బ్లాగ్వరులకి కొన్ని గమనికలు - చర్చా సారాంశం

డిసెంబరు 22 న కూడలి కబుర్లలో తెలుగు బ్లాగ్వరులందరూ కూడి కబుర్లాడుకుంటున్న శుభ సందర్భంలో తెలుగు బ్లాగుల ప్రాచుర్యాన్ని పెంచడం ఎలా అనే విషయం చర్చకి వచ్చింది. ఇటీవల ఈ విషయమై దేవరపల్లి రాజేంద్ర, తెలుగు వాడిని లేవనెత్తిన సమస్యలని, చేసిన సూచనలని కూడా సభ్యులు చర్చించారు.

బ్లాగుల్నే కాక అనేక అంతర్జాల పోకడలను అధ్యయనం చేసిన సాలభంజికల నాగరాజు గారు కొన్ని ప్రతిపాదనలు చేశారు ఆ చర్చలో. చర్చ ముగిసిన తరవాత తెలుగు బ్లాగు గుంపులోని క్రియాశీలక సభ్యులకి కొంత మందికి నాగరాజు గారు తన ప్రతిపాదనల సారాంశాన్ని ఆంగ్లంలో ఒక టపా పంపారు. నాగరాజు గారి ప్రతిపాదనలు బ్లాగ్జనులందరూ చదివి ఆలోచించ వలసిన అవసరం ఉందని అనిపించి వారి అనుమతితో ఆ ప్రతిపాదనలను ఇక్కడ తిరిగి రాస్తున్నాను.

అసలు ప్రశ్న: ప్రస్తుతానికి తెలుగు బ్లాగులకి నిత్య పాఠకులు ఇతర తెలుగు బ్లాగరులే నన్నది నిర్వివాదాంశం. ఈ పరిధిని దాటి బ్లాగుల్ని బయటికి తీసుకెళ్ళడం ఎలా? బ్లాగులని క్రమం తప్పకుండా చదివే పాఠకుల సంఖ్యని పెంచటం (కొద్ది శాతం కాదు, పది రెట్లు, వంద రెట్లు) ఎలా? ఇక్కడ బ్లాగులు అంటే వ్యక్తిగత బ్లాగులే కాక పొద్దు, ప్రాణహిత వంటి జాల పత్రికలూ, తెవికీ కూడా.

ఒక సాధారణ పాఠకుడి దృష్టిలో ఈ సమస్యని పరిశీలిస్తే మనమేం చెయ్యాలో అర్ధమయ్యే అవకాశం ఉంది. ఏదో పత్రికలో తెలుగు బ్లాగుల గురించి ఒక వ్యాసం రావటం, ఒక వారం పాటు కూడలి, తెవికీ ఇత్యాది గూళ్ళకి విపరీతంగా సందర్శకులు రావటం, వారిలో అతి కొద్ది శాతం బ్లాగు గుంపులోనో, తెవికీ బృందంలోనో సభ్యులుగా చేరటం, అలా చేరిన వారిలో మరి కొద్ది మంది (ఐదు నించీ పది మంది) క్రియాశీలకంగా రాస్తూ ఉండటం .. మళ్ళీ వారం తిరిగేటప్పటికి పరిస్థితి ఎక్కడ వేసిన గోంగళీ అక్కడే అన్నట్టు. జనాలందర్నీ బ్లాగర్లుగా, వికీపీడియన్లుగా మార్చటం మన వల్ల కాదు, అంత అవసరమూ లేదు. స్వయంగా బ్లాగులు రాయడం మీద ఆసక్తి లేని వారికి బ్లాగుల్ని పరిచయం చేసి, మళ్ళీ మళ్ళీ వచ్చే పాఠకులుగా చెయ్యటం ఎలా - ఇదీ అసలు ప్రశ్న. ప్రస్తుతానికి బ్లాగుల్లోనో తెవికీలోనో రాస్తున్న వాళ్ళకి భాషని గురించో, సంస్కృతిని గురించో - దీన్నేదో నేను ఉద్ధరించాలి అనే తహతహ కొంత ఉండి ఈ పనులు చేస్తున్నారు. మామూలు మానవులకి అలాంటి తహతహ ఏమీ లేదు. వాళ్ళకి అవసరానికి తగిన విజ్ఞానమో, లేక సమయానికి తగిన వినోదమో కావాలి - అంతే! ఆ అవసరాన్ని తీర్చే మాధ్యమాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. రాబోవు పాఠకులకి ముందస్తు షరతులు పెట్టకుండా వాళ్ళని ఇటువైపు ఆకర్షించడం ఎలా - అనేది ముఖ్యమైన ప్రశ్న.

