భద్రుడి కథ చర్చించడానికి ఆహ్వానం

"రాముడు కట్టిన వంతెన" అనే పేరుతో ప్రముఖ కవి, కథకుడు, విమర్శకుడు, వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన కథని ఈ వారం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రకిటించారు. ఈ లంకెని ఇప్పటికే జాన్ కనుమూరి గారు, రానారె తమ బ్లాగుల్లో ప్రస్తావించారు. కానీ వారి బ్లాగుల్లో గానీ, తమ తమ బ్లాగుల్లో గానీ ఈ కథ గురించి మన బ్లాగరులనించి ఏమీ చప్పుడు కావట్లేదు.

పేరు చూసి ఇదేదో రాజకీయ కథ అని తొలగి పోకండి. ఇటీవలి రామసేతు వివాదానికీ ఈ కథకీ ఏమీ సంబంధం లేదు.

ప్రస్తుత సమాజంలో భారీ ఎత్తున జరుగుతున్న వలస జీవితాలకీ, ఆ వలస జీవితాల్లో ముఖ్య భాగాలమైన మనందరికీ ప్రతీక ఈ కథ. మన చుట్టూ సమాజ వాతావరణం ఎంత మారినా, మనమే ఎంతో మారినా మనలో ఎప్పటికీ వాడిపోకుండా ఎప్పటికప్పుడు చిగురిస్తూ ఉండే ఒక ప్రాణ శకలానికి ప్రతీక ఈ రాముడు.

ఈ కథ గురించి మనందరం కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుందని ఉంది. ఇదే ఆహ్వానం. మొదలు పెట్టండి మరి.

గమనిక 1: ఈ కథ మొదటి సారి చదివినప్పుడు "నా బాల్యం పోయిందో, ఎప్పటికీ దొరకదో" అని మొత్తుకునే మరో నాస్టాల్జియా కథ అని పొరబడే అవకాశం ఉంది.

గమనిక 2: ఈ కథ పైన ఇచ్చిన లింకులో ఈ శనివారం అర్ధరాత్రి (భారత సమయం) వరకూ, అటుపైన ఆర్కైవులో మరొక వారం మాత్రమే ఉంటుంది.

Comments

Nagaraju Pappu said…
మీరు చెప్పిన తర్వాత ఇప్పుడే ఒకసారి చదివా. మరో రెండు మూడు సార్లు చదవాలి.

ఈ మధ్య వస్తున్న చాలా కథలన్నీ ఎనభై శాతం వ్యాసాలే. వ్యాసంతో పొయ్యే దానికి కథఎందుకు? కథతో పొయ్యేదానికి కవితెందుకు? మాటతో పోయే దానికి మౌనమెందుకు అనిపిస్తుంది..
సిరి said…
రాముడు అడవులకు వెళ్ళడానికి, ప్రస్తుత కాలంలో - బ్రతుకు తెరువు కోసం ఉన్న వూరిని, స్వజనాన్ని వదలి మరో వూరుకో, దేశానికో వెళ్ళడానికి చాలా తేడా ఉంది. రామాయణ రాముడు వెళ్ళింది తండ్రి ఆజ్ఞననుసరించి! వలస రాముళ్ళు వేరే వూరులకు, దేశాలకు వెళుతున్నది మాత్రం అయోధ్య రాముడి మాదిరిగా మాత్రం కాదు అని నా అభిప్రాయం.

నిత్య జీవితంలో మనకి పెద్దగా నష్టం కలిగించని, ఇబ్బంది పెట్టని చాలా విషయాల్లో చాలా మంది 'వదులు కోవడానికి ' సిద్ధంగా ఉంటారు. దానికి పెద్దగా బాధపడరు కూడా. కథలో...ఇలాంటివి వదులు కోవడాలని, శ్రీరాముడు వదులుకున్న వాటితో పోల్చడానికి ప్రయత్నించడం బాగోలేదు! రెంటికీ సమన్వయం కనిపించడం లేదు(కనీసం కథ వరకు)!

