పదే ఏం భాగ్యం?

వీవెన్‌ని ఖచ్చితంగా అభినందించాలి - ఎప్పుడూ కూడలికి ఇంకా ఏ కొత్త హంగులు అద్దుదామా అని చూస్తూనే ఉంటారు. సరికొత్త ప్రతిపాదన పది అత్యుత్తమ తెలుగు బ్లాగుల్ని ఎంచి కూడలిలో ప్రదర్శించాలని.

కొత్తగా బ్లాగ్లోకంలో ప్రవేశించిన వాళ్ళు వెతుక్కోనక్కర్లేకుండా మంచి బ్లాగుల్ని పరిచయం చేసుకోడానికి ఇదొక మంచి పనిముట్టే. క్రమం తప్పకుండా బ్లాగులు చదివేవారికి వాళ్ళకి నచ్చే బ్లాగులేవో వాళ్ళకి తెలుసు. చాలా మంది (నేను కూడా) తమకి నచ్చే బ్లాగుల్ని బ్లాగు పట్టీలో చూపిస్తుంటారు. కానీ అన్ని బ్లాగులూ అందరికీ నచ్చాలని లేదు కదా. పదింటిని ఎంచితే, ఈ పదే గొప్పవి, మిగతావి చెత్త, చదవక్కర్లేదు అనే భావం కూడా కలగొచ్చు పాఠకులకి. ఆ పాఠకుడు నాలాంటి బద్ధకస్తుడైతే .. మిగతా బ్లాగుల్లో ఏముందో అని శోధించకుండా - ఈ పదింటితోనే సరిపెట్టేసుకో గలడు. విశాలంగా చూస్తే అంతర్జాల విహారంలో, సూక్ష్మంగా చూస్తే బ్లాగుల్లో, ఏదో అలా గాలికి తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒక రాత - మనసు చెమ్మగిల్లే కవిత్వమో, మెదడుకి పదును పెట్టే ఆలోచనో, తెలివిని సవాలు చేసే సమస్యో - అనుకోకుండా కంట బడితే - ఆ అనుభూతి చెప్పలేం. ఎన్నో మంచి ముత్యాల్ని నేను ఇలాగే ఏరుకున్నాను. ఇవే మంచివి అని పట్టీలో పెట్టి అందిస్తే .. పాఠకులకి "కనుగొంటిని!" అనే భావం దూరమైపోతుంది. పైగా ఆ పట్టీలోవి వాళ్ళ అభిరుచికి తగనివి ఐతే అరికాలి మంట నెత్తికెక్కినా ఎక్కచ్చు.

ఇది ఎలా చూసినా ప్రజాస్వామిక ఎన్నిక కాజాలదు. ఈ ఎన్నికలో పాల్గొనేవాళ్ళందరూ, నేను గమనించినంతలో, బ్లాగులు రాయడంలోనే కాక బ్లాగుల్ని చదవడంలో వ్యాఖ్యానించడంలో తమ అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నవాళ్ళు. అంటే బ్లాగౌత్సాహికులన్న మాట. యధాలాపంగానూ యాదృఛ్ఛికంగానూ బ్లాగులు చదివేవాళ్ళ రాసేవాళ్ళ అభిప్రాయం ఇందులో గణనకి రావట్లేదు. అలా జనబాహుళ్యంలో తెలుగు బ్లాగులకి ఎంత ప్రాచుర్యం వచ్చిందో తెలుసుకునే అవకాశం లేదు. కేవలం మూషికం నొక్కుల్ని బట్టి అత్యుత్తమ బ్లాగుల్ని ఎంచుదామా అంటే .. అది మరీ అధ్వాన్నం. తేనెగూడులో ఈ అంశం ఉండేది కానీ నేను చూసినప్పుడల్లా ఆ లిస్టులో కనబడినవి, ఒకటి రెండు తప్ప, ఏదో ఒక కాంట్రవర్సీ వల్ల జనాల దృష్టికి వచ్చినవే కానీ, ఆ బ్లాగులో టపాలో ఏదో విలువ ఉండి కాదు. దానికంటే బ్లాగుల్ని సునిశిత దృష్టితో చదివే వాళ్ళ అభిప్రాయమే మేలు ఖచ్చితంగా. రానారె ప్రకటించిన పద్ధతి కూడా బావుంది - ప్రతిబ్లాగూ తనకెందుకు నచ్చిందో రెండు ముక్కల్లో రాశాడు.

నాకు అంత ఓపిక లేదు గానీ - ఈ టపా తయారు చేసేప్పటికే ఒక శలవురోజు ఉదయమంతా గడిచిపోయింది - కూడలి తెరిచినప్పుడల్లా వీళ్ళ దగ్గిర్నించి ఏవన్నా కొత్త టపాలు వచ్చాయా అని వెతుకుతాను.

