అయిదు శాజరాక్ ల తర్వాత !
ఎదురుగా కనిపిస్తున్న నీలాకాశం, రెండు వైపులా కింద పారుతున్న Lake Pontchartrain అద్దం లో
ఒక దాన్నొకటి చూసుకుంటున్నాయా అన్నట్లు రెండూ ఒకే రంగు ని ప్రతిఫలిస్తున్నాయి.
అదురుతున్న గుండెతో నది దాటగానే ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది సృష్టి.
అల్లంత దూరం లో New Orleans. ఊర్లోకి తీసుకెళ్ళే ఆ బ్రిడ్జీ మీద ట్రాపిక్ ,కారు కి కారు కి అడుగు
దూరం కూడా లేనంత ఇరుకుగా ఉంది. రకరకాల రాష్ట్రాల కారు ప్లేట్లను చూస్తుంటే టూరిస్ట్ సిటీ లోకి
అడుగు పెట్టబోతున్నట్లు తెలిసిపోతోంది. తళుకు బెళుకులతో జిగేలు మనిపిస్తున్న బిల్ బోర్డ్ లు
ఊర్లో జరిగే ఈవెంట్స్ గురించి చెప్తున్నాయి.
“ The City that care forgot “ - యారన్ తో కలిసి చూడాలనుకున్నఊరు. హఠాత్తుగా ఒంటరి గా
ఈ రోడ్డు ట్రిప్.
***
మిసిసిపి మీదుగా చీకటి ఆ ఊరిని జలతారు వస్త్రంగా కప్పుకుంటోంది.
హోటల్ లో చెకిన్ చేసి లాంగ్ డ్రైవ్ అలసట తీరడం కోసం బాత్ టబ్ లో మునిగింది. ఒక పక్క బీర్ బాటిల్,
మరో పక్క ఫోన్ లో పాటలు.
ఎటు నడిస్తే అటు ఆకాశం లోని చందమామ వెంటపడినట్లు, ఎక్కడికెళ్ళినా వెంటవచ్చే ఈ ఆలోచనలు.
నో..ఎవరూ తన ఆనందాన్ని, తన జీవితాన్ని లాక్కోలేరు. ఆ అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు.
నూటొకటో సారి మనసు కు నచ్చ చెప్పుకుంది.
రూమ్ సర్వీస్ లో డిన్నర్ ఆర్డర్ చేసి హోటల్ వాడు రూమ్ లో పెట్టిన బ్రోచర్స్ తీసుకొని ఒకొక్కటి
చూడటం మొదలుపెట్టింది.
ఫ్రెంచ్ క్వార్టర్, బుర్బన్ స్ట్రీట్, కెఫే డు మాంట్ , ఊడూ షో, స్వాంప్ టూర్, ప్రిసర్వేషన్ హాల్... ఊరి చరిత్ర
మొత్తాన్ని ఆ కాగితాల్లోకి కుదించేసారు,
ఈ ఊరికి ఊపిరి లాంటి సంగీతం, మందు, కాజన్ ఫుడ్, బెన్యే (Beignet) చాలనుకుంటూ నిరాసక్తం గా
బ్రోచర్స్ ని పక్కన పడేసింది.
ఇదొక పిట్ స్టాప్ .ఇక్కడి నుంచి ఆలబామా, నార్త్ కెరొలినా, జార్జియా ప్లాన్ మొత్తాన్ని మరో సారి గుర్తు
చేసుకుంది.
ప్రాజెక్ట్ పని మీద ట్రావెల్ లోఉన్నా,వారం వరకు డిస్ట్రబ్ చేయొద్దని ఇండియా లో అమ్మా,నాన్నలకు
టెక్స్ట్ మెసేజీ పంపింది.
ఈ ఊర్లో ప్లాన్ చేసిన వెకేషన్, పెళ్లి చేసుకుంటే బాచెలరేట్ పార్టీ ఇక్కడే పెట్టుకుంటానని యారన్ దగ్గర
చేసిన అల్లరి అన్నీ గుర్తొస్తుంటే, అవే ఆలోచనలతో ఎప్పుడో నిద్ర లోకి జారుకుంది.
