ఆటవ పట్నం సూడరబాబూ ...

ఏమాట కామాటే చెప్పుకోవాలి.
ఆటవా అందమైన నగరమే.
కెనడా దేశ రాజధానిగా ఏర్పడి ఈ సంవత్సరమే నూటయాభయ్యేళ్ళు అవుతున్నాయట.
ఏర్పోర్టు నించి నగరంలోకి వస్తుంటే ఏమంత పెద్ద అబ్బురపరిచేట్టుగా అనిపించలేదు. కానీ .. ఇంక మన ఫేటిదే అని డిసైడైపోయాక, ఇక వెరపేల అని నా కుళ్ళా తలమీద పెట్టుకుని కోటు ధరించి నగరం చూడ పోవగా .. కంట బడిన వింతలెట్టివనిన ..

నేనున్న హోటలు పక్కనే ఆటవా నగర పాలక కార్యాలయాలు. ఆ కార్యాలయ భవనాల మధ్య ప్రాంగణంలో మూడు స్తూపాల్లాంటి నిలువెత్తు బండ రాళ్ళున్నాయి - బహుశా ఏదో ఆధునిక శిల్పమేమో అనుకున్నా. అలవోకగా చూస్తే ఒక్కొక్కటీ పేద్ధ శివలింగంలా ఉంది .. ఆటవా నడిబొడ్డున త్రిలింగదేశం! అనుకుని కాసేపు నవ్వుకున్నా. ఈ కార్యాలయాల వెనక ఒక పార్కు, పార్కు మధ్యలో పేద్ద రాతి ఫౌంటెను. అఫ్కోర్సు, పార్కూ, ఫౌంటెనూ అన్నీ ఇప్పుడు మంచుతో కప్పబడి ఉన్నాయి. అవి దాటి వెళ్తే రోడ్డుకవతల వేపు పెద్దగా ఎత్తు లేకుండా బల్ల పరుపుగా విశాలంగా విస్తరించిన ఒక భవనం కనబడింది. జాతీయ కళాకేంద్రమట! పలువిధముల ప్రదర్శనలు జరుగుతాయట. లోపలి ప్రాంగణంలో అలంకారణలు చాలా అందంగా ఉన్నాయి. అది దాటి వెళితే ఒక అతి పురాతన భవనం .. ఏదో పాతకాలం నాటి బ్రిటీషు భవంతి లాగా .. నా పక్కన వాణ్ణడిగాను ఏవిటదని. అదే పార్లమెంటుట! ఏవిటి ఇంత చిన్నదా? అన్నా. అబ్బెబ్బే, మొదట్లో పార్లమెంటు ఇక్కడే ఉండేది, కానీ ఇప్పుడు ఈ భవనాన్ని కేవలం చారిత్రక కారణాలవల్ల నిలబెట్టి ఉంచుతున్నారు. దానికి వెనకాల విస్తరించి ఉన్న భవన సముదాయం అంతా కలిసి పార్లమెంట్ కాంప్లెక్సు .. అదన్నమాట సంగతి.

ఈ పార్లమెంట్ సముదాయాన్ని దాటి వెళితే అది ససెక్సు వీధి. అక్కడ ఒక పక్క రిడో కేంద్రమని పిలువబడే షాపింగ్ మాల్. క్రిస్మసు అమ్మకాలతో కొనుగోళ్ళతో హడావుడిగా ఉంది. రెండో పక్కన వీధి వీధంతా గొప్ప గొప్ప డిజైనర్ షాపులు - వాటి గవాక్షాల్లో ప్రదర్శిస్తున్న వస్తువులు బట్టలు వాటి ధరలు చూడ్డానికే కళ్ళు జిగేల్మనేట్టు. ఈ ససెక్సు వీధిలోనే అమెరికను దౌత్య (ధౌర్త్య) కార్యాలయం కూడా ఏడిచింది. దాన్ని దాటి వెళితే ముందంతా గొప్ప గాజు బురుజులతో ఒక అద్భుతమైన కట్టడం. అదే జాతీయ కళా ప్రదర్శన శాల. ఇవ్వాళ్ళ (శనివారం) మంచు కురవడం కొంచెం తెరిపిచ్చి, నేనూ, నా యువస్నేహితుడూ వెళ్ళి చెరి ఆరు డాలర్ల ముడుపు చెల్లించుకుని కాస్త కళాస్వాదన చేసి వచ్చాం. కళాఖండాలు నేను అమెరికాలో యూరపులో చూసిన వాటంత గొప్పగా లేవు, కానీ అమర్చిన తీరు బాగుంది. భవనం ఆర్కిటెక్చరే ఒక కళాఖండం.

