ముసిముసి నవ్వులు, హాహాకారాలు

ప్రేమించే పెళ్ళి చేసుకున్నా మొగుడూ పెళ్ళాలకి ఆత్మాభిమానాలు బిర్ర బిగుసుకుంటే ఇక ఆ సంసారం నవ్వులపాలవుతుందని "పెళ్ళైన కొత్తలో" ముసిముసి నవ్వుల్తో చెప్పింది. చక్కటి కథకి చక్కిలిగింతలు పెట్టే హాస్యాన్ని జోడించి చిక్కటి కథనంతో ఒక మంచి సినిమా మనకందించారు.

జగపతిబాబు మొహంలో నడివయసు కొట్టొచ్చినట్టు కనబడుతోంది - ఇక మీదట అతన్ని కుర్ర పాత్రల్లో నమ్మడం కష్టం. నాయిక ఎవరో "ప్రియమణి" ట - బాగా చేసింది. అసలీ మధ్య మన సినిమాల్లో కాస్త వ్యక్తిత్వం ఉన్న నాయిక పాత్రలేవీ? ఆ లెక్కన ఈ నాయిక పాత్రని బాగా మలిచినట్టే లెక్క. ఆ అమ్మాయి కూడా పాత్రకి న్యాయం చేసింది. మన సినిమాల్లో మామూలుగా సినిమా మొదటి భాగంలో నాయికలు ఎంత చిన్న గుడ్డ పీలికలు కట్టుకుని ఎలాంటి కోతి గంతులేసినా, "పెళ్ళి" అనంగానే చీరలు కట్టేసి ఒక ముత్తైదువల్లా నిలబెడతారు. పల్లెటూరి సన్నివేశాల్లో సందర్భోచితంగా తప్ప ఈ నాయికకి పెళ్ళైనా తన సహజ వేషధారణతో చూపించడం కొంచెం నమ్మేట్టుగా ఉంది.

నాయకుడికి లేని పురుషాహంకారాన్ని రగిలించి ఎగదోసే మిత్రుడిగా కృష్ణభగవాన్ రాణించాడు. అతని భార్యగా వేసినమ్మాయి - ఈమెని "క్షణం క్షణం" సినిమా నించీ చూస్తూనే ఉన్నాను, పేరు తెలీదు - చాలా సినిమాల్లో అక్క, వదిన, సహోద్యోగి పాత్రలు వేస్తూ ఉంటుంది - తనకి ఎంతో సామర్ధ్యం ఉన్నా కూడా భర్తకి అణిగిమణిగి ఉండే భార్యగా చాలా బాగా నటించింది. మొగుణ్ణి బానిసలా చూస్తూ, నాయికకి దాంపత్య పాఠాలు చెప్పే స్నేహితురాలిగా వేసినామె - ఈమె పేరు కూడా తెలీదు (ఇంతకు ముందు చూసిన గుర్తు లేదు) - మరీ బిగుసుకుపోయినట్టు ఉంది. గర్వంగా అతిశయంగా ఉండటమంటే కొయ్యముక్కలా బిగుసుకుపోవటం కాదు. సత్యభామ వేషంలో ఇదివరకు జమున, ఎస్. వరలక్ష్మి ల నటన చూపించి శిక్షణ ఇప్పించి ఉంటే బాగుండేది. ఆవిడ కొంగు చాటు మొగుడిగా సునిల్ నటన అద్భుతం. హాస్యనటనంటే ఏమాత్రం వ్యక్తిత్వం లేని వెకిలి పాత్రలు అన్నట్టున్న ఈ రోజుల్లో సునిల్ ఇలాంటి వైవిధ్యమున్న పాత్రని తీసుకుని పండించడం అభినందించాల్సిన విషయం. తాతయ్యగా కోట చాలా హుందాగా నటించాడు. బామ్మగా అలనాటి తార జయంతి చూడ్డానికి కొంచెం భయపెట్టేలా ఉన్నా నటన పరవాలేదనిపించింది.

