హేరీ పాటర్లో ఏముంది?

టిప్పింగ్ పాయింట్ అని ఒక పుస్తకముంది, మాల్కం గ్లాడ్వెల్ అనే అతను రాశాడు - ఆలోచనలు, ఉద్యమాలు, ఫేషన్లు - విషయం ఏదైనా ఎట్లా అది అశేష జనాన్ని ఉర్రూతలూగించే స్థాయికి చేరతుంది అనేది ఆ పుస్తకంలో చర్చించాడతను.
హేరీ పాటర్ పుస్తకాల పరంపర జనాన్ని కేవలం ఉర్రూతలూగించడమే కాదు ఒక ప్రభంజనమే అయి కూర్చున్నదివ్వాళ.

హేరీ పాటర్లో ఏముంది ప్రపంచ వ్యాప్తిగా ఇంతమంది జనాన్ని ఆకట్టుకోవడానికి? ఏమన్నా ఉందా అసలు? లేక ఇదంతా మార్కెటింగ్ మాయేనా?

మొన్ననే ఏడో పుస్తకం చదివిన శుభసందర్భంలో ఒక సారి వెనక్కి తెరిగి చూసుకుని - ఈ పరంపర నాకెందుకు నచ్చిందో నెమరు వేసుకుంటున్నాను.

సృజనాత్మకత: మన ప్రపంచంతో సమానాంతరంగా వర్ధిల్లుతున్న ఒక మాయా ప్రపంచాన్ని ఊహించడం. ఆ మాయా ప్రపంచం "ఏదైనా జరగొచ్చిక్కడ" అనేలాంటి కలల ప్రపంచం కాదు, దానికుండే సూత్రాలు, నియమాలు దానికున్నై. అందరూ మాంత్రికులే ఐనా అందరు మాంత్రికులూ అన్ని పనులూ సమాన ప్రతిభతో చెయ్యలేరు. ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.

మరి కొన్ని తమాషా అంశాలు -
* పిల్లమాంత్రికుల కోసం ఒక బడి - అందులో ఉండే నియమాలు, పిల్లలు చదివే పాఠ్యాంశాలు, వాళ్ళకొచ్చే పనిష్మెంట్లు, ఎసైన్మెంట్లు, పరీక్షలు, పోటీలు
* ఒక మంత్రి, ఒక సచివాలయము, దాని శాఖలు
* రవాణా - ఫ్లూ నెట్వర్కు, చీపుళ్ళు, అంతర్థానం, బస్సు, కొండొకచో ఎగిరే కారు, బైకు
* ఇతరాలు - గుడ్లగూబల తపాలా సర్వీసు, బొమ్మల్లో మనుషులు కదలడం, 9 3/4 ప్లాట్‌ఫాం, మొ.
* క్విడ్డిచ్ - enough said


పాత్రలు: ముఖ్య పాత్రలన్నీ తమవైన వ్యక్తిత్వాలతో నమ్మదగినట్టు ఉన్నాయి.

తప్పు చేసినంత మాత్రాన పిల్లలు చెడ్డవాళ్ళు కాదు - ఆ తప్పుల్నించే పిల్లలు నేర్చుకుంటారు అనే నమ్మకం మూర్తీభవించిన గురువు ఆల్బస్ డంబుల్‌డోర్.

తను చేసిన ప్రమాణానికి కట్టుబడి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి అతీతంగా, ధైర్యంగా పనిచేసిన దీక్షాపరుడు సెవెరస్ స్నేప్.

తానెవరో తనకే తెలియని స్థితిలో తలతిరిగే ప్రఖ్యాతీ తలకి మించిన భారమూ తలమీద పడినా - అప్పుడప్పుడూ దిక్కుతోచని అయోమయం కలవరపెట్టినా - ఉన్న బలాన్ని ఉపయోగించుకుని గమ్యాన్ని చేరుకున్న నాయకుడు హేరీ పాటర్.

తమ స్నేహితుడికి అన్ని వేళలా తోడు నిలిచిన నెవిల్, హర్మయనీ, రోనల్డ్.

అతిహీన స్థితినుండి లేచి, కేవలం తన శక్తియుక్తులతో మంత్రతంత్రాల్లో గొప్ప విజయాలు సాధించినా, ప్రపంచాన్ని తన పాదాక్రాంతమొనరించుకున్నా, జీవితంలో ప్రేమించడమే అతిగొప్ప బలం అని తెలుసుకోలేక నశించిపోయిన విలన్ టాం రిడిల్ ఎలియాస్ లార్డ్ వాల్డ్‌మోర్ట్.

ముఖ్యమైన సహాయక పాత్రలు వీస్లీ కుటుంబం, సహాధ్యాయులు, ఉపాధ్యాయులు, మాంత్రిక మంత్రి - ప్రతి ఒక్కరూ ఒక విశిష్ట వ్యక్తిత్వంతో నిలబడేవారే.

