మనసు నిన్నే తలంచు .. కురవనీలే మంచు

సూచన: ఈ రెండు విడియోల్లోని పాట వింటూ ఈ టపా చదవండి.


విన్నీ ద పూ


క్రానికల్స్ ఆఫ్ నార్నియా
*** *** *** *** ***

మా ఊళ్ళో మంచు పడింది.

పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటూ ఉండగా, కొత్త సంవత్సరం ఇంకా అప్పుడే వాకిట్లో అడుగు పెడుతోందో లేదో ..

సరిగ్గా ఆ సంధి సమయంలో మంచు పడింది.

ఆ పడటం కాస్తా కూస్తా కాదు, ఏకంగా ఒక అడుగు దాకా పడింది.

చలికాలం మొదలైన దగ్గిర్నించీ ఎప్పుడు మంచు పడుతుందో అని కొంత భయంతోనూ, ఒకింత ఆసక్తితోనూ ఎదురు చూస్తుండటం మామూలే. "వైట్ క్రిస్మస్" కావాలని చాలా మంది కోరుకుంటారు. మా ఊళ్ళో మరీ ఎక్కువగా పడదు .. ఒక చలి సీజనుకి రెండు మూడు సార్లు భారీగా .. అంటే ఆరంగుళాలకి మించిన పరిమాణంలో పడితే గొప్ప. సాధారణంగా చలికాలం మొదటి వారాల్లో ఏదో ముగ్గుపొడి జల్లినట్టు అరంగుళం అంగుళం పడుతుంది. అది అందంగా ఉండదు సరిగదా, పరమ చికాకుగా ఉంటుంది.

ఈ దేశానికి వచ్చిన కొత్తల్లో మంచు పడటం చాలా ఆశ్చర కరంగానూ, కొంత అయోమయంగానూ ఉండేది నాకు. మామూలు రోజుల్లో వాన కురుస్తుంది. చలికాలం వచ్చినప్పుడు ఆ వానే మంచుగా కురుస్తుంది అనుకునే వాణ్ణి. అది నిజం కాదని నెమ్మది మీద తెలిసింది. మంచు కురవడానికి చాలా తతంగమే జరగాలి. ఒక్కోసారి వాన బిందువులు గడ్డ కట్టేసి ఐసుముక్కల వాన కురుస్తుంది. ఒక్కోసారి నీటివాన, గడ్డకట్టిన వాన కలిసి కురుస్తుంది - ఇది అన్నిటికంటే మోస్ట్ డేంజరస్! అనేక వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే గాని మంచు కురవదు. మంచుగా కురిసినప్పుడు కూడా ఒకసారి టాల్కం పౌడరు చల్లినట్టు పొడిగా కురుస్తుంది. మరోసారి ఏదో తెల్లటి పక్షి ఈకల్లాంటి మంచు తునకలుగా రేకలుగా గాలిలో తేలియాడుతూ కురుస్తుంది.

ఐతే .. ఈ కొత్త సంవత్సరం పడ్డ మంచు అలా రాలేదు. మహా ఆర్భాటంగా మేళ తాళాల్తో వచ్చింది. ఉధృతంగా ఉరకలు వేస్తూ వచ్చింది. గాలి ఈలలు కేకల్తో కదన కాహళలు మోగిస్తూన్నట్టు వచ్చింది. నూత్నసంవత్సరాహ్వాన వేడుకలనించి ఇంటికి తిరిగి వస్తున్నాం. హైవే మీద ముందున్న కారు ఎర్రలైటు తప్ప కళ్ళముందు ఏవీ కనిపించదు. అంత దట్టంగా మంచు తెరలు. కారు అద్దం మీద మంచు తునకల దాడిని ఎదుర్కునేందుకు వైపర్లు అటూ ఇటూ అల్లల్లాడిపోతున్నై. తిన్నగా రోడ్డుమీద లైన్ల మధ్యలో పరిగెత్తాల్సిన కారు అకస్మాత్తుగా మందు కొట్టేసి స్కేటింగ్ చెయ్యాలని మారాం చేస్తోంది. ఎట్లాగొట్లా కారుని బుజ్జగించి ప్రాణాలు అరచేత బట్టుకుని ఇంటికొచ్చి పడ్డాం.

ఇహ రాత్రంతా ఇంటికప్పు ఎగిరిపోతుందేమోనన్న లెవెల్లో గాలి వేసే వీరంగాలు. సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ తో తగిన నేపథ్య సంగీతం. అలా ఎప్పటికో మొత్తానికి నిద్రపోయాం. పొద్దున ఏ ఎనిమిదింటికో మెలకువ వచ్చింది. లేచి, తెరలొత్తిగించి కిటికీలోంచి బయటికి తొంగి చూస్తే .. కనుచూపు మేర .. కనబడే ప్రతి తలం మీదా .. తెల్లటి మంచు .. వొత్తుగా మెత్తగా .. బూరుగదూదిలా .. వెనిల్లా ఐస్క్రీంలా .. తెల్లటి పీచుమిఠాయిలా ..

రాత్రంతా అరిచి ఏడిచి రాద్ధాంతం చేసి ఇల్లు టాపు లేపేసి తాను పడుకోక ఇతరుల్ని పడుకోనీయక గోల చేసిన పాపాయి .. తెల్లారు జామున అమ్మ పక్కలో నోట్లో వేలేసుకుని అమ్మ పక్కలో వెచ్చగా బజ్జున్నట్టు .. తెల్ల దుప్పటీ కప్పేసుకున్న ప్రకృతి .. బద్ధకంగా నాకేసి అరకన్ను తెరిచి .. అబ్బా, ఎందుకూ ఇప్పుడే లేచి కూర్చున్నావ్? అసలే రాత్రంతా నిద్దర్లేదు. ఇంకాసేప్పడుకో! అనేసి అమాయకంగా కళ్ళు మూసేసుకుంది.

