The Sun Monthly
March 2021, Page 33
Lilly Goodman - Allwright, McCarthy, Alaska
ఆ సెస్నా విమానపు జోరు వినబడగానే నేను గబగబా నా మంచు స్కూటర్ని ఎక్కేదాన్ని, రెండున్నర మైళ్ళు మంచు మీద ప్రయాణం చేసి, బయటికి పంపాల్సిన నా ఉత్తరాలను అక్కడ అందించడానికి.
ఆ విమానం దిగే సన్నటి బద్ద లాంటి ఆ చదును నేలకి చివర ఓ చిన్న చెక్కల గుడిసె. అక్కడికే నా లాంటి వాళ్ళు చాలా మంది వారం వారం వచ్చే ఆ ముహూర్తం కోసం చేరుకునే వాళ్ళు. స్లెడ్ బండ్లను లాగే కుక్కలు, లేదా మోటారు తో నడిచే మంచు స్కూటర్లు ఆ గుడిసె బయట కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవి. తపాలా విమానం రావడం మాకందరికీ వారం వారం జరిగే ఓ చిన్న పండుగ. కొంతమంది అయితే దీని కోసం ముందటి రాత్రి ప్రత్యేకం స్నానం చేసేవాళ్ళు కూడా.
ఆ ఇరుకు గుడిసెలోనే మగాళ్ళంతా ఒక పక్కన గుమిగూడి మంచు స్కూటర్ల గురించీ ఇతర యంత్రాల గురించీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆడాళ్ళందరూ ఇంకో గుంపుగా గుమిగూడి ఇక మిగతా విషయాలు అన్నిటిని గురించీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలు ఆడుకుంటూ లోపలా బయటా అటు ఇటూ పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు.
రావలసిన తపాలా దింపేసి, వెళ్ళాల్సిన తపాలా ఎక్కించుకుని ఆ చిన్న విమానం తిరిగి ఎగిరి పోవడానికి రన్ వే మీద పరుగు తీసేటప్పుడు, పిల్లకాయలందరూ గుడిసె వెనక నక్కే వాళ్ళు, ఆ వేగానికి రేగే చలిగాలికి దెబ్బ తినకుండా.
ఒకసారేమైందంటే ప్లేన్ బాగా లేటయింది, పొగ మంచు వల్ల. అప్పుడు ఒకాయన తన ఇంటినించి ఒక మోపెడు అట్టపెట్టెలు తెచ్చాడు, బీర్ కేన్లు పేక్ చేసేవి. ఒక అగ్గిపిల్ల గీసి వాటిని అంటించి చిన్నపాటి చలిమంట తయారు చేశాడు, మేం ప్లేన్ కోసం వేచి ఉండే సమయంలో కొద్దిగా "వెచ్చ"బడడం కోసం. మేమందరం ఆ చిన్న మంట చుట్టూ గుమిగూడి, ఆ చిన్న మోపెడు అట్టపెట్టెలు కాలి బూడిద అయ్యే లోపల గలగల కబుర్లాడుకుంటూ ఉండగా, అతను తన కోటు జేబుల్లో నింపుకున్న బీర్ కేన్లు ఒకటొకటీ ఖాళీ చేస్తూ ఉన్నాడు.
కొన్నేళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఆ బుల్లి రన్ వేని పెద్దది చేసింది. తపాలా విమానం వారానికి రెండు సార్లు రావడం మొదలు పెట్టింది. ఇంతలోనే అందరికీ ఫోన్లు వచ్చాయి. ఇంటర్నెట్, ఈమెయిల్ వచ్చాయి. మంచు స్కూటర్ల వాడకం కూడా బాగా ఎక్కువైంది. ఇప్పుడు తపాలా అందుకోవడం అంటే, బిల్లులు, ఎన్నికల ప్రకటనలు అందుకోవడం మాత్రమే.
నేనిప్పుడు అంతగా వెళ్ళడం లేదు తపాలా అందుకోవడానికి. కానీ ఆకాశంలో నించి ఆ సెస్నా విమానపు జోరు మాత్రం వింటూ ఉంటా అప్పుడప్పుడూ.
Comments
మల్లెల వేళ అంటే "సీజన్" అని కూడా చెప్పుకోవచ్చు starting in March, my understanding. వెన్నల మాసం అంటే March probably where clear night sky, and the Moon appears to be bright in this month. Please email your opinion on this. (mvenkataramesh@yahoo.co.in). Thanks for your review on my opinion.