మూడు మేరువులు

ఇరవై నాలుగ్గంటల్లో మూడు సార్లు మేరు సమాన ధీరుని సాక్షాత్కారం భలే విచిత్రంగా జరిగింది.

మాయామాళవ గౌళ రాగం, ఆది తాళం, త్యాగరాజ కృతి
మేరు సమాన ధీర, వరద, రఘు
వీర, జూతము రారే, మహా .. మేరు సమాన

సార సార వయ్యారపు నడలును
నీరద కాంతిని నీ ఠీవినీ .. మేరు సమాన

అలకల ముద్దును, తిలకపు తీరును
తళుకు చెక్కిళ్ళచే తనరు నెమ్మోమును
గళమున శోభిల్లు కనక భూషణములు
దళిత దుర్మానవ, త్యాగరాజార్చిత .. మేరు సమాన

తన ఇష్టదైవమైన శ్రీరాముని సౌందర్యాన్ని వర్ణించే కృతుల్లో త్యాగరాజు పరవశంతో ఒళ్ళు మరిచిపోతాడేమో ననిపిస్తుంది. ఇటువంటి పరవశమే నను పాలింప (మోహన), బాల కనక మయ చేల (అఠాణా), అలక లల్ల లాడగ (మధ్యమావతి) వంటి కృతుల్లోనూ కనిపిస్తుంది. అవును మరి, ఆయన మనోనేత్రానికి విందు చేస్తున్నది సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే. ఆహా! ఏమి ఆ మహానుభావుని వీర శృంగార రూపము? ఎటువంటి ఉపమానాలు, ఉత్ప్రేక్షలు సరిపోతాయి ఆ రూపాన్ని వర్ణించడనికి? మేరు సమాన ధీరుడు, ఆపన్నులకు వరదుడు, రఘు వీరుడు, నీల మేఘ శ్యాముడు .. ఆ నడకలో వయ్యారమేవిటి, ఆ ముంగురుల ముద్దేవిటి, తిలకం తీర్చిన తీరేవిటి, జోడద్దాల్లా మెరిసిపోతున్న చెక్కిళ్ళ తళుకేవిటి, ఆ ఆభరణల మెరుపులేవిటి .. అబ్బబ్బ .. చెప్పనలవి గాదనుకో. పోనీ ఇంత అందంగా ముద్దుగా ఉన్నాడంటే బాలుడనో, ఆడంగి వాడనో అనుకునేవు, పొరబాటు సుమా! దుర్మానవుల్ని దండించిన వాడు, త్యాగరాజార్చితుడు, ఈ మేరు సమాన ధీరుడు! వొట్టి మాటలేం సరిపోతాయి ఆ సౌందర్యాన్ని చెప్పేందుకు? అక్కడే ఉంది త్యాగరాజు కృతుల్లో తమాషా అంతా .. మాటల్లో చెబుతున్నదాని ఫలితాన్ని వెయ్యింతలు అతిశయింప చేస్తూ స్వర గతుల శిఖరాలమీది కెక్కించి, సంగతుల జలపాతాల్లోకి దూకించి, మూర్చనల సెలయేళ్ళ వెంబడి పరిగెత్తించి మనసుని ఒక్ఖ ఊపు ఊపేస్తాడు. చివరికి మనం చేతులెత్తి దణ్ణం పెట్టి
"స్వామీ, అర్ధమైంది, మీరేం వర్ణిస్తున్నారో మాకు అర్ధమైంది" అనేలా చేస్తాడు.