చినవీర భద్రుడి 'గృహోన్ముఖంగా ' అన్న కథ దాదాపు పాతికేళ్ళ క్రితం ఆంధ్ర జ్యోతి వార పత్రికలో వొచ్చింది. ఆ కథలో చెప్పింది, చాలా వరకు ఈ కథలోనూ కనిపిస్తుంది. అప్పట్లో ఆ కథ నాకెంతగా నచ్చిందంటే, ఇప్పటికీ వా.చి.వీ.భద్రుడి రచన ఏది చూసినా అప్పటి కథే గుర్తుకొస్తుంది! ఈ కథ మాత్రం నన్ను మరో సారి నిరుత్సాహపరచింది(ఇంతకు మునుపొక కథ -భద్రుడిదే - ఆదివారం ఆం.జ్యో. లోనే - ప్రపంచీకరణ మీద వచ్చింది. కథ పేరు గుర్తు రావడం లేదు. అది నన్ను నిరుత్సాహపరచిన భద్రుడి కథల్లో ఇంకొకటి)!

శైలి క్లిష్టంగా ఉన్నా నష్టం లేదు కానీ, తెచ్చి పెట్టుకున్న గాంభీర్యాన్ని, పాత్ర స్థాయికి మించిన 'పాండిత్యాన్ని ' ప్రదర్శిస్తుంటే చదవడానికి ఇబ్బందే!

ఇంకొందరు అన్నట్లు, ఈ మధ్య చాలా కథలు వ్యాసాల్లా ఉంటున్నాయి. ఈ కథకు వాటి నుంచీ ఎలాంటి మినహాయింపూ లేదు. చాలా ఓపిక చేసుకుని చదవాల్సిన కథ!
మీరిద్దరూ చెప్పిన విషయాల్ని కాదనలేను. కానీ నాకనిపించింది - వదులుకోవడం అనేదే ఇక్కడ సామాన్య లక్షణం. ఎందుకు వదులుకున్నామనేది అప్రస్తుతం. వదులుకున్నాక ..రాముడు దండకాటవికి వెళ్ళాడు. మనం ఏ నగరానికో ఏ విదేశానికో వచ్చి పడ్డాం. ఇద్దరికీ దారి మరీ అంత అగమ్యగోచరంగా లేదు కానీ స్పష్టంగా కూడా లేదు. కష్టాలెదురైనప్పుడు ఆయన వానరులతో స్నేహబాంధవ్యాలు ఏర్పరుచుకున్నాడు. మనం మాత్రం చుట్టూతా మరిన్ని గోడలు కట్టేసుకుంటున్నాం. .. ఇవీ నాకనిపించిన విషయాలు.

గొప్ప కథ కాకపోవచ్చు గానీ మనమున్న పరిస్థితుల్ని గురించి కొంచెం వేరేగా ఆలోచింపచేసే ప్రయత్నమని నాకనిపించింది.

సిరిగారూ, మీరు చెప్పిన ప్రపంచీకరణ కథ నేనూ చదివాను. అది కూడా నాకు బానే నచ్చింది. ఆ వాతావరణంలో పనిచెయ్యడం వల్ల కాబోలు, చాలా నిజాలు చెప్పాడు.

చర్చ మొదలు పెట్టేసి నాది కాదన్నట్టు మెదలకుండా కూర్చున్నందుకు క్షమించాలి.
Nagaraju Pappu said…
మాస్టారూ,
ఇప్పటికి ఓరెండుసార్లు చదివాను. కధావస్తువుని గురించి మీరెప్పుడో వీల్చూసుకొని చెప్తారు గదా. ప్రధమ పురుషలో చెప్పే కధానిర్మాణం గురించి నా మెదిలో మెదులుతున్న ఒకటి రెండు ఆలోచనలు:

కథకుడే కథలో ఒక పాత్రని పోషిస్తూ గాని, కధని ఒక నారేటర్ చేత చెప్పించేటప్పుడు పాటించవలిసిన కొన్ని నియమాలున్నాయి. ఇలాటి కధలు సోమర్సెట్-మామ్ చాలా ఎక్కువగా రాసాడు, తెలుగులో మధురాంతకం రాజారాంగారు ఇలాటి కధలు ఎన్నో రాసారు. నారేటర్ని కథలో ఎప్పుడు ప్రవేశపెట్టాలి? నారేటర్ పాత్ర ఎలాఉండాలి?