మధ్యలో నాయికకి చిన్నప్పటి స్నేహితుడిగా ఒకతను ప్రత్యక్షమవుతాడు. అతనెవరో నృత్య దర్శకుడల్లే ఉంది, సాంబా నృత్యం బాగా చేశాడు. బ్రెజిలియన్ సాంబా, లాటినో సాల్సా నృత్యాలు మేళవించిన ఆ కొరియోగ్రఫీ, తగిన సంగీతాలు కలిసిన ఆ పాట (సంగీతం మాత్రమే - సాహిత్యం అసలు మాటలేమిటో అర్ధమై ఛస్తేగా?) బాగున్నాయి.

ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లో కలిసున్నప్పుడు పరస్పరం ఆకర్షణ రేకెత్తే సందర్భాలు ఎన్నో ఎదురౌతాయి. అమ్మాయి తలంటి పోసుకుని బాల్కనీలో నించొని జుట్టార బెట్టుకోవటం, అబ్బాయి చేతుల్లేని బనీను వేసుకుని వ్యాయామం చెయ్యడం వంటి సన్నివేశాలు మంచి కళాత్మక దృష్టితో, ఎక్కడా ఎబ్బెట్టు అనిపించకుండా, చక్కటి అభిరుచితో తీశారు. ఇక తాతయ్యా, బామ్మా తంత్రం చేసి ఈ మొగుడూ పేళ్ళాలని లిటరల్‌గా ఒక మూటన కట్టి పొర్లు దణ్ణాలు పెట్టించడంతో ఇది పరాకాష్ఠకి చేరుతుంది. నవరసాల్లో శృంగారం రసరాజం అన్నారు మన పెద్దవాళ్ళు. ఆ తరవాత జనరంజకమైనది హాస్యం - దర్శక నిర్మాతలు మదన్ ఈ రెండిటినీ తగు పాళ్ళలో మేళవించి మంచి రొమాంటిక్ కామెడీ మనకందించారు. వేణుమాధవ్, బ్రహ్మానందం, కోవై సరళల అసందర్భపు హాస్యం లేకపోతే బాగుండేది.

ఆడవారిమాటలకు అర్థాలె వేరులే - మతి పోగొట్టుకోవడాలు, జుట్టు పీక్కోవడాలు, హాహాకారాలు - enough said.
తుదిపలుకు: త్రిషని నాయికగా తెలుగుతెర కెక్కించిన వాళ్ళని కొరత వెయ్యాలి.

Comments

Sriram said…
గురువుగారూ...ఏమిటి కొత్త తెలుగు సినిమాలు చూడడం మొదలెట్టారా మళ్ళీ...కాస్త జాగ్రత్త!
రాధిక said…
ఆడువారి మాటలకు సినిమా ఆడాళ్ళకి తెగ నచ్చేస్తుంది అంత బాగుంది ఇంత బాగుందని చూసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు.ఓహో నిజమే ననుకుని ఎగేసుకుని వెళితే బుర్ర బద్దలు కొట్టుకోవాలనిపించే అంత బోర్ సినిమా. మీరిచ్చిన 2 వాక్యాల రివ్యూ చాలా ఎక్కువ దానికి.మీరన్నట్టుగా "పెళ్ళయిన కొత్తలో" వాస్తవానికి దగ్గరగా బాగా తీసారు మదన్.అందులో భర్తను ఆడించే భార్యగా వేసింది ఝాన్సీ.తను చాలా పేరు మోసిన బుల్లితెర యాంకర్.చాలా సినిమాల్లో కూడా చేసింది చిన్న [చిన్న వేషాలు]తన నటన నాకు బానే అనిపించింది.బహుసా మీకు ఆమె చేరెక్టర్ మీద వున్న చిరాకు వల్ల అలా అనిపించిందేమో?ఇక అణకువగల భార్య గా చేసిన ఆమె పేరు హేమ.ఈమె అంటే నాకు చాలా ఇష్టం.చాలా సహజం గా చేస్తుంది.అమె చేసిన వాటిలో బాగా గుర్తుండిపోయేవి నువ్వు నాకు నచ్చావ్,మల్లీస్వరి,అతడు...
అవునూ..కొత్త సినిమాలు చూడడం ఎప్పుడు మొదలు పెట్టారు?
తెలుగు సినిమాలు (పాత, కొత్త, మధ్య - అన్నీ) ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. చూసిన వాటిని గురించి రాయాలి అనే కోరిక మాత్రం మన 24fps వెంకట్ బ్లాగులు చదివాకే మొదలైంది. మన సినిమాల్ని గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? :-)