ఈ బ్లాగుల్లో ఎప్పుడూ నిత్యకళ్యాణం పచ్చతోరణం
చరసాల అంతరంగం
శ్రీరాం సంగతులూ సందర్భాలూ
రానారె
లలిత ఓనమాలు
చావా కిరణ్ ఒరెమూనా
సౌమ్య
సత్య శోధన
విహారి
నాగరాజా తెలుగు నేల
జేప్స్
దిల్
తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి కలగూరగంప
వెంకట్ ఇరవై నాలుగు ఫ్రేములు
ఎన్. వేణుగోపాల్ కడలితరగ

ఈ బ్లాగర్షులు ఇంకొంచెం తరచుగా రాస్తే బాగుణ్ణనిపిస్తుంది
నాగరాజు గారి సాలభంజికలు
స్వాతికుమారి
చదువరి
త్రివిక్రం అవీ ఇవీ
రాధిక స్నేహమా
సిరిసిరిమువ్వ
రెండురెళ్ళు ఆరు
రవి వైజాసత్య

ఈ మధ్యనే మొదలు పెట్టినా వన్నె కలిగి వాసికెక్కినవి
రాకేశ్వరుడి ఋౠ
నువ్వుసెట్టి సోదరులు

వూకదంపుడు
లలితాస్రవంతి

సిరి తలపు
పూలవాన
వికటకవి
రమ మనలో మనమాట

చివరిగా ఒక మాట: నా ఈ టపాకి సమాధానంగా .. "నాబ్లాగు మీ పట్టీలో పెట్టినందుకు ధన్యవాదాలు", "ఇంత చెత్త బ్లాగు మీకెలా నచ్చిందసలు, మీకింతకంటే మంచి టేస్టుందనుకున్నానే" - ఇలాంటి వ్యాఖ్యలు రాయడం అనవసరం. అంతకంటే తెలుగు బ్లాగుల వాసి (క్వాలిటీ)ని పెంచడానికి సూచనల్ని ప్రతిపాదించి చర్చిస్తే చాలా సంతోషిస్తాను.

తానింత శ్రమ తీసుకుని నన్నింత శ్రమ పెట్టిన వీవెనుడికి మరోసారి అభినందనలతో ..

Comments

rākeśvara said…
గురువుగారూ, నాకు చాలా అన్యాయం చేసారు :)
ఌౡ లను మరచిపోయారు, నాకైతే ఎడమకంటిలో పొడిచినట్లయ్యింది :)
అలానే నాది కొత్త బ్లాగన్నారు, కానీ నాది ౨౦౦౫ అక్టోబరు నుండే ఉందని గమనించాలి, నేను చాలా పాతవాడినే...
చావా గారి క్విట్ ఆంగ్లం మూమెంట్ లో జేరి బ్లాగార్పితం చేసినవాడిని :)
Anonymous said…
మాస్టారూ,

ఈ సందర్భంగా మన వాళ్ళందరూ మీ బ్లాగుల్ని భక్తి శ్రద్ధలతో చదవుతున్నారని అర్థం అయ్యింది. ఈ సంవత్సరానికి అత్యంత పాపులర్ బ్లాగు మీదే అనుకుంటాను...
అచ్చుల బ్లాగుకి బెర్తు దొరకకపోయేటప్పటికి బాధ వేసింది,పోన్లే ఆర్.ఎ,సి. లొ ఉంటుంది అని అనుకొన్నాను, కాని ఆర్.ఎ.సి లొ కూడా అవకాశం దొరకక వెయిటింగ్ లిస్ట్ లొ చేరింది.
రాకేశ్వరా! చేసినపాపం చెబితే పోతుంది .. RTS లో ఌౡ ఎలా రాయాలో నాకు చేతకాదు. లేఖిని చతురస్రంలో కూడ లేదు - అదీ సంగతి.
నాగరాజా! మీ నిర్ధారణకి ఆధారమేవిటో నాకు అర్ధం కాలేదు.
మాటలబాబు గారు! మీ రైల్వే భాష కొంచెం కూడా బుర్రకెక్కలేదు.
మంచి పద్యాల లింకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు అచ్చుల బ్లాగు = రాకేశ్వర్ గారి బ్లాగు. రాకేశ్వర్ గారికి మీరు గురువు గారు అయితే మా గురువుగారు రాకేశ్వర గారు తెలుగు వికీపీడియా లొ ఌ ౡ పడతాయి లింకు తీసుకోండి paDataayi liMku tIsukOMDi http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82
GKK said…
మీ లిస్టులో నా బ్లాగు లేనందుకు నిరాశ చెందాను. కానీ అన్ని బ్లాగులు చదవి దెబ్బలు (hits) వెయ్యటం మాననండోయ్.--అమృతవర్షిణి కిరణ్
Anonymous said…
కొత్తపాళీ గారు, మీరు ఒక హల్లు పారేసుకున్నారు. వట్టి ఊకే, వూక కాదు. నా అంగ్లభాషాపాటవం వల్లా, ఇంగ్లిషు 'O' సున్నను పోలివుండటం వల్ల, సున్నాతో మొదలుపెట్టటం ఎందుకని 'v' వేశాను. ఎందుకైనా మంచిదని తెలుగు బానర్ కి ఆడ్రిచ్చాను, కొన్నాళ్లాగండి. "బ్లాగటనికెందుకురా తొందరా, ఎదగ బ్లాగంతా చిందరవదర" అని ఆగాను కానీ గురువుగారు, లేకపోతే ఈపాటికి, ఊకగుట్ట ఎవరెస్టు ను తన్నేసేది.
Ramani Rao said…
ధన్యవాదాలండీ!! కొత్త పాళీ గారు!! మాటలు రావడం లేదు.. కూడలి లో మొదటి పది బ్లాగులలో నేను లేకపొయినా(రాకపొయినా) పర్వాలేదు... ఒక్కరు గుర్తించినా... చాలు... బాగా రాసామా లేదా అన్నది కాదు.. రాసినది ఎవరికన్న ఉపయోగ పడేలా వుందా లేదా అన్నది ముఖ్యం అని నా అభిప్రాయం.. ..
lalithag said…
రమ గారు,
మీ బ్లాగూ, తలపు కూడా నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. పైగా అప్పటికే పది కంటే ఎక్కువ రాసేసాను. పది కంటే కచ్చితంగా కొన్ని రెట్లు ఎక్కువే ఉన్నాయి మంచి బ్లాగులు.