ఎవరో రచయిత ఒక నవల రాస్తే, ఒక పబ్లిషరు దాన్ని ప్రచురిస్తే, ఆ పబ్లిషరే దాని పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు, ఎందుకంటే అది అతని వ్యాపారం కాబట్టి. అంతర్జాల రచనల్లో, ముఖ్యంగా బ్లాగుల్లో మనమే రచయితలమూ, పబ్లిషర్లమూ కూడా .. అందుకని మన పంపిణీ .. మన ప్రకటనలు మనమే చేసుకోవాలి. ఎవరో వచ్చి ఈ పని మనకి అప్పనంగా చేసి పెడతారని ఆశించడం అమాయకత్వం. పైగా, డబ్బుతో నడిచే పత్రికలవంటి మాధ్యమాలకి అంతర్జాలం అంటే ఒకింత భయం ఉండొచ్చు, ప్రస్తుతానికి కాకపోయినా భవిష్యత్తులో దీని పోటీ తాము తట్టుకోలేమని. అందుకని ఇటువంటి కార్యకలాపాలకి అప్పనంగా వాళ్ళు చేసే సహాయం ఏదీ ఉండబోదు.

ఇది సాధించడానికి కూడలి కబుర్లలో రూపుదిద్దుకున్న ప్రతిపాదనలు ఇవి:
1. అంతర్జాలంలో ఉన్న తెలుగు సమాచారం మొత్తం ఒక డీవీడీ మీద పడుతుంది, అంతకంటే ఎక్కువైతే ఉండదు. అలా ఒక డీవీడీ తయారు చేసి ప్రతి జిల్లాలోనూ ముఖ్యమైన బడులు, కళాశాలలు, గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చెయ్యాలి. వెయ్యి డీవీడీల తయారు ఖరీదు రూ. 25 వేలకి దాటదు. పెట్టుబడి కోసం తానా ఫౌండేషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వంటి సంస్థలని అర్ధించవచ్చు. ఈ పంపిణీ వల్ల కలిగే లాభాలు -
అ) పాఠకులు మన దగ్గిరికి వచ్చే బదులు మన రచనలని మనమే పాఠకుల దగ్గిరికి తీసుకెళ్తున్నాము.
ఆ) వార్తా పత్రిక వేసే ముద్ర క్షణికం. ఒక చోట ఈ డీవీడీ అందుబాటులో ఉంటే తరచూ చూసి ప్రభావితులయ్యే యువత పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉంది.
ఇ) ఒక పూట కనబడి మాయమయ్యే పత్రికల్లో ప్రకటనలకంటే ఇది సమర్ధ వంతంగా పని చేస్తుంది.
ఒక లొసుగు - ఈ పని వల్ల "రచనాచౌర్యం" ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువే. ఈ పని చెయ్యదలుచుకుంటే, మన రచనల్ని ఇతరుల పేరు కింద చూడ్డానికి కొంత మనసు సమాధాన పరుచుకోవాలి.
2. యూనీకోడు వాడకం. ఇటీవల కంప్యూటరు వాడకం పెద్దగా తెలియని వారు తెలుగు బ్లాగుల దగ్గిరికి ఎలా వస్తున్నారు అని గమనిస్తే, ఎక్కువగా గూగుల్ వంటీ శోధనాయంత్రాల వల్ల అని తేలుతున్నది. శోధనా యంత్రాలు యూనీకోడు తెలుగులోనూ లభ్యమవుతూ ఉన్నా, సాధారణ పాఠకులు ఆంగ్ల శోధననే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంచేత ఒక మామూలు శోధనలో ఒక బ్లాగు కనిపించాలంటే ఆ బ్లాగుకి ఒక RTS అవతారం ఉండాలి. ఇది తయారు చెయ్యడం పెద్ద కష్టం కాదు. తెలుగులో బ్లాగులు రాసేవారందరూ కొంత కాలం పాటైనా తమ బ్లాగులకి RTS ప్రతిబింబాల్ని కూడ తయారు చేసి పాఠకులకి అందుబాటులో ఉంచాలి.