***
Café’ Du Monde ముందు వేలం వెర్రిగా బారులు తీరిన జనం. పొడవాటి క్యూ ,కెఫే కు బయట జాజ్
పాటల విభావరి. ఈ ఊరికొచ్చి ఈ ఫ్రెంచ్ డోనట్స్ తినకుండా వెళ్ళటం ఎలా?
రోడ్డు మీదజనం నడుస్తూ,గుర్రపు బగ్గీల్లో, పెడీ కాబ్ ల్లో. హైదరాబాద్ లో ఉన్నట్లే ఎండకు తోడైన ఉక్క
పోత.
ఎక్స్ప్రెసో, బెన్యే రెండూ ఆర్డర్ చేసి బయట కుర్చీలో కూర్చుంది. మెత్తటి పంచదార చల్లిన ఆ డోనట్స్ ని
వేడి వేడిగా కాఫీ తో పాటు తెచ్చిచ్చారు. నోట్లో పెట్టుకుంటీ తీపి తప్ప రుచి తెలియలేదు. ఓవర్ రేటెడ్
అనిపించింది. చికోరి కలిపిన కాఫీ పౌడర్ ని చూడగానే ప్రాణం లేచొచ్చి రెండు డబ్బాలు కొనుక్కొని
బయట పడింది.
నెత్తి మాడిపోతున్న ఎండ కు హేట్ కావాల్సిందే అనిపించి ఫ్రెంచ్ మార్కెట్ కి బయలుదేరింది.
స్పానిష్, ఫ్రెంచ్, టిపికల్ సౌత్ ..ఆహార పదార్థాలు, వస్తువులతో మార్కెట్ మొత్తం నిండిపోయింది.
గీచిగీచి బేరమాడి పొడవాటి హేట్ కొనుక్కొని మళ్ళీ నడవటం మొదలుపెట్టింది. పేర్లను బట్టి Bourbon
Street కి వచ్చినట్లు అర్థమయింది. టూరిస్ట్ లతో రోడ్లన్నీ కిటకిట లాడుతున్నాయి. ఏ సందు తిరిగినా
జాజ్ వినిపిస్తూనే ఉంది.ఆల్కహాల్ డ్రింక్స్ ని ప్లాస్టిక్ కప్పుల్లో పట్టుకొని తాగుతూ నడుస్తున్నారు.
ఇంకొంచెం దూరం నడిచే సరికి ఫ్రెంచ్ క్వార్టర్ వచ్చింది.
ఈ ఊరున్నది అమెరికా లోనేనా అని అనుమానం వచ్చేంత కొత్త గా ఉంది New Orleans. ముఖ్యంగా
ఫ్రెంచ్ క్వార్టర్. ఈ ఊరి మొత్తానికి ఈ ఫ్రెంచ్ క్వార్టర్ కిరీటం లాంటిదని ఎందుకంటారో చూస్తుంటే
అర్థమవుతోంది సృష్టి కి. సన్నటి ఇరుకైన సందులే కానీ శుభ్రంగా ఉన్నాయి. ఏ ఇల్లు చూసినా
ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ గుర్తొస్తోంది. కొన్ని ఇళ్ళు చక్కటి బాల్కనీలతో, షాన్డిలియర్స్ లాంటి పూల మొక్కలతో
అందంగా ఉంటే, ఆ పక్కనే మరి కొన్నివచ్చిపోయిన వరద మరకలతో దిష్టిబొమ్మల్లా ఉన్నాయి.
వరదల విషాదం ఇళ్ళ మీద కనిపిస్తోంది కానీ ఆ ఊరి జనం ఉత్సాహంగా నవ్వుతూ తిరుగుతున్నారు.
కత్రినా కథలు విన్నాక, ఈ ఊరిని మరో రకంగా ఊహించింది. మామూలు రోజుల్లోనే ఇలా ఉంటే “ మర్డీ
గ్రాస్” సంబరాలప్పుడు ఇంకెలా ఉంటుందో అనుకుంది.
***
మెయిన్ రోడ్డు మీదకు వచ్చిఎటు వెళ్దామా అన్నట్లు అటూ ఇటూ చూసింది.
