కథలు ఎలా రాయకూడదు?

మనం చదివే ప్రతి కథా బ్రహ్మాండం కాక పోవచ్చు కానీ కొన్ని కనీసార్హతలు ఉండాలని కోరుకోవడం అత్యాశ కాదనుకుంటాను. కాస్త మంచి కథ చదవాలని తాపత్రయ పడే ఒక పాఠకుడిగా మాట్లాడుతున్నానే గాని నేను సాహిత్య సిద్ధాంతాల్ని విశ్లేషించబోవట్లేదు.
ఈ మధ్యన రెండు అంతర్జాల పత్రికల్లో రెండు కథలు చదివాక నాకెందుకు అరికాలి మంట నెత్తికెక్కిందని ఆలోచిస్తే ఈ కనీసార్హతలు స్ఫురించాయి.

1. భాష మీద గౌరవం: రచయితకి ఉన్న ఒకే ఒక ముడి పదార్ధం భాష. రచయిత బాబు సొమ్ము కాదు ఆ భాష - దానికి ఒక స్వంత ప్రాణం ఉంటుంది. ఒక స్వరం ఉంటుంది. దాన్ని గుర్తించటం, గౌరవించటం రచయిత మొదటి కర్తవ్యం. అనవసరపు కామాలు, అడ్డదిడ్డంగా వాక్యాల నిర్మాణం కథాగమనానికి నిరంతరం అడ్డం పడుతుంటాయి. అక్కడక్కడా సాఫీగా సాగిపోయినట్టు అనిపించినా ఒక్క క్షణం ఆగి ఈ వాక్యానికి అర్థం ఏవిటని ఆలోచించి చూడండి - సరైన సమాధానం దొరికితే ఒట్టు.
2. భాష మీద పట్టు: కొన్నాళ్ళ క్రితం నందిని అని ఒక కథ వచ్చింది. దానికి ఏవో పోటీల్లో బహుమతులొచ్చాయి, దాని మీద బోలెడు చర్చ జరిగింది. ఆ కథ చివర్లో రచయిత "చెలియలి కట్ట" అనే మాటని అసందర్భంగా వాడారు. ప్రముఖ కవీ విమర్శకుడూ వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒక విమర్శ రాస్తూ ఈ అసందర్భ ప్రయోగాన్ని చేటలో వేసి చెరిగి వొదిలి పెట్టారు. రచన అంటే మాటలతోనే కదా పని? వాడుతున్న మాటలకి అర్థాలే తెలియక పోతే? ఇంక ఆ కథలో రసమేమి పుడుతుంది? తాళంచెవుల గుత్తి గుమ్మటంలా ఉంది అంటే అర్థం తెలుసా మీకు?
3. పాత్రలకుండాల్సిన స్వేఛ్ఛ: పాత్రలంటే రచయిత బానిసలు కాదు. పాత్రకి రచయిత చెయ్యాల్సిందల్లా - కథకి అవసరమైన మట్టుకి - ఒక వ్యక్తిత్వం ఇచ్చి వాళ్ళ మానాన్న వొదిలెయ్యడమే - అంతే చెయ్యాల్సింది. చెయ్యి పట్టుకుని నడిపించ కూడదు, చెవి మెలేసి గుంజీళ్ళు తీయించ కూడదు. విటుడైనవాడు భావుకుడు కాకూడదనేం లేదు - కానీ రచయిత చెప్పదల్చుకున్న కథలో ఆ విటత్వానికీ ఆ భావుకతకీ ఏమీ పొంతన లేదు. ఇంకా ఆ భార్యామణి గారేంటి - ఆమె సంగతి అసలు ఎత్తకుండా ఉంటే బెటరు.
4. పాఠకుల మీద గౌరవం: ఇది అన్నిటికంటే ముఖ్యం. రచయితకి కలం (పోనీ కీబోర్డు) ముట్టుకోగానే వీరావేశం వచ్చేస్తుంది - తనకి తెలిసిందంతా చెప్పెయ్యాలని, తన తెలివితేటలన్నీ గుప్పించెయ్యాలని. బాధ్యత తెలిసిన రచయిత ఈ పైత్యాన్ని తమాయించుకుని పాఠకుల తెలివికి కూడ కాస్త గౌరవం ఇస్తాడు.