3. బ్లాగు-వికీల ఇంకో పార్శ్వం పాఠకులు కూడ తిరిగి రాయడం. తెలుగులో సులభంగా రాయలేక పోవడం చాలా మందిని నిరుత్సాహ పరుస్తున్నది. జ్యోతి లాంటి మన ఔత్సాహికులు ఎంత కష్టపడినా కంప్యూటరు ఉన్న ప్రతి తెలుగింటిలోకీ తెలుగు వ్రాతని ప్రవేశ పెట్టడం మన శక్తికి మించిన పని. అదే పనిని మైక్రోసాఫ్టు అతి సులభంగా చెయ్యగలదు. ప్రస్తుతం తెలుగులో రాస్తున్న 90 శాతం మంది వాడుకదారులు బరహా, లేఖిని వంటి ఫోనెటిక్ ఇన్పుట్‌ని ఉపయోగిస్తున్నారు. కొత్త వాడుకదారులకి RTS వంటి ఇన్పుట్ పద్ధతి సులభం. మైక్రోసాఫ్టు వారు అటూవంటి మృదులాంత్రాన్ని తయారు చేశరు కానీ ఎవరూ పెద్ద ఆసక్తి చూపక దాని ప్రాతిపదిక కుంటుపడింది. "అహో, మేమంతా దీని మీద ఆసక్తి కలిగి యున్నాము" అని యెలుగెత్తి అరిస్తే మైక్రోసాఫ్టు దీన్ని పునరుద్ధరించ వచ్చు. ఇదే జరిగితే .. వేరే ఏ సాఫ్టువేరు స్థాపించుకో నక్కర్లేకుండానే ఏ అప్లికేషన్లో అయినా ఆంగ్లంలో రాసినంత సులభంగా తెలుగులో రాసేసుకోవచ్చు. దీనికి చెయ్యవలసిన పని - మనలో కొందరం ఒక టీంఉగా ఏర్పడి మైక్రోసాఫ్టుని ఈ పనికి పురిగొల్పాలి. బ్లాగరులు, వికీపీడియనుల అనుభవాలు, పౌనఃపున్యాలు కూడా దోహదం చేస్తాయి. అంతగా అవసరమైతే దానికి కావలిసిన కోడు రాసి సపోర్టునందించగల సమర్ధులు కూడా మనలో ఉన్నారు. మైక్రోసాఫ్టు చెయ్యవలసిందల్లా దీన్ని తమ ఆపరేటింగ్ సిస్టంతో కలిపి అందించటమే. దీనికి అవసరమైన తొలి ప్రయత్నాలు నేను (అంటే నాగరాజు) చెయ్యగలను.
4. ప్రస్తుతం మైక్రోసాఫ్టు XP లేదా విస్టా ఆపరేటింగ్ సిస్టముల్లో ఇన్స్క్రిప్టు అని సులభంగా తెలుగు రాసే పద్ధతి ఉన్నది అని 90% మంది కంప్యూటరు తెలుగు వాడుకదారులకి తెలియదు. తెలిసిన వారిలోనూ 90% మంది అది వాడే ప్రయత్నం చెయ్యట్లేదు - ఎందుకంటే .. కంట్రోలు పేనెలు తెరిచి అది నిర్వహించటం ఒక తలనెప్పి. ఇండీయాలో అయితే చాలామందికి ఆపరేటింగి సిస్టం సీడీ ఉండదు. అసలు ఇన్స్క్ర్ప్టుని డిఫాల్టుగా అందిస్తే? రాకేశ్వరుడు ఒక మంచి ప్రశ్న వేశాడు - ఇవ్వాళ్ళ మనం తెలుగు అన్నాం, రేపు మన సోదరుడు కన్నడం అంటాడు - ఇలా ఎన్ని భాషలు వాళ్ళు డిఫాల్టుగా అందించగలరు? నిజమే, కానీ ఇదంత పెద్ద సమస్య కాదని నా అభిప్రాయం. ప్రస్తుతం వాళ్ళు ఇచ్చే ఎంపికలో పన్నెండూ భారతీయభాషలున్నాయి. ఇతర భాషలు అక్కర్లేని వారు కంట్రోలు పేనెలు లోకి వెళ్ళీ వాటిని "ఆఫ్" చేసుకోవచ్చు. ముఖ్యం ఏవిటంటే ఇంత బాదరబందీ లేకుండా తెలుగులో రాయడం వాడుకదారులకి అందుబాటులోకి రావాలి. పైగా, అసలు సమస్య ఇదీ అని మైక్రోసాఫ్టుకి మనం చెప్పగలిగితే ఇటువంటి చిన్న సమస్యలకి పరిష్కారాలు వాళ్ళే వెదుక్కుంటారు, అవసరమైతే మనమూ ఒక చెయ్యి వెయ్యొచ్చు. అసలు సంగతి చైనీసు, జపనీసు వంటి మిగతా ప్రపంచ భాషల వలే కంప్యూటరులో తెలుగు రాయడం వాడుకదారుకి సులభంగా అందుబాటులో ఉండాలి.

