రసప్లావితం

రసప్లావితం

నిన్న సభలో పానుగంటి వారి సాక్షి వ్యాసాల గురించి చర్చ జరుగుతుండగా ఒక స్నేహితులు అడిగారు - 'రసప్లావితం' - అంటే ఏవిటని. నేనేదో కొద్దిగా ఆలోచించి సందర్భాన్ని బట్టి, రసంలో మునిగినది, తడిసినది, తద్వారా రసంతో నిండినది - అని వ్యాఖ్యానించాను.
ఇంటికొచ్చి ఒక పద్యకావ్యం టీకా తాత్పర్య సహితం చదువుతూ ఉంటే అందులో "సింధు లహరీ ప్లవన" అని వుంది. దానికి నదీ ప్రవాహంలో తేలినట్టి అని అర్థం చెప్పారు. అది చదవంగానో .. ఏ నాడో ఏడో క్లాసులోనో, ఎనిమిదిలోనో చదువుకున్న భౌతిక శాస్త్ర పాఠం గుర్తొచ్చింది - "ప్లవన సూత్రాలు" .. అంటే laws of flotation.
తమాషాగా ఉంది కదూ, మన భాషలో వాడుక తప్పిన భావాన్ని పాశ్చాత్య దత్తమైన భౌతిక శాస్త్రం ద్వారా గుర్తు చేసుకోవటం. నాకేవిటో గిలిగింతలు పెట్టినట్టైంది.
రసప్లావితం అంటే రసంలో తేలినది.
రసంలో మునగడానికీ తేలడానికీ చాలా తేడా వుంది. అది అనుభవైక వేద్యం.
ఆ విషయం ఇంకో మాటు .. కానీ .. అసలీ రసమంటే ఏవిటి?
లాక్షణికులు కావ్యం రసమయంగా వుండాలన్నారు. శ్లోకాలు నాకిప్పుడు గుర్తుకి లేవుగానీ, సంగీత నాట్యాల లక్ష్య లక్షణ నిర్దేశం చేసిన భరత ముని ప్రభృతులు రసానికి పెద్ద పీట వేశారు. నవరసాలన్నారు. మరి పూర్వపు విషయాల్ని వదిలి ఇటీవలికొస్తే, శ్రీశ్రీ కూడా పట్టుకుని, "కానీవోయ్ రస నిర్దేశం" అన్నాదు. ఇంకొంచెం ముందుకొస్తే శంకరాభరణం శంకరశాస్త్రి గారు (వేటూరి కలం బాలూ గళం ద్వారా) "రసికుల కనురాగమై, రస గంగలో తానమై" అన్నాడు.
అంటే మునగమనా? తేలమనా?

ఈ సమస్య ఎలా ప్లావితమౌతుంది?

Comments

"మన భాషలో వాడుక తప్పిన భావాన్ని పాశ్చాత్య దత్తమైన భౌతిక శాస్త్రం ద్వారా గుర్తు చేసుకోవటం." ఇలాంటిదే ఇంకొకటుందండీ: "శృంగము".
భౌతికశాస్త్రంలో శృంగము, ద్రోణి (crest and trough of a transitive wave) చదివాం. శృంగమంటే ఎత్తైన ప్రదేశం లేక కొండకొమ్ము (శిఖరాగ్రం) అని, శృంగారమంటే కొండెక్కడమని etymological meaning చదివి ఆశ్చర్యపోయాను. (శృంగమనే మాటకు వేరే అర్థాలు కూడా ఉన్నాయనుకోండి)
బాగుంది మీ వ్యాఖ్య. అలల గురించి చదివేప్పటికి నేనూ ఆంగ్ల మాధ్యమంలోకి వచ్చేశాను, అందుకని ఈ పరిభాష నా దృష్టికి రాలేదు. యజ్ఞాల్లో ద్రోణ కలశమని వాడతారు. అలాంటి కలశంలో పుట్టాడు కనక ద్రోణుడన్నారు, కౌరవ పాండవుల గురువు. దానికీ ఈ ద్రోణికీ ఏవన్నా సంబంధం ఉందేమో.
శృంగారం = కొండెక్కటం. ఇది మరీ తమాషాగా ఉంది. :-)
రసాన్ని "dramatic / literary effect on the psyche" అని చెప్పుకోవచ్చు. రసానికి చాలా నైఘంటికార్థాలు (lexical meanings) ఉన్న మాట వాస్తవం. వాటిల్లో ముఖ్యమైన అర్థం -రుచి.

ఒక ఉదాహరణతో రసాన్ని అర్థం చేసుకోవచ్చు. శృంగారం వేరు. శృంగార రసం వేరు. మనుషులు నాలుగ్గోడల మధ్య చేసుకునేది శృంగారమైతే దాన్ని వర్ణనలోనో నటనలోనో సహానుభూతి చెందడం/చెందించడం "శృంగార రసం" అవుతుంది. ఆ సహానుభూతే రసం. ఇది సానుభూతి కంటే వేరైనది. సన్నిహితులు పోయినప్పుడు మనిషి అనుభవించేది విషాదమైతే, దాన్ని డైలాగులతోను అనుభావ విభావాలతోను సంచారి వ్యభిచారి భావాలతోను అభినయించడం కరుణరసమౌతుంది. నటనని నటనగా రసికుడు గుర్తిస్తూనే దాన్ని తన వాస్తవ జీవితపు పూర్వానుభవంతో అంతర్లీనంగా పోల్చుకుంటూ అనుభూతి చెందడం రసం.
బాగా చెప్పారు మాస్టారు.
rākeśvara said…
మునిగామా తేలామా అన్నది విషయం కాదు. రసంతో టచ్చిలో ఉన్నామా లేదా అని. రసంతో తడిసినదానిని ముట్టుకుంటే మనకి కూడా రసం అంటుకుంటుందిగా, అలా అంటుకోవడం ముఖ్యం కదా. ఎలా ఉంది నా ఉపమాన భీబత్సం :)
గురువుగారూ! కాస్త ఆలశ్యంగా మీపక్క వచ్చాను ఏమనుకోకండే. ఈబ్లాగ్లోకంలో ఓపదిమంది గురించి తెలిశాక, కొద్దిగా కలుస్తూ ఉందాం అనుకున్నాక నాకు ఈవలకి తీగతెగింది. మళ్లీ ఈమద్యే లంకె కలిపాను. మీమొదటిటపా నుంచి మొదలెట్టాను. అలాఅలా ఎప్పటికో ఆచివరికి చేరేది? మద్యమద్యలో పలకరిస్తూ ఉంటానండీ.
రాకేశ్వరరావు గారు, మీ ఉపమానానికి తడిసి ముద్దయ్యాను.
చైతన్య .. ఇదే బ్లాగుల్లో ఉన్న సుళువు .. ఎప్పటివో పాతవన్నీ కూడా ఇంచక్కా చదూకోవచ్చు. సో ఇంతకీ మీక్కాస్త తీరిక చిక్కిందన్న మాట. ఆ తీరికని నా బ్లాగులో గడపాలనుకోవడం నా అదృష్టం.
Anonymous said…
రసప్లావితానికి అర్థం వెతుక్కుంటూ వస్తే,తడిసి ముద్దయ్యాను....ఆ వ్యాఖ్యానాల వెల్లువలో...తగిన శాస్తే అయ్యింది