నాకు చిర్రెత్తించిన ఆ కథలు ఇవి: అతి సర్వత్ర ..., ఇద్దరు దుర్మార్గులు

Comments

padma i. said…
చిత్రం, ఏప్రిల్ 2007 సుజనరంజని ఏడిటర్లలో మీరొకరు. :-) "అతి సర్వత్ర.." కథ అర్థాంతరంగా ఆగిపోయినట్లుంది.
నా బ్రౌజర్లు (ఫైర్ ఫాక్సు, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు ) రెండింటిలో ఈ కథ వడ్లమాని వారి కోడలు పేరాగ్రాఫుతో ఆగిపోతోంది.
(అతి సర్వత్ర వర్జయేత్ అని పత్రిక వారే గుర్తించి కథని మధ్యలో ఆపేసి ఉండాలి. :-)) BTW, "నందిని" కథ ఇంతకు
ముందు ఈమాటలో ప్రచురించబడింది. ఈ కథ 2003 తానా కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథల్లో
ఒకటి. ఈ కథ(ల) మీద సమీక్షలు కూడా అదే సంచికలో ఉన్నాయి.
కే.వీ. గిరిధరరావుగారు రాసిన మరొక సమీక్ష కూడా అదే సంచికలో ఉంది.
"అతి సర్వత్ర వర్జయేత్ అని పత్రిక వారే గుర్తించి కథని మధ్యలో ఆపేసి ఉండాలి. :-)"
బాగా చెప్పారు :-))

"చిత్రం, ఏప్రిల్ 2007 సుజనరంజని ఏడిటర్లలో మీరొకరు. :-)"
ఐతే? కథని విమర్శించకూడదా?
ముందుగా కొత్తపాళీ గారికి ధన్యవాదాలు
కథ ఏలా రాయాలో చెప్పి ఔత్సాహికులకు blue print ఇచ్చినందుకు.

పాత్రలకు వ్యక్తిత్వం లేని ఆ కథ కు ఏ ప్రాతిపదిన award వచ్చిందో అర్ధం కాలేదు...
@ లలిత - ఎవరికి ఎవార్డొచ్చింది? నందిని కథ గురించా మీరు మాట్లాడేది? నందిని కథలో మెచ్చుకో దగిన అంశాలు చాలానే ఉన్నై - ముఖ్యంగా నాయిక నందిని వ్యక్తిత్వం. ఆ కథ వెలువడిన కొత్తలో దాన్ని సమీక్షిస్తూ "నందిని లాంటి వ్యక్తి నాకు నిజజీవితంలో తారస పడితే అటువంటి ఆమె నా స్నేహితురాలైతే నేను చాలా గర్విస్తాను" అని రాసుకున్నాను. ఆ కథ గురించి నేను ప్రస్తావించింది - రచయితకి వాడే మాటల అర్థం తెలిసి వాడాలని ఉదహరించడానికే.

మిగతా రెండు కథలకీ, నాకు తెలిసి, ఎవార్డులేం రాలేదు.
"రచయితకి ఉన్న ఒకే ఒక ముడి పదార్ధం భాష. రచయిత బాబు సొమ్ము కాదు ఆ భాష" అరికాలిమంట ఎంత తీవ్రమైందో ఈ వేడిచూస్తే తెలుస్తోంది. :)
మనం రోజూ మాట్లాడే భాషలో ఒక వాక్యాన్నెలా రాశామో చూసుకోకుండా తెలుసుకోకుండా పత్రికలకు పంపించేయడం, ఆ పత్రికల సంపాదకులు, నిర్వాహకులు దాన్ని అలాగే ప్రచురించెయ్యడం చూస్తే మరోమారు ఆవైపు వెళ్లబుద్ధి కాదు. "పాత్రలకుండాల్సిన స్వేచ్ఛ" అనే మాటకు అర్థాలు తెలియాలంటే "పైత్యాన్ని అదుపులో పెట్టుకోవడం" తెలిసి ఉండాలేమో. భాష మీద పట్టులేకపోయినా పాండితీప్రకర్షము చేయాలనుకోకపోతే చాలు ఆ కథ బాగుంటుంది - అనుకుంటాను. ఏమంటారు?
జగదీష్ దారా said…
:-))"చిత్రం, ఏప్రిల్ 2007 సుజనరంజని ఏడిటర్లలో మీరొకరు. :-)"ఐతే? కథని విమర్శించకూడదా?