ఈ ప్రతిపాదనల గురించి మన ఔత్సాహికులు, క్రియాశీలక సభ్యులు తెలుగు బ్లాగు గుంపులో అందరూ కలిసి చర్చిస్తే మనకి అందుబాటులో ఉన్న అంశాలని అభివృద్ధి చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యొచ్చు. కూడలి కబుర్లలో నలుగురు కలిసినప్పుడు కూడా ఈ విషయాలు గణనకి వస్తే ఆ చర్చని తిరిగి తమ బ్లాగుల్లోనో, లేదా తెలుగు బ్లాగు గుంపులోనో తిరిగి ప్రస్తావించవలసిందని సభ్యులకి నా వేడికోలు.

Comments

నిర్ణయం బావుంది. దీన్ని కార్యరూపం లోకి తీసుకు వస్తే బావుంటుంది. ఇంటర్నెట్ సాంకేతిక విషయాలు నాకు తెలీవుగానీ మరే విధమైన సాయానికైనా నేను సిద్ధమే. కృతజ్ఞతలు.
కొత్తపాళిగారు మీరు చెప్పిన సూచనలు బావున్నాయి. అందరు బ్లాగర్లు కలిసి సీరియస్‍గా ప్రయత్నిస్తే అది తప్పకుండా సాధ్యమవుతుంది. బ్లాగులు రాయడంలో చూపే బద్ధకం ,ఇందులో చూపకుంటే చాలు.
This comment has been removed by a blog administrator.
Ramani Rao said…
మీ ఆలోచన చాలా బాగుంది కొత్తపాళిగారు కాని ఈ విషయం చర్చించడానికి ప్రత్యేకంగా బ్లాగర్లందరు ఒకచోట సమావేశమై ఏకాభిప్రాయానికి వస్తే మంచిది.. ఎందుకంటే కూడలి కబుర్లు ఇంకా బ్లాగర్లందరికి చేరువ అవలేదని నా అభిప్రాయం.. ఎవరో ఒకరిద్దరు వచ్చినా ఏదో పిచ్చా పాటి మాట్లడుకొంటున్నారు కాని మీరు చెప్పిన అంశాలు చర్చించడం తక్కువగానే ఉంది.. కాబట్టి ఆదివారం జరిగే మీటింగ్స్ లో వీటి గురించి ప్రస్తావిస్తే బాగుంటుంది తరువాత దూరంలో వున్నవారికి ఈ అంశాలు చెప్పి వారి ఆలోచనలు.. అభిప్రాయాలు.. సేకరిస్తే బాగుంటుంది..సమిష్టి కృషి అన్నమాట..
ప్రతిపాదించిన నాగరాజుగారికీ, తెనిగించిన మీకు అభినందనలు. నాకు కన్పించిన తెలుగువాళ్ళకి బ్లాగులగురించీ, తెవికీ గురించి చెప్పి జేరమంటూనే ఉన్నాను. కంప్యూటరు వాడుతున్నవాళ్ళు కూడా అదేదో వేరే ప్రపంచం అనే భావన లోనే ఉన్నారు. పేదరికనిర్మూలన కార్యక్రమంలా ఉంది చూడొస్తే. ఈనాడు వ్యాసాల్లాంటివి ఓఫ్ఫదో, తొంబై వస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు.
ఒక్క మనవి - ప్రతిపాదనలు నాగరాజు గారివి. తెలుగు మాటలు మాత్రమే నావి.
@రమ - ఆ మాటకొస్తే ఆదివారం సభలైనా హైదరాబాదు సభ్యులకే పరిమితం కదా! అందరూ పాల్గొనే అర్ధవంతమైన చర్చ జరగడానికి తెలుగు బ్లాగు గుంపే సరైన స్థలం. పైగా ప్రతి ఒక్కరూ చర్చలోనూ, తరువాతి కార్య్క్రమంలోనూ పాల్గొనాలని కూడా ఏం లేదు. ముందొక కార్యవర్గం ఏర్పడి పని మొదలైతే మిగతావి అవే జరుగుతాయి.
@సత్యసాయి- పేదరిక నిర్మూలనం .. హ హ్హ .వ్య్కతిగత ప్రయత్నాలు ఆపనక్కర్లేదు. పత్రికలో వ్యాసాలు పని చెయ్యట్లేదని ఇప్పటీ అనుభవం వల్ల రూఢి అయ్యంది.
Anonymous said…
RTS అంటే ఏమిటండీ?
Raj గారూ
