మీకిష్టమైన సీసపద్యం

తెలుగు పద్య కవిత్వంలో సీస పద్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
వర్ణనలకి సీసపద్యం పెట్టింది పేరు.
మాత్రా ఛందస్సుతో ఏర్పడింది కాబట్టి ఈ పద్య పాదాల్లో ఒక నిర్దిష్టమైన నడక (pun intended) ఉంటుంది. అందులోనూ ఎక్కడ పదాల్ని విరవాలో తెలిసిన కవి చేతులో ఇంకా రసవంతంగా పడుతుంది.
ఎప్పుడో ఇంకా సాలెగూడు పుట్టని పాత రోజుల్లో, అమెరికా తెలుగు కురువృద్ధులు ఒకాయన ఈ మెయిల్లో ఒక సర్వే చేశారు - మీకిష్టమైన సీస పద్యం ఏది - అని.
కావ్యంలోది కావచ్చు, ప్రబంధాల్లోది కావచ్చు, చాటువు కావచ్చు, నాటకాలనుంచి రావచ్చు - చివరికి సినిమా కోసం రాసింది ఐనా సరే!
అదే ప్రశ్న ఈ నాటి బ్లాగ్లోక యువ తురుష్కులని (young turks :-)) మిమ్మల్నందర్నీ అడుగుతున్నా.
మీకిష్టమైన సీసపద్యం ఏది?
షరా 1: ఈ పద్యం నా కిష్టం, కానీ ఇది సీసపద్యమో కాదో తెలీదు అనుకునే వాళ్ళు ముందు ఆ పద్యాన్ని ఇక్కడ రాయండి. అది సీసమో కాదో తరవాత తేల్చుకోవచ్చు.
షరా 2: సీసపద్యమంటే ఏంటి అని అడిగే వాళ్ళు లక్షణపద్యాన్ని వందసార్లు తెలుగు imposition రాయాల్సి ఉంటుంది. పీకు-అతుకులు చెల్లవు.

Comments

Murali Nandula said…
నాకు ఇష్టమైన వాటిల్లో ఇది ఒకటి:

రచయిత: కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి)
సీ. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర, దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు, మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె, గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై, చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

తే.గీ ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను

సాంకా రమకృష్ణగారి వ్యాసం:

http://members.tripod.com/~rksanka/telugu/chandassu101.html
పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం లోని ప్రహ్లాద చరిత్రలో ఉండే సీస పద్యాలంటే నాకు చాలా ఇష్టం. అందులో ఉండే సీస పద్యాలన్నీ ఆణి ముత్యాలే. ముఖ్యంగా ప్రహ్లాదుడు తన తండ్రితో చెప్పేవయితే నోట్లో నానుతూంటాయి. వాటిలో ఒక్కటే ఎన్నుకోవాలంటే, ఈ పద్యాన్ని ఎన్నుకుంటాను.

మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునె కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు

అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు చేర నేర్చు
వినుత గుణశీల! మాటలు వేయు నేల
Sriram said…
హర్షగారు చెప్పినట్టు ప్రహ్లాద చరిత్రలోని పోతనగారి సీసాలు అన్నీ అమూల్య రత్నాలే...కమలాక్షు నర్చించు కరములు కరములు లాంటి పద్యాల విలువ కట్టలేం....
నాకు బాగా నచ్చినవి చాలా ఉన్నాయి కానీ నావంతుగా ఒక సీసపద్యం రుక్మిణీ కళ్యాణం నుండి...


ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
చక్షురింద్రియముల సత్వమేల?
దయత! నీయధరామృతంబానగాలేని
జిహ్వకు ఫలరససిద్ధి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?
నచ్చినది ఒక్కటే చెప్పమంటే చాలా కష్టమండి. పోతన, శ్రీనాధుడు రాసిన సీసాలన్నీ నాకు ఇష్టమైనవే.

ప్రస్తుతానికి మాత్రం నాకు ఇష్టమైన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది ఓ సీసం.

కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పింప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి

లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
ఇష్టమైనదేదో ఎంచుకొనే అవస్థపడేన్ని సీసపద్యాలు నాకు తెలియవు. తొమ్మిదేళ్ల క్రితం, మెడిసిన్ సీటు సంపాదించలేకపోయానని తెలిసిన తరువాత ఏర్పడిన శూన్యాన్ని పూరించడానికన్నట్టు పోతన భాగవతం పట్టి, బ్రౌణ్యం సహాయంతో ఆసక్తిగా చదివిన ప్రహ్లాద చరితం, గజేంద్రమోక్షం, రుక్మిణీ కల్యాణం వంటి కొన్ని భాగాలలో రుక్మిణి ఆందోళనను వర్ణిస్తూనే ఆమె ఎంత అందగత్తో నాకు చెప్పిన పద్యం ఇది. ఇది సీసం కాదు బంగారం. కాదనగలరా? దీన్ని నేర్చుకొని, మళ్లీ మరచిపోయాను కూడా. తప్పులు లేకుండా రాస్తాననే ధైర్యంలేక చూసి రాస్తున్నాను. అర్థం మాత్రం దాదాపుగా గుర్తుంది - ఎంత అందగత్తె అయుంటుందో కదా అని ఊహల్లోకి వెళ్లడంవలన.

సీ. మృగనాభి యలదదు మృగరాజమధ్యమ జలకంబు లాడదు జలజగంధి
ముకురంబు జూడదు ముకురసన్నిభముఖి పువ్వులు దురుమదు పువ్వుబోడి
వనకేళిగోరదు వనజాతలోచన హంసంబు బెంపదు హంసగమన
లతల బోషింపదు లతికా లతికదేహ తొడవులు దొడవదు తొడవుతొడవు

ఆ. తిలకమిడదు నుదుట దిలకినీతిలకంబు
గమల గృహము జొరదు కమలహస్త
గౌరవించి తన్ను గరుణ గైకొన వన
మాలి రాడు మగవుమాలి యనుచు.

మృగనాభి = కస్తురి
అలదదు = పూయదు, రాసుకొనదు
మృగరాజమధ్యమ = సింహపు నడము గలది.
జలజగంధి = తామరపూవు వంటి సువాసన గలది.
ముకుర సన్నిభ ముఖి = అద్దముతో సమానమైన ముఖముగలది.
పువ్వుబోడి = పూబోణి = సుందరకన్య.
వనజాతలోచన = లేడికన్నుల వంటి కన్నులుగలది(!?)
హంసగమన = నెమ్మదియైన నడక కలది.
లతికా లలితదేహ = లేతతీగవంటి సుందరమైన దేహముగలది.
తొడవుతొడవు = ఆభరణములకే అభరమమువంటిది(!?) (వహ్వా!).
తిలకినీ తిలకంబు = ?
కమలహస్త = కమలములవంటి కరములుగలది.
...గైకొన వనమాలి రాడు తగవుమాలి అనుచు... ఆటవెలది చివరలో ఒక చమక్కు.
This comment has been removed by the author.
చూసి కూడా తప్పురాశాను - ఆటవెలది చివరి పాదం ఇలా ఉండాలి: మాలి రాడు తగవుమాలి యనుచు.

