
టూకీగా: ఒఫీలియా తన తల్లి కార్మెన్ తో కలిసి తన స్వగ్రామం వదిలి మారుటి తండ్రి విడాల్ దగ్గరికి వెళ్తోంది. కార్మెన్ అప్పటికి నవమాసాల గర్భవతి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో స్పెయిన్ ఫాసిస్టు నియంత ఫ్రాంకో సైన్యంలో కెప్టెన్ విడాల్ తన దండుతో విప్లవకారులు సంచరించే ఒక అడవి దగ్గర చిన్న గ్రామంలో ముట్టడించి ఉన్నాడు. తన బలంతో క్రౌర్యంతో స్థానిక ప్రజలను భయభ్రాంతులని చేసి గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఈ స్థితిలో ఒఫీలియా తల్లితో అక్కడికి చేరుకుంది. మొదటిచూపులోనే ఆ పాపకి ఈ మారుటి తండ్రి క్రౌర్యం చూచాయగా అర్థమైంది. అతన్నించి దూరంగా ఉండటానికి చుట్టుపక్కలౌన్న వనాలలోకి వెళ్ళి చాలా సేపు గడుపుతోంది. ఒక సారి మేక తలకాయ ఉన్న ఒక విచిత్ర వ్యక్తి (ఇతనే Pan) తారసపడి ఆమె జన్మ రహస్యాన్ని చెప్పాడు. ఆమె నిజంగా వేరేలోకపు రాజకుమార్తె. శాపవశాత్తూ ఇక్కడ ఈ ఆపదలో చిక్కుబడిపోయింది. మూడు సాహసకృత్యాలు నెరవేర్చితే శాపం తీరి మళ్ళీ తన లోకానికి చేరుకో గలుగుతుందని చెప్పాడు. ఒఫీలియా అంగీకరించడంతో ఇక అద్భుతాలు మొదలవుతాయి. నిజజీవితంలో పరిస్థితులు నానాటికీ క్షీణించి పోతున్నాయి. ఒఫీలియా తల్లి ప్రసవ వేదనలో చనిపోయి పుట్టిన బిడ్డ మాత్రం బతికాడు. ఆ పసికందుని రక్షిస్తున్న డాక్టరుని, విద్రోహులకి సాయం చేస్తున్నాడనే అనుమానంతో కెప్టెన్ విడాల్ చంపేశాడు. చివరి సాహస కృత్యంగా Pan ఒఫీలియాని ఏం చెయ్యమంటాడు, ఒఫీలియా తన మాయాప్రపంచాన్ని చేరుకోగలిగిందా, కెప్టెన్ విడాల్ గతి ఏమైంది - ఈ ప్రశ్నలకి సమాధానం వెండితెరపై చూడవలసిందే.

ఈ సినిమా విజయానికి అద్భుతమైన సెట్టింగులూ, ఛాయాగ్రహణమూ ఒక కారణమైతే ఒఫీలియాగా ఇవానా బాఖెరో అనే చిన్నారి నటన ఇంకో కారణం. పాలుగారే బుగ్గలతో అమాయకత్వమూ తెలివితేటలూ సమపాళ్ళలో నిండిన కళ్ళతో మహాముద్దొస్తూ ఉండడం ఒక ఎత్తైతే, ఈ పాప నటనా చాతుర్యం ఇంకో ఎత్తు. ఈ సినిమాలో ఈమె ప్రతిభని పొగడ్డానికి నాకు మాటలు చాలట్లేదు. సిక్స్త్ సెన్సు సినిమాలో హేలీ ఓస్మెంట్ అనే పిల్లాణ్ణి చూసి ఆ రోజుల్లో ఇలాగే ముచ్చట పడ్డాను. వాడి తలదన్నేలా నటించింది ఈమె.
కౄరుడైన కెప్టెన్గా సెర్జి లోపెజ్, అతని దగ్గర దాసిగా పనిచేస్తూ విప్లవకారులకి చేయూతనిచ్చే వీరనారి మెర్సిడెస్ గా మారిబెల్ వెర్దు మంచి నటన అందించారు. ఈ సినిమా చూసి నాకు ఒక్కటే విమర్శ మిగిలింది - బాల్యాన్ని గురించి ఇంత చక్కటి సినిమా పిల్లలు చూడ దగినట్లుగా తీస్తే బాగుండేది. కథలో వచ్చే క్రౌర్యమూ, తీసిన పద్ధతిలో కొంత మితిమీరిన నలుపు ఛాయలూ ఈ సినిమాని పిల్లలకి దూరం చేశాయి. మీకు చందమామ కథలు నచ్చేవా? ఐతే ఈ సినిమా తప్పక నచ్చుతుంది.
Comments
అన్నట్టు
Guillermo ని గియ్యఱ్మొ అని పలుకుతారు.
నాకొక స్పెయిన మిత్రుడుండేవాడు. అతని పేరిదే, అతనో పది సార్లు చెబితే నాకు పలకడం తెలిసింది. ఆంగ్లంలో ఆ పేరునే William అంటారు. :)
ఒకానొక కాలంలో మంచి సినిమాల్ని థియేటార్లో, రిలీజయిన కొతల్లో చూసే అలవాటుండేది. ఇప్పుడంతా డిస్కులే. అంచేత కొంచెం లేటే మరి :-(
@రాకేశా - రెండు ఎల్లులని "య్య"గా పలుకుతారు కదూ, తెలుసు.
@ప్రదీపూ - ఇంకొన్ని సినిమాలతో కథలతో పోలిస్తే ఈ కథలో ఆ సరిహద్దు బాగానే స్పష్టంగా ఉంది అనిపించింది నాకు.
@క్రిష్ - చూడాలి.