మాయామాళవగౌళలో ఒక సన్నటి విషాదపు జీర ఉంటుంది. కానీ ఆ విషాదపు ఛాయ ఈ కృతిలో ఎక్కడా లేశమాత్రం కూడా వినిపించదు. అంతా సౌందర్యమే, అంతా ఆనందమే. బాల కనకమయ చేల కృతిలో కీర్తిస్తున్నది బాల రాముణ్ణి .. అందుకే ఆ కృతిలో ఒక కుర్రతనపు ఉత్సాహం గంతులు వేస్తుంటుంది. తానెంతగానో ఎదురు చూడగా, వేడుకోగా తన దేవుడు కరుణించి కనిపించాడే అన్న ఒక తత్తరపాటు కనబడి, కరిగి నీరైపోతున్న భక్తుడి గొంతు వినిపిస్తుంది ననుపాలింప కృతిలో. ఈ కృతిలో అటువంటి మనోవికారాలేమీ లేవు. ఎదురుగా ఉన్నది మేరు సమాన ధీరుడైన రాముడు. మేరు పర్వతం పర్వతాలన్నిటిలోకీ ఎత్తైనదీ, పెద్దదీ, పవిత్రమైనది కూడా. పల్లవిలోనే ఆ మేరువుని తలుచుకుంటూ, మళ్ళీ మళ్ళీ ఆ ధీరత్వాన్ని మననం చేసుకుంటూ త్యాగయ్య పాట పొడుగునా ఒక ఉదాత్త గంభీర భావాన్ని పలికిస్తాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని కానీ, కైలాస శిఖరాన్ని కానీ దర్శించిన వారికి కలిగే అనుభూతి కలిగిస్తాడు.

నిన్న పొద్దున ఆఫీసులో ఏవో ఇంజనీరింగు డ్రాయింగులతో కుస్తీ పడుతున్నాను. చేతికి దొరికిన కేసెట్టొకటి (నా దగ్గరున్న భారతీయ సంగీతమంతా ఇంకా కేసెట్ టేపుల్లోనే ఉంది) వాక్ మేన్‌లో తగిలించి వింటున్నాను. ఎప్పుడో 1995లో క్లీవ్‌లాండ్లో ఆరాధనోత్సవ సందర్భంలో హైదరాబాదు సోదరులు (డి. రాఘవాచారి, డి. శేషాచారి) చేసిన కచేరి. హాలులో చేతులో వాక్‌మేన్ రికార్డరుతో స్పీకరు ముందు కదలకుండా కూర్చుని నేనే రికార్డు చేసుకున్నానది. మూడో పాటగా కొద్ది పాటి ఆలాపనతో పాడారు. ఈ సోదరులతో పెద్ద తలకాయనొప్పి ఇన్నాళ్ళైనా వాళ్ళకి సాహిత్యం నోటికి రాకపోవడం .. పుస్తకం చూస్తూ పాడ్డంలో పల్లవిలోనూ అనుపల్లవిలోనూ పడవలసిన నాలుగు సంగతులు ఎగిరిపోయినై. ఏదో, పాడేశాం అన్నట్టు ముగించారు.

ఇంతలో మా అక్కయ్య చాట్‌లోకి వచ్చింది. ఏం చేస్తున్నావే అంటే చెన్నై సంగీత సభల కచేరీలు వింటున్నానంది. ఈవిడ హాయిగా ఉద్యోగానికి శలవ పెట్టేసి చెన్నైలో మకాం వేసింది కాబోలునని నాకు ఒక్క క్షణం భలే అసూయ కలిగింది. ఇంతలో అసలు విషయం చల్లగా చెప్పింది - ఎవరో పుణ్యాత్ములు ఈ సీజనులో జరిగిన కచ్చేరిలు చాలా వాటిని తమ గూట్లో పెట్టారని, తను (మా అక్క) ఊరు కదలకుండానే హాయిగా అన్నీ వింటోందని.