విలువలు: అక్కడక్కడా గట్టిగా నెత్తిన మొట్టికాయ వేసి చెప్పినా, నీతులు విలువలు వంటి విలువైన జీవిత పాఠాలు కథలో అంతర్గతంగా ఒదిగి ఉన్నై.
మనకి ప్రముఖంగా కనపడేది స్నేహం విలువ. పదకొండేళ్ళ వయసులో మొదటిసారి బడికెళ్ళడానికి రైలెక్కినప్పుడు కలుసుకున్నప్పుడు మొదలైన హేరీ రాన్ హర్మయనీల స్నేహం, ఎదురైన ప్రతి సమస్యతోనూ ఇంకా బలపడి చివరి పుస్తకంలో వాళ్ళు ఒకరి మీద ఒకరు instinctiveగా ఆధారపడే స్థాయికి ఎదుగుతుంది.

ఇంకా సాహసం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, పట్టుదల, సాధన, అపోహలని అధిగమించడం, ... ఇలా ఏడు పుస్తకాల్లోని ప్రతి ముఖ్య సంఘటన నించీ ఏదో ఒక మంచి విలువ బయటపడుతూనే ఉంది.

కథనం, కథాగమనం: ముఖ్య పాత్రలైన హేరీ, లార్డ్ వాళ్డ్‌మోర్ట్, డంబుల్డోర్ల వెనుక కథలు, వారి మధ్య ఉత్పన్నమైన సంక్లిష్ట త్రికోణ సంబంధాన్ని అంచెలంచెలుగా ఏడు సంపుటాల్లో, ఎక్కడా కథామర్యాద చెడకుండా క్రమంలో ఆవిష్కరించడంలో రౌలింగ్ ప్రతిభ కనిపిస్తుంది. ప్రతి పుస్తకం చదివినప్పుడూ దాని కథనంలో కథాగమనంలో విమర్శించడానికి చాలా విషయాలో కనిపిస్తై - అక్కడక్కడా బోరు కొట్టిందనో, మరీ పొడుగ్గా ఉందనో, ఇట్లా .. కానీ ఏడు పుస్తకాల మీదా మూల కథ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందని చూసుకుంటే ఎంత విమర్శకులైనా సంతృప్తితో తలపంకించక తప్పదు.

ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన ఇంత వెల్లువ వచ్చేస్తుందా? ఇంత హడావుడీ ప్రభంజనమూ అవసరమా?

అక్కడే - టిప్పింగ్ పాయింట్ పుస్తకంలో చెప్పిన నాలుగు కీలకమైన అంశాలు పనిచేశాయని నా నమ్మకం.


Comments

చాలా ఉపయోగకరమైన పుస్తకాన్ని పరిచయం చేశారు. కృతజ్ఞతలు
http://en.wikipedia.org/wiki/The_Tipping_Point_(book)
Anonymous said…
I didn't read Harry Potter till now, the way you narrated the whole theme & characters is attracting me towards reading it... I appreciate...
S said…
Tipping Point is a very well-written book. The same author wrote another book called - "Blink" which is about split-second decisions.... it is also a book worth "studying". Good to see this post..as cine abhimani said...you are attractng me towards potter.... :)
మీరు నాలాగా హేరి పోట్టర్ అభిమాని అని తెలిసి బాగా ఆనదంగా ఉంది. మీరు చెప్పిన నాలుగు విషయాల గురించి నేను అంగీకరిస్తాను. రోలింగ్ రచనా శైలి, హాస్యం పండించడం, అనూహ్యమైన కథ, కథనం పట్టుకొమ్మలు అని నేను అనుకుంటాను. నాకు ఎందుకు నచ్చిందో చెప్పటం ఒక టపా అవుతుందేమో
RG said…
Potter for President :)
mohanraokotari said…
vinadame pillalu chustunnaru kada vaari taram ani seriou ga pattinchu ko ledu , artha mayye taatu chepparu santhosham.
భావన said…
చాలా బాగా చెప్పేరు మీరు చెప్పిన ప్రతి దానికి తలకాయ తెగ వూపేసేను... అంతే అంతే అంతే...
నేను మొదటి నవల/సినిమా చదివి, చూసి చాలా సంతోషపడ్డాను, నేను చిన్నప్పుడూ ఇలాంటి విచిత్రమైన వూహలెన్నో చేసే దాన్ని, మా ఇల్లు ఎగురుతున్నట్లు, చీపురు కట్ట మీద ఎగుర్తున్న మాంత్రింకులను చూసినట్లు, మళ్ళేమో గోడలోనుంచి వెళ్ళినట్లు ఇట్లా ఏవేవో ఆలో చించుకుంటూ వుండే దాన్ని.. అవి అన్ని పిక్చర్ రూపం లో చూడాటం ఎంత బావుందో నాకైతే...
కాని ఏడవ పుస్తకం నవల అంతటిని తీయలేక పోయారు సినిమా గా అనిపించింది. నవలలో వర్ణనలు ఇంకా బాగున్నాయి, డంబుల్డోర్ చనిపోయినప్పుడు బాగా తియ్యలేదనిపించింది పుస్తకం తో పోల్చుకుంటే...