RTS = Rice Transliteration Scheme.
It is a type of spelling used to write telugu in English script. For example:
దీన్ని కార్యరూపం లోకి తీసుకు వస్తే బావుంటుంది.
will be written as
dInni kAryarUpaMlOki tIsuku vastE bAvuMTuMdi.
Many English-to-Telugu editors such as Lekhini, Baraha and Aksharamala use this as the basis to input Telugu text.
Anonymous said…
ఎంత గింజుకున్నా, పాఠకులని ఆకర్షించటం అంత సులువు కాదు. భాష మీద మరియు మన సంస్కృతి మీద అభిమానం, గౌరవం ఉన్న యువతరాన్ని ఆకర్షించాలంటే ముందు కంప్యూటర్ లో ధారాళంగా మరియు సులువు గా తెలుగు వ్రాయగలిగి, చదవగలిగేలా ఉండటం ఎంతో అవసరం. నాగరాజు గారు ప్రతిపాదించినట్లు ఇది మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా సాధించుకోవలిసిన కార్యం. మీరు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడితే, ముందుకు వచ్చి ఏదోవిధంగా సహాయపడని బ్లాగరు ఉండడు. మరియు నా విన్నపమేమంటే చర్చలనేవి ఏ కొద్దిమందికో పరిమితం కాకుండా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ప్రతి బ్లాగరు ఒక నిర్ధిష్ట చర్చా వేదికలో ఇలాంటి అభివృద్ధి పనులలో పాలు పంచుకునే విధంగా నియంత్రిస్తే బాగుంటుంది. ఉదా: ప్రపంచ తెలుగు బ్లాగర్ల సమాఖ్య (ఉందేమో నాకు తెలీదు) ను ఏర్పరిచి అందులో సభ్యత్వం కలుగజేసి సమస్యలో భాగస్థుల్ని చేస్తే అందరూ సీరియస్ గా తీసుకుంటారని భావిస్తున్నాను. ఏది ఏమైనా మీరెలాంటి అడుగు వేసినా అందుకు తగిన కృషి చేయటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము.
పైన నాగరాజు గారు ప్రతిపాదించినవన్నీ ఆచరణలో పెట్టగల పెట్టవలసిన సూచనలే. (ముఖ్యంగా డీవీడి ఆలోచన ఆచరణలో పెట్టాలన్న ఆలోచన నాకు ఉంది).
బ్లాగులు ఎంత స్వయంసంతృప్తి కోసం వ్రాసుకుంటామనుకున్నా కమర్షియల్ కోణం లేనిదే దీర్ఘకాలం మనలేవు. ఇది వరకు నాగరాజు గారే తెలుగు బ్లాగు గుంపులో ఎలాగూ వ్రాస్తున్నారు కదా..ఆ వ్రాసే బ్లాగు ఒక కొత్త చీర కొనిపెట్టగలిగితే చేదా ? అన్నారు.
అందరూ బ్లాగును మానిటైజ్ చెయ్యాలని కాదు. అందరూ ఉచితంగా వ్రాయలని కాదు. తెలుగు బ్లాగుల్తో కూడా కొద్దిగా కష్టపడితే కాస్తోకూస్తో చిల్లరడబ్బులు చేసుకోవచ్చు అని ఎవరైనా చేసిచూపిస్తే చాలామంది కొత్తతరం కుర్రాళ్ళు కాస్త ఉత్సాహంగా ముందుకొస్తారు.
కొందరికి చేదుగా అనిపించినా money motivates..
తెలుగు బ్లాగుల వ్యాప్తి అనే మహాప్రస్థానానికి తొలి అడుగుగా అనిపించవలసిన ఈ టపా, ఇందులోని విషయాలను చదివిన తరువాత (except second point which is very good point)... ఎలా అనిపించిందో కొంచెం నిక్కచ్చిగానే చెపుదామనే ప్రయత్నమిది...

