త్యాగరాజ యోగ వైభవం


ఆనంద భైరవి రాగం, రూపక తాళం
ముద్దుస్వామి దీక్షిత కృతం

ప|| త్యాగరాజ యోగ వైభవం, సదా శివం, సదాశ్రయామి

అ|| త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజ
యోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం

చ|| నాగరాజ వినుత పదం, నాదబిందు కళాస్పదం
యోగిరాజ విదిత ప్రదం, యుగ పద్భోగ మోక్ష ప్రదం
యోగరూడ నామరూప విశ్వసృష్ట్యాది కరణం
యుగ పరివృత్త్యాబ్ద మాస దిన ఘటికాద్యావరణం

శ్రీ గురుగుహ గురుం, సచ్చిదానంద భైరవీశం
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం
శం, ప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వ స్వరూప ప్రకాశం,
సకల తత్త్వ స్వరూప ప్రకాశం,
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం

గోపుఛ్ఛ యతి వరుస: ఆవు తోక లాగా మొదట లావుగా ఉండి రాను రాను సన్నబడే మాటల ప్రయోగం.
త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజ యోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం

త్యాగరాజ యోగ వైభవం = త్యాగమునందు రాజైన ఆ పరమేశ్వరుని యోగము యొక్క వైభవము
త్యాగము చేతనే అమృతత్వము లభించును. యోగము దానికి మార్గము. యోగమును ఉపదేశించినవాడు ఈశ్వరుడు. ఐశ్వర్య దాత అగుటచే అతని వైభవము ఇది. ఐశ్వర్యమంటే ధనము కాదు - ఈశ్వరుని లక్షణము, ఈశ్వరుడు ఇచ్చినది ఐశ్వర్యము. భావమేమంటే త్యాగము, యోగము, వైభవము - ఈ మూడింటికీ మూలము ఆయనయే.
అగరాజ యోగ వైభవం = పర్వతరాజు హిమవంతుని యోగముచే పార్వతిని పాణిగ్రహణమొనర్చిన వైభవము కలవానిని
రాజయోగవైభవం = జీవులకు మహారాజ యోగమునిచ్చు వైభవము గలవానిని, లేక రాజాధిరాజులచే సేవించబడు వైభవము కలవానిని
యోగ వైభవం = జీవాత్మ పరమాత్మల అనుసంధానము యోగము. అర్థనారీశ్వరుడై ఈ సంధానమునకు ప్రతీక అయిన వైభవము కలవానిని
వైభవం = విభవము కలవానిని
భవం = భవుని, ఈశ్వరుని (వానిన్ ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్ - అని భాగవత పద్యం).
వం = అమృత స్వరూపుని.
________________________________

స్రోతోవాహ యతి వరుస: నదీప్రవాహం లాగా మొదట్లో సన్నగా వుండి రాను రాను పెద్దదయే పద ప్రయోగం.
శం, ప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వ స్వరూప ప్రకాశం,
సకల తత్త్వ స్వరూప ప్రకాశం,
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం
శం = సుఖమొసగు వానిని (శంకరుడు అంటే అర్థం ఇదే)
ప్రకాశం = వెలుగు వానిని
స్వరూప ప్రకాశం = స్వంత రూపముతో వెలుగు వానిని
తత్త్వ స్వరూప ప్రకాశం = వేదార్థమైన రూపముతో వెలుగు వానిని
సకల తత్త్వ స్వరూప ప్రకాశం = సర్వమైన వేదార్థముల రూపముతో వెలుగు వానిని
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం = వేదార్థములనగా వేరేమియు కాదు శివ శక్తి - ప్రకృతి పురుష తత్త్వమే. ఈ వేదాంత సూక్ష్మమును తనలో దాచుకొని వెలుగు వానిని .. అని అర్థం.