సంగీతప్రియ నిర్వాహకులకు ఆ సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా కలుగుగాక అని మనసులో అనుకుని చాట్ కట్టేసి ఆ గూడు తెరిచాను. మా అక్క రికమెండేషను మీద మొదట TNS కృష్ణ కచేరీ నొక్కాను. ఈ పిల్లగాడు ప్రముఖ విద్వాంసులు, పద్మభూషణ బిరుదాంకితులు శ్రీ మదురై టి ఎన్ శేషగోపాలన్ గారి కుమారుడు. మిత్రులెవరో చెప్పారు IIM alumnus అని. ఎంత చక్కగా పాడాడో! ఆ ఎత్తుగడ, మెరుపుల్లాంటి భృగాలు గుప్పించడం, ఆ పద్ధతంతా అచ్చంగా వాళ్ళ నాన్న పోలికే. ఈ సభలో ఆయనకూడా ఉండి ఉంటే తప్పకుండా ఆ తండ్రి "పుత్రోత్సాహము" అనుభవించే ఉంటారు. ఉచ్చారణ కూడా చక్కగా స్పష్టంగా ఉంది. ఎటొచ్చీ తండ్రి బాణీని, కొండొకచో గొంతుని కూడా గుడ్డిగా అనుసరించడం కాక, త్వరలో తన స్వంత స్వరాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచి గాయకుడిగా రాణిస్తాడు. ఆ వయసులో తండ్రి చేసినట్టే గొంతు వాడకంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. దాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే అన్యాయంగా అపస్వరాల పాలవుతాడు. అవన్నీ సరే గానీ ఈ పాట మాత్రం భలే గొప్పగా పాడాడు.

మూడోది నా అభిమాన గాయకుడు సంజయ్ సుబ్రహ్మణ్యనం KSGSలో చేసిన కచేరి. విపులమైన ఆలాపనతో ముఖ్యాంశంగా పాడాడు. ఈయనకి కొంచెం మాటలు తేల్చేసే అలవాటుంది, కానీ నా అభిమాన గాయకుడు కదా, అందుకని క్షమించేశా!

తాజాకలం: ఇప్పుడే తెలిసిన వార్త. శ్రీ శేషగోపాలన్ గారికి చెన్నై మ్యూజిక్ ఎకాడెమీ వారు ఈ సంవత్సరం సంగీతకళానిధి బిరుదు అందించారట. కర్ణాటక సంగీత విద్వాంసులకి ఇది భారత రత్న కంటే అరుదైన, విలువైన సత్కారం. బిరుదు స్వీకరిస్తున్న శేషగోపాలన్ గారిని ఈ వారపు సరస్వతీపుత్రులు చిత్రంలో చూడవచ్చు.

Comments

pi said…
Thanks for the link! Check chestaanu. Naaku Sanjay Subramanian nacchadu. :).
Sriram said…
మేరుసమానధీరుని కొలిచిన కృతిని అంతే దీటుగా అభివర్ణించారు. చాలా నచ్చింది నాకు.

TNS Krishna is certainly a very talented artist and has achieved a commendable degree of professionalism at an young age.

But he sounds so much like his father that it is like two seshagopalans available for a concert on any given day. He should carve a niche for himself and create an identity of his own to reach the standards of TMKs and Sanjays.
బాగుందని చెప్పడం చిన్న పదం. అయ్యా - మీరు ఈజాబు రాసినట్టు చిన్న కమ్మ రాసాకా చూడడానికి ఇన్ని రోజులు పట్టింది - ఆరునెలలింకా అవలేదు గమనించగలరు. డిసెంబరు 31 నుండి మధ్యలో ఒక్కో రోజు లెక్కన రెండు సార్లు తప్ప టూరులోనే గడిచిపోయింది. జీవితంలో ఇంత బిజీగా ఎప్పుడైనా ఉండగలనని ఎప్పుడూ అనుకోలేదు. బ్లాగుల్ని ఎన్ని రోజులు మిస్సయ్యానో కదా. అన్నట్లు తిరువాయూరు చూసొచ్చా- ఆఅనుభూతులు వీలైనంత త్వరలో. ఈ యేటి ఉత్సవాలకి పందిళ్ళేస్తున్నారు- మేమెళ్ళినప్పుడు.
ధన్యోస్మి, మేస్టారూ. రసికులకి నచ్చినప్పుడే కదా రచన సాఫల్యం!
పూర్వం "పరోపకారార్ధం ఇదం శరీరం" అనే వారు .. ఇప్పుడది .. "ఉద్యోగ ఊడిగార్ధం వెధవ శరీరం" అన్నట్టు తయారైంది, నిజమే.
నిన్ననే స్నేహితులతో చెబుతున్నా ఆరాధనకి తిరువయ్యారు వెళ్ళాలనే కోరిక ఇంకా మిగిలే ఉందని.
మీ అనుభవాల వడ్డింపు కోసం ఎదురు చూస్తుంటాం.