సులభంగా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పాలి అంటే ... గుమ్మం ముందుకి వచ్చి తలుపు తడుతున్న వారిని లోపలికి ఆహ్వానించకుండా, వారికేమి కావాలో తెలుసుకోకుండా, మర్యాదలు చేయకుండా .... రానివారి గురించి ఎందుకు రాలేదో, పిలుపులో లోపం ఉందేమో లేక మేళతాళాలతో/బొట్టూకాటుక పెట్టి తీసుకువస్తే బాగుంటుందేమో...అని ఆలోచిస్తున్నట్టుగా ఉంది .... లేదా సామెత లాగా చెప్పాలి అంటే 'ముందు వచ్చిన వారికి మూకుళ్లలో వెనుక వచ్చే వారికి విస్తళ్లలో పెట్టటానికి చేస్తున్న ప్రయత్నం లాగా ఉంది'


ఈ ఆలోచనలు/ప్రయత్నాలు అన్నీ మంచివే ... నిస్సందేహంగా తెలుగు బ్లాగుల వ్యాప్తికి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి కానీ మన తెలుగు Blog Aggregators(ముఖ్యంగా కూడలి)కు సంబంధించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా, వాటి మార్పుల గురించి ప్రస్తావించకుండా ఉన్న ఈ టపా వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనమేమీ లేదు.

వీటికన్నా వెనువెంటనే ఆచరణయోగ్యమైన, సులభంగా చేయగలిగినవి, ఫలితాలు సాధించగలిగినవి నేను ఇంతకు ముందు చెప్పిన టపాలలో లాగా ఇంకా చాలా ఉన్నాయి.


