్చు.

మార్చి 17 న కొత్త ఇతివృత్తం వెలువడుతుంది.

Comments

కొత్తపాళీ గారు,
నేను రాయలేనేమో కానీ, మంచి ప్రయత్నమండీ..
గిరి
Ramani Rao said…
బాగుందండీ ఈ కధా ప్రారంభం.. రాయడానికి ఉపక్రమిస్తున్నా .... ఆచార్య ధేవో భవా!! అన్నారు పెద్దలు ... కొంచం మీ ఆశీర్వచనాలు.. ప్లీజ్..
S said…
బాగుందండీ ఈ ప్రయత్నం ... నేను రాస్తానా లేదా అన్నది చెప్పలేను కానీ..వీలు దొరికితే ఖచ్చితంగా రాస్తాను... :)
Anonymous said…
చూద్దాం, ఎంతమంది ముందుకు వస్తారో! ఇంతకి ఆ సంకలనం ఒకే రచయిత్రి/రచయిత దా లేక కొంతమంది సంకలనమా? ఏది,ఏదైనా మీ ప్రయత్నం హర్షణీయమే!
మాలతి said…
మీరే కథ రాస్తున్నారనుకున్నా. బాగుందండీ మీఅయిడియా. ఔత్సాహికరచయితలకి మంచి ప్రోత్సాహం.
అభినందనలు.
@నెటిజెన్‌ - ఆధునిక మేనేజిమెంటు గురువులు ఒక కన్నుని ప్రైజుమీద వేసుంచమని చెబుతుంటారు తగిన ఉత్సాహం ఊటలూరుతుండటానికి .. మీరూ ఆ బళ్ళోనే చదువుకున్నట్టుంది. సరే, చెబుతాను. నా తెలుగు లైబ్రరీ తగినంత పెద్దదే .. విజేతకి తనకి నచ్చింది ఎంచుకునే ఛాయిస్ ఇవ్వగలననే నా నమ్మకం.

ఇది కొత్త రచయితలకే కానక్కర్లేదు. ఎవరైనా సరదాగా ప్రయత్నించొచ్చు. మారథాన్‌ లో పరిగెత్తేవాళ్ళు ఇంటిపక్క ఉత్సవంలో పరుగు పందేల్లో పాల్గొన కూడదని ఏం లేదుగా.
Anonymous said…
కొత్త పాళీ గారూ, బావుంది. నేను కథ రాయలేను కానీ, ఆసక్తి తో యెదురు చూస్తున్నాను. బహుమతి గెలవడానికి వెరే మార్గం యేమైనా వుందా ?? :-)

అన్నట్టు ఇలాంటి ఇతివృత్తం తో శ్రీ రమణ గారి కథ ఒకటి చదివినట్టు గుర్తు.
Anonymous said…
రమ గారు మీ ఉత్సాహం ఇంకొందరికి మార్గదర్శకం కావాలి.
సౌమ్యా నువ్వు కూడా ఏమో అంటే ఎలా? మీ శిష్యులని కూడా అడిగి చూడు.
@రవి - శ్రీరమణ కథ ఉందా? నా దృష్టికి రాలేదు. ఈ అవిడియా పూర్తిగా నా సొంత బుర్రలో పుట్టినదే అని హామీ యిస్తున్నాను. ప్రస్తుతానికి బహుమతి గెలవడానికి వేరే మార్గాలేమీ లేవు. పోటీ ప్రకటించిన వారికి ఒక కిలో పూతరేకులు చదివించుకుంటే పరిస్థితి ఏవన్నా మారవచ్చు :-)
@ లలితా - మిగతా వాళ్ళని ఎగదొయ్యడం సరే .. మీరే ఎందుకు రాయగూడదు?
Anonymous said…
ఎవరైనా మంచి కథ రాస్తే, ఇంకొకరు బొమ్మలు వేస్తే, మరెవరైనా చదివితే దాన్ని తెలుగు4కిడ్స్ లో ప్రచురిద్దామని ఉంది.
రాయగలిగితే నేనూ రాస్తాను. ప్రస్తుతానికి తెలుగు4కిడ్స్ కి సంబంధించి చెయ్య గలిగినది, చెయ్యాల్సినదీ చాలా ఉంది.
Anonymous said…
కొత్తపాళీ గారు,