"వర్ణనలకు సీసపద్యం పెట్టింది పేరు." అన్న మీ మాటకు ఈ పద్యం మంచి ఉదాహరణ.
అదేదో కథలో వంగ విత్తు జల్లితే లింగ నారు మొలిచినట్టు - నేనొక ప్రశ్న విత్తు నాటగానే సీసముల నారు కాదు ఏకంగా పంటే పండింది. బాగు బాగు. మందార మకరందాలూ, భక్తి మాధుర్యాలూ, వనమాలికా గంధాలూ, పుష్పాంజలులూ, అమృత ఝరులూ, వనజాత లోచనలూ - ఓహ్, అంతా సరస వచో శోభస్కరంగానూ సరస్వతీ ప్రసన్నంగానూ ఉంది. శ్రమతీసుకుని రాసిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా కురు వృద్ధుల సర్వేలో తేలిన పద్యాల్ని లేఖినిలో కూర్చటం కాగానే టపా వేస్తాను. ఈలోగా మీ మిత్రుల్ని కూడా కనుక్కోండి.
Anonymous said…
చిన్నప్పుడు ఎనిమిదో తరగతిలో కంఠస్థం చేసిన పువ్వు గుర్తు పద్యం. (దీనికి ఎక్కువ వోట్లు పడవనుకోండి,
అయినా ఈ పద్య నాకెందుకు నచ్చిందంటే, ఏకరూపులైన రామలక్షమణులిద్దరినీ, ఒకే పద్యంలో వర్ణించడం వల్ల)

[హనుమంతుడు అశోకవనంలో సీతతో]
నీలమేఘ చ్ఛాయబోలు దేహమువాడు,
ధవళాబ్జ పత్ర నేత్రములవాడు
కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు,
చక్కని పీన వక్షంబువాడు
తిన్నైన కనుపట్టు దీర్ఘబాహులవాడు,
ఘనమైన దుందుభి స్వనమువాడు
పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాడు,
బాగైనయట్టి గుల్ఫములవాడు

కపటమెరుగని సత్య వాక్యములవాడు
రమణి! రాముండు శుభలక్షణములవాడు
ఇన్ని గుణముల రూపింప నెసగువాడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు

"మందార మకరంద.. " పద్యం మాకు ఏ తెలుగు వాచకంలోనూ
ఉన్న గుర్తులేదు కాని ఆ పద్యం నేర్చుకున్నది మాత్రం
"శుభోదయం" సినిమా చూసి. సందర్భోచితంగా విశ్వనాథ్
ఆ పద్యాన్ని ఉపయోగించుకున్న తీరు, సుశీల గొంతులో
తీయదనం (గోరుముద్దలు తినిపిస్తూ సులక్షణ నటించిన
సన్నివేశంతో సహా!) ఎప్పుడు మర్చిపోలేనివి.
Unknown said…
సీస పద్యం గురించి చెప్పి మీరీ ప్రశ్న అడిగుంటే ఇంకా సంతోషించేవాడిని :(
@ ప్రవీణ్ - మీ అంత అంతర్జాల వీరుడు ముందు తెవికీలో చూడకుండా వచ్చి ఇక్కడ అడుగుతున్నాడా? :-)
http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%80%E0%B0%B8%E0%B0%AE%E0%B1%81

ఇదే కాక పైన మురళి వ్యాఖ్యలో ఉదహరించిన శంకా రామకృష్ణ వ్యాసం కూడా ఉపయోగిస్తుంది.
Nagaraju Pappu said…
తిక్కనగారు నిర్వచనోత్తర రామాయణంలో రావణుడు ఎంతోమంది స్త్రీలను చెరపట్టి, వాళ్లని పుస్పకంలో ఎక్కించుని పోతున్నప్పుడు, వాళ్ల అవస్తఎలా ఉందో వర్ణిస్తూ చెప్పిన పద్యం:

తట్టికివచ్చి యిట్టట్టు వోనేరని లేళ్ళవిధంబున లీలయెడలి
వలజిక్కి యెక్కడ మెలగంగనేరని చిలుకలచాడ్పున జెన్నుదరిగి
మాపున జొరబడి యావలజనలేని మీలచందంబున జాలగుంది
యురులలోబడి యెందునరుగంగజాలని నెమిళుల తెరగున గొమరుదక్కి
కలయ జూచుచు బలుకంగ నెలగురాక
నలగుమేనులతో నెరిదలలు వీడి
వెగడుపడి వెల్లనై కడువిన్నబోయి
పుష్పకంబుననున్న యప్పొలతులెల్ల