మీ ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని ఆశించటం తప్ప ప్రస్తుతానికి ఇంతకు మించి చేయగలిగిందేమీ లేదు. సలహా ఇవ్వటానికి డబ్బులు, డుబ్బులు ఏమీ ఇవ్వక్కరలేదు కాబట్టి ఒక సలహా/సూచన .... ఇప్పుడే గోతులు తీసి పునాది వేస్తున్న సమయంలో, పునాది సాధ్యమైనంత గట్టిగా ఉండేలా చూసుకుంటూ... సమాంతరంగా, వేయబోయే పదో/వందో అంతస్తు గురించి ఆలోచిస్తే అర్ధవంతంగా ఉంటుందేమో ... ఆలోచించి చూడండి.
Sujata said…
రవి వైజాతస్య గారు చెప్పింది చాలా ప్రాక్టికల్. అసలు తెలుగు భాషాభిమానం అని అంతా ఒక్కో బ్లాగ్ మొదలు పెట్టడం... అంత సులభంగా తెవికీ కి కాంట్రిబ్యూట్ చెయ్యకపోవటానికి చాలా ప్రాక్టికల్ కారణాలే వున్నట్టుంది. ఉదా : బ్లాగ్ లొ తమ రచనలూ.. లేదా సేకరణలూ .. పొందుపరచి, తమ కు ఇస్టం వచ్చినట్టు రాసుకొనే అవకాశం, బ్లాగ్ రాయటం వల్ల వచ్చే పాపులారిటీ.. లేదా సెన్స్ ఓఫ్ అచీవ్మెంట్ / గుర్తింపు / సంత్రుప్తి ..మొత్తానికి బ్లాగ్ లొ దొరికే స్వతంత్రం. ఇవాన్నీ తెవికీ లో రాయటానికి ఉండత్లేదు.

ఇంకో ముఖ్య విషయం. అసలు బ్లాగ్ అనేది ఒక పేజ్ - 3 విషయం. అది కొందరికే అందుబాటు లో వుండే విషయం. ఇండియా లో / ఆంధ్ర ప్రదేశ్ లో నిజంగా తెలుగు మీద అభిమానం వుండి, వారికి సొంత కుంప్యుటర్ వుండి, దానికి హై స్పీడ్ ఇంటెర్నెట్ కనెక్షన్ (లేఖిని / బరహా లు ఆన్ లైన్ లోనే అందుబాటు లో వుంటాయి) వుండి, సరైన డాటా వుండి.. బ్లాగ్ చేసేది, డబ్బున్న, తీరికున్న, పట్నాల్లో / నగరాల్లూ వున్న చదువుకున్న జనం. ఆంధ్రా లో బోల్డన్ని వ్యామోహాలు. తెల్లరితే వాకిట్లో వాలే ఈనాడు / హిందూ అలా తిరగేసే తీరిక కూడా ఉండదు. ఆఫీసు, తెలంగాణా కబుర్లూ.. ఆటొల స్త్రైకులూ.. పెట్రొలు ధరల పెంపూ.. హైదరాబాదు లో దుర్మార్గమైన ట్రాఫిక్.. సాయంత్రం ఇంటికొస్తే టీవీ.. సీరియళ్ళో, వార్తలో, పాటలో.. స్వాతి / ఇండియా టుడే / స్వాతి మంథ్లీ / ఉద్యోగ సోపానం / సితార / విపుల / చతుర లాంటి పత్రికలూ ఉండగా బ్లాగ్ లు ఎవరు చదువుతారు? వాటిల్లో విశేషాలేముంటాయి ? 24 ఫ్రేములూ/నవ తరంగం లాంటి మంచి ఎడ్యుకేట్ చేసే బ్లాగ్ లు ఈ పత్రికల కన్న ఎక్కువ విషయాన్నివ్వొచ్చు. మన తెలుగు పత్రికలు కూడా మార్కెట్లో పోటీ ని తట్టుకొనేందుకు అన్ని రకాల వ్యాసాలనూ ప్రచురిస్తున్నాయి. ఈ మధ్య తెలుగు వార్తా పత్రికలు ప్రతి రోజూ విద్య, ఆరోగ్యం, వినోదం, రియల్ ఎస్టేట్, సమాజం, ప్రపంచం.. అన్నీ సమగ్రంగా ప్రచురిస్తున్నాయి. కాబట్టి, బ్లాగుల రీడెర్షిప్ సమాజం లో చాలా తక్కువ మందికే పరిమితం అవుతుంది.