బ్లాగులు పెరుగుతున్నాయి. చాలా మంది బాగా రాస్తున్నారు. చదవడానికి సమయం చాలటం లేదు. కొన్నింటిని ఎంచి, తప్పక చదవ దగ్గవి అని నిర్ణయిస్తే అవి చదివేసి మిగిలిన వాటికి వెళ్ళడం miss అయిపోతామేమో అన్న ఆలోచన కూడా రాయాలనుకున్నాను.

కొత్తపాళీ గారు ఈ పట్టీ తయారు చెయ్యడం గురించి రెండు వైపులా బాగా చెప్పారు. అదే నా అభిప్రాయమూను అని చెప్పడం తప్ప ఇంక ఎక్కువ చెప్పగలిగేది లేదు.

ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ఎన్నో కిటీకీలు తెరుచుకుంటున్నాయి బ్లాగులు చదువుతుంటే. రాయదల్చుకోవాలే గాని ఎంత బాగా రాయగలుగుతారు, భాష సమస్య కాదు, భావ వ్యక్తీకరణ కష్టం కాదు అనిపించేలా ఉంటున్నాయి.

దాదాపు ఒక ఏడాది పాటు బ్లాగులు అప్పుడప్పుడూ చదివే దాన్ని. రచ్చబండలో కిరణ్ గారి సందేశాలు చదివి బ్లాగుల గురించి తెలుసుకున్నాను. అప్పుడప్పుడూ కొన్ని వ్యాఖ్యలు రాసే దాన్ని. నేనూ రాయాలి అనిపించినా కొన్ని అనుమానాల వల్ల ఆగాను. రాయాలని ఉండేది కాని రాయలేను అనుకునే దాన్ని కూడా. బ్లాగులను పరిచయం చేసిన వారికి, తలుచుకోగానే బ్లాగు రాయడానికి ఉపయోగపడే లేఖిని వంటి ఉపకరణాలను తయారు చేసిన వారికి, కూడలి, జల్లెడ వంటి సమాహారాలకి(ఈ పదం సరైనదేనా) ధన్యవాదాలు చెప్పుకోవాలి అనిపిస్తోంది ఇప్పుడు.

ఏ మంచి అలవాటైనా మితి మీరితే వ్యసనమే అవుతుంది. అంతే కాని బ్లాగు రాయడాన్నే వ్యతిరేకించనక్కర లేదు. బ్లాగులు రాసే వారు చదవడం కూడా సమపాళ్ళలో కాని కొంచెం ఎక్కువ కాని చెయ్యడం కూడా మరవ కూడదని నాకనిపిస్తుంది.
వా వా..వా... నా బ్లాగులు ఎవ్వరికీ నచ్చటంలేదు. ఒక్కరు కూడా నా పేరు రాయలా! ఇలాగైతే నేను రాయడం మానేస్తా..సన్యాసం పుచ్చుకుంటానంతే.. బ్లాగులన్నీ కట్ట గట్టి అటకెక్కించి తీర్ధయాత్రలకు వెళదామనుకుంటున్నా...బై.......
Naga said…
మీ పాపులారిటీని చూసి ముచ్చట పడి అలా అనుకున్నాను మాస్టారూ. మీ దృష్టిలో పడిన ఆనందంలో తబ్బిబ్బైపోయి ఇక్కడ రాసాను :)
Madhu said…
మీ బ్లాగు లో వెతకండి, ఈ క్రింది ఫలితాలను గమనించండి.

http://www.gults.com/mini/te/search.htm?cx=011867517247898499319%3Aihag31htjkm&hl=te&cof=FORID%3A9&q=%E0%B0%AD%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82+site%3Akottapali.blogspot.com&site=kottapali.blogspot.com

మీ బ్లాగు కి ఈ శోధనను అనుసందానించండి పూర్తి వివరాలకు ఈ క్రింది బ్లాగు లో చూడండి.

http://gultus.blogspot.com/