చిన్నప్పుడు ఏప్రిల్ ఒకటి దగ్గర పడుతోంటే పిచ్చి గుబులుగా ఉండేది. ఒకటేమో ఎవరైనా మనల్ని మోసగించేసి "ఏప్రిల్ ఫూల్" అని అరుస్తారేమోనని. మోసం చెయ్యటమంటే ఏదో మన డబ్బులో వస్తువులో లాగేసుకుంటారని కాదు. ఈ మోసాలు "నీ చెవి మీద ఏదో పాకుతోంది" దగ్గర్నించి .. "హెడ్మిస్ట్రెసు గారు నిన్ను తీసుకు రమ్మన్నారు. నీకేదో మూడింది" దాకా ఉంటై. మనం తొణక్కూడదు, బెణక్కూడదు. మన తోటి వాళ్ళనీ, చిన్న వాళ్ళనీ బోల్తా కొట్టించడం కంటే మనకంటే పెద్దవాళ్ళని ఓ పిల్లి మొగ్గ వెయ్యించడం అదొక గొప్ప. మా ఇంటి చుట్టుపక్కల నాతో ఆడుకునే వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళు - అక్కడ మనకి హీరో వర్షిప్ కాక పోయినా కొంచెం నాయకుడి పొజిషనుండేది. పోయి పోయి ఈ పిల్ల వెధవల చేతిలో ఫూలైపోతే మన పరువేంగానూ! ఎంత జాగ్రత్తగా ఉన్నా మరీ రోజంతా బిగదీసుకుని ఉండలేం కదా. ఒకసారైతే ఒక గడుగ్గాయి, వెంకటప్పయ్య కొట్లో పాత బొంగరాలు తీసుకుని కొత్తవిస్తున్నారని చెప్పి నన్ను పల్టీ కొట్టించాడు.
ఆందోళన కలిగించే రెండో విషయమేంటంటే రోడ్డు మీదా, స్కూల్లో స్కూలైపోయాకా బట్టల మీద సిరా చిమ్మేవాళ్ళు. అప్పుడంతా ఫౌంటెన్ కలాలే ఉండేవి. చిన్న రబ్బరు ఫిల్లర్తో వచ్చే ఈనాటి చైనా హీరో పెన్నులు కాదు, ఒక్కొక్క కలానికీ ఒక ఔన్సుడు సిరా పట్టేంత బానపొట్టలుండేవి. మాకు ఐదో తరగతిలో అనుకుంటా కలాలు వాడటం మొదలైంది. పరిక్షలప్పుడు కూడా సిరా నింపుకోని చాలా మంది పిల్లకాయలు ఆ రోజు మాత్రం కోవటి కొట్టు తెరవంగానే ఐదు పైసలకి కలంనిండా సిరా పోయించుకుని యుద్ధ సన్నద్ధులై ఉండే వాళ్ళు. అది నిజంగా యుద్ధమే! మనమీదకి వస్తున్న సిరాస్త్రాల్ని తప్పుకుని అవతలి వాళ్ళని ముంచెత్తాలి. ఈ యుద్ధాల్లో ఆడపిల్లలు కూడా వీరోత్సాహంతో పాల్గొనే వారు. ఏదో ఆడపిల్ల కదాని మనం దయతల్చి ఊరుకున్నా వాళ్ళే వెనకనించి వచ్చి ఇంకు చిమ్మేసి విరగబడి నవ్వేవాళ్ళు. ఎవడన్నా హీరో ఆడపిల్ల చేతులో ఇంకు దెబ్బ తిన్నాడంటే వాడింక ఆ రోజుకి జీరోయే.
ఈ తతంగమంతా స్కూలైపోయాక మొదలయ్యేది, ఎందుకంటే స్కూలు జరుగుతుండగా ఎవడన్నా ఇట్లాంటి పన్లు చేస్తే హెడ్మిస్ట్రెసు గారి పేంబెత్తంతో వీపు చిట్లబడేది. కానీ స్కూలుకెళ్ళే రోడ్డు మీద వేరే స్కూలు పిల్లలకి మన హెడ్మిస్ట్రెసు గారంటే ఏం భయముండదు గదా. అందుకని స్కూలుకి చేరేదాకా చాలా అప్రమత్తంగా నడవాలన్నమాట.
ఒక సంవత్సరం మా స్నేహితుడొకడికి బ్రిలియంటైడియా వొచ్చింది. బంగాళ దుంప చెక్కమీద జాగ్రత్తగా అక్షరాలు చెక్కి దాన్ని ఇంకులో ముంచి printing block లాగా వాడొచ్చని. తగినంత పెద్ద బంగాళ దుంప తేవడం వాడి వొంతు. కొయ్యటానికి కత్తి తేవడం ఇంకోడి వంతు. దానికి పులమటానికి పెన్నుల్లో ఉండే ఇంకు చాలదు కాబట్టి ఇంకు బుడ్డీ తేవడం నా వొంతు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోయాయి. ఎట్లాగో రహస్యంగా ఇంటర్వల్లో ఒక చెక్కని తయారు చేశాం. మధ్యాన్నం డ్రాయింగ్ పీరియడ్ కొంచెం ఆట విడుపు. క్లాసులోనే నెమ్మదిగా మా శత్రువర్గపు నాయకుడి వెనక చేరి వాడి వీపు మీద వేసిన ముద్ర .. ఇలా!
మన ఖర్మ కాలి ఆ పూటే మనం ఇంటికి చేరే లోపలే మా నాన్నగారి కలంలో సిరా నిండుకుంది.
Comments
మనలో మన మాట, కొందరు ముందే పసిగట్టి, పచ్చడి చేదుగా ఉందనో, లేక పోతే ఇంకోటో చెప్పేవారనుకోండి.....