పెడీ కాబ్ ని పక్కగా ఆపి “ ఎక్కడికెళ్ళాలి?” అడిగాడు రిక్షా తొక్కుతున్న ఓ యువకుడు.
కూలింగ్ గ్లాసెస్, హేట్ తీసి చేతి రుమాలుతో మొహాన్ని తుడుచుకొని సృష్టి చెప్పే సమాధానం కోసం
ఆమె వంకనే చూస్తున్నాడు.
చెమట కు తడిసిపోయిన బనియన్ లాంటి టీ షర్ట్ లో నుంచి కనిపిస్తున్న యవ్వనపు కండలు . ఆమె
నుంచి ఏ సమాధానం రాకపోవటం తో “ జస్ట్ ఫైవ్ డాలర్స్ ఫర్ ఫైవ్ బ్లాక్స్. ఒక స్టార్ బక్స్ కాఫీ ఖరీదు”
అన్నాడు ఒప్పించే విధంగా.
అతనామాట అన్నాక ఇక మరో ఆలోచన లేకుండా రిక్షా ఎక్కేసింది.
రిక్షా తొక్కుతూనే వెనక్కు తిరిగి “ ఐయాం లోగన్” పలకరింపు గా అన్నాడు. “ సృష్టి” అంది బదులుగా.
“ ఏం చూశారు? ఏం చూస్తారు?” అని అడిగితే “ సర్ప్రైజ్ మీ” అంది.
ఇండియా లో రిక్షా ఎక్కడం ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా ముసలి వాళ్ళు తొక్కేటప్పుడు,
ఎక్కకుండానే డబ్బులిచ్చి వెళ్ళిపోయేది.లోగన్ ని చూస్తే అలా చేయాలనిపించటం లేదు. నిజం
ఒప్పుకోవాలంటే ఈ క్షణం లో కాస్త మాట్లాడే తోడు పక్కనుంటే బావుంటుందనిపిస్తోంది ఆమె కు.
చిన్న చిన్న సందులు తిప్పుతూ ఆ ఊరి గురించి ఆసక్తి కరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
సునాయాసంగానే రిక్షా తొక్కుతున్నా, మాట్లాడేటప్పుడు కొంచెం రొప్పుతున్నాడు. సృష్టి కి వినిపించటం
కోసం కొంచెం పక్కకు తిరిగి మాట్లాడుతున్నాడు. కొత్త లేకుండా మాట్లాడేస్తున్నాడు. అమెరికన్
రచయిత ఫాక్నర్ నివసించిన ఇల్లు, దానికి ఆనుకొని ఉన్న పుస్తకాల షాపు కు తీసుకెళ్ళాడు.
ప్రిసర్వేషన్ హాలు దగ్గర ఆపాడు. లోపలికెళ్లి జాజ్ పాట వింటుందేమో అని. ఊహూ, సృష్టి ఎక్కడా
రిక్షా దిగకుండా ముందుకు పోనివ్వమంటే ఈ అమ్మాయి కి ఏవీ చూసే ఆసక్తి లేదని లోగన్ కి
అర్థమయింది.
“ శాజరాక్ టేస్ట్ చేసారా? అది మా న్యూ ఆర్లీన్స్ స్పెషల్.” శాజరాక్ గొప్పతనం లోగన్ చెప్పబోతుంటే
“ నేను రూజ్వెల్ట్ బార్లోనో, Monteleone లోనో తాగుదామని ఒకప్పుడు ప్లాన్ చేసాను”.
Bourbon Street లో రచయిత టెన్నెసీ విలియమ్స్ ఫేవరేట్ రెస్టారెంట్ లో లంచ్ , Antoine లో డిన్నర్ ,
హెమింగ్వే, ఫాక్నర్ లాంటి రచయితలు గడిపిన hotel Monteleone లో శాజరాక్ తాగాలని యారన్,
తానూ వేసుకున్న ప్లాన్స్ అన్నీ గుర్తొచ్చాయి.
“ పర్ఫెక్ట్. కానీ బడ్జెట్ సరిపోదనుకుంటే ఇక్కడే అంతకన్నా బెస్ట్ బార్ సజెస్ట్ చేస్తాను. హౌస్ ఆఫ్ బ్లూస్.