శ్రీరామా - తెలుగు సినిమా చూడ్డానికి సంకల్పించడమంటేనే ఆ కాసేపూ తల తాకట్టు పెడుతున్నామన్న మాట, ఎక వెరచేదేముంది :)

రాధికా - పాత్రధారిణుల పేర్లు చెప్పినందుకు థాంకులు. ఝాన్సీ వేసిన పాత్ర గురించి నే చెప్పింది మీరు అపార్థం చేసుకున్నారు. చిరాకు పాత్ర మీద కాదు, వేసినావిడ మీదే. హేమ నటన చాలా సినిమాల్లో చూసి ఆనందించాను.
Sriram said…
"తెలుగు సినిమా చూడ్డానికి సంకల్పించడమంటేనే ఆ కాసేపూ తల తాకట్టు పెడుతున్నామన్న మాట"
అదేకదా నా భయం. మీ తల/మెదడు పైన మాకూ కొన్ని హక్కులున్నాయి మరి!
రవి వైజాసత్య said…
స్వామీ, ఆడవారిమాటలకి అర్ధాలు... జుట్టుపీకుడని ముందే సెలవిస్తే కాస్త జుట్టైనా మిగుల్చుకునేవాళ్లము కదా..ఏం చేస్తాం బలైపోయాం! అవును మీరన్నట్టూ రాయకపోతే నాలాంటి వాళ్లు కొద్దో గొప్పో వచ్చే మంచి సినిమాలూ మిస్సయిపోతారు
@రవి - సమయోచిత హెచ్చరికలకి నా మీద ఆశ పెట్టుకోకండి. కొత్త సినిమాలు వచ్చిన వెంటనే చూడడం నాకు కుదరదు. తెలుగు సినిమాలకి పదేసి డాలర్లు పెట్టి హాలుకి పోయి చెత్త సౌండు, చెత్త కంపు, చెత్త చప్పుళ్ళ మధ్య చూడనని వ్రతం పట్టాను. డిస్కులేమో మా కొట్టువాడు కొత్తవి వెంటనే తిరిగి ఇవ్వాలంటాడు - నాకేమో వాటిని ఒక వారం రోజులు ఇంట్లో పెట్టుకుని ఊరించి ఊరించి చూసుకుంటే గానీ తృప్తిగా ఉండదు - వెరసి వాడు నాకు కొత్త సినిమాలు ఇవ్వడు. ఒక వేళ చూసినా అది బ్లాగేప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచేపోతుంది, బహుశా అప్పటికే మీరు బలైపోయి ఉంటారు.

ఏమాట కామాట, ఈ సినిమా విడదలైన కొత్తలోనే ప్రవీణ్ పాపం తన బ్లాగులో హెచ్చరించాడు. ఐనా చూశాం - masochism, I guess.
ఈ మధ్య కొత్త ట్రెండ్ కనిపెట్టాను. అదేమిటంటే, సినిమాలో కొంత భాగమే చూసి, కథను మా ఆవిడ ద్వారా వినడం. దీనిలో ప్రజ్ఞ సంపాదించాలంటే ఎప్పుడంటే అప్పుడు టీవీ ముందు నుండి లేచిపోగలగాలి.

ఉన్న కొద్ది పాటి వెంట్రుకలను కాపాడుకోవడానికే ఈ ప్రయత్నమంతా... :)
"చూసిన వాటిని గురించి రాయాలి అనే కోరిక మాత్రం మన 24fps వెంకట్ బ్లాగులు చదివాకే మొదలైంది. మన సినిమాల్ని గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? :-)"
బ్లాగ్విజయ ఉపాయం 10 నుండి ఉపాయం 8 కి దిగజారిపోయారా ?? :)
పైగా, జనాలు తెలుగు సినిమాలను పట్టించుకోవాల్సినదానికంటే ఎక్కువే పట్టించుకుంటున్నారని నా అభిప్రాయం. :))

@ रवि गारु
ప్రవీణ్ అఫ్పట్లో చెప్పనే చెప్పారు సినిమా పెద్ద యాక్ అని.
chaitanya said…
బామ్మ పాత్ర వేసిన ఆవిడ పేరు 'గీతాంజలి '
విహారి said…
ఎవరెన్నైనా చెప్పండి. నాకు మాత్రం ఆ.మా.అ.వే. నచ్చింది అక్కడక్కడా కొన్ని మిణాయిస్త. అదండీ సంగతి.