ఇప్పుడు తెలుగు బ్లాగులు కమర్షియల్ గా ఎదిగే అవకాసాలు ఇప్పట్లో లేనట్టే వున్నయి. లేఖిని లాంటి సాఫ్ట్ వేర్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాసం వుంటే, చాలా మంది తెలుగు లో డాటా ను తెవికీ కోసం టైప్ చేస్తారేమొ.. నెమ్మది నెమ్మది గా తెవికీ లోకి ఆ డాటాను అప్లోడ్ చెయ్యొచ్చు కదా.. అందరికీ అన్నీ అందుబాటు లో ఉండవు కదా. తెలుగు బ్లాగర్లు హైదరాబాద్ లో ఉన్న కాలేజీలూ, యూనివర్సిటీ కాంపుస్ లలో ఉచిత సెమినార్లు నిర్వహించొచ్చు. రాజమండ్రి / విజయవాడ / విశాఖల్లో ఉన్న తెలుగు తల్లి సెంటిమెంటునూ.. హైదరాబాద్, వరంగల్లు, మెదక్ లలూ ఈ మధ్య ఎక్కువవుతున్న తెలంగాణా పిన్ని సెంటిమెంటునూ చక్కగా తెలుగు భాషోద్యమానికి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు.

అయితే బ్లాగ్గర్లు వైజాతస్య గారన్నట్టు కేవలం ఉచిత శ్రమ దానాల్ని జనాల్నుండీ ఆశించకుండా, ఏదైనా ఒక సంస్థ కి / వ్యక్తుల కీ కాంట్రాక్టు ఇచ్చారంటే.. ఒక సంవత్సరం కల్లా తెవికీ లో చాలా డాటా అచ్చ తెలుగు లో చేరుతుంది. అయితే దానికి కావల్సిన నిధులను నిజమైన తెలుగు భాషాభిమానులే ఎలానో సమకూర్చాలి. ఇండియా లో నెలకు పాపం అతి తక్కువ జీతానికి దొర్కే బోల్డంత మంది సమర్ధులకూ.. స్టూడెంట్స్ కు ఒక హాట్ జాబ్ లా కూడా ఈ అవకాశం కల్పించొచ్చు. ఎక్కువ ఫలితాలనిచ్చిన వాళ్ళకు పత్రికాభిముఖంగా అవార్డులివ్వొచ్చు. లేదా మనమే హైప్ స్రుష్టించొచ్హు..:) టీవీ-9 వాళ్ళతో హడావుడి చెయ్యొచ్చు.

ధనం మూలం ఇదం జగత్ అన్నారు గా. తెలుగు ని పెట్టుబడి గా పెట్టి, తెలుగుని అమ్మి, తెలుగుని సంపాదించడం, తెలుగు బ్లాగర్ల లాంటి పవర్ ఫుల్ పీపులుకి చాలా సులభం. మీ దగ్గర డబ్బూ, తెలివి తేటలూ, 2 - 8 ఎం బీ ఇంటెర్నెట్ కనెక్షనూ.. ఉచిత సాఫ్ట్వేరూ, హోదా, తీరికా కన్నా ముఖ్యమైన స్పూర్తీ, ఆత్మ విస్వాసం, సమిష్టి క్రిషీ, పట్టుదలా, నాలాంటి అనామకుల అభిప్రాయాలను కూడా రెసీవ్ చేస్కొనే పెద్ద మనసూ ఉన్నాయి. రెఫార్మ్ ఆర్ పెరిష్ అంటారు కదా. మీరు దీన్ని ఒక నాట్ ఫొర్ ప్రాఫిట్ సంస్థ గా తయారు చెయండి. మీకు సులభంగా నిధులు సమకూరుతాయి. విజయం మీదే.