Comments

Naga said…
గాలి దేవుని దర్శనం కనీసం ఒక్కసారి జరిగింది కనుక చెబుతున్నాను. చికాకో(గో) పరిసర ప్రాంతాలవారికి ఇది రోజూ వారి సమస్య!!! అనుభ-ఊహించగలరు!!!
రాధిక said…
" చలికాలం వచ్చినప్పుడు ఆ వానే మంచుగా కురుస్తుంది" ఇప్పటికీ నేను అలాగే అనుకుంటున్నాను.నాగరాజా గారు చెప్పినట్టు ఇది మాకు సర్వసాధాణం.అందులోను మేము వుండేది బే ఏరియా కాబట్టి మాదగ్గర వుండే గాలి బండలాంటి నన్ను కూడా వెనక్కి నెట్టేస్తూ వుంటుంది.ఊపిరిపీల్చడం కూడా చాలా కష్టమయిపోతుంది.మంచు కురుస్తుందంటే చాలా చిరాకు గా అనిపించినా దూదిలా ఎగురుతూ పడే మంచు మాత్రం చూస్తుంటే భలే ఆనందం గా వుంటుంది.నేను కూడా తేలిపోతున్న భావన వస్తుంది.మంచు వల్ల ఆనందం 5% అయితే బాధలు 95%.
ఈ మధ్య ఇంత బాగా మంచుపడటం ఈ సంవత్సరమే..
చుట్టుపక్కల మంచువాహనాలు తిరుగుతూ హుషారుగా ఉంది. మొన్నటిదాకా కంపెనీ అమ్మేద్దామని అనుకున్న ఆర్కిటిక్ కాట్ పునరాలోచిస్తుందనుకుంటా!! మా పక్కింటి పిల్లలు మంచు తోడిపోసిన గుట్టమీద స్లెడ్జిబళ్ళ సర్వీసు నడుపుతున్నారు :-) మంచంటే ఎండాకాలానికి ముందు వచ్చే న్యూసెన్సులా చూడకుండా సంవత్సరంలో తప్పకుండా వచ్చే ఒక సీజను అనుకుంటే బాగా ఆనందించవచ్చు :-)
పైదేశం నుండి వీచే చలిగాలులు మాత్రం బాబోయ్..కెవ్వ్
oremuna said…
ఆ గాలి వెయ్యి విమానాల హోరు పెట్టు అని వెంటనే అనిపిస్తుంది కదూ!
Anonymous said…
chaalaa baavund isir

http://indianwebdesign.wordpress.com/2008/01/07/12/
ఏంటి అమెరికావాళ్ళందరు మంచు తిప్పలు పడుతున్నారు. మేమేమో ఎంత బావుందో అని కుళ్ళుకుంటున్నాము. మరి సినిమాల్లో ఎంత అందంగా ఉంటుంది. హీరోహీరోయిన్లు సూపర్ డూపర్ హిట్లు పాడుకుంటారు. వాళ్ళకు చలేయదా??
@ Jyothi, హీరో హీరోయిన్లకి చలెయ్యదు - తోళ్ళు మందం కదా :-)
నేనింతవరకూ మంచు 'పడడం' చూళ్లేదుగానీ, పడ్డాక కలిగే కష్టాలు అనుభవించాను. సినిమాల్లో చూడ్డానికైతేనే మంచు బాగుంటుందనిపించింది.
Anonymous said…
కొత్తపాళీ గారూ,
భలే వర్ణించారు మంచు బాధలని కూడా. మంచును అనుభవించని వారు కుళ్ళుకుంటారు.

ఈసారి మంచుకాలం మరీ ముందుగా వచ్చింది కదా అని, మా అమ్మాయి ఎంత గోల చేస్తున్నా "నీ పుట్టిన రోజుకు (డిసెంబర్ 26) మంచు మళ్ళీ కురుస్తుంది, మంచు మావయ్యను(snow man) ఆరోజు చేస్తాన్లే" అన్నా. ఏదీ మళ్ళీ ఇప్పటి వరకూ మంచే లేదు. ఇవాళ బాల్టిమోర్‌లో 71 ఫారన్ హీట్!

--ప్రసాద్
http://blog.charasala.com
Usha said…
Manasu ninnetalachu ippude chadivaanu Kottapaali gaaru nijnagaa kanulaki kattinattu chupinchi oka bhavanani ichaaru
meeru cheppina salahaa ki dhanyavaadamulu
but nenu cheppagaa kotta ani site aite open ayyindi kani elaa pettalo ardham kavatledu koddigaa sramaanukokunda cheppagalugutaaraa?

USHARANI
usha garu,,

contact me on jyothivalaboju@gmail.com. i can help you with ur blog.
rākeśvara said…
Give me the 6-count
Else give me the 8-count
Show me your hip move baby
As we dance the Lindy

As we dance the Lindy
And let it snow as we dance to the Lindy

మీ టపా చదువగానే నేనెప్పుడో వ్రాసిన Show me the snow అనే కపిత గుర్తుకువచ్చింది... అందులోని ఆఖరి పద్యం పైన ఇవ్వబడింది.. :)
rākeśvara said…
@ రానారె,
మంచు పడుతున్నప్పుడు (అదీ ఆ హంస తూలికల్లా పడే రకం పడుతున్నప్పుడు) జీవితం లో ఇంకేమీ అక్కరలేదనిపిస్తుంది.