ఇప్పుడు హేపీ అవర్. అంటే ఫ్లాట్ రేట్ కి అయిదు శాజరాక్ లు తాగొచ్చు.”
“ If you want to join, I don’t mind” సూటిగా చెప్పేసింది.
సృష్టి అడిగిన దానికి ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి చూసాడు లోగన్.
“ పది నిముషాలు ఆగితే దీన్ని పార్క్ చేసి వస్తాను”
సరేనంటూ తలూపింది.
***
వెలుతురూ, చీకటి సమంగా ఉన్నాయి ఆ బార్ లో.
బార్ లోకి వెళ్ళగానే ఎడమ వైపు ఒక చిన్న స్టేజ్ మీద తెల్ల చొక్కా, నల్ల ప్యాంట్ ఫార్మల్స్ లో ముగ్గురు
ఆర్టిస్ట్ లున్నారు. ఒకతను ట్రంపెట్, మరొకరు సాక్సో ఫోన్ వాయిస్తుంటే మూడో వ్యక్తి పాడుతున్నాడు.
రెండు మూడు టేబుల్స్ తప్ప అన్నీ నిండిపోయాయి.అందరి ముందు చిన్నా, పెద్దా గ్లాసులు. బీర్లు,
విస్కీలు, వోడ్కాలు, పేర్లు,రుచి తెలియని ఎన్నో రకాల ద్రవాలు.డాన్స్ ఫ్లోర్ లో నాలుగైదు
జంటలున్నాయి. పాట కు పాట కు మధ్య ఒకతను టిప్స్ కోసం అన్నీ టేబుల్స్ దగ్గరకు ఒక చిన్న
గ్లాస్ జార్ ని తీసుకొస్తున్నాడు.
“ Do you know what it means to miss New Orleans” లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ పాట మొదలు
కాగానే చప్పట్లు. ఆ పాటకు డాన్స్ ఫ్లోర్స్ అంతా ఊగిపోతోంది.
***
అక్కడున్న బార్ టెండర్స్ అందర్నీ పలకరిస్తూ సృష్టి పక్కకొచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
ఆర్డర్ తీసుకోవటానికి వచ్చిన బార్ టెండర్ ని “క్లోయి” అంటూ పరిచయం చేసాడు.ఆ అమ్మాయి వయసు ఇరవై ల్లోఉంటుందేమో. సన్న గా ఉంది. నవ్వుతుంటే బుగ్గ సొట్ట పడుతోంది.తెల్లటి ఫుల్ హేండ్స్ షర్ట్, బ్లాక్ స్కర్ట్, నడుముకు చిన్న యాప్రాన్ లాంటి గుడ్డ.
“ ఆర్ యు రెడీ ఫర్ శాజరాక్? “ అంటుంటే తలూపింది సృష్టి.
క్లోయి అటు వెళ్ళగానే “ విస్కీ ఇంతవరకూ టేస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం” లోపలి భయాన్ని బయట
పెట్టింది.
“ ప్రతీ దానికి ఓ ఫస్ట్ టైం . దిసీజ్ శాజరాక్ టైం” అంటూ నవ్వాడు.
మరో సారి అనుకుంది, నవ్వుతుంటే మరింత చార్మింగ్ గా ఉన్నాడని.
రెండు రాక్ గాజు గ్లాసులలో శాజరాక్ , ఒక ప్లేట్ లో స్నాక్ తెచ్చి ఎదురుగా పెట్టి ఎంజాయ్ అంటూ
వెళ్ళిపోయింది క్లోయి.
చీర్స్ చెప్పి గొంతు లో ఒకేసారిగా పోసుకుంది ,లోగన్ ఏదో చెప్పబోతుంటే వినకుండా. గొంతులో మంట
తెలుస్తోంది. తియ్య గా కూడా ఉంది, ఘాటుకూడా స్పష్టంగా తెలుస్తోంది.
లోగన్ నెమ్మదిగా సిప్ చేస్తున్నాడు. ఒకే సారి తాగకుండా.
“ శాజరాక్ అలా ఒక్క షాట్ గా తాగకూడదు”
“ అనుభవం చెప్పింది” నవ్వింది సృష్టి.
