అతి సర్వత్ర వర్జయేత్ ..

.. ఈ ఆర్యోక్తి యమదొంగ సినిమాకి బాగా వర్తిస్తుంది.

వినోద భరితంగా కథ రాసుకున్నావు. కథలోని వేర్వేరు దారాల్ని పాయలుగా అల్లుకొచ్చి చక్కటి అమరిక తయారు చేశావు. కథలో పాత్రలకి అనుగుణంగా ప్రతిభగల నటీనటుల్ని ఎన్నుకున్నావు.
వినోదాన్ని రక్తి కట్టించడానికి అవసరమైన మసాలా దినుసులన్నీ పోగు చేసుకున్నావు. ఇవన్నీ చాలవా ?
- ప్రతి అంశాన్నీ అతి చేసి చివరికి రసాభాస చేసుకోవాలా? సినిమాలో వేర్వేరు అంశాలు దేనికదే వినోదంగానే ఉన్నై కానీ అన్నీ కలిపి మూడు గంటలు దాటేసరికి దేన్నీ భరించడం కష్టమైపోయింది. నిడివిని కనీసం ఒక అరగంటైనా కుదించి ఉండొచ్చు. కత్తెర నా చేతిలో ఉండి ఉంటే, కథ చెడకుండా ఒక గంట దాకా కత్తిరించి ఉండే వాణ్ణి.

మెచ్చుకోదగిన విషయాలు:
వినోద భరితమైన కథ. ఆసక్తికరమైన కథనం.
యముడి పాత్రని మలచిన తీరు. యముడు సూర్యుడి కొడుకు అనే పురాణకథని కథకి తగినట్టు ఉపయోగించుకోవడం. మోహన్‌బాబు బాగా నప్పాడు. యమలోకం సెట్టు, పాత్రల ఆహార్యం కూడా బాగుంది.
ధనలక్ష్మిగా మమతా మోహన్‌దాస్ నటన.
చాలా రోజుల తరవాత హాస్యనటుడు అలీ తన ప్రతిభకి తగిన పాత్రలో రాణించాడు.
సాంకేతిక మాయాజాలంతో స్వర్గీయ ఎన్టీయార్ తెరపైన ప్రత్యక్షమై కథలో ఒక కీలకమైన మలుపు తిప్పడం.
యాభై పౌండ్ల భారం వొదిలించుకున్న స్లిం అండ్ ట్రిం జూ. ఎన్టీయార్ డాన్సులు, ఫైట్లు తన సహజమైనశైలిలో నిర్వహించాడు. కొన్ని ఫైట్లు పాటల పిక్చరైజేషన్ చాలా ఇనొవేటీవ్‌గా ఉంది. యముడికి దీటుగా సంస్కృత సమాస భూయిష్టమైన భారీ డైలాగులు కూడా బానే చెప్పాడు.
నేపథ్య సంగీతంలో నరసింహ స్వామి మహిమ సూచించటానికి, యముడి ప్రతిభ ఎత్తి చూపటానికి ఉపయోగించిన ఉఛ్ఛాటనలు సందర్భోచితంగా సమకూరినై.
సంభాషణలు కూడా చాలా మట్టుకు సందర్భోచితంగా, చమత్కారంగా ఉన్నై.
యముడి పాత్రలో చాలా చోట్ల మాయాబజార్ ఘటోత్కచుని "ప్రేరణ" కనిపిస్తున్నది.