ఆ రోడ్డు చివరికంటా వెళితే అక్కడొక నది. ఆటవా నది. ఈ నది కెనడాలోని ఒంటారియో రాష్ట్రాన్నీ, క్వెబెక్ రాష్ట్రాన్నీ విడదీస్తోంది. క్వెబెక్ లోకి వెళ్ళామంటే అదో ఫ్రెంచి గోల! ఆ నదిలో నించి మొదలై రిడో కెనాల్ అని ఒక సన్నటి కాలవ ఆటవా నగరం మధ్యగా ప్రవహించి ఊరవతల ఇంకో నదిలో కలుస్తుంది. చలికాలం మొదలవుతుండగా కాలవకి అటూ ఇటూ లాకులు మూసేస్తారట. అందులో మిగిలిన నీళ్ళు గడ్డ కట్టేసి ఒక సహజమైన ఐస్ స్కేటింగ్ రింక్ తయారవుతుందన్నమాట. అఫ్కోర్సు, గత వారంలో కురిసిన మంచుకి ఇప్పుడు కెనాలు మొత్తం పొడుగాటి వెనిల్లా కేకులాగా ఉంది. అన్నట్టు మిషిగన్లో లాగా ఒంటారియో రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ బీరూ మందూ అమ్మరుట. అంతా గవర్నమెంటు కంట్రోలు .. కంట్రోలు షాపుల్లో మాత్రమే అమ్ముతారట. అఫ్కోర్సు మామూలుగా బార్ అండ్ రెస్టరాంట్లు, పబ్బుల్లో గ్లాసులకొద్దీ తాగొచ్చనుకోండి. లేదంటే నదిని ఈది క్వెబెక్కులోకి పోతే కావల్సినంత మద్యంట. ఫ్రెంచి వాడి మాయ!

గమనిక: ఇక్కడ చూపిన బొమ్మలు వికీనుండీ, ఇతర కెనేడియను సాధికారిక సాలెగూళ్ళనించీ సంగ్రహించబడినవి. నేను తీసిన బొమ్మలు పైకెక్కించడం పూర్తైనాక చూపిస్తాను.

తా.క.: రాకేశ్వరా, మా ఆటవా వోళ్ళు మీ అట్లాంటా వోళ్ళని చితకబాదినారంట.

Comments

rākeśvara said…
river skating hmmmm....

మైసూరులో వున్టున్న "నా అట్లాంటా"
మిషిగన్లో వున్టున్న "మీ ఆటావా"
అందరూ నగ్గిన వారి పక్షమే మఱి... :)
Unknown said…
బావుంది ఒటావా...
ఐస్ స్కేటింగు నాకెంతో ఇష్టం. ఇప్పటి వరకూ చూడడమే కుదిరింది.
Anonymous said…
మీరు క్వీబెక్ రాష్ట్రం గురించి,’క్వెబెక్ లోకి వెళ్ళామంటే అదో ఫ్రెంచి గోల!’ అనటం బాగాలేదండి. క్వీబెక్ మిగిలిన కెనడా రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుంది. ఫ్రెంచి భాషా, సంస్కృతి కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇంగ్లీషు మాట్లాడేవారు బాగా తక్కువ. అయినా communicationకు భాష తెలియకపోవటం పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఇక్కడి జనం మంచివారు, సంగీతప్రియులు, నెమ్మదస్తులు. మీరొకసారి క్వీబెక్ పర్యటిస్తే మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారనుకుంటాను.
రాకేశ్వర .. అంతే మరి .. :-)
ప్రవీణ్ .. ఒకసారి ఆన్‌సైటు వేసుకుని ఇటుపక్కకి రండి!
రాజ్ .. మీరేనా మాంట్రియాల్ లో ఉండేది? నిన్ననే మీ బ్లాగులో ఆటవా అందాల ఫొటోలు చూశి మీరు ఆటవా యేమో అనుకుని వ్యాఖ్య పెట్టాను. This was just being tongue in cheek. I am sure Quebec is a very nice place.
మీ కెనడ అనుభవంతో, ఒక సటైరు బ్లాగరాదు!
తీరికగా ఉంటేనే సుమా!
మీ సలహా బానే ఉండండి నెటిజెన్ గారూ. సందర్భం కూడ బలంగానే ఉంది, కానీ ఏంటో ఈ మధ్య సెటైరు పలకటం లేదు పది పదిహేనేళ్ళ క్రితం పలికినట్టు. అమెరికా ధౌర్త్య కార్యాలయం మీద ఎంత వొళ్ళు మండి పోతున్నా ..అంతకంటే వాళ్ళని తిట్టడానికీ, వెక్కిరించటానికీ మాటలు రావట్లేదు. ప్చ్
ససెక్సు వీధిలో మన తెలుగువాళ్లున్నారా మాస్టారూ? మన ఆంధ్రకని ధూర్జటి 'వార'సులేమైనా?
రాంనాథా.. మల్లాది రామకృష్ణశాస్త్రిగారికి కలిగిన లాంటి జిజ్ఞాసే కలిగింది నీకూనూ. సమాధానం నేను చెప్పగల్ను గానీ వినే (చదివే) వాళ్ళు తట్టుకోలేరేమోనని తటపటాయిస్తున్నాను. సభామర్యాద కూడా పాటించాలి కదా! అవునూ, ఆ విషయంలో ధూర్జటినే తల్చుకోవటమెందుకూ .. ఇక్కడ పద్యం మొదలు పెట్టిన శ్రీనాథుడే ఉన్నాడుగా
teresa said…
రామనాథా,