"ఈ పద్యంలో చక్కటి శిల్పం ఉంది. సీసపద్యం నాలుగు పాదాలలోనూ వరుసగా లేళ్ళనూ, చిలకలనూ, చేపలనూ, నెమిళ్ళనూ చెప్పారు. తేటగీతిలో చూచుచు, పలుకంగ, ఎలుగురాక, నలగుమేనులతో, నెరితలలు వీడి అనే క్రియలు వాడారు. ఆడువాళ్ల కళ్ళు లేడికళ్ళు, పలుకులు చిలక పలుకులు, మేనికాంతి బేడిసలలాగ మిలమిల లాడుతుంది, శిఖలు నెమిలిపింఛాలు. ఎటూ పోలేని లేళ్ళలాగ బెదురుచూపులు చూస్తూ, వలలో చిక్కిన చిలుకలలాగ నోట మాటరాక, చెపలలాగ తప్పించుకోలేని మేనులతో, పింఛాలు వాలిన నెమిళ్ళలాగ ఆ జవరాళ్ళు ఉన్నారనడంలో మంచి కల్పన ఉంది. కవి సమయానికి కట్టుబడుతూ సందర్భోచితంగా వర్ణించడం జరిగింది - తిక్కనా, మరి మజాకా?
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఉంది ఈ పద్యం.
Nagaraju Pappu said…
తిక్కనగారు నిర్వచనోత్తర రామాయణంలో రావణుడు ఎంతోమంది స్త్రీలను చెరపట్టి, వాళ్లని పుస్పకంలో ఎక్కించుని పోతున్నప్పుడు, వాళ్ల అవస్తఎలా ఉందో వర్ణిస్తూ చెప్పిన పద్యం:

తట్టికివచ్చి యిట్టట్టు వోనేరని లేళ్ళవిధంబున లీలయెడలి
వలజిక్కి యెక్కడ మెలగంగనేరని చిలుకలచాడ్పున జెన్నుదరిగి
మాపున జొరబడి యావలజనలేని మీలచందంబున జాలగుంది
యురులలోబడి యెందునరుగంగజాలని నెమిళుల తెరగున గొమరుదక్కి
కలయ జూచుచు బలుకంగ నెలగురాక
నలగుమేనులతో నెరిదలలు వీడి
వెగడుపడి వెల్లనై కడువిన్నబోయి
పుష్పకంబుననున్న యప్పొలతులెల్ల

"ఈ పద్యంలో చక్కటి శిల్పం ఉంది. సీసపద్యం నాలుగు పాదాలలోనూ వరుసగా లేళ్ళనూ, చిలకలనూ, చేపలనూ, నెమిళ్ళనూ చెప్పారు. తేటగీతిలో చూచుచు, పలుకంగ, ఎలుగురాక, నలగుమేనులతో, నెరితలలు వీడి అనే క్రియలు వాడారు. ఆడువాళ్ల కళ్ళు లేడికళ్ళు, పలుకులు చిలక పలుకులు, మేనికాంతి బేడిసలలాగ మిలమిల లాడుతుంది, శిఖలు నెమిలిపింఛాలు. ఎటూ పోలేని లేళ్ళలాగ బెదురుచూపులు చూస్తూ, వలలో చిక్కిన చిలుకలలాగ నోట మాటరాక, చెపలలాగ తప్పించుకోలేని మేనులతో, పింఛాలు వాలిన నెమిళ్ళలాగ ఆ జవరాళ్ళు ఉన్నారనడంలో మంచి కల్పన ఉంది. కవి సమయానికి కట్టుబడుతూ సందర్భోచితంగా వర్ణించడం జరిగింది - తిక్కనా, మరి మజాకా?
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఉంది ఈ పద్యం.
Unknown said…
కొత్త పాళీ గారు:
నాదే తప్పండీ. ఇంగ్లీష్ వికీ అలవాటయినట్టు ఇంకా తెలుగు వికీ అలవాటు కాలేదు.
ఈ సారి నుండి తప్పక అక్కడ చూస్తాను అండీ.