కథలో కథావస్తువుని, పాత్రలని అనుసంధానం చెయ్యవలసి రావొచ్చు (ఒకరి గురించి ఒకరికి తెలియకపోవచ్చు, కథలో ముఖ్యమైన సన్నివేసాలు వేరు వేరు కాలాల్లోగాని, వేరు వేరు ప్రదేశాల్లోగాని జరిగుండవచ్చు) - అటువంటప్పుడు, వాటిన్నటిని అనుసంధానం చేస్తూ ఒక నారేటర్ని ప్రవేశపెట్టడం ఒక ప్రక్రియ. మామ్ ఇలాటి కధలు చాలా రాసాడు. ఇలాటి కథల్లో నారేటర్ సాక్షీభూతంగా ఉండాలి. మామ్ ఇలాటి కథలు చాలా రాసాడు.

ఇక రెండోది, నారేటర్ కూడా కథలో ఒక పాత్ర అయినప్పుడు - సాధారణంగా, నారేటర్ అండర్-డాగ్ పాత్ర పోషిస్తాడు. కథవల్ల అతను ప్రభావితుడవుతాడుగాని, కధకి భాష్యకారుడిగా మాత్రం ఉండకూడదు మధురాంతకం రాజారాం ఈ ప్రక్రియలో అష్టసిద్ధులూ సాధించిన మాంత్రికుడు.

నారేటర్ కథకి భాష్యకారుడిగా మారితే - కథకి రసభంగం అవుతుంది, అప్పుడు కథ మనల్ని తనవొళ్ళోకి లాక్కోలేదు. సాయం సేయరా ఢింభకా కధలో, చిట్టచివర్లో ఇలాటి రసాభాస జరిగింది. ఒక్కోసారి కథకుడుకాని, కవిగాని - ఉద్దేశ్యపూర్వకంగానే రసభంగం చెయ్యవొచ్చు, దానికి మనలాక్షణికులు రసాభాసాలంకారం అని ఒక టెక్నికొకటి చెప్పారు కూడా. కాని, రసాభాసాలంకారాన్ని పోషించడం చాలా కష్టం.

నారేటరే కథానాయకుడయినప్పుడు అది బయేగ్రాఫికల్ కథవుతుంది, లేక ఆత్మకథ కావొచ్చు. నారేటర్ని కథానాయకుడిగా పెట్టి శ్రీపాద వారొక అద్భుతమైన కథొకటి - మార్గదర్శి - రాసారు. రిచ్ డాడ్-పూర్ డాడ్ పుస్తకం మెత్తం ఆ కథలో ఉంటుంది. కథలో, ఆయన నారేటర్ని కధానాయకుడిని చేసి, అంతటితో ఊరుకోకుండా పాఠకుడిని నిశ్శబ్ధ పాత్రధారిగా చెయ్యడం ఆయనకే చెల్లింది.

ఈ కధలో, నారేటరు కథకి భాష్యకారుడిగా మారడం వల్ల, కథలో మనం లీనమవ్వడం కష్టమవుతోంది - కానీ, మరోలా ఎలా ఈ కథని చెప్పడమో కూడా తోచడం లేదు.
--నాగరాజు (సాలభంజికలు)
పిడకల వేట అనుకోకపోతే... 'నారేటర్'ని తెలుగులో ఏమని పిలవ్వొచ్చు?
ఈ కథను చదువుతూ ఉన్నపుడు నా ఆలోచనలు ...
కథకుడు = narrator(!?)
ఆంగ్లంలో సాహిత్య చర్చా పరిభాషలో కథ రాసిన వారిని author, writer అనీ, కథలో కథ చెప్పే గొంతుని narrator అనీ అనడం పరిపాటి. తెలుగులో కథల మీద రాసిన విశ్లేషణల్లో విమర్శల్లో "ఉత్తమ పురుష, ప్రథమ పురుష" కథనాల ప్రస్తావన తప్ప కథ చెప్పే గొంతుని ప్రత్యేకంగా గుర్తించిన వైనాలు నాకు ఎక్కడ కనపళ్ళేదు, ఒక వేళ చూసి ఉన్నా ఇప్పుడు గుర్తుకి రావట్లేదు.

