పడికట్టు

నా చిన్నప్పుడు విజయా డెయిరీ వారి పాలబూతులో వారానికొకసారి ఒక రెండు గంటల సేపు నెయ్యి అమ్మేవాళ్ళు. నాకు ఏడెనిమిదేళ్ళు ఉండొచ్చు. అప్పటికే నేను ఇంట్లో కావలసిన అత్యవసర వస్తువులు పచారీ కొట్టు నించి అప్పుడప్పుడూ తెచ్చి పెడుతూ ఉండేవాణ్ణి. చిల్లర సరిగ్గా లెక్కపెట్టి తెచ్చుకోవటం, కొట్టతను సరైన తూకపు రాయి వేశాడా తక్కెడలో అని గమనించటం లాంటి జాగ్రత్తలు బానే తెలుసు.

నెయ్యితో కొంచెం క్లిష్ట పరిస్థితులున్నయ్యి. ఒకటి ద్రవ పదార్థం కావటం. రెండు ఖరీదైనది కావటం. పైగా ఆ నెయ్యి అమ్మే పాలబూతుకి పెద్ద రోడ్డు మీద వెళ్ళాలి. నేను సరిగ్గా తేలేనేమో అని మా అమ్మకి భయం, అందుకని నెయ్యి తెచ్చే బాధ్యత నాకెప్పుడూ ఇవ్వలేదు - అప్పటిదాకా.

ఒక రోజు అకస్మాత్తుగా నన్ను నెయ్యి కొనుక్కు రమ్మంది. ఆ పూట నాకంటే పెద్దవాళ్ళెవరూ అందుబాటులో లేరు. మిగిలిన నెయ్యి మరుసటి వారం దాకా సరిపోదు. ఇక నన్ను పంపక తప్పలేదు.

ఆహా! మనకి ప్రమోషనన్న మాట - అనుకుని గర్వపడి పోయాను. నెయ్యి తెచ్చే "స్టీలు కేరేజీ" తొందరగా ఇవ్వు మరీ అని చెయ్యి చాపాను. అమ్మా, మా అమ్మ అంత తొందరగా అంత పెద్ద బాధ్యత నా చేతిలో పెడుతుందా?

రోడ్డుకి పక్కగా తప్పుకుని నడు. సైకిళ్ళ వాళ్ళు దూకుడుగా వస్తుంటారు, జాగ్రత్తగా చూసుకుంటూ నడు. కేరేజీని గట్టిగా ఊపకు. వంటింట్లోంచి కేరేజి తెచ్చి నా చేతికిచ్చి, డబ్బులు లెక్కపెట్టి నా జేబులో పెట్టే వరకూ ఇలా జాగ్రత్తల దండకం చదువుతూనే ఉంది. అన్నిటికీ బుద్ధిగా తల ఊపుతున్నా, ఎక్కడ తన మనసు మార్చేసుకుని నన్ను పంపదో అని. తీరా చెప్పులేసుకుని గుమ్మం దాట బోయే సమయానికి ఈ హెచ్చరిక - పడి కట్టించటం మర్చిపోకు!

ముందరికాళ్ళకి బంధాలు పడ్డాయి. ఇన్నాళ్ళ నా కొనుగోలు అనుభవంలో ఈ స్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. అసలు మా అమ్మ ఏమందో అర్థం కాలేదు. ఏం కట్టించటం?

"పడి, పడి కట్టించు, నెయ్యి పోసే ముందు."

"పడి అంటే ఏంటి? అదెలా కడతారు?" అడక్క తప్పలేదు. తెలీదని ఒప్పుకుంటే పంపదేమోనని ఒక భయం. తెలిసినట్టు తలూపేసి వెళ్ళిపోతే, తీరా అదేదో సరిగ్గా జరక్క పోతే .. నా బుర్ర ఆ పర్యవసానాన్ని ఊహించలేక పోయింది.

"హోర్నీ. నీకింతవరకూ పడికట్టటం అంటే తెలీదూ?"

అప్పుడు తెల్సుకున్నాను పడికట్టుని గురించి. ఇప్పుడు నెయ్యి కొనుక్కోటానికి మనం ఒక స్టీలు కేరేజీ తీసుకెళతాం కదా. మనం కొనేది ఏ అరకిలోనో. కొట్టువాడు అరకిలో రాయి తక్కెడ ఒక పళ్ళెంలో వేసి రెండో పళ్ళెంలో మన కేరేజీ పెట్టి దాంట్లో నెయ్యి పోసిస్తే ... మన కేరేజీయే ఒక మూడు నాలుగొందల గ్రాముల బరువుంటుంది కదా, అంటే మనకి వొచ్చేది ఒక వంద గ్రాముల నెయ్యేనన్న మాట. నెయ్యి బోలెడు ఖరీదని ముందే చెప్పాను కదా.

అందుకని ముందు ఖాళీ కేరేజీని తక్కెడ పళ్ళెంలో ఉంచి దాని బరువుకి బేలెన్సుగా రాళ్ళ పళ్ళెంలో కొన్ని రాళ్ళు పెడతారు. తక్కెడ సమతూకానికి వచ్చాక అప్పుడు రాళ్ళ పళ్ళేనికి అరకేజీ రాయి చేర్చి నెయ్యి తూచాలి - అప్పుడే మనకి అరకిలో నెయ్యీ పూరాగా వచ్చినట్టు.

ఈ ప్రక్రియని పడి కట్టడం అంటారు. కేరేజీ బరువుని తూచడానికి వేసే రాళ్ళని పడికట్టు రాళ్ళు అంటారు. వాడుతూ ఉంటాం, కానీ వాటి వల్ల ఏమీ విలువ సమకూరదు.

పడికట్టు మాటలు కూడ అంతే!

Comments

spandana said…
నాకు పడికట్టు అంటే ఇప్పుడే తెలిసింది.
ఇలా చేస్తారని తెలుసు గానీ దాన్నే పడికట్టు అంటారని తెలియదు.

--ప్రసాద్
http://blog.charasala.com
Sriram said…
హహ...మావూళ్ళో చిన్నప్పుడు ఇళ్ళలో వెన్న అమ్మే ఆడవాళ్ళు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తూనిక రాళ్ళుగా వాడడం గుర్తొచ్చింది