ససెక్సు వీధి విషయం గురువుగార్నొదిలేసి మీరే investigate చేస్తే బావుంటుందేమో! :)
ధూర్జటి 'వార'సులు ;-) కిసుక్కు కిసుక్కు..హాహాహా
Anonymous said…
గురువు గారు,

ధూర్జటి వారిది సరసము, శ్రీనాధుల వారిది మోటు సరసమూ అని రానారే గారి అభిప్రాయమేమో ..


చాటువులు ముఖ్యంగా రెండు రకాలు కదా మాస్టారు, తిట్టు చాటువులు, సరస చాటువులు..
ఈ రెండ్రొజుల్లో .. వీసా ఆఫీస్ లో మొదటి రకం గానీ ..బయట రెండవ రకము గాని.... వస్తే మాతో దయచేసి పంచుకుందురూ.

-ఊ.దం
ధౌర్త్య కార్యాలయం - చాలా బావుంది
తెరసాగారు, గురువుగార్నొదిలేస్తే మల్లాదివారికొచ్చిన సందేహమేమిటో మాకెలా తెలుస్తుంది! :)
గురూజీ, 'వేగు'లవారితో సమాధానం పంపించేయొచ్చు కదా! దాన్ని తెలుసుకోగోరిన 'వార'ందరికీ నేను పంపిస్తాను. సభామర్యాద చెడకుండానే సభికులందరికీ విషయం తెలియజేసినట్లుంటుంది.
ఊ.దం.గారు, నమస్తే. ధూర్జటిని రాయలవారు అడిగేశారు, రాములవారు అనేశారు. శ్రీనాధుడెన్ని చేసినా అడిగినవారున్నారా?
braahmii said…
@ రానారే గారూ
తెలుసుకోవలిసిన విషయాలు తెలుసుకోవాలనుకోవటంలో మీతరువాత ఉండేది నేనే, మీకు తెలుసుగా.. అందువల్ల వేగుల ద్వారా ఏం తెలిసినా నాకు మాట చెప్పండి.
బాలవాక్కు
Dr.Pen said…
నేను కూడా బంతిలో:-)
కొత్తపాళీగారూ, ఆటవ పట్నం నుండి తిరిగొచ్చేసారా?
నేనేదో రహస్యం చెబుతానని (దుర్)ఆశగా లైన్లో నించున్న బాబుల్లారా, .. ఈ విషయమై నేను పబ్లిగ్గా కానీ రహస్యంగా కానీ ఏవ్హీ చెప్పబోవట్లేదు .. లైట్ తీస్కోండి :-) అంతగా కావాలంటే .. శ్రీనాథుడి చాటువొకటీ చెప్తాను .. ఇప్పుడే కాదు .,. త్వరలో ..
ramya said…
బావుంది ఒటావా...