“ ఎలా ఉంది?” లోగన్ అడిగిన దానికి “ లైఫ్ లాగా” అనటంతో కొంచెం గట్టిగానే నవ్వాడు.
ఏదో అడగబోయి సంశయిస్తూ ఆగిపోయాడు.
“ డోంట్ వర్రీ. జస్ట్ బ్రేకప్ బ్లూస్” .
అర్థమయిందన్నట్లు తలూపాడు. “అందరి టూరిస్టుల్లాగా లేరు. ఎందుకలా ఉన్నారని అడగాలనుకొని
.....”
ఆమె మొహం లో నీలి నీడలు కనిపించాయేమో...మాట మార్చాడు.
“ శాజరాక్ ఎలా తయారు చేస్తారో తెలుసా? ఇందులో ఫ్రెంచ్ విస్కీ, అమెరికన్...చెప్పటం కాదు
చూపిస్తాను” అంటూ సృష్టి ని బార్ దగ్గరకు చొరవగా లాక్కెళ్ళాడు. బార్ టెండర్ లుండే వైపు కి వెళ్లి
క్లోయి కి చెప్పి రెండు రాక్ గాజు గ్లాసులు తెచ్చాడు.ఒక దాంట్లో ఐసు ఉంది. “ మొదట ఇలా రై విస్కీ
పోయాలి” అంటూ బాటిల్ లో నుంచి ఖాళీ గ్లాసు లో కొంచెం ఒంపాడు. తర్వాత సింపుల్ సిరప్
అంటూ మరో బాటిల్ లోనుంచి సిరప్ వేసాడు. ఎరుపు రంగు రావటానికి కొంచెం ఫేసియల్ బిట్టర్స్ ని
కలిపాడు.మొదటి గ్లాసు లోని ఐస్ ని ఒంపేసి ఆ గ్లాసు లో కొంచెం herbsaint కలిపాడు.
రెండో గ్లాసు లోని ద్రవాన్ని ఒక స్త్రైనర్ తో హెర్బ్ సెయింట్ ఉన్న గ్లాసు లోకి వంచాడు. ఆ తర్వాత ఒక
నిమ్మ కాయ ముక్కను గ్లాసు అంచుల మీద రాసి దాన్ని గ్లాసు కి ఒక పక్క తగిలించాడు.
కాక్ టైల్ ని అలా గ్రేస్ ఫుల్ గా కలుపుతుంటే ఆసక్తి గా చూస్తుండిపోయింది సృష్టి.
“ ఇది అఫీషియల్ న్యూ ఆర్లీన్స్ శాజరాక్” సృష్టి చేతికి అందించాడు.
లోగన్ చేసిచ్చిన శాజరాక్ ని రుచి చూసింది “ మొదటి షాట్ అంత ఘాటు గా లేకుండా వేరే రకంగా
ఉంది”
“ మనం మొదట తాగిన దాంట్లో రై విస్కీ కొంచెం ఎక్కువయింది .కావాలనే ఘాటు తగ్గించాను.ఈ
శాజరాక్ ని ఒక్కో బార్ లో మిక్సాలజిస్ట్ ఒక్కోలా చేస్తాడు.”
ఇద్దరూ మళ్ళీ టేబుల్ దగ్గరకొచ్చారు.
పాట ఆగలేదు కానీ క్రమేపీ జనం పలచబడుతున్నారు.
“ కత్రినా అనుభవం చెప్పు“.అతని మొహం లో భావాలు మారటం గమనించింది “ సారీ. ఇష్టం లేకపోతే
చెప్పద్దు”.
“కత్రినా ని గుర్తు చేసుకోవటం ఎవరికిష్టం ఉంటుంది? అలా అని మర్చిపోము. ఇక్కడకొచ్చిన
టూరిస్ట్ లు లంచ్ దగ్గరో, డిన్నర్ లోనో రకరకాలుగా ఆ ప్రశ్న అడుగుతారు. అపటైజర్ కి మెయిన్
కోర్స్ కి మధ్య లో సమాధానం చెప్పగలిగే ప్రశ్న కాదది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసిన
అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మాటల్లో ఎలా చెప్పగలం?”