దర్శకుణ్ణి మొత్తబుద్ధయ్యే విషయాలు:
ప్రతి అంశంలోనూ మితి మీరిన అతి.
నాయిక పాత్రకి వెర్రిమొహంలా చూస్తుండడం తప్ప వేరే పని లేదు. మన హీరోయిన్లలో కాస్త ప్రతిభగల అమ్మాయి ప్రియమణి - ఈ పాత్రలో పూర్తిగా వృధా. దానికి తోడు ఆమె ఉన్న రెండు పాటల్లోనూ విపరీతమైన మేకప్పు, ఆమెకి అస్సలు నప్పని దుస్తులు వేసి ఆమె సహజసౌందర్యాన్ని నాశనం చేశారు.
స్వర్గీయ ఎన్టీయార్‌కి వాడిన డబ్బింగ్ నప్పలేదు. అంతకంటే చక్కగా ఆయన గొంతుని అనుకరించేవారు ఆంధ్రదేశంలో దొరకలేదంటే ఆశ్చర్యంగా ఉంది.
అన్నిటికంటే చిర్రెత్తించిన విషయం - తెరమీద ఏదన్నా అమ్మాయి పాత్ర ప్రవేశిస్తే చాలు, కెమెరా లెన్సు సరాసరి ఆమె బొడ్డు మీదికి దూసుకు పోతూంటుంది. ఒకటి రెండు సార్లు భరించొచ్చు. ఇక తెర మీద అమ్మాయి కనబడ్డప్పుడల్లా ఇదే గోలా? సినిమా విజయం అమ్మాయిల బొడ్డు చుట్టూ పరిభ్రమించును అని దర్శకుడి భ్రమ కాబోలు.
పాటలన్నీ ఊపుగా మోతగా ఉన్నై. ఏదో అక్కడక్కడా ఒక్కొక్క ముక్క తప్ప సాహిత్యం ఏదీ నా చెవికి స్పష్టంగా వినపళ్ళేదు. బహుశా వినబడకుండా ఉండటమే మంచిదేమో. ఎవరో కొత్త యువకవి ఈ సినిమాలో పాటలు అన్నీ రాశాడుట. అందుకని కొంత కుతూహలంగానే ఉంది. సినిమా మొదట్లో ఉన్న ఒకటి రెండు పాటల్లో ఉపయోగించిన హిప్‌హాప్ శైలి మరీ విపరీతంగా ఉంది. కానీ పాటల చిత్రీకరణ, దానిలో సాంకేతిక బృందం కనబరిచిన టెక్నికల్ బ్రిలియన్సుని, ముఖ్యంగా ఎడిటింగ్‌ని అభినందించాలి.

మన ఓర్పుకి కొంచెం పరీక్ష పెడతుంది గానీ, చూడతగ్గ సినిమాయే. జూ.ఎన్టీయార్ లేదా రాజమౌళి అభిమానులైతే నిరాశ చెందరు.

Comments

మన తెలుగు వారికి మిగిలిన ఒకే ఒక కళ సినిమాని చాలా బాగా పోషిస్తున్నారు కోపో గారూ :)
అన్ని కళల్నీ శక్తివంచన లేకుండా పోషిస్తూనే ఉన్నాను :-)
అమ్మా... అప్పుడే చూసేసారా.
నే కూడా చూడాలనుకుంటున్నా. జూ ఎన్టీఆర్ నాజూగ్గా ఎలా ఉన్నాడో కూడా చూడాలి.
విదేశాల్లో ఉన్నా మీరే ముందు చూసేశారే..

నేనింకా చూడకపోవడానికి కారణం, క్యూలో ఒకరికొకరు తగలకుండా టికెట్టు తీసుకోగలిగే రోజే సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడతాను నేను.

కొత్త రవికిరణ్
థాంక్స్ అండి. ఈ వారాతం హ్యూస్టన్‌కు వస్తోందీ సినిమా. జూ.ఎన్టీయార్ కు మంచి విజయం దక్కాలనీ మంచి సినిమాలో నటిస్తే చూడాలనీ అనుకుంటున్నాను. అది ఇన్నాళ్లకు జరిగేలా ఉంది.
విహారి said…
ఆ వెబ్ గాళ్ళ రివ్యూ లన్నీ చదివాకా అనిపించింది. ఈ సినిమా వీళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా బావుంటుంది నేను చూశాక ఓ నాలుగు చుక్కలు వేద్దామనుకున్నా. ఇక చూసిన తరువాత GBU రివ్యూ రాయడం ఎందుకులే అనుకున్నా.

బాగా నచ్చినవి: సెట్టింగ్స్, బుడ్డోడి డ్యాన్సు. ప్రియమణి, లాకెట్ ఎపిసోడ్స్.
చెడ గొట్టబడినవి: అదర గొట్టే సీన్లు వున్నచోట డైలాగులు చప్పబడి పోవటం. అన్నింటికి మించి చాలా సీన్లలో బుడ్డోడి హెర్‌స్టయిల్ సరి చెయ్యక పోవడం.
అతిదానాద్ధతఃకర్ణః ,
అతిలోభాత్సుయోధనః,
అతికామాద్ధశగ్రీవః,
అతి సర్వత్సవర్జయేత

For the uninitiated, which until a while ago included me, దయచేసి అర్థం చెప్పగలరు
చూశాను. అన్నింటికంటే నాకు ఆనందం కిలిగంచిన విషయం ఏమిటంటే - పౌరాణికాలను చేయగల, సంభాషణలను సరిగ్గా చెప్పగల సత్తా ఉన్న నటులు, అందునా యువనటులు మనకు ఉన్నారనేది. నృత్యాల్లో ఎన్టీయార్ ఒక మెరుపు. యముడి ప్రవేశ సన్నివేశంలో మోహన్‌బాబు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఒప్పుకొని తీరాల్సిన మాట ఏమిటంటే - మనకున్న చాలామంది స్టార్లకంటే నటన విషయంలో మోహన్‌బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి.