జగమంత కుటుంబమా? మనసంత గందరగోళమా??

ఈ పాట విన్నాను. చక్రం సినిమా కూడా చూశాను. రెండూ పెద్దగా పట్టించుకోవలసిన విషయాల్లాగా అనిపించలేదు అప్పుడు. ఈ మధ్య వికటకవి బ్లాగులో "ఈ పాట నచ్చనిదెవరికి?" అనే రెటోరికల్ ప్రశ్న చదివినప్పుడు "నాకు!" అని సమాధానం నా మనసులో అసంకల్పితంగా మెదిలింది. దాంతో ఎందుకు నచ్చలేదని నాకు నేనే ప్రశ్నించుకున్నాను.

అలవోకగా పాట విన్నప్పుడు అంతర్గతంగా ఉన్న లయ కదంతొక్కే గతులతో ఆకర్షిస్తుంది. తీరికగా చదివినప్పుడు మాటల చమక్కులు కళ్ళు మిరుమిట్లు గొలిపి కాసేపు బైర్లు కమ్ముతాయి. కాస్త ఊపిరి బిగబట్టి లోపలికి తొంగి చూస్తే
పల్లవి
జగమంత కుటుంబం నాది - ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే
మ్మ్ .. బానే ఉందే. పరస్పరం వ్యతిరేకమైన ద్వంద్వాల్ని తనలో ఏకం చేసుకుని ద్వైతంలోనించి ఒక అద్వైత దృష్టి పుడుతున్నది .. ఆహా .. ఇదేదో మన బుర్రని సవాలు చేసి మేధకి పదునుపెట్టే వ్యవహారంలా ఉంది. బాగుంది. మరి తరవాత ..

చరణం
కవినై కవితనై - ఓహో, సృష్టికర్త తనే, తాను సృజించే ఊహ కూడ తనే - సరే
భార్యనై భర్తనై - ఇదేవిటి? Is the poet androgynous? అర్ధనారీశ్వర తత్త్వమా??
మల్లెల దారిలో మంచు ఎడారిలో - ??
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల - ??
నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ - ఆగండాగండి .. నాకేం అర్ధం కాలేదు. మల్లెల దారి మంచు ఎడారిలో ఉందా, ఇంకెక్కడైనా ఉందా? పన్నీటి జయగీతం ఏవిటి? ఎవరు పాడారు? కన్నీరు జలపాతం ఎందుకైంది? కవి కవితా, భార్యా భర్తా అన్నీ తానే అయినప్పుడు ఇంక జయగీతాలకీ, కన్నీళ్ళకీ తావేది? అవి ఎవరికి, ఎక్కణ్ణించి పుట్టుకొచ్చాయి? అనుగమించడంటే వెన్నంటి రావడం కదూ? నా"తో" నేను అనుగమించడం ఏవిటి, నన్ను నేను అనుగమించడం అనొద్దూ? భావం ప్రకారం తనకి తానే తోడు అనుకుందాం, ఓకే. మరి నాతో నేనే రమించడమేవిటి? androgynous అవడం సరిపోక సంభోగం కూడానా? హతోస్మి! నాకొక ఆంగ్ల పదబంధం మనసులో మెదుల్తోంది గానీ సభామర్యాద కాదని ఊరుకుంటున్నాను. సరే ఒదిలెయ్యండి, తరవాతి లైనేవిటో ..

ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం .. అయ్యా మాష్టారూ, అనవరతం అన్నా నిరంతరం అన్నా ఒకటే కదండీ?కలల్ని కథల్ని .. కావ్య కన్యల్ని, ఆడ పిల్లల్ని - ఓహో, తనకి లేకపోయినా పుట్టిన వాళ్ళకి లింగ భేదం ఉందన్న మాట .. అన్నట్టు ఇందాక కవిత కూడా నేనే అన్నట్టున్నారు, మరిప్పుడు పుట్టింది కావ్య "కన్య" ఎలాగైంది సార్?

ఈ ఉధృతం చూశాక రెండో చరణంలోకి వెళ్ళాలంటే భయమేస్తోంది కానీ ఒక్క సందేహం మాత్రం అడగకుండా ఉండలేక పోతున్నా - "కనరాని గమ్యాల కాలాన్ని కనడం" అంటే ఎవిటో?

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె - హమ్మయ్య, మొదటి రెండు చరణాల భీభత్సం తరవాత ఈ వరుస నిజంగానే పిల్లగాలిలా, గాలి పాటలా, పాట పాపలా ముద్దుగా ఆహ్లాదంగా ఉంది.
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె - ఆహా, కని పెంచిన కూతురికి పెళ్ళిచేసి అప్పగింత పెట్టి సాగనంపి వెనుతిరిగిన తల్లి మనసు తడి - సెబాషో!!
నా హృదయమే నా లోగిలి - ఇదేవిటి గుండె కాస్తా సంస్కృత గంధం పూసుకుంది అకస్మాత్తుగా?
నా హృదయమే నా పాటకి తల్లి - అయ్యా, ఇందాక అంపకాలు పెట్టినప్పుడే ఆ సంగతి అర్ధమైంది .. అవునూ హృదయం తల్లయితే మరి తండ్రి? ఆడక్కుండా ఉండటం బెటరేమో!
నా హృదయమే నాకు ఆలి - ఇందాక భార్యా భర్తా నేనే అన్నారు, మళ్ళీ ఇప్పుడు హృదయం నా భార్య అంటు .. ఓకే ఓకే, నోరు మూసేసుకుంటున్నా. ఇక చివరిలైను ..
నా హృదయములో ఇది సినీవాలి .. హబ్బ, తిప్పి తిప్పి ఏవి దెబ్బ కొట్టారండీ, దిమ్మ తిరిగిపోయింది!!

లయల జతుల గతుల చమత్కృతుల మోహ పాశంలోనించి బయటపడి ఈ పై పై అలంకారాల పొరల్ని వొలిచి పాటలోకి లోతుగా చూస్తే నాకు కనబడిందల్లా కొంత స్వాతిశయం, మరికాస్త ఆత్మాభిమానం, బోలెడు వాగాడంబరం. కొత్త ఆలోచన గానీ, పోనీ పాత ఆలోచననే కొత్తగా చెప్పడం కానీ లేవు సరిగదా, మొదణ్ణించీ చివరిదాకా అన్వయం కుదరని ఆలోచనలు, అసందర్భ ప్రయోగాలు, మాటల ఇంద్రజాలం - పైపూత పూసి ఇత్తడిని పసిడిగా భ్రమింప చెయ్యవచ్చు కానీ నిజంగా బంగారంగా మార్చలేము కదా. దానికి కెమిస్ట్రీ సరిపోదు - పరశువేదిని ప్రసాదించే ఆల్కెమీ కావాలి, తిలక్ చెప్పినట్టు.

మహాప్రస్థానానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ చెలాన్ని అడిగితే కవిత్వాన్ని తూచేందుకు తనదగ్గిర తూనిక రాళ్ళు లేవన్నాడు చెలం. తూచొద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ. మరి ఆ పని చెయ్యాలన్నా ముందసలు అర్ధమవ్వాలి కదా అంటాను నేను.

సెప్టెంబరు 30 న చేర్చిన కొసమెరుపు: ఈ నాణేనికి రెండో వేపు ఇక్కడ "సిరివెన్నల" కృష్ణమోహన్ గారి దృష్టిలో.

Comments

కొత్తపాళీ గారు,
నాకు దీని అర్థం తెలుసని గానీ అర్థం అయ్యిందని గానీ అనలేను గానీ నాకు మొదటి చరణంలో కవి స్పృషిస్తున్నది... ఈ అనంత విశ్వరూపాన్ని అనిపిస్తున్నది.

ఇక్కడ "తను" బ్రంహాండం, అనంత విశ్వం అనుకుంటే...
కవీ-కవితా అదే
భార్యా-భర్తా అదే (ఒకే జీవిలో ఆడా-మగా అవయవాలు వుండి పునరుత్పత్తి సామర్థ్యం వుండే జీవులున్నాయట గదా? మరయితే ఈ విశ్వాన్ని అలాంటి ఓ జీవితో పోల్చుకోవచ్చా!! ఏమో అయితే ఈ విశ్వం మరో విశ్వాన్ని సృష్టించదు కదా అని నాకే సందేహమొస్తోంది.)
మల్లెల దారి-మంచు ఎడారీ అదే (లేదా అదీ ఇదీ అందులోనే వున్నాయి)
పన్నీటి జయగీతాలు-కన్నీటి జలపాతాలు అందులోనే లేదా అదే
నాతో నేనే అనుగమిస్తూ-నాతో నేనే రమిస్తూ - బహుశా రెండో అంశములోని "నాతో నేను"కు లయ కుదరాలని మొదటే "నాతో నేనే" అన్నారేమొ!

ఇక రెండో చరణం జోలికి వెళ్ళదల్చుకోవడం లేదు. (అర్థం కాలేదు)


--ప్రసాద్
http://blog.charasala.com
ప్రసాదు గారూ, మధ్య మీరెందుకండీ కష్టపడ్డం - టపాలో నేనిచ్చిన లింకులో కవిగారే అరటి పండు వొలిచి నోట్లో పెట్టారు. నేనీ టపా రాశాకే ఆ వివరణ విన్నాను - నా విమర్శకి సమాధానం దొరకలేదు.
Anonymous said…
ముందు మీ ధైర్యానికి జోహార్లు. కళ్ళు మూసుకుని నలిగినబాటల్లో నడవడమూ, చిలకపలుకులు పలకడమూ అలవాటవుతున్న కొద్దీ సాధారణత్వమే మహాద్భుతంగా స్థిరపడే ప్రమాదంలోంచి ఇటువంటి టపాలే రక్షిస్తాయి. దురభిమానాలకి పోకుండా దేన్నయినా ప్రశ్నించి నిగ్గు తేల్చగలిగే అలవాటు పెంపొందు గాక!
అయ్యా,

క్షమించాలి. మీతో పోటీ పడేంతవాణ్ణి కాకపోయినా, నేను మీతో ఏకీభవించలేను కొన్ని విషయాల్లో. దుస్సాహసమేమో, అయినా రేపు ప్రయత్నిస్తాను నా వైపు వాదనతో. ఉంటాను.
Dil said…
నిజం చెప్పాలంటే, ఈ పాటను మీరు విశ్లేషించినంత లోతుగా నేను విశ్లేషించలేను. బట్ ఎందుకో ఆ పాట వింటుంటే అందులో నాకు అర్ధమైనంత వరకూ చాలా బాగా ఉందనిపిస్తుంది.

ఇప్పుడు వస్తున్న 'నన్ను చంపెయ్ రో, కొరికెయ్ రో" లాంటి పాటల మధ్య అంతో ఇంతో వినదగ్గ పాటలు రాస్తున్నాడు సిరివెన్నెల అనేదే నా అభిప్రాయం.
ఈ పాటకు సిరివెన్నెల ఇచ్చిన వివరణ - ఇక్కడ.
సిరి said…
ఇంతకు ముందొకరు చెప్పినట్లు, మీ ధైర్యానికి అభినందనలు.
ధైర్యమని ఎందుకన్నానంటే -
సిరివెన్నెల ఎన్ని గొప్ప పాటలు వ్రాసినా, ఎంతో గొప్ప కవిగా (సినిమా పాటల్లో కవిత్వం గురించి ఎవరైనా పరిశోధన చేసారా? ) చాలామంది గుండెల్లో స్థానం పొందినా - అసంబద్ధమైన పాటలు కూడా చాలానే వ్రాసాడనీ, ఆయన కూడా మనిషేనని, పైగా సినిమాలకు పాటలు మాత్రమే వ్రాస్తాడని కొంతమంది ఎందు చేతనో ఒప్పుకోరు! Ofcourse, every one has right to have their opinions!
ఈ యుగం నాది అని సగర్వంగా చెప్పుకున్న శ్రీశ్రీ గారు కూడా మహాప్రస్థానం తర్వాత చాలానే చెత్త పోగేశారు. అయినా ఆయన్ని మహాకవిగా గుర్తుంచుకునేందుకు సంశయించేవారు అతితక్కువ!!
వీడియోలో పాటకిచ్చిన వివరణ పాట కంటే గందరగోళంగా ఉంది. కాకపోతే, అర్థాన్ని భావాన్ని ఒకింత పక్కన పెడితే, వింటానికి పాట బాగుంది!
వ్యాఖ్యలు రాసిన వారందరికీ ధన్యవాదాలు. నా ధైర్యాన్ని మెచ్చుకోవటంలో మీ భావం అర్థమైంది కానీ ఆ అవసరమేమీ లేదని నా అభిప్రాయం. రాసింది ఎంత గొప్పవాళ్ళైనా రచనలో పస ఉందా లేదా అనేదే మనకి మార్గ దర్శకం కావాలి.
@రానారె - కవిగారి వివరణని నేను టపాలోనే ప్రస్తావించాను.
@వికటకవి - మీ వాదం కోసం ఎదురుచూస్తుంటను. దుస్సాహసమనే ప్రసక్తి లేదు.
@దిల్ - మీకా పాట నచ్చితే నాకేం అభ్యంతరం లేదు. దాన్ని గురించి మీరు నాకు గానీ మరొకరికి గాని సంజాయిషీ ఇచ్చుకోనక్కర్లేదు. ఏదన్నా (పాట, సినిమా, పుస్తకం) ఇష్టపడినప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నామో తెలుసుకోమని నా గోల.
@సిరి మరియు దిల్ - ఇక్కడ చర్చ ఆయన ఇదివరకు గొప్పగా రాశాడా, ఇతరులు చెత్తగా రాయలేదా అని కాదు. ఇది నా opinion విషయం కూడా కాదు - భావంలొ అన్వయంలో పాటలో ఎటువంటి లోపాలున్నాయో చూపించే ప్రయత్నం చేశాను. ఆందరూ ఇంత మెచ్చుకునే దాన్ని ఖండించడం నాకు సరదా కాదు.

చివరిగా ఒక మాట. "కవిత్వం కావాలి" అనే పద్యంలో త్రిపురనేని శ్రీనివాస్ అంటాడు ఫుట్‌నోట్‌లూ కుండలీకరణాలూ కవిత్వం కాదు అని. ఒక పాట రాసి - అభిమానులు ఇది మాకు అర్థం కాలేదు మహాప్రభో అంటే - ఆ పాట గురించి అరగంట ఉపన్యాసం, వివరణ ఇవ్వడం నాకు హాస్యాస్పదంగా ఉందిkanipistOMdi.
అయ్యా, ముందే చెప్పినట్లు నేనేదో పెద్ద పండితుణ్ణి కాదు. కాని, నే రాసే ఈ అభిప్రాయాలకు అంత పాందిత్యమూ అవసరంలేదేమో కూడా. ఏమైనా తప్పులున్నచో మన్నించగలరు.

1) "భార్యనై భర్తనై" ఇక్కడ నాకు తెలిసి నేనే ఆడ నేనే మగ అని అంటున్నాడు కవి. కవినై కవితనై కి పొడిగింపుగా (అవసరమా అంటే, అది వేరే సంగతి)

2) "మల్లెల దారిలో మంచు ఎడారిలో"
"పన్నీటి జయగీతాలా కన్నీటి జలపాతాలా " కవిగా తన జీవన పయనంలోని సుఖదు:ఖాలు అని అన్నాడు కదండీ! ఎవరు పాడారు ఆ గీతాలు, ఎందుకొచ్చాయి ఆ కన్నీళ్ళు అన్నవి ఇక్కడ అప్రస్తుతమేమో?

3)"నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ" రమించడం, ప్రేమించడం ఒకే అర్థం ఇచ్చినప్పుడు "నాతో నేను రమిస్తూ" అన్న మాట నన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న అర్థమే సూచిస్తుంది కదండీ? కవిగా తన భావాల తాలూకు అనుభూతుల్ని తనకు తానే (తనతో తానే) అనుభవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అనటం తప్పా? ఇక్కడ మీ ఆగ్రహానికి కారణం నాకు బోధపడలేదు?

4) "ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం "
ఇక్కడ నిరంతరం రెండు సారులు వాడాడు కవి. ఒంటరినై కంటున్నాను నిరంతరం కన్న ప్రాస కోసం ఒంటరినై నిరంతరం కంటున్నాను నిరంతరం అన్నాడు. కవిత్వంలో అది మామూలేకదా ఒకే మాటని పది సార్లు చెప్పటం?

5) "కనరాని గమ్యాల కాలాన్ని కనడం"
నాకైతే దీనర్థం "కలల్లో నేను భవిష్యత్తు ని చూస్తున్నాను అంటున్నాడు" అనిపించింది. ఇదసలు సమస్యే కాదనిపించింది.

6) "ఇదేవిటి గుండె కాస్తా సంస్కృత గంధం పూసుకుంది అకస్మాత్తుగా" నాకు తెలిసి ఆయన తనని అచ్చ తెలుగు కవిగా చెప్పుకోలేదు. అయినా హృదయం లాంటి పదాలు తెలుగులో వాడే విధానం చూస్తే (సినిమాల్లో గాని, కవితల్లో గానీ), ఇది తెలుగు పదం కాదా అనే వాళ్ళెక్కువుంటారేమో?

7) "నా హృదయమే నా పాటకి తల్లి - అయ్యా, ఇందాక అంపకాలు పెట్టినప్పుడే ఆ సంగతి అర్ధమైంది .. అవునూ హృదయం తల్లయితే మరి తండ్రి? ఆడక్కుండా ఉండటం బెటరేమో!
నా హృదయమే నాకు ఆలి - ఇందాక భార్యా భర్తా నేనే అన్నారు, మళ్ళీ ఇప్పుడు హృదయం నా భార్య అంటు .. ఓకే ఓకే, నోరు మూసేసుకుంటున్నా. ఇక చివరిలైను .."

మీ వ్యాఖ్యల్లో నన్ను బాగా ఇబ్బంది పెట్టిందిదే. ఎందుకంటారా, మీరలా పద విచ్చేదనం చేస్తూ అర్థాలు వెదికితే, ఈనాటి కవిత్వం అనబడే పదాల సమూహంలో 90% కపిత్వమే ఉంటుంది. అదీగాక, అసలు ఏకవీ పూర్తిగా 100% అర్థం కవిత్వంలో చెప్పడు కదా? కవిత్వంలో గొప్పదనమూ అదేగదా? చాల వరకు "ఖాళీలు పూరింపుము" లాగా వదిలేస్తారు కదా? ఆ దిశగా ఇలాంటివి తీసుకోవచ్చును కదా?

ఇక "లయల జతుల గతుల చమత్కృతుల మోహ పాశంలోనించి..." అంటారా, అది కరక్టే. కానీ అవన్నీ తీసేస్తే, నేను మళ్ళీ ఈ పాటని వింటానా? ఏమో .... వినొచ్చు, వినలేకపోవచ్చు.


చివరగా, నాకు వీరు చుట్టం కాదండోయ్. ఏదో, నాకు నచ్చిన చాలా పాటలు ఆయన కలం నుంచి జాలువారాయన్న చిన్న బలహీనత తప్ప మరేంలేదు. మరో మాట, కొత్తపాళీ గారు, మీ పుణ్యమా అని ఓ కవి ని మొదటి సారి ఇంత నిశితంగా పరిశీలించాను. కృతజ్ఞతలు.
"...........ప్రాగ్దిశ వీణియ పైన...దినకర మయూఖ తంత్రుల పైన....జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైన................." లాంటి పాటలో నాలాంటి వారికి ఒఖ్ఖ ముక్క అర్థం కాకపోయినా గాఠ్ఠిగా ఓ విజిలేసి పాట సూపరు అనలేదా. ఈ పాట విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది అని నా అభిప్రాయం. "నాలో నేనే !@#$" అంటూంటే మన సిరివెన్నల ఉద్దేశ్యం - భావం అర్థం కాలేదు. ఇదింతే...సిరివెన్నెల వ్రాస్తే బాగుంటుందంతే అని సరిపెట్టుకున్నాను. మానసిక శాస్త్రంలో దీన్ని "ఎక్పోసర్ యెఫెక్ట్" (the tendency for people to express undue liking for things merely because they are familiar with them.) అంటారు అనుకుంటా.
దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ చదవండి: http://en.wikipedia.org/wiki/Mere_exposure_effect

(ఇందుకే నాకు వికీ నచ్చేది...నాకు తెలిసిన ఏ పదం వెతికినా తప్పకుండా వ్యాసం అందులో ఉంటుంది)
నవీన్ గారు,