చక్కటి ఆలోచన. మంచి కథలు వస్తాయని ఆశిస్తున్నాను.
లలిత గారి ఆలోచన ఇంకా బాగుంది. బ్లాగర్లలో బొమ్మలు గీసేవారుంటారు కదా. కుదిరితే వారి చేత కథలకు బొమ్మలు వేయించి, లలిత గారు చెప్పిన చోట ఉంచవచ్చు...ఇంకా పుస్తకం (PDF) కూడా తేవొచ్చు [ప్రవీణ్ జీ గారు బ్లాగులను సంకలనించి పుస్తకం తయారు చేస్తున్నట్లు].
మీ ప్రయత్నం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను.
కథల కోసం, క్రొత్త ఇతివృత్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ -

గిరిధరరావు.
గురువు గారూ,ముందా బుడ్డోడిని బడికి ఎట్టాతేవాలా అని చూస్తున్నా,ఆడు బళ్ళొకి వస్తెగా ఈ కాయితాల గోల మొదలయ్యేది
రాజేంద్ర,
బుడ్డాడు కథ మొదలయ్యే టైముకే బళ్ళో ఉన్నాడు. ఇంకా వెనక్కెళ్ళి వాడీకి అక్షరాభ్యాసం కూడా చేయిస్తాను అంటే .. నీ యిష్టం!
Anonymous said…
చాలా మంది లాగే నేనూ, కొత్తపాళీ గారి ఆలోచనను మెచ్చుకుని, నా సృజనా శక్తి పరిమితులు తెలుసుకుని నా వల్ల కాదు అని announce చెయ్యాలా, లేక ఏమీ రాయకుండా మంచి ఆలోచనకు స్పందించకుండా ఊరుకోవాలా అని ఆలోచించి, సరే, ఉత్సాహం చూపించిన వారినీ, ఊహా శక్తి ఉన్న వారినీ ఒక సారి ప్రోత్సహించి ముందుకు నెడితే బాగుంటుందేమో అని మొదటి వ్యాఖ్య రాశాను.

ప్రయత్నించండి. ఒక సారి చిన్నప్పుడు చదివిన చందమామ కథలను తలుచుకోండి. బ్లాగర్లందరూ భాష మీద ప్రేమ ఉన్న వారే కదా. మరి మన పిల్లలకు మన భాష మీద మమకారం మిగలాలంటే మనకు అందిన అనుభూతులను కొంచెమైనా వారికి కలిగించాలి కదా.

తెలుగులో మంచి పిల్లల సాహిత్యం కోసం చాలా కృషి జరగాల్సి ఉంది. ఇది ఒక మంచి అవకాశం. మీ పిల్లలను ఆలోచింప చేయండి. మీరు పదాలు అందించండి. ఏదో ఒక ప్రయత్నం చెయ్యండి.

నా పరిమితులు నాకు తెలుసు కనుక నేను నాకు వీలైన పద్ధతిలో http://www.telugu4kids.com ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాను.