కృతిలో యతి ప్రాముఖ్యత:
సంగీతమునకు "శ్రుతిర్మాతా లయః పితా" - శ్రుతి తల్లి, లయ తండ్రి.
లయ పాటను నడిపించును.
లయను నిర్దేశించునది తాళము.
తాళమునకు పది ప్రాణములు - కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము, జాతి, కళ, లయ, యతి, ప్రస్తారము.
త్యాగరాజస్వామి కూడా సొగసుగా మృదంగ తాళము అనే కృతిలో "యతి విశ్రమ సద్భక్తి" అని చెప్పినారు.
యతి ఆరు విధములు.
ఇందులో గోపుఛ్ఛయతి వరుసగా 16, 12, 8, 4, 2, 1 అక్షరముల నిడివితో వచ్చును. ఇక్కడ అక్షరమనగా రాసిన అక్షరము కాదు, పాడునప్పుడు తాళము వేయుటలో రెండు తట్టులకు మధ్యనుండు కాలము (the smallest time interval in a taala, a beat).
స్రోతోవాహ యతి సరిగా దీనికి వ్యతిరేకము. 1, 2, 4, 8, 12, 16 అక్షరములతో వెలయుచున్నది.
ఈ యతుల ప్రయోగములో గూఢార్థముగ విశ్వరూపము నుంచి అణువు వరకు, అణువు నుంచి విశ్వరూపము వరకు సర్వము నిండియున్న ఈశ్వర తత్త్వమును దీక్షితులు ఆవిష్కరించినారు.
___________________________
"దీక్షిత కృతిరచనా దక్షత" అనే పుస్తకములో సంగీత సాహిత్య విద్యా విశారద శ్రీ నిరాఘాటం శ్రీరామకృష్ణ శాస్త్రిగారు రచించిన వ్యాఖ్య ఈ వ్యాసమునకు ప్రాణము. దానికి నా మిడిమిడి జ్ఞానాన్ని జోడించి మీముందుంచుతున్నాను. దీక్షితుల కృతులపై ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకము ఒక వరము.
______________________________
శ్రీరామా, వింటున్నావా. ఇటువంటి చమత్కార యతి ప్రయోగములు నారాయణతీర్థుల తరంగములలో కనిపించునని శ్రీ శాస్త్రిగారు శలవిచ్చారు (నువ్వు చెప్పినటే!). నాకు తరంగాల సాహిత్యం బాగా తెలీదు గనక నేను దానిగురించి ఏమీ చెప్పలేను. ఓపిక ఉన్నవాళ్ళు ఆంధ్రభారతి సైటుకి వెళ్ళి వెతికి చెపితే బావుంటుంది.

Comments

Sriram said…
Thanks a lot for the explanation. I thought the word tyagaraja in this kriti refers to the tyaagarajeswara who is the deity in tiruvayyur temple(tyagaraja swami was named after this lord).

But this explanation makes it very clear.

