సుదీర్ఘమైన రాత్రి

రేప్పొద్దున మీరు రోజూ మామూలుగా లేచే వేళకి లేచి కిటికీలోంచి బయటికి తొంగి చూసి .."ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?" అనుకునే అవకాశం ఉంది. ఈ నాటి (ప్రపంచపు పూర్వార్ధంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గడచి పోయిన) రేయి ఈ సంవత్సరానికి సుదీర్ఘమైన రేయి.

కాలచక్రభ్రమణాన్ని లెక్కపెట్టుకోవటానికి, ఋతువులూ, కాలాలు, ఇలా ప్రకృతి మనకి అనేక టైం టేబుళ్ళని ఇచ్చింది. ఈ అనంత విశ్వంలో భూమి సూర్యునితో చుట్టూ చేసే వింత నృత్యంలో నాలుగు అడుగులు మార్చి, జూన్, సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో సుమారు 21వ తేదీ ప్రాంతంలో పడతాయి. మార్చి సెప్టెంబర్లలో వచ్చే ఈ దినాలని ఈక్వినాక్సులు అంటారు. ఆ రోజున పగలు, రాత్రి ఇంచుమించు సరిసమానంగా ఉంటాయి. జూన్ లో వచ్చేది వేసవి (సమ్మర్) సాల్స్టిస్. ఆ దినం సుదీర్ఘమైన పగలు. ఇవ్వాళ్ళ వింటర్ సాల్స్టిస్ - సుదీర్ఘమైన రేయి. కేవలం భూమి - సూర్యుడు సాపేక్ష చలనాల ప్రకారం ఈ వేళ ఆకాశంలో సూర్యుడు దక్షిణోత్తమ బిందువుని స్పృశించి రేపణ్ణించీ ఉత్తరాయణం ప్రారంభిస్తాడు. భారతీయ సౌరమానంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించితే (మకర సంక్రాంతి) గానీ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు కాదు.

ప్రాచీన నాగరికత లన్నిటిలోనూ కాలగమనానికి, తద్వారా మన చుట్టూ ప్రకృతిలో వ్యక్తమయ్యే మార్పులకూ చాలా ప్రాముఖ్యత ఉన్నది. కొంత వరకూ అది వారి వారి వ్యావసాయిక జీవితాలతో ముడిపడిన సంబంధాల వల్ల కావచ్చు. ఉదాహరణకి దక్షిణ భారతంలో సంక్రాంతి, పంట చేతికి వచ్చినప్పుడు జరుపుకునే పండుగ.

అదే కాక .. ఈ కాలగమనపు చిహ్నాలు నిరంతరం జరుగుతుండే మార్పుకీ, అశాశ్వతత్వానికీ ప్రతీకలు .. మార్పు సహజం .. మార్పుని ఆహ్వానించు, జీవించు ..అనే తాత్త్విక ఆలోచనలు కూడా మన పూర్వికులకి కలిగినయ్యేమో, ఈ రోజుల్ని పురస్కరించుకుని పండుగలు ఏర్పాటు చేశారు. అమావాస్యలూ, పౌర్ణములూ, సూర్య చంద్ర గ్రహణాలూ .. అంతెందుకు రోజూ జరిగే త్రిసంధ్యలు కూడా మనవారికి శక్తిభరిత ముహూర్తాలుగా తోచాయి. ఆయా సమయాల్లో ప్రత్యేక నిష్ఠతో జపతపాలు పూజలు చెయ్యమని సెలవిచ్చారు.

ఇక్కడ నేటివు అమెరికను జాతుల వారికి చాలా మందికి ఈ రోజు ఎంతో పుణ్యదినము. ఈ రాత్రి ప్రత్యేకమైన సామూహిక కర్మకాండలు నిర్వహిస్తారు. క్రిస్టియానిటీ ఒక మతంగా యూరపులో ప్రబలక ముందు ఆయా దేశాల్లో బలంగా ఉన్న పేగన్, కెల్టిక్ ఇత్యాది మతాల్లో కూడా ఈ రాత్రికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అసలు ఏసుక్రీస్తు డిసెంబరు 25న పుట్టాడని ఋజువేమీ లేదూ, అప్పటికి ప్రబలంగా ఉన్న వింటర్ సాల్స్టిస్ పండగని తమ కొత్త మతంలో విలీనం చేసుకోవడానికి మొదటి క్రైస్తవుల ఎత్తు క్రిస్టమసు అని కూడా ఒక వాదం ఉంది. గమనించండి, చర్చిలలోనూ, జానపద కథల్లోనూ కూడా క్రిస్మసు ముందు రాత్రికే .. ప్రాముఖ్యత ఎక్కువ .. క్రిస్మసు దినానికి కాదు!

Comments

Anonymous said…
Thanks అండీ చాల చక్కని సమాచారం అందించారు.
మొదటి మూన్నాళుగు శతాబ్దాలు క్రైస్తవులు బాహాటంగా మతాన్ని అవలంబించగలిగే రాజకీయ సామాజిక పరిస్థితులు లేవు..కనిపిస్తే తాట తీతే (పౌలుకు జరిగినట్టు) కాబట్టి ఉన్న పండగల ముసుగులో కొత్త పండగలు జరుపుకున్నారు. క్రీస్తు జన్మవృత్తాంత వివరణలోని ఆధారాల ప్రకారం జూన్ నుండి సెప్టెంబరు లోపల పుట్టి ఉంటాడని అంచనా
రవీ, మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఇది చూడండి:
http://en.wikipedia.org/wiki/Christmas#Pre-Christian_origins
అఫ్కోర్సు, వికీలో రాసిందంతా చారిత్రక సత్యం కాకపోవచ్చు కానీ నేను ఈ విషయమై సంప్రదించిన చాలా పుస్తకాల్లో ఇలాగే ఉంది. అదీ సంగతి.
Dr.Pen said…
"...జానపద కథల్లోనూ కూడా క్రిస్మసు ముందు రాత్రికే .. ప్రాముఖ్యత ఎక్కువ ..." అందుకే ఈ రోజు పుట్టింది:-) ఆశీర్వాదాలకు బహుత్ షుక్రియా!
మాష్టారూ, మీరు వ్రాసినదాంట్లో తప్పేమీలేదు..నేను దానికి జోడించానంతే..క్రిస్మసును అలా వింటర్ సాల్స్టీసుపై ఎక్కించడంవళ్ళ (పిగ్గీబ్యాక్) ఉభయతారకమయ్యింది :-)
9thhouse.org said…
ఇదే సాయన మకర సంక్రమణం. ఈ సంక్రమణ సమయానికి మీరు గ్రహస్థితిని సూచించే చక్రం ఇచ్చారు. మీకు జ్యోతిషంతో పరిచయం ఉందా?
మురళి .. జ్యోతిష్యం గురించి అస్సలు తెలీదండీ. సోల్స్టిస్ గురించి వెతుకుతుండగా ఒక సైట్లో దొరికిన బొమ్మ అది. "సాయన" మకర సంక్రమణం అంటే ఏవిటి? మామూలు మకర సంక్రమణానికి దీనికి ఏవిటి తేడా?
Anonymous said…
నేను జ్యోతిషం గురించి ఒక వ్యాస పరంపర రాసే ఉద్దేశ్యంలో ఉన్నాను (ఎప్పుడు రాయగలనో చెప్పలేను). అందులో రాశిచక్రంలో సాయన నిరయన భేదాల గురించి వివరిస్తాను. స్థూలంగా చెప్పాలి అంటే - రాశిచక్రం అంటే భూమధ్యరేఖ మీద నుంచి ఆకాశంలో కనిపించే భాగం. దీనికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. సూర్యుడు ప్రతీ సంవత్సరం సరిగ్గా భూమధ్య రేఖ మీదకి వచ్చే సమయాల్ని/బిందువుల్ని విషువములు (ఈక్వినాక్స్) అంటారు. అది మార్చి 21 న, సెప్టెంబరు 21 న జరుగుతుంది. మార్చిలో సూర్యుడు ఈ బిందువు మీదకి వచ్చినప్పుడు, ఆ బిందువు నుంచి రాశి చక్రం ప్రారంభమౌతుంది అని, అక్కడ నుంచి మేష రాశిని లెక్కపెట్టాలనీ సిధ్ధాంతం. కానీ భూమికి ఉండే Nutation అనబడే చలనం వల్ల ప్రతీ సంవత్సరం ఈ విషువద్బిందువు మారుతూ ఉంటుంది. అందువల్ల రాశిచక్రం ప్రారంభ బిందువు కూడా ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటుంది. దాన్ని సాయన రాశి చక్రం అంటారు. కానీ హిందువుల రాశి చక్రం మాత్రం ఒకే స్థిర బిందువు నుంచి పరిగణించబడుతుంది. దాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. అయనాంశ అంటే ఈ స్థిర బిందువుకీ, విషువద్బిందువుకీ మధ్య ఉన్న దూరం. అది సుమారు 24 డిగ్రీలు. దాని ఫలితంగా హిందువుల లెక్క ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి 24 రోజులు ఆలస్యంగా ప్రవేశిస్తాడు.

అందుచేత సాయన రాశి చక్రంలో మకర సంక్రమణం డిసెంబరు 21 అయితే, నిరయణ రాశి చక్రంలో జనవరి 14 అవుతుంది.

ఇప్పుడు నేను చెప్పినది ఏమీ అర్ధం కాకపోయినా ఏమీ కంగారు లేదు. వికిపీడియాలో అయనాంశ, Zodiac, Equinoxes, Nutation మొదలైన అంశాలు వెతికితే చాలామటుకు బోధపడుతుంది.