మీరు చెప్పింది కరక్టే. కొందరు ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. కొందరు ఏమీ చెప్పకపోతే బాగుంటుందనిపిస్తుంది. ఈ "ఎక్పోసర్ యెఫెక్ట్" ఏమిటో నేనూ చదువుతాను.
@వికటకవి - మిత్రకేసరీ, "ఓలమ్మీ తిక్కరేగిందా" పాటని తీసుకుని ఇందులో నన్నయాదుల కవిత్వపు ఒరవడి లేదు అని వాదించేంత అవివేకిని కాను. ఈ పాటలో ఆయన ఆలోచనా ధోరణి ఏవిటో చూచాయగా ఊహించాను. ఆయన ఇచ్చుకున్న వివరణ విన్నాక నా అవగాహన సరైనదే అని తేల్చుకున్నాను. నా గొడవల్లా ఆ అన్వయం కుదరట్లేదు అనే. మీరొక మంచి మాటన్నారు - ఏకవీ పూర్తిగా 100% అర్థం కవిత్వంలో చెప్పడు కదా? - కోట్లకి విలువైన మాట. ఐతే మంచి కవిత్వానికి ఉండాల్సిన మిగతా లక్షణాలు ఫలించినప్పుడే ఈ గుప్తత శోభిస్తుంది. ఇంకొక్క మాట - ఈ పాటకి జరిగిన ప్రచారము, వచ్చిన ప్రశంస వల్లనే దీని గురించి ఇంత ఆలోచించి ఇంత రాయాల్సి వచ్చింది. ఏదో లొల్లాయి పదమైతే అసలు గొడవేముంది?
కవిత్వాన్ని ఆస్వాదించడం ఎలాగో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే ఇది చదవండి.
http://canopusconsulting.com/salabanjhikalu/?p=26
వీలైతే ఆ పరంపరలోని వ్యాసాలన్నీ చదవండి.
@ నవీన్ - ఇందులో పెద్ద అర్థం కాపోటానికి ఏవ్హీ లేదు.
నీలాకాశం స్టేజి మీద (వినీల గగనపు వేదిక పైన) తూర్పు దిక్కు (ప్రాక్+దిశ) వీణ మీద (వీణియ పైన) సూర్య కిరణాలు అనే తీగల మీద (దినకర మయూఖ తంత్రుల పైన) అప్పుడే మేల్కొన్న పక్షుల గుంపులు (జాగృత విహంగ తతులే) పాడుతున్న కిలకిల ధ్వనుల సంగీతం (పలికిన కిలకిల స్వనముల స్వరజతి) ఈ జగానికి (జగతికి) మొదలు కాగా (శ్రీకారము కాగా) ఈ సృష్టి అనే కావ్యానికి (విశ్వ కావ్యమునకు) ఒక విఅవరణ లాగా (ఇది భాష్యముగా) నేనే బ్రహ్మనై (విరించినై) రాశాను (విరచించితిని) ఈ కవిత్వాన్ని(ఈ కవనం), వీణనై వినిపిస్తున్నా (విపంచినై వినిపించితిని) ఈ పాటని (ఈ గీతం).

"ఇదింతే...సిరివెన్నెల వ్రాస్తే బాగుంటుందంతే అని సరిపెట్టుకున్నాను."

I got you! :-)
@వికటకవి -
"కొందరు ఏం చెప్పినా వినాలనిపిస్తుంది."
- ఔను నిజం :-)

"కొందరు ఏమీ చెప్పకపోతే బాగుంటుందనిపిస్తుంది."
- ఇది కూడా నిజమే!
సినిమా పాటల్లో సాహిత్యాన్ని బేరీజు వెయ్యటం గురించి ఆసక్తి ఉన్న వారు ఈ టపానీ దానికింద వ్యాఖ్యల్నీ చూడండి.
http://pradeepcr.blogspot.com/2007/05/1-2-www.html

అప్పటికి మీ ఉత్సాహం చచ్చిపోకపోతే ఇది కూడా చూడండి :-)
http://telpoettrans.blogspot.com/2007/07/blog-post.html

ఇంక నేను నోరు మూసేస్తున్నా. గప్చుప్.
విహారి said…
కొత్తపాళి గారూ,

ఇంతకీ మయూఖ అంటే ఏంటి? మీరిచ్చిన నిర్వచనం లో అది సరీగా కనిపించలేదు అనుకే అడిగా :-)


-- విహారి
@విహారి -
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=mayukha&display=utf8&table=brown
నేను కేసరినీ కాను, వ్యాఘ్రాన్ని కానండి. మామూలోణ్ణే. కాస్త ఆలస్యంగానైనే మీబోటి వాళ్ళుండే ఓ మంచి గుంపులో పడ్డాను. మీరిచ్చిన లంకెల్లోకి త్వరలో వెళ్తాను.
కొత్తపాళీ గారు,
మీ నోటంట మీకు నచ్చిన ఒక సిరివెన్నెల పాట వినాలనుంది. ఎందుకు నచ్చిందో కూడా దయచేసి చెప్పండి.

--ప్రసాద్
http://blog.charasala.com
@ప్రసాద్ - సిరివెన్నెల సినిమాలోనే "ఆదిభిక్షువు వాడినేది కోరేది" లో శివుడి మీద నిందాస్తుతి (తిడుతున్నట్టు పొగడ్డం) బాగుంటుంది. సింహాద్రి సినిమాలో "అమ్మైనా నాన్నైనా" కూడా బావుంటుంది - పర్టిక్యులర్ గా "సూరీడుకి నాన్నుంటే, స్కూల్లో పెడతానంటే" అనే వరుస కితకితలు పెడుతుంది. నేను పనిగట్టుకుని సినిమా పాటలు వినను - ఎప్పుడైనా ఇలా బ్లాగుల్లో, యూట్యూబులో నా దృష్టికి వచ్చినవేవీ నాకు పెద్ద గొప్పగా అనిపించలా.
ఈ పాట చుట్టూ ఉన్నభావం (సిరివెన్నెలగారిచ్చిన వివరణ) వలన, ఆ భావాన్ని ఒక సినిమా ద్వారా వ్యక్తీకరించేందుకు జరిగిన ప్రయత్నం వలన మాత్రమే ఈ ప్రచారము ప్రశంసలు వచ్చాయి. ఈ పాటకు ప్రాచుర్యం తెచ్చినవారు, ప్రశంసించినవారూ గొప్ప కవులేంకారనుకుంటాను. కానీ ఈ పాటను ఆయన ఏ నేపథ్యంలో రాశారో, ఎందుకు సినిమాలో ఇమడదనుకున్నారో, రమించడం అంటే సంభోగించడం కాదని, ఆ పదం గతంలో ఒకచోట ఎలా ప్రయోగింపబడిందో వివరించిన ఆ ఇంటర్వ్యూ చూసికూడా అలాగే విమర్శిస్తూ దీన్ని శల్యపరీక్షకు పెట్టారంటే మీ ఉద్దేశం నాకర్థంకాలేదు గురువుగారూ.
@రానారె - రాయడంలో నా ఉద్దేశం ఏవిటి అనే కంటే ఏమి రాశాను, రాసిందాంట్లో పాయింటుందా అని ప్రశ్నించుకుని ఆలోచిస్తే నీకూ నాకూ కూడా ప్రయోజనం ఉంటుంది.
అబ్బా, ఉద్దేశం అనే పదంతో దొరికిపోయాను, సరేనండి, రమించడమనే ప్రయోగాన్ని సంగంమించడం అనే రూఢి అర్థంలోవాడలేదనీ -- ఆనందించడం, ఆనందింపచేయడం అనే అర్థంలో "రమింపజేయువారెవరురా రఘువరా" అని త్యాగరాజు వాడినట్లు ఉదహరిస్తూ వివరణ ఇచ్చారు సిరివెన్నెల. దీన్ని పక్కనబెట్టి, రూఢి అర్థాన్నే తీసుకొని వ్యంగ్యంగా విమర్శించారు మీరు. "భార్యనై భర్తనై" అన్న పదాల దగ్గర "is the poet androgenous?" అని ప్రశ్నించారు. అర్ధనారీశ్వరం అనే కాన్సెప్టు ఉందికదా, దానిగురించి మాట్లాడేవారు androgenous అవుతారా? ఇలా రాయటంలో పాయింటేమిటి ప్రయోజనమేమిటి అనేది ఆలోచిస్తున్నాను. ఈ విమర్శకు సమాధానంగా అన్నట్లు అదే వీడియోలో చివరి మూడు నిముషాల్లో సిరివెన్నెల మాటలున్నాయి.
నీలాంటి శిష్యులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనే పైన నాగరాజుగారి సాలభంజికల వ్యాసం రిఫర్ చేశాను. విమర్శలో సంధించే అనేక అస్త్రాల్లో వ్యంగ్యం కూడా ఒకటి. అలా రాయడంలో ఉద్దేశం, కోరే ప్రయోజనం ఈ పాటనే కాక ఇతర పాటల్ని (సినిమాల్ని, పద్యాల్ని, పుస్తకాల్ని - దేన్నైనా) కూడా జనాలు కొంచెం సునిశిత దృష్టితో చూడ్డం, లోతుగా ఆలోచించడం చేస్తారని.

పై పై విషయాల్ని పక్కన పెట్టి అసలు విమర్శని చూడు - అక్కడ రమించడానికి (బై ద వే, ఆయన ఆ త్యాగరాజ కృతిని కూడా తప్పు కోట్ చేశాడు) ఏ అర్థం చెప్పుకున్నా పెద్ద వొరిగేదేం లేదు - ఆ చరణం మొత్తంలో అన్వయం కుదరకపోవడమే మిగిలింది
teresa said…
@ranare - The word is 'Androgynous', not androGENOUS.
meaning Hermaphrodite.
Thank you, Teresa. ఎంత వరకూ ఢీకొట్టగలనో చూద్దామనుకున్నాను. నేను సరిపోనని తొందరగానే తెలిసిపోయింది. స్వల్పమైన నా జ్ఞానం అల్పజ్ఞానం అనిపించుకోకముందే తప్పుకుంటున్నాను. :)
కొత్తపాళీ గారు, అందరూ మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడిగారు. మీరు కూడా అంతే ఉత్సాహంగా జవాబిచ్చారు. నేను అడిగేది ప్రశ్న కాదు కానీ, అభిప్రాయం. ఇంతకు ముందెపుడో నాకు చాలా బాగా నచ్చిన సీతారామశాస్త్రి పాటను బ్లాగాను ఇక్కడ: http://gsnaveen.wordpress.com/2006/10/05/lazy_fellow/