btw, i have sent you a mail also.
కొన్ని వివరణలు.
1. తిరువారూరు, తిరువయ్యారు అని రెండు వేరే ఊళ్ళు.
2. తిరువారూరులో వెలసినది త్యాగరాజేశ్వర స్వామి. ఈ స్వామిని గురించీ, ఈ గుడిని గురించీ చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ స్వామికి రాజసం ఎక్కువ-ట. దేవేరి నీలోత్పలాంబ.
3. ఈ కృతిని దీక్షితులు ఈ త్యాగరాజేశ్వరస్వామిని ఉద్దేశించే రాశారు. ఇదికాక ఇంకో పన్నెండు కృతులు ఉన్నాయి. అమ్మవారి మీదకూడా అనేక కృతులు రచించారు.
4. తిరువయ్యారులో వెలసినది పంచనదీశ్వర స్వామి. అమ్మవారు ధర్మసంవర్ధిని.
5. త్యాగరాజస్వామి తిరువారూరులో జన్మించటం వల్ల తలిదండ్రులు ఆయనకాపేరు పెట్టారని కథ. ఆయన పిన్న వయసులోనే ఆ కుటుంబం తిరువయ్యారుకి మారింది.
Sriram said…
చక్కని వివరణ. తెలియని విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు.
బాలమురళీ గారు రీతిగౌళరాగంలో పాడిన శ్రీ నీలోత్పలనాయికే కృతి చాల ఇష్టం నాకు. అందులో శ్రీనగర నాయికే అని వస్తుంది. అది విని ఈ శ్రీనగరమెక్కడిదో అనుకున్నాను. బహుసా శ్రీ చక్రంగురించి ఏమో...
ఇంకొన్ని వివరణలు :-)
తిరువారూరుకే కమలపురము, శ్రీపురము అని పేర్లున్నాయి. నీ ఊహ కరక్టే. అనేక అమ్మవారి ఆలయాల్లో శ్రీచక్ర స్థాపన జరిగి ఉన్నా, ఈ త్యాగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి సన్నిధికి ఏమిటో ప్రత్యేకత - ఆ శ్రీచక్రమే అసలు సిసలైనది అన్నట్లు. దానికితోడు దీక్షితులు శ్రీవిద్యా ఉపాసకులు. అందుకని ఆ అమ్మవారి కీర్తనలలో ఈ ప్రసక్తి విరివిగా వస్తుంది.
నీలోత్పలాంబ మీద రచించిన 9 కృతుల రాగాల పేర్లు "గౌళ" తో ముగుస్తాయి, రీతిగౌళ, కన్నడ గౌళ, ఇలాగ. ఇందులో సంగీత విశేషమేమీ లేదు, ఆయా రాగాలకి సంగీతపరంగా ఏమీ సంబంధం లేదు, ఇది దీక్షితుల చమత్కారాల్లో ఒకటి.
ఈ తిరువారూరు త్యాగేశ్వరస్వామి ఆలయంలోనే కమలాంబ సన్నిధి కూడా ఉంది. ఈ అమ్మవారిపై కమలాంబ నవావరణ కృతులని రచించారు.
1. కమలాంబికే - తోడి - సంబోధనా ప్రథమా విభక్తి
2. కమలాంబా సంరక్షతు - ఆనందబైరవి - ప్రథమా విభక్తి
3. కమలాంబాం భజరె - కళ్యాణి - ద్వితీయా విభక్తి
4. శ్రీ కమలాంబికయా - శంకరాభరణం - తృతీయ
5. కమలాంబికాయై - కాంభోజి - చతుర్థి
6. శ్రీ కమలాంబికాయాః - భైరవి - షష్ఠి
7. కమలాంబికాయాస్తు - పున్నాఅవరాళి - షష్ఠి
8. శ్రీకమలాంబికాయాం - శహన - సప్తమి
9. శ్రీ కమలాంబికే - ఘంట - సంబోధన ప్రథమ
10. శ్రీ కమలాంబా జయతి - ఆహిరి - 8 విభక్తులతో రచించినది
వీటిలో అనేకం మాంఛి బరువైన రాగాల్లో ఉండటం గమనించాలి.
Sriram said…
ఆహా...అమృతభాండానికి చిల్లు పెట్టినట్టు సుధారసం కురుస్తోంది. చాలా మంచి విషయాలు తెలియచేసారు. ధన్యవాదాలు.

దీక్షితులవారికి పూర్వమే ఊతుక్కాడు వెంకటకవి కామాక్షీ నవావర్ణ కృతులు రచించారు. విశేషమేమిటంటే ఆయన యే రాగాలలో స్వరపరిచారో అవే రాగాలని దీక్షితుల వారు కూడా వాడారు.

ఈ కామాక్షీ నవావర్ణాలు కొన్ని నాకు ఆ అమ్మవారి సమక్షంలోనే వినే భాగ్యం కలిగింది. పున్నాగవరాళి కృతి చాలా మనోహరంగా ఉంటుంది.

annaTTu, please make a seperate post on navaavarna kritis.
Vasu said…
వివరణలు అద్భుతంగా ఉన్నాయి

రెండు యతులు మహాద్భుతంగా ఉన్నాయి

Thanks for sharing