ఎంత అనాలోచితం గా అడిగేస్తామో ఇలాంటి ప్రశ్నలనుకొంది సృష్టి .
“ మా పూర్వీకులు ఫ్రెంచ్ వాళ్ళు. ఇక్కడకొచ్చి స్థిరపడ్డారు. మా అమ్మ స్పానిష్. కత్రినా
వచ్చినప్పుడు నాకు పదమూడేళ్ళు. వాషింగ్టన్ డిసి లో ఉన్న మా అత్త దగ్గరకు వెళ్ళాము,
పరిస్థితి సద్దు మణిగాక మళ్ళీ వద్దామని. మా అమ్మా, నాన్న తిరిగొచ్చారు కానీ నన్ను డిసి లోనే
ఉండి చదువుకోమన్నారు. నెలకొకసారి వచ్చి అమ్మా,నాన్నాలను చూసే వాడిని. ఫ్రెంచ్ మార్కెట్ లో
మా దుకాణం. మా తాతల నాటి నుంచి అదే మా కుటుంబానికి జీవనోపాధి. నన్ను మాత్రం ఎలాగైనా
బాగా చదివించాలని మా అమ్మా,నాన్న ఆశ.”
ఇక చెప్పలేనట్లు ఆగిపోయాడు.
పెడీ కాబ్ తొక్కేటప్పుడు మాట్లాడిన లోగన్, ఈ బార్ లో లోగన్ ఇద్దరూ వేర్వేరు మనుష్యుల్లా
అనిపించారు. ఫ్రెంచ్ క్వార్టర్ లో పెళ్లలూడి పోయి నల్లటి మరకలు పడ్డ ఇల్లు గుర్తొస్తోంది లోగన్ మాట్లాడుతుంటే.
సృష్టి చెప్పటం మొదలు పెట్టింది.“ ఇండియా నుంచొచ్చి ఏడేళ్ళవుతోంది. మాస్టర్స్ చేసాను.
ఐటి లో జాబ్. ఏడాదిగా నా కొలీగ్ యారన్ తో కలిసుంటున్నాను. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు
తెలియదు. పెళ్లి కి ప్రపోజ్ చేస్తాడేమో అనుకుంటే బ్రేకప్ చెప్పాడు. వద్దనుకొని విడిపోతే బాధ లేదు
కానీ సడెన్ గా నా మీద బోలెడు తప్పులు మోపి బ్రేకప్ చేసాడు. నేను లావు గా ఉండటమే కాదు
ఫ్రిజిడ్ గా ఉన్నానట.” యారన్ అన్న మిగతా మాటలు కూడా చెప్పేయాలని ఉన్నా, గొంతు దాటి
మరొక్క మాట బయటకు రాలేదు, కొన్ని కన్నీళ్లు తప్ప.
క్లోయి మూడో సర్వింగ్ తెచ్చింది.
“ ఇంత జరిగాక రోజు ఆఫీసు లో అతన్ని చూస్తూ భరించే శక్తి లేదనిపించింది. సెలవు పెట్టేసి ఇలా
రోడ్డు ట్రిప్ కి బయలుదేరాను.”.
“ sorry to hear that”
ఇద్దరూ మౌనంగా ఆ గ్లాసుల వంక చూస్తుండిపోయారు.
“ డిసి ప్రపంచం వేరు.డబ్బున్న సమాజం. ప్రతి ఒక్కరూ గ్లోబల్ సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, నాన్నలని చూడటానికి ఇంటికొస్తే అడుగడుగునా పేదరికం. ఇక్కడకు రావాలని మనసు పీకేది కానీ ఈ ఊరు ని చూడలేక పారిపోదామనిపించేది. డిసి లో ఉంటే గిల్టీ గా ఉండేది. కత్రినా పీడకల కు పదేళ్ళు నిండినప్పుడు వచ్చి ఇక తిరిగెళ్ళలేదు. ఇక్కడే ‘నోలా’ లో చదువుతున్నాను. బార్ టెండర్ , పెడీ కాబ్ పార్ట్ టైం ఉద్యోగాలు. క్లోయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ . ఇప్పుడు కేవలం ఫ్రెండ్. కష్టమే కంపార్ట్ మెంట లైజ్ చేసుకోవటం. కానీ మాకు తప్పదు. మీకు బాధ కలిగితే ఓదార్పు కోసం ఈ ఊరొస్తారు. మాకు కష్టమిచ్చినా, ఓదార్పునిచ్చినా ఇదే మా ఊరు. ఊరొదిలి వెళ్ళినా ఊరు ని మాత్రం వదలలేము ” ఎన్నోచెప్పుకోవాలనుకున్నాడు కానీ చెప్పలేదు.