ఇంకా నాకు అర్థం చేసుకునేంత జ్ఞానం రాలేదు. చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చి అర్థం చేసుకుంటా. :)
సిరిసిరిమువ్వగారికి ఇష్టమైన సీసపద్యం ఘంటసాలనోట ఇక్కడ వినవచ్చు(3.30 నిముషాల ప్లే వద్ద).
రానారే@
ధన్యవాదములు.
నాకు తెలిసిన సీస పద్యాలు బహుతక్కువ. మూడో నాలుగో ఉంటాయి. నాకు నచ్చిన ఓ పద్యం రాస్తానిక్కడ. "ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి" అని మొదలయ్యే ఆ పద్యం చిన్నప్పుడు క్లాసు పుస్తకంలో అనుకుంటాను -బొమ్మతో సహా ఉండేది- చదువుకున్నాను. నడివీధిలో ఏనుగుపై నుండి చెయ్యి చాపిన రాయలు, కింద పెద్దన - ఇదీ బొమ్మ. నాకా మొదటి పాదమే గుర్తుండి పోయింది. ఓ మూడు నాలుగేళ్ళ కిందట పి.రాజేశ్వరరావు సంకలనం చేసిన "ప్రసిద్ధ తెలుగు పద్యాలు" అనే పుస్తకంలో ఇది మళ్ళీ చూసాను. అందులో 'మదకరీంద్రము నిల్పి' అని రాసారు. చిన్నప్పుడు 'డిగ్గి' అని చదివాం కదా అని అనుకున్నాను. ఏది సరైనదో పెద్దలే చెప్పాలి. అలాగే 'కేలూత' అనే మాటను 'చేయూత' అని మరోచోట చదివాను. పూర్తి పద్యం ఆ పుస్తకంలోంచి చూసి రాస్తున్నాను. రాయల మృతికి పెద్దన సంతాపమిది:

ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి
కేలూత నొసగి యెక్కించుకొనియె

మనుచరిత్రం బందుకొనువేళ
బురమేగ బల్లకి తనకేల బట్టియెత్తె

గోకట గ్రామాద్యనేకాగ్రహారంబు
లడిగిన సీమలయందు నిచ్చె

బిరుదైన కవిగండపెండేరమున కీవ తగుదని
తానె పాదమున దొడగె

'ఆంధ్ర కవితా పితామహ, అల్లసాని
పెద్దన కవీంద్ర' యని నన్ను పిల్చునట్టి
కృష్ణరాయలతో దివికేగలేక
బ్రతికియున్నాడ జీవచ్ఛవంబ నగుచు
Anonymous said…
నాకు కూడాపోతన గారి మందార మకరందమే ఇష్టం. ఇక కొత్తగా నేను చూసింది శ్రీకాకుళాంద్రవిష్ణువు మీద నిందాస్తుతి గా ఉన్న సీస పద్యాలు.
"విమతభూపతు లెట్లు విముఖులై పాఱిరో- రాపీఠం బెక్కరాని నీకు
కుంభినీధవులెట్లు కూతుఁడ్రనిచ్చిరో- కులమొల్లకయె నీకు గోపకునకు
సుందరీమణులెట్లు చూచీ మోహించిరో - కప్పగు మైచాయ గలుగు నీకు
దాసజనంబెట్లు దాస్యంబు సలిపిరో - తిరియు వానిని మారు తిరియు నీకు

మమత నీలీల అటు సూసి బ్రమసెరేమొ - తగదువే ఇట్టి ఘనతకు దభభూప
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ - హత విమత జీవ శ్రఈకాకులేంధ్ర దేవ!"

