పద్యాల మణిహారం

1993 - 1994 ప్రాంతాల్లో అనుకుంటా నాకు ఈ మెయిలు వాడకం మొదటి సారిగా తెలిసింది. దాంతో పాటే uunet newsgroups కూడా పరిచయమైనాయి. మొదట్లో soc.culture.indian అని ఉండేది. మన తమిళ సోదరులు, మరాఠీ సోదరులు, ఇతరత్రా సోదరులు తమ తమ గుంపులు ఏర్పాటు చేసుకోవడం మొదలయ్యి , మన వాళ్ళు కూడా మాకో గుంపు కావాలని ఉద్యమించి soc.culture.indian.telugu ని మొదలెట్టారు. దీన్నే ముద్దుగా స్కిట్ అని పిలుచుకునే వాళ్ళం. ఈ గుంపులో బలే మంచి సందడిగా ఉండేది. సందేహాలు అడగటాలు, తీర్చటాలు, ఇతరుల తప్పులు దిద్దటాలు, తెలుగు రాజకీయ మరియూ సినిమా వార్తలు, సాహిత్య చర్చలు, వాదోపవాదాలు , జ్వాలా యుద్ధాలు (flame wars) .. మధ్య మధ్య శాన్ ఫ్రాన్సిస్కో నించి హైదరబాదు వెళ్ళేందుకు మా అమ్మకి తోడు కావాలని వేడికోళ్ళు .. ఇలా. ఈ సందర్భంలోనే మనం ఇప్పటికీ వాడుతున్న RTS పుట్టింది - పేజీలకి పేజీలు తెలుగుని ఆంగ్ల లిపిలో రాసేవాళ్ళం, చదివే వాళ్ళం. ఈ గుంపులోనే ఎంతో మంది పండితులు విద్వాంసులైన వారి పరిచయ భాగ్యం కలిగింది. సమకాలీనులు కూడా చాలా మంది స్నేహితులయ్యారు.

అంతర్జాలం ఈ బాల్యస్థితిలో ఉండగానే తెలుగు ప్రభంజనం సృష్టించిన ఆద్యుల్లో డా. పిల్లలమర్రి శివరామకృష్ణ గారు ముఖ్యులు. సహృదయులు, సరసులు, సాహిత్యంలో మంచి అభిరుచి ఉన్నవారు. వీరి టపాలన్నీ ఏదో ఒక చమత్కారంతో గిలిగింతలు పెడుతూ, ఒక్కోసారి పదునైన వ్యంగ్యంతో పొడుస్తూ ఉండేవి. తరవాతి రోజుల్లో స్కిట్‌లో పిచ్చిగోల ఎక్కువై సాహిత్య చర్చలకి వేరేగా తెలుసా గుంపు ఏర్పడడంలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు.

రామకృష్ణ గారు 1995 లో ప్రసిద్ధి చెందిన సీస పద్యాన్ని ఒక దాన్ని చెప్పమని సభ్యులతో ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాలివి.

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే, మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె, తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే , కుటజములకు?
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే, సాంద్ర నీహారములకు?
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి యితరంబు జేయ నేర్చు?
వినుత గుణ శీల, మాటలు వేయు నేల?
పోతన భాగవతము, ప్రహ్లాద చరిత్ర, 4 వోట్లు

కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ
నురికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదల
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ
గరికి లంఘించు సిమ్హంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖవృష్టి
దెరలి చనుదెంచు దేవుండు నాకు దిక్కు
పోతన భాగవతము, ప్రథమ స్కంధము, భీష్ముని పై దండేత్తే శ్రీకృష్ణుని స్తుతి - 2 వోట్లు

ఈ తరువాతి పద్యాలన్నీ ఒక్కొక్క వోటు సంపాయించుకున్నాయి.
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!
పోతన భాగవతము, ప్రహ్లాద చరిత్ర

పేర్వేర బొమ్మల పెండ్లిండ్ళు సేయుచు నబలల తోడ వియ్యంబు లందు
గుజ్జెన గూళ్ళను గొమరొప్ప వండించి, చెలులకు బెట్టించు జెలువు మెరసి
రమణీయ మందిరారామ దేశంబుల బువ్వుదీగెలకును బ్రోది వెట్టు
సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు
బాలికలతోడ జెలరేగి బంతు లాడు
శారికాకీర పంక్తికి జదువు సెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు
మద మరాళంబులకు జూపు మంద గతులు
పోతన భాగవతము, రుక్మిణీ కళ్యాణము, రుక్మిణి బాల్యము

ఘుమఘుమా రావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్ర భాగమగుచు
జటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానా విధ జంతు సంతాన యగుచు
జండ దిగ్-వేదండ తుండ నిభాఖండ వారి ధారా పూర్ణ వసుధ యగుచు
విద్యోత మనోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుద్ద్యుతి-చ్చటా విభవ మగుచు
నడరి జడి గురియగ నిను డస్తమింప
భూరి నీరంధ్ర నిబిడా-ంధకార మేచి
సూచికా-భేద్యమై వస్తు గోచరంబు
గాని యట్లుండ మనము నవ్వాన దడిసి
పోతన భాగవతము, కుచేలోపాఖ్యానము, కృష్ణుడు కుచేలుడు తమ విద్యార్ధి దశను గుర్తు తెచ్చుకొనుట

ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణ రజోరాజి నడగు
నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు
నెవ్వని కడకంట నివ్వతిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు
నెవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరి ప్రతాప మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుడు, కేవల మర్త్యుడె ధర్మసుతుడు!
తిక్కన భారతము, విరాటపర్వము, ద్రౌపది భీమునితో ధర్మరాజు గొప్పను చెప్పుట

రామకృష్ణగారి టపా నకలు ఇక్కడ చూడచ్చు.

ఆ రోజుల్లో ఈ టపా ఎంత ప్రసిద్ధి చెందిందంటే తొలితరం తెలుగు వెబ్ సైట్లలో పెట్టుకున్నారు. మచ్చుకి ఇదొకటి, ఇది ఇంకోటి.

స్కిట్ ఆర్కైవులు ఇక్కడ ఉన్నాయి.

తెలుసా ఆర్కైవులు ఇక్కడ ఉన్నాయి.

Comments

అవును ఆ గుంపు ఒక చాలా పెద్ద విజ్ఞాన భాండాగారం. నాకు ఈ గుంపు RTS ఎలా పుట్టిందో తెలుసుకుందామని వెతుకుతుంటే దొరికింది.
నేను statistical analysis చేసింది ఆ పద్యాలమీదే. హ గణం గురించి కూడా బాగా అవగాహన కుదిరింది, దాని మీద త్వరలో ఇంకో టపా :)
అన్నట్టు teluguworld మరియు sirigina లంకెలు చెడినవి, సరిదిద్దగలరు.
@ ప్రదీప్ - అవును, స్కిట్ మరియూ తెలుసాలో తెలుగు సాహిత్యానికి సంబంధించి బోలెడు సమాచారం ఉంది. స్కిట్ లో ఐతే ఆ కాలపు రాజకీయాలు, సినిమాల గురించి కూడా .. rec.music.indian.classical అనే గుంపులో శాస్త్రీయ సంగీతాన్ని గురించి మంచి వ్యాసాలు, సూచనలు ఉన్నాయి.

@ రాక్ అ - లంకెలు సవరించాను.
Sriram said…
మీరు సీసపద్యాల గురించిన సర్వేమొదలుపెట్టిన దగ్గరనుంచీ వాటికోసం ఉన్న పుస్తకాలన్నింటిలో ప్రత్యేకంగా వెతుకుతున్నాను. ఒక్కొక్క దానిలోనూ కొత్త కొత్త అందాలు పొడసూపుతున్నాయి చదివినకొద్దీ. చాలా థేంకులు!
padma i. said…
అబ్బ, ఆ లింకుల్నిచ్చి కొన్ని గొప్ప జ్ఞాపకాల్ని నిద్రలేపారండీ! :-)
teluguworld.org -- దీని అసలు పేరు telugu literary home page-- ని తయారు చేసింది-- drum roll please!-- ఈమాట సురేశ్ గారే! ఇది వెబ్బులో ఇంచుమించు మొదటి తెలుగు వెబ్ సైటు.
SCIT , దాని తోబుట్టువు telusA రెండు చిన్న సైజు సాహితీ సర్వస్వాలు. కానీ అందులో పాల్గోనేవాళ్లు
చాలా మంది (పరుచూరి గారు, కొలిచాల గారు, కొత్తపాళి గారు లాంటి కొందర్ని మినహాయిస్తే,) ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసేసారు.
Anonymous said…
ఈ అస్త్ర సన్యాసం చేసిన వారందరికీ మన బ్లాగాస్త్రాలు ఇస్తే వాటిని ఏ అగ్నేయాస్త్రాలుగానో వాయువ్యాస్త్రాలుగానో, సమ్మోహనాస్త్రాలుగానో వాడతారనుకుంటాను.
పేర్వేర బొమ్మల పెండ్లిండ్ళు సేయుచు నబలల తోడ వియ్యంబు లందు
గుజ్జెన గూళ్ళను గొమరొప్ప వండించి, చెలులకు బెట్టించు జెలువు మెరసి
రమణీయ మందిరారామ దేశంబుల బువ్వుదీగెలకును బ్రోది వెట్టు
సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు
బాలికలతోడ జెలరేగి బంతు లాడు
శారికాకీర పంక్తికి జదువు సెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు
మద మరాళంబులకు జూపు మంద గతులు
పోతన భాగవతము, రుక్మిణీ కళ్యాణము, రుక్మిణి బాల్యము ;
;
నాకు ఇష్టమైన పద్దెరాణి ఇది ; కృతజ్ఞతలు, మంగిడీలు ;
;
&
పోతన భాగవతము - దశమస్కంధం - లోనిది ఈ పద్దెం, కానీ ఎన్నో పద్యరాజమో మరి ....... !????