విమర్శించ కూడదు అనలేను గానీ, ఎడిటర్ గా ఉండి కూడా అరికాలి మంట నెత్తికెక్కించే కథను అసలు ప్రచురించకుండా ఉండొచ్చు లేదా కథకులతో కథను తిరగరాయించి ప్రచురించవొచ్చు. కాదంటారా?!
- జగదీష్ దారా
Sowmya said…
kottapali gariki

meeru raasindi chaduvutuntene artham aindi...andulo oka katha "iddaru durmargulu" ani :) Hmm... rendo katha nenu chadavaledu kane... ee katha ki sambandhinchi naakunna abyantaraalu naavi.. ayite... naakunna agnaanam valla naku naccaledemo kaabolu... ani anukunnaa appatlo daniki nenu chadivina rojuna vaccina bagumdi bagumdi anna kaamentlanu chusi.
జగదీష్ దారా said…
కొత్తపాళీ గారు,

నా కామెంటును (ముందు రాసింది) తీసేద్దామని చూసాను కానీ కుదరలేదు. అక్కడున్న అంత మంది ఎడిటర్లలో మీరొకరు కాబట్టి, మీకు నచ్చకున్నా మీరు పెద్దగా చేయగలిగినదేమీ ఉండదనిపించింది, కామెంటు రాసాక! ఇప్పుడిప్పుడే బ్లాగులు చూడ్డం...అందుకే మీ బ్లాగు చదివి ఆవేశంగా కామెంటు రాసి, తర్వాత ఇలా నాలుక కరుచుకున్నా :-)

జగదీష్ దారా
netizen నెటిజన్ said…
నాకు చిర్రెత్తించిన ఆ కథలు ఇవి: అతి సర్వత్ర ..:
"అతి సర్వత్ర.." మూడవ వాక్యం దాటనివ్వలేదు, మీరన్నట్టు, "రచయితకి కలం (పోనీ కీబోర్డు) ముట్టుకోగానే వీరావేశం వచ్చేస్తుంది -", చదువరికి కూడా ఒక బుర్ర వుంటుందని వారికి తెలియదు. కోపం కాదు, జాలి పడాలి వారి మీద!
netizen నెటిజన్ said…
ఇది మూడవ వాక్యం (..చదవనివారికోసం..ఆ లింక్ దాకా వెళ్ళకుండా ఆపుదామని..)"లయబద్ధంగా వినిపించే ఆ తాళాల గుత్తి శబ్దం, ఆమె ఎక్కడుందో, ఎంత దూరంలో ఉందో చక్కగా అనువాదం చేస్తుంది."

శబ్దం దూరాన్ని అనువదిస్తున్నదట.ఇంకా మీకా కధ చదవాలనిపిస్తున్నదా?

ఇదివరలో "డబ్బింగ్" నవలలు చూసేవుంటారు, ఇప్పుడు అనువాద చిత్రాలు చూస్తున్నారుగా?
@ సౌమ్య - కొందరు జనాలకి నచ్చినంత మాత్రాన చెత్త కథ మంచి కథ కాదు. టేస్టు అనేది వ్యక్తిగతం - దాన్ని బట్టి నచ్చడం నచ్చకపోవడం ఉంటాయి. రచన మంచిదా చెడ్డదా అనేది వ్యక్తికి అతీతం. అందుకే మనం ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం - ఇవి పట్టించుకోవాలి.

@ జగదీష్ గారు - ఆ కథల్ని నేను విమర్శించినట్టే మీరూ నను విమర్శించొచ్చు - మీరు రాసినదాంట్లో తొందరపాటూ ఏమీ లేదు. వాదన వ్యక్తిగతం కానంతవరకూ అందరికీ ఉపయోగపడుతుందనే నేననుకుంటాను. మీరు రెండో కామెంటులో ఎడిటర్ నిజ స్థితిని బానే కనిపెట్టారు.

@ నెటిజెన్ - బాగా చెప్పారు :-))
అందుకనే మీ శిష్యరికం చేరింది. :)
కందం వ్రాసినవాడే కవి, పందిని చంపినవాడే బంటు అన్నారు. కందాన్ని ఎట్లాగూ వ్రాసాను, ఎన్నాళ్ళ నుండో కథానికి వ్రాయాలని తలపెట్టాను. కాని నా ఆంగ్ల మాధ్యామం తెలుగు అవరోధిస్తుంది.
ఈ టపాని మళ్ళీ చదువుతా, ఇంకా సూచనలుంటే తెలుపగలురు.
కృతజ్ఞతలు