ఇదే శతకం లోని మరి కొన్ని సీస పద్యాల కోసం ఇక్కడ చూడండి.
http://andhrabharati.com/shatakamulu/AMdhranAyaka/AMdhranAyaka21.html
*నా టైపింగ్ లోని ముద్రా రాక్షసాలకు క్షమాపణలు.
Anonymous said…
అమ్మో భయంకరమైన తప్పులు చాలా దొర్లాయి.
"విమతభూపతు లెట్లు విముఖులై పాఱిరో- రాజపీఠం బెక్కరాని నీకు
కుంభినీధవులెట్లు కూతుఁడ్రనిచ్చిరో- కులమొల్లకయె నీకు గోపకునకు
సుందరీమణులెట్లు చూచి మోహించిరో - కప్పగు మైచాయ గలుగు నీకు
దాసజనంబెట్లు దాస్యంబు సలిపిరో - తిరియు వానిని మారు తిరియు నీకు

మమత నీలీల అటు సూసి బ్రమసిరేమొ - తగుదువే ఇట్టి ఘనతకు దందభూప
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ - హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ!"

ఇది సరైనది.
Anonymous said…
సీ. కలుగడే నాపాలి కలిమి సందేహింపన్
గలిమి లేములు లేక కలుగువాడు
నాకడ్డపడ రాడె నలిన సాధువులచే
బడిన సాధుల కడ్డు పడెడి వాడు
చూడడే నా పాటు జూపుల జూడక
జూచు వారలన్ గృపన్ జూచువాడు
లీలతో నా మొరాలింపడే మొఱగుల
మొఱలెరుంగుచున్ దన్ను మొఱగువాడు

తే. నఖిల రూపులున్ దనరూప మైనవాడు
ఆదిమధ్యాంతములు లేక అడరువాడు
భక్త జనుల దీనుల పాలి వాడు
వినడె చూడడె తలపడే వేగ రాడె

అక్షరాలు పొల్లుపోతే సరిదిద్ద గలరు.

source: http://www.telugubhakti.com/telugupages/Telugu/Pothana/Gajendra/Gajendra11.htm

నేను వేరే పద్యం కోసం వెదుకుతుంటే ఈ పద్యం తటస్థ పడింది. ఈ పద్యం ఇదే నేను మొదటి సారి చదవడం . చదువుతూనే ఆకట్టుకుంది. వెంటనే మీ "నాకు నచ్చిన సీస పద్యం" లో ఇది చేర్చాలనిపించింది. పైన చెప్పిన పద్యాలన్నీ కూడా వేటికవే సాటి కదా.

కొత్త పాళీ గారూ,
మంచి ఆలోచన అండీ, ఈ టపా.

http://telugu4kids.com/Padyalu.aspx
చూసి వ్యాఖ్య రాయగలరు.

లలిత.
చాలాఏండ్ల క్రితం (నే బ్లాగులలో అడుగుబెట్టక ముందు)కొత్తపాళీ గారు మీకిష్టమైన సీస పద్యం చెప్పమని బ్లాగరులందరినీ ఆహ్వానించారు.
ఆ టపా చదివినప్పటినుంచి, తీరిగ్గా కూర్చొని ఈ పద్యం విని వ్రాసి ప్రకటించాలని అనుకోవటమే గానీయండి, కార్యరూపం దాల్చింది లేదు.
మహానుభావులు బాపూరమణల సంపూర్ణరామాయణం నుండి, ఇవేళ సంగ్రహించగలిగాను. అవధరించండి.
ఎందుకిష్టం అని అడగకండి, నాకే తెలియదు ఎందుకిష్టమో

సర్వమంగళగుణసంపూర్ణుడగు నిన్ను
నరుడు దేవునిగా గనరయు గాత!

రామనామము భవస్తోమభంజనదివ్య
తారకనామమై తనరు గాత!

పదికొంపలునులేని పల్లెనైనను రామ
భజనమందిరముండు వరలు గాత!

కవులెల్ల నీదివ్యకధ నెల్లరీతుల
గొనియాడి ముక్తిగైకొంద్రు గాత!

ఎట్టివ్రాతయు శ్రీరామ చుట్ట వడక
వ్రాయబడకుండు గావుత! రామ వాక్య
మనిన తిరుగనిదని అర్ధమగునుగాత!
రమ్యగుణధామ! రఘురామ! రామ! రామ!



స్వస్తి.