తెలుగులో కథకుడు అనే పదం కూడా కథా రచయితని సూచించడానికే ఎక్కువగా వాడుతున్నారు. నాగరాజుగారి వ్యాఖ్యలో ప్రస్తావించిన "నారేటర్" కథకుడు కాదు.

ఇంకేదన్నా మంచి పదం ఆలోచించాలి.
నారేటర్ ని ప్రయోక్త అనవచ్చ్హా! నాటకాలకు ప్రయోక్త ఉంటాడు.
-నేనుసైతం
"నేనుసైతం" సూచించిన 'ప్రయోక్త' వాడవచ్చుననుకుంటాను. 'కథకుడు' మాత్రం ఖచ్చితంగా సరికాదు.
Ravikiran Timmireddy said…
మొదట సారి చదివిన తర్వాత, రెండు, మూడు సార్లు తర్వాత కూడా ఈ కథ నాస్టాల్జియా కథగానే నా కర్థమౌతుంది. కథ మొదటినించి చివరవరకు చిన్నతనపు ఙ్ఞాపకాల అల్లికలాగానే నాకు తోచింది. రచయిత, లేకపోతే కథలో తన ఆలోచనలు పంచుకున్న పాత్ర మనసు పోరల్లో ఆ మధ్యాహ్నపు తీరికలో తిరిగి విచ్చుకున్న బాల్యపు ఙ్ఞాపకాలే కాక, తన కోడుకు సంతోషంతోనూ, రావులవారి అవతారంతో కాకపోయినా, ఆయన భావంతో పెనవేసుకుపోయిన తన బాల్యపు రోజుల వెచ్చ వెచ్చని నీరెండలు, చల్ల చల్లని వెలుగు నీడల ఏటి వొడ్లు, కోవెల ఉత్సవాల సందళ్ళు, ఆ ఙ్ఞాపకాల అంచుల్లో తెలిసీతెలియకుండా, కనిపించీ కనిపించకుండా అల్లుకుపోయిన ఆ అతిపల్చటి దిగులు పోగు నాస్టాల్జియానే సూచిస్తున్నాయని నా అభిప్రాయం.
చిన్నతనంలో మనకేవి నచ్చుతయో, అవి (అన్నీ కాకపోయినా, చాలా వరకు) జీవితాంతం కూడా ఇష్టాలు గానే వుండం మనకు అనుభవంలోనిదే. పాలరాతీ తో కట్టిన మహా మహా గుళ్ళు కూడా, మన ఊళ్ళో రంగువెలిసిన గుడికి సాటిరావని నేను వేరే చెప్పక్కరలేదు. మన ఊరి ఏటికి, మన అమ్మ కొంగుకి ప్రపంచంలో మరేవి సాటిరావని మనకందరకీ తెలిసిన విషయవే. అవేవో గొప్ప కట్టడాలో, మహా నదులో, చీని చీనాంబరాలో కాదు విలువ కట్టడానికి, అవన్నీ బాల్యపు ఙ్ఞాపకాల తునకలు. ఆ వెలిసిపోయిన గుడి మెట్లమీద, ఆ సన్నటి సగం ఎండిపోయిన ఏటి పాచినీట్లో, వంట వాసన కోట్టే అమ్మ చెంగులో మనం మన ఙ్ఞాపకాల్ని చూస్తాం. మనసునుంచి ఆ ఙ్ఞాపకాల్ని పెరికి వస్తుప్రపంచంలోకి విసరివేస్తే, అవి గుళ్ళుగా, ఏర్లుగా, అమ్మలుగా, రావులువార్లుగా రూపం తీసుకుంటాయని నేననుకుంటాను. అందుకనే రావుడి సుగుణాల వలన రావుడ్ని ఇష్టపడే వాళ్ళకంటే, రావుడి భావానికి తలవంచే వాళ్ళే ఎక్కువని నా అభిప్రాయం. రచయిత కూడా ఇదే అభిప్రాయాన్ని కథలో వివరించారని నాకనిపిస్తుంది.