ఈ ఇతివృత్తం గురించీ ఆలోచిస్తున్నాను, మా పిల్లలూ ఆలోచిస్తారేమో అని ప్రయత్నిస్తున్నాను. ఈ లోగా ఇద్దారూ చెరో కాగితాన్నీ నింపేశారు బొమ్మలతో, ఇంత సేపూ erasable markers తో బోర్డు మీద గీసుకుంటున్న వాళ్ళే. వారిని ఆలోచింప చెయ్యాలంటే మీ సాయం కావాలి మరి.
Nagaraju Pappu said…
ఏఁవిటి - కేజీడు పూతరేకులే? మీరు infinite optimist (మీ ఆశకి అంతులేదని అకాడెమీ అనువాదం లెండి) లా ఉన్నారే? సరే అడిగారు కాబట్టి, మా బోంట్లి వారికి జహాపనా కోరిక మన్నించక తప్పదు కాబట్టి, "పూత మెరుంగులున్‌ బసరుపూపబెడంగులు జూపునట్టి వా కైతలు?.." పద్యం మీరే రాగయుక్తంగా చదివేసుకొని, అందులోని ప్రతిపాదాన్ని ఒక పదికేజీల పూతరేకులుగా, పసిడిరేకులుగా భావించి, ఆ గండపెండేరమేదో ఇటు దయచేయించమని మనవి.
పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని మీరెంరుగరా ప్రభూ?
పోటీ లో గెలుపొందిన వారికి నేను కూడా ఒక బహుమతి పంపిస్తాను. అది ప్రస్తుతానికి SUSPENSE.
Unknown said…
నే రాయడానికి ప్రయత్నిస్తా... (సమయం అనుమతిస్తే...)
కాకపోతే వచ్చిన చిక్కల్లా ఇంతవరకూ నేను కథలు రాయలేదు. అనుభవం లేదు.
కుదిరితే ఇదే మొదలు :)
Anonymous said…
తప్పకుండా! రేపు మీకు నేను రాసిన కథ పంపిస్తాను..
ఏవిటి, భక్తులెవరన్నా ఈ కథ రాయడం గురించి ఆలోచిస్తున్నారా లేదా?
మీన మేషాల్లెక్కబెడుతూ కూర్చుంటే ఈ లోగా పుణ్యకాలం కాస్తా గడిచే పోతుంది. గడువు పూర్త్కి ఇంకా పన్నెండు రోజులే ఉంది.
రమ గారు తన మనసులోమాట బయట పెట్టేశారు. క్వాలిటీ పరంగా బహుమతి ఎవరిదైనా (రమగారి కథ క్వాలిటీ ఏమీ తక్కువ కాదు), మొదటిగా కథ పోస్టు చేసినందుకు ఆమెకి అభినందనలు.
S said…
నేను రాస్తున్నా అండి.. నాలుగైదు రోజుల్లో పంపుతాను మీకు...
Anonymous said…
కొత్త పాళీ గారు తెల్ల కాగితం కథ నా బ్లాగ్ లో పోస్ట్ చేసాను . మీమైల్ ఐ డి లింక్ నా సిస్టం లో ఓపెన్‌ అవడం లేదు.ఇంకెక్కడా నాకు మీ మైల్ ఐడీ దొరక లేదు.అందుకనే ఇక్కడ తెలియ జేస్తున్నాను.
కొత్తపాళీ గారు నమస్కారం మీ కధల పోటీ బాగుంది. మీకు సలహా చెప్పేటంతటి పెద్దదాన్ని నేను కాదు గాని ధైర్యం చేసి చెప్తున్నా మీరు కధకి ముఖ్య విషయం చెప్పారు బాగుంది. కాని అది కూడా రచయిత స్వేచ్చకి వదిలేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పైతే మన్నించండి. అర్దం లేదనుకుంటే క్షమించండి. ధన్యవాదములు.
Anonymous said…
మీరేమి అనుకోపొతేనే చెప్పండి, ఎన్ని "తెల్ల కాగితాలు"చేరినవి ఇప్పటి దాకా?
Ramani Rao said…
చేయి తిరిగిన రచయిత(త్రు)లు కూడా పోటీలో వుంటే ఎన్ని తెల్ల కాగితాలొచ్చినా, ప్రయోజనం ఏముంటుంది చెప్పండి నెటిజన్ గారు. ఎమాటకామాటే చెప్పుకోవాలి నేనైతే బహుమతి మీద ఆశ తో రాయలేదు. కాని ఇప్పుడు ఒక్కొక్కరి కధ చదువుతుంటే ఆ ఆశ కూడా కలగడం లేదు. మన నాగరాజు గారి ప్రపోజల్ బాగుంది(గండపెండేరం..)
Naga Pochiraju said…
కొత్తపాళీ గారు.....ధన్యవాదములు
ఈ విధం గా నాలాంటి వారికి తెలుగు రాసే అవకాశం ఇస్తున్నందుకు
అసలు తెలుగు రాసి చాలా రోజులు అవుతోంది నేను
ఆ అవసరమే రావడం లేదు ఈ మధ్య :((

ఈ శీర్షికన వచ్చిన కథలన్నీ పొందుపరిచండి
అందరికీ ఎంతో ఉపయోగం గా ఉంటుంది
Anonymous said…
తెల్ల కాగితం ని ఒక జీవితం తో పోల్చి దాన్ని మళ్ళీ దిద్దుకోవడానికి ఒక ప్రయత్నం గా- అన్న కధావస్తువుతో ఎక్కువ కధలు వచ్చినవా?