యాహూ... గట్టిగా అరిచి చెబుతున్నా :-)

-- విహారి
@ నాగరాజ - మీరదృష్టవంతులు. మా ఆవిడ కూడా ఏ సినిమా ఐనా పట్టువదలకుండా చివరిదాకా చూస్తుంది, కానీ సినిమా ఐపోయిన ఐదు నిమిషాల తరవాత ఆవిడకి ఏమీ గుర్తుండదు. సినిమాలో బోరు కొడితే మధ్యలో లేచి వచ్చెయ్యడం 1987 నించీ సాధన చేస్తున్నా :-)

@ రాక్ అ - పది నించి ఎనిమిదేంటి, దీనికి ముందు టపాతో (అన్నీ వేరే బ్లాగుల వాళ్ళకి లంకెలు పెట్టి) ఏకంగా ఆరుకి గెంతాను :-) మన జనాలు సినిమాల్ని పట్టింకోరు, హీరోలనీ, హీరోయిన్లనీ పట్టించుకుంటారు.

@ చైతన్య - అవును, ఆవిడ గీతాంజలే. థాంకులు.

@ విహారి - నిజంగా? ఐతే మీకు ఇప్పుడే ఈ సభా ప్రాంగణమందు "ఆంధ్ర వీర బోరు చిత్ర రసికాగ్రేసర చక్రవర్తి" అని బిరుదిస్తున్నాము.
"మన జనాలు సినిమాల్ని పట్టించుకోరు. హీరోలను, రోయిన్లను మాత్రమే పట్టించుకుంటారు." అని మీరన్నమాట విన్నాగానీ ....

ఈ ఫోటోలో ప్రియమణి భలేఉంది. పట్టించుకోక తప్పలేదు. సినిమా చూడలేదు. పట్టించుకోకపోవడంవల్లకాదుగానీ ఇక్కడ ప్రదర్శనకు రాలేదు
కిరణ్ said…
ఈ సినిమాలో ’సిరిసిరిమువ్వల్లే’ పాట చాలా బాగుంది గురువుగారు. 80 లలో ఇళయరాజాను తలపించింది. మీరు విడిగా ఈ పాట వినాలి.
ఈ సినిమా సంగీతదర్శకుడు కొత్తవాడు. విదేశాల్లోనే ఎక్కడో సంగీతం నేర్చుకున్నవాడు. ఇళయరాజా పద్ధతిలో ప్రతి ట్రాక్‌కూ నోట్సు రాసి, ఇళయరాజా అర్కెస్ట్రానే పిలిపించి వాయింపజేశాడట. తెలుగువన్ వారి పరిచయ కార్యక్రమంలో అనుకుంటాను, ఈ విషయాలు అతనే చెప్పాడు.
@ కిరణ్ - "ఈ సినిమాలో" అంటే ?? ఆడవారి మాటలకు .. లోనా?? విని చూస్తాను.


@ రానారె - "ఈ ఫోటోలో ప్రియమణి భలేఉంది. పట్టించుకోక తప్పలేదు."

నీకు పెళ్ళీడు వచ్చింది, తొందరగా పెళ్ళి చేసుకో అని మా ఉత్తమ అర్థభాగము గారు సెలవిచ్చినారు :-)
ఆహా! హహ్హహ్హ. అలాంటి పిల్లెవరైనా ఉంటే సాయంచేసి పుణ్యంకట్టుకొమ్మని మా గురుపత్నిగారికి మా విజ్ఞాపన. :)
మద్యలో వచ్చిన నృత్యదర్శకుడు రాజుసుందరం. ప్రభుదేవా సోదరుడు. జెంటిల్మన్ 'చికుబుకు రైలే' పాటలో రైల్వేకార్మికుడిగా, బొంబాయి 'అది అరబిక్కడలందం' పాటలోనూ ఉన్నాడు.