నిశ్శబ్దం గా ఉండి పోయింది సృష్టి.
“ ఇండియా లో ఉన్నప్పుడు కొంచెం బొద్దు గా ఉన్నా ఈ ఏడేళ్ళలో ఎలా ప్లస్ సైజ్ లోకి వెళ్లిపోయానో
గుర్తుపట్టలేదు. స్కాలర్ షిప్ కోసం కష్టపడి చదవటం, ఫీజుల కోసం పార్ట్ టైం జాబ్స్ చేయటం, కొత్త కొత్త
డైటింగ్లు, ఎక్సర్ సైజ్ లు మొదలు పెట్టడం, ఆపేయ్యడం.” లావు ని దాచిపెట్టడం కోసం ఇంకో సైజ్ పెంచి
వేసుకున్న డ్రెస్ లో నుంచి తన శరీరాన్ని చూసుకుంటూ చెప్పింది.
“ You are beautiful inside and out” చొరవ గా చేతి మీద చెయ్యి వేశాడు.
ఫుడ్ ఆర్డర్ చేస్తారేమో కనుక్కోవటానికి క్లోయి వచ్చింది.
అప్పటికి అయిదు షాట్స్ పూర్తి చేశారు. శరీరం తేలిపోతోంది. లోపలి దుఖం పైకొస్తానంటోంది.
ఇప్పుడేం వద్దన్నట్లు తలూపింది సృష్టి.
ఒక పక్క జాజ్ వినిపిస్తూనే ఉంది. డాన్స్ ఫ్లోర్ లో ఎక్కువ మంది లేరు. నెమ్మదిగా టేబుల్స్ ఖాళీ
అవుతున్నాయి.
బ్యాండ్ ట్రూప్ లో అతనికి ఏదో చెప్పి వచ్చిసృష్టి ని డాన్స్ ఫ్లోర్ దగ్గరకు లాక్కెళ్ళాడు .
“ Any one who knows what love is” పాట మొదలయింది.
పాటకు అనుగుణంగా ఇద్దరూ అడుగులు వేస్తున్నారు.
“ ఎమ్మా థామస్ ఈ పాట నా ఫేవరేట్” అంటున్న లోగన్ భుజం మీద తల వాల్చి అడుగులో అడుగు
కలిపింది.
***
తలభారంతో నిద్ర లేచి ఆస్ప్రిన్ వేసుకొని అన్నీ సర్దుకొని హోటల్ వెకేట్ చేసింది. కారు లో కూర్చొని
జిపిఎస్ లో Montgomery అడ్రెస్ పెట్టింది.
“ Thanks for everything.” లోగన్ కి టెక్స్ట్ మెసేజీ పంపి కారు స్టార్ట్ చేసింది.
కొత్తగా కనిపిస్తున్న ఊరు ని మరో సారి చూస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేస్తోంది.
కొన్ని దుకాణాలు ఇంకా నిద్ర మత్తులో ఉన్నాయి. రోడ్డు మీద జనం మాత్రం తిరుగుతున్నారు.
నుంచో ఓ పాట తేలి వస్తోంది.
వచ్చిపోయే హరికేన్ ల మధ్య అల్లంత దూరం లోని మిసిసిపి అన్నం పెడుతుందో, పిండం పెడుతుందో
తెలియకపోయినా దాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు ఆ ఊరి జనం. ఆ ఊరికి వచ్చే జనం.
“ హరికేన్ నిన్నటిదో, రేపటిదో. ఇవాళ శుభోదయం.” లోగన్ మెసేజీ చదువుకున్న సృష్టి పెదాలపై
సన్నటి చిరునవ్వు.
“మిసిసిపి కోసం మళ్ళీ రావాలి”
***
Comments