మోహన రాగ మహా - 3, 4



వీటిల్ని గురించి కూడా కొంచెం విపులంగా రాద్దామనుకున్నాను గానీ ఈ వారంలో బొత్తిగా సమయం చిక్కలేదు. ఇంక దీని సంగతి అసలు మరిచిపోయే బదులు క్లుప్తంగా నైనా సరే చెప్పుకోవటం మేలు గదా.
మూడో మోహనం కూడా యాదృఛ్ఛికంగానే తగిలింది. పాడింది అరుణా సాయిరాం. ఈవిడ గాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. గొంతు విప్పితే ఎక్కడ ఏమి ఒలికిపోతుందో అన్నట్టు గుసగుసగా పాడే ఈ తరం యువగాయనీ మణుల్లా కాకుండా చక్కగా గొంతు విప్పి పాడతారు. ఇలా బలంగా పాడటంలోనే ఒక లాంటి కర్కశత్వం ధ్వనిస్తూ ఉంటుంది. ఈ లక్షణం ఆమె పదాలు స్పష్టంగా పలికేప్పుడు కూడా కనిపిస్తుంది. ఐనా అందులోనూ ఒక ఆకర్షణ ఉంటుంది. ఈమె పోయినేడాది క్లీవ్‌లాండ్ ఆరాధనకి వచ్చారు. కారిడార్లలో తారస పడేవారు, పచ్చగా ఉండి, ఎప్పుడు ప్రశాంతంగా చక్కటి చిరునవ్వుతో కనిపించేవారు. తీరా ఆవిడ కచ్చేరీ ఎప్పుడో వారం మధ్యలో పెట్టారు, నేను విననే లేదు. ఈమెని గురించి ఇంకో విశేషం చదివాను - వీణ ధనమ్మాళ్ గారి వారసురాలైన టి.బృంద దగ్గర తన సంగీతానికి మెరుగు పెట్టుకున్నారుట. తద్వారా క్షేత్రయ్య పదాలు, తదితర పదాలు పాడటంలో తంజావూర్ బాణీకి వారసురాలీమె. చాలా యేళ్ళ క్రితమే ఒక ఫ్రెంచి కంపెనీ ఈమె పాడిన పదాలని వెలువరించింది - అదిప్పుడు దొరకటం లేదు. ఈవిడ గురించి మరికొంత ఇక్కడ చదవొచ్చు.




విన్న కీర్తన - రారా రాజీవ లోచన రామా! నను బ్రోచుటకు - అని. ఇన్నాళ్ళు ఇది త్యాగరాజ కీర్తన అనుకుంటున్నా. ఈ టపా రాయటానికి కూర్చుని దీన్ని పరిశోధిస్తే తెలిసిన విషయం (శ్రీరామా, వింటున్నావా?) - ఇది మైసూరు వాసుదేవాచార్యుల కీర్తన!! ఆహా, ఎంత తియ్యగా రాశారు. రాముని అందాన్ని గాని, తేజస్సుని గాని, మహిమని గాని మోహన రాగంతో జత కలపడంలో త్యాగయ్యకు సాటి లేరనుకున్నాను, ఆయనకి దీటుగా వచ్చింది ఈ కీర్తన - వాసుదేవాచార్యులు నిజంగా ధన్య జీవి. ఈ పాట సాహిత్యం ఇప్పుడు అందుబాటులో లేదు, ఈ సారి టపాలో వేస్తాను.
ఈ సీడీ వివరాలు ఇక్కడ.




ఇహ చివరి మోహన సన్నివేశం ఆ సాయంత్రం నేను కావాలని పెట్టుకుని విన్నది. ఇది లాల్గూడి జయరామన్ వయొలిన్, ఎన్. రమణి వేణువు, ఆర్. వెంకటరామన్ వీణ కలిసి వాయించిన మోహన రామా కృతి. జంత్ర వాద్య కచ్చేరీ, అందులో మూడు వాయిద్యాల కలయిక వల్ల కొంచెం నియంత్రించినట్టుగా ఉంటుంది గానీ ఇందులో అలరించే లక్షణాలు చాలా ఉన్నై - మొదట వచ్చే ఆలాపన జయరామన్ గారి స్వభావసిద్ధమైన మృదుత్వానికి ఒక మచ్చుతునక; పల్లవి మీదా అనుపల్లవి మీదా సుమారు పది పదిహేను సంగతులు వేసి, చక్కగా పాఠం చెప్పినట్టుగా సాగిస్తారు ముగ్గురు విద్వాంసులూ. ఇక పాత ముగిశాక వచ్చే స్వర ప్రస్తారం కూడా ఒక వరుసలో సంక్లిష్టమవుతూ రసవంతంగా ఉంటుంది.


కొత్తగా సంగీతం వినడం మొదలు పెట్టినవారికి ఈ రికార్డు ఒక నిధి.








Comments

మురళి said…
నాశీ, చాలా బాగున్నాయి.
వాసుదేవాచార్యుల వారి కృతులు అచ్చం త్యాగరాజకృతుల్లాగే సులభమైన పదాలతో అదే శిల్పంతో ఉంటాయి. ఈయన కూడా తెలుగు వారవడం, తెలుగులో కృతులు రచించడం తెలుగు వారి పూర్వ పుణ్యం.
మురళీ, ఇప్పటికైనా తీరింది. సంతోషం :-)

సత్య గారూ, మీ బ్లాగు చూస్తూనే ఉన్నాను గానీ మీ ప్రొఫైలు అందులోని శబ్దపు తునక ఇప్పుడే చూశాను. నాట కురంజి నా అభిమాన రాగాల్లో ఒకటి, సుబ్రహ్మణ్యం నా అభిమాన విద్వాంసుల్లో ఒకరు. మీ టేస్టు బావుంది. మైసూరు వాసుదేవాచార్యులు జన్మతహ తెలుగు వారు కాదనుకుంటా. ఈ విషయమై

శ్రీరాం బ్లాగు చూడండి.