దీని మీద మీ అభిప్రాయం వినాలని ఉంది :)
http://gsnaveen.wordpress.com/2006/10/05/lazy_fellow/

(ఇంతకు ముందు లింకు సరిగ్గా వచ్చినట్టు లేదు)
నవీన్ - మీరు ఆ టపా రాసినప్పుడే చూశానది. ఆ సినిమా కూడా అంతకు కొద్ది కాలం ముందే మరోసారి చూశాను. మీరన్నట్టు టైటిల్సు పడుతుండగా రావడంతో పెద్దగా పట్టించుకోలేదు. పాటని విడిగా చదివితే గొప్పగా ఏం లేదు గానీ, ఆ సీన్‌లో సందర్భోచితంగా ఉంది - టైటిల్సు పూర్తయ్యే టైముకి రాజేంద్ర ప్రసాద్ బలవంతంగా నిద్ర లేవటంతో కలిసేట్టు బాగా తీశాడు.
ఇళయరాజా సంగీతం, వంశీ అధ్బుత చిత్రీకరణ లేకపోతే ఆ పాటకు ప్రాణమే లేదు. వంశీ సినిమాకు ప్రారంభం పలికే విధానం, హడావుడిగా కదిలిపోయే పాత్రలు భలే నచ్చుతాయి. ముఖ్యంగా "చెట్టు క్రింద ప్లీడరు" ఐతే చెప్పనవసరం లేదు. తమాషాగా మొదలయ్యి, సస్పెనులో పెట్టి, ఉత్కంఠతను రేపి, ఆసక్తిగా ముగుస్తుంది.
కొత్తపాళీ గారు,

మీ అభిప్రాయం మీది --మిమ్మల్ని ఒప్పించాలి అని నాకు ఏ కోశానా లేదు. సో,carry on..........
shanmukhan said…
--- ఒక పాట రాసి - అభిమానులు ఇది మాకు అర్థం కాలేదు మహాప్రభో అంటే - ఆ పాట గురించి అరగంట ఉపన్యాసం, వివరణ ఇవ్వడం నాకు హాస్యాస్పదంగా ఉందిkanipistOMdi.
---

అర్థం కాని వాటికే వివరణ ఇవ్వాలి. అర్థం అయిన వాటికి వివరణ ఎందుకు?
మీ ఉద్దేశ్యం పాట అందరికీ అర్థం కావాలి అనా?
అందరికీ అర్థం అయ్యిందే పాట కావాలా?
అన్నీ మనకు అర్థమయ్యేలా రాస్తే మనం ముందుకు పోలేము. అర్థం కాని వాటిని కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడే మనం ముందకు పోగలం(ఎవరి నుంచైనా తెలుసుకొని లేదా ఇంకెలాగైన్....).

మీరు మధ్య మధ్య లో ఇంగ్లీషు వాడితే లేని తప్పు, తెలుగు పాటలో సంస్కృత పదం వస్తే తప్పా?

మీ ఈ వ్యాఖ్య చదివి వ్రాయలనిపించింది వ్రాశాను.
తప్పులుంటే క్షమించండి.

షణ్ముఖన్.
Mauli said…
సినిమా లో వినేవరకూ ఈ పాట నచ్చ లేదు. సినిమా చూశాక వాయిస్ నచ్చి౦ది. ఇక సిరివెన్నెల గారి వివరణ నచ్చక విమర్శి౦చబోయి నేనే విశ్లేషణ వ్రాసుకొన్నాను :)రాస్తూ ఉ౦టే నచ్చేసి౦ది .

మీకు సమాధాన౦ కనిపిస్తు౦దని ఆశిస్తాను

http://mtarigopula.blogspot.com/2009/10/blog-post_21.html
mauli గారు, మీ వ్యాఖ్యకి సంతోషం. ఈ పాట గురించి నాకేమీ అయోమయం లేదు. నాకు పాట బాగానే అర్ధమయింది. మీ విశ్లేషణ ఇదివరకే చూశాను.