కథలో రావుడు కూడా రచయిత ఙ్ఞాపక రూపంగానే నేను భావిస్తున్నాను. అతి తక్కువ సమయంలోనే పెనుప్రళయంగా సంఘంలో వచ్చిన మార్పులతోపాటు, ఇటీవల రావుడుమీద, రామసేతుమీద జరుగుతున్న జగడం ఆయన ఙ్ఞాపకాలని వేదించిందని నా అభిప్రాయం. ఆ వేదనకి రూపంగానే ఈ కథ నా మనసుకి తెలుస్తుంది. అతి సున్నితంగా, అత్యంత మధురంగా, వొక దోసెడు సంతోషంలో, వొక చిటికేడు బాధని కలిపినట్టున్న ఈ కథ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది.
Ravikiran Timmireddy said…
2nd part of my comment

అంతగా నచ్చని విషయం రావుడు మీద రచయిత చెప్పిన ఫిలాసఫీనే. వదులుకోవడం వరకు అర్థమైన రావుడు, పొందడంలో రహశ్యాన్ని తనలోనే దాచేసుకున్నాడట. నాకుమాత్రం రావుడు వదులుకున్నదీ ఉన్నతంగా కపడటంలేదు, తిరిగి పొందింది అసలు కనపడటంలేదు. తనుపుట్టిన ఇంటినీ, తల్లి తండ్రుల్ని, తన దేశాన్నీ అన్నిటినీ వదిలి, ఎవరో ఏవిటో తెలియని ముగ్గురమ్మల ముద్దులకొడుకింటికి వచ్చింది సీతమ్మ తల్లి, ఎవరూ మాటమాత్రం కూడా తెలియని ఆ ఇంట్లో, తెలిసీ తెలియని శ్రీరావుడి కోసం, తనకు తెలిసిన, తన మొత్తం జీవితాన్ని వదులుకుంది ఆ తల్లి. ఆ తల్లే కాదు, లక్షల, కోట్ల అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు చేసే ఈ త్యాగం ముందు, రావుడు గారి రాజ్యం వొక లెక్కా?

పొందడవెలానో రావుడుకి తెలుసేవో గానీ, ఆయన పొందిందేంలేదు. వదులుకున్న వన్నీ చేజేతులా వడులుకున్న సీతమ్మ తల్లి కనీసం బిడ్డల ప్రేమని పొందగలిగింది, ఆఖర్లో అక్కున చేర్చుకునే అమ్మను పొందగలిగింది. తనమనసులో రావుడిమీద ప్రేమను (రావుడు ఆ ప్రేమని అనుభవించలేక పోయినా) తరతాలుగా అమ్మల గుండెల్లో నిక్షిప్తం చేయగలిగింది, ఆ అమ్మల ద్వారా మన చిన్న నాటి బంగారు ఙ్ఞాపకాల్లో రావుడ్ని నింపేయగలిగింది. వదులుకోవడవైనా, తిరిగి పొందగలగటవైనా ఆ తల్లికి, ఆ తల్లులకే చెల్లు. రావుడి చుట్టూ గోడలే, రాచరికపు గోడలు, భేషజాల గోడలు, గొప్పలకోసం గోడలు, కసువుల దిబ్బల్లాగా ఆచారాల, వ్యవహారాల, వ్రతాల గోడలు. గోడలు లేంది, ఎల్లలు లేంది, సీతమ్మ తల్లి మనసులో వున్న రామ భావానికే. అందుకే అది మన అమ్మలు చెప్పిన కథల రూపంలో ఇప్పటికి కూడా మన మనసులో విస్తరిస్తుంది.
రవికిరణ్ గారూ, మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా సీతమ్మవారి గురించి. బాఉంది మీ వ్యాఖ్య.