కంచరపాలెం కబుర్లు

C/o కంచరపాలెం

ఈ సినిమా పతాక సన్నివేశంలో ప్రేక్షకుల మనోభావాలను నూటఎనభై డిగ్రీలు తిప్పేసే ట్విస్ట్ ఉంది. ఈ సినిమా బాగోగుల గురించి కాస్త కూలంకషంగా మాట్లాడ్డం అంటే ఆ ట్విస్ట్ గురించి మాట్లాడక తప్పదు.
అంచేత



<><><> SPOILER ALERT <><><>
పదేళ్ల సుందరం
పాతికేళ్ల జోసెఫ్
ముప్పై దాటి నలభై కి దగ్గరవుతున్న గడ్డం
యాభైకి చేరువలో ఉన్న రాజు

ఈ నలుగురి ప్రేమ కథలనీ నాలుగు పేటలుగా అల్లుకొచ్చిన కథ ఇది.
అంతవరకూ బాగానే ఉంది.
అంతే కాదు, చాలా పకడ్బందీ గా స్క్రిప్టు రాసుకుని, దాన్ని అంతే క్రమశిక్షణతో తెరకి ఎక్కించారు. ఈ లక్షణం తెలుగు సినిమాల్లో చాలా అరుదు. అందుకు ఈ సినిమా బృందాన్ని, ముఖ్యంగా దర్శకుణ్ణి అభినందించాలి.
నాకు చాలా ఆశ్చర్యం కలిగించినది నటీ నటులు. ఎవరూ పేరొందిన నటులు కాదు. ఎక్కడో చదివిన విషయం, అసలు చాలా మంది నటులే కాదు అని. మరి ఈ పద్ధతిలో వెళ్లాలని సినిమా నాయకులు ఎందుకు అనుకున్నారో, ఆ మార్గంలో వాళ్ళు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో, నాకు తెలియదు గాని, ఫలితం మాత్రం అద్భుతంగా వచ్చింది. ఎక్కడా తడుముకున్నట్టు గానీ, ఎబ్బెట్టుగా ఉన్నట్టు కానీ అనిపించలేదు సరికదా, ఎంతో సహజంగా ఉండి, సాధారణ కమర్షియల్ ఓవరాక్షన్ నించి బాగా తెరిపి ఇచ్చింది.
దీనికి కూడా వీరిని అభినందించాలి.

సమస్య ఎక్కడ మొదలయ్యిందంటే, సినిమా ముగింపుకి దగ్గరవుతున్నాం అనుకునే లోగా మొదటి మూడు కథలూ నిరాశగా ముగిసి పోయాయి. అందులో ఒకదానిలో ఆత్మహత్య, ఇంకో దానిలో హత్య - ప్రేక్షకుల మనసులో ఒక దిగులు, ఒక నిరాశ గూడు కట్టుకుంటూ ఉండగా నాలుగో కథ, యాభయ్యేళ్ళ రాజు కథ ముగింపు వేపు పరుగులు తీస్తోంది.
అది కూడా ఏమీ సుఖాంతమయ్యే సూచన కనబడ లేదు చాలా సేపు. అలా కొంత సేపు ఉత్కంఠ కలిగించి హమ్మయ్య సుఖాంతం చేసాడు పోనీ ఈ కథయినా .. ఇక కథ కంచికి మనం ఇంటికి అని మనం ఊపిరి పీల్చుకునే లోపల .. అప్పుడు వదులుతాడు మన మీదికి ఈ ట్విస్ట్.
రాజు నోటి ద్వారానే చెప్పిస్తాడు - సుందరం, జోసెఫ్, గడ్డం వేరు వేరు మనుషులు కాదు, రాజేనని.

దీనితో వచ్చింది బాధంతా.

రాజు ప్రేమ సఫల మయింది కదా అని సంతోష పడే లోపలే ఈ ట్విస్ట్ నా సెన్సిబిలిటీ కి ఒక చెంప పెట్టులా తగిలింది. ఒక విధంగా ముందటి కథల్లోని విషాదానికి దుఃఖింప జేసి దర్శకుడు నన్నొక వాజమ్మ కింద కట్టాడని అనిపించింది. కళలో ఉద్దేశించిన రసం సిద్ధించక పోతే, లేదా సరిగ్గా పోషించక పోతే అది రసాభాస. కళాకారుడు కావాలనే ప్రేక్షకుల దృష్టిని, తద్వారా అనుభూతిని తప్పుదారి పట్టిస్తే? ఇది కేవలమూ డిటెక్టివ్ సినిమాల్లో అటు ఇటు కథని మలుపులు తిప్పే రెడ్ హెర్రింగ్స్ లాంటిది కాదు కదా.  ఒక మాదిరి అతి తెలివితో ఈ ట్విస్ట్ చొప్పించి ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడు కోవడం ఒక ఆర్టిస్టిక్ దగుల్బాజీతనం.

ఇది ఈ సినిమా గురించి నా ముఖ్యమైన సమస్య. ఎంత సర్ది చెప్పుకున్నా దీని గురించి రాజీ పడలేక పోయాను. అప్పటిదాకా ఎంతో బాగా అనిపించినవన్నీ కూడా చిరాకుగా అనిపించాయి. సినిమా చూస్తుండగా పంటికింది రాయిలా ఇబ్బంది పెట్టిన కొన్ని చిన్నపాటి సమస్యలు ఇప్పుడిక పూర్తి స్థాయిలో సలపడం మొదలు పెట్టాయి.

మొట్ట మొదటగా - ఈ నాలుగు కథలూ ఒక మనిషివి అని సూచించే క్లూస్ ఏవీ సినిమాలో లేవు. ముఖ్యంగా ఆయా కాల పరిస్థితులను సూచించే దృశ్యాలు. రాజు ఇప్పటి వాడు అనుకుంటే, సుందరం కథ 80 లలో, జోసెఫ్ కథ 90 ల చివర్లో, గడ్డం గాడి కథ 2000 - 2010 మధ్యలో జరిగి ఉండాలి. సూచించ దలుచుకుంటే ఎన్నో లక్షణాలు ఉన్నాయి, కానీ అలా సూచించడం వాళ్ళ ఉద్దేశం కాదని తెలుస్తూనే ఉంది.

పిల్లవాడైన సుందరం తన ప్రేమ ప్రయత్నాల్లో తోలి విజయాలు దేవుడి ప్రసాదం అని నమ్మినట్టే, ఆ ప్రేమ ఘోరంగా విఫలమవడం కూడా దేవుడి శాపం వల్లనే, కనీసం దేవుడి నిర్లక్ష్యం వల్లనే అని నమ్మడం లో వింత ఏమీ లేదు. కానీ అటుపైన దేవుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సుందరం చేసిన పని ఏ మాత్రం సమర్ధనీయంగా లేదు. ఆ వినాయక చవితి బొమ్మ వాళ్ళ అమ్మ నాన్నలకి ఎంత ముఖ్యమో తెలియని పసివాడు కాదు. తద్వారా తండ్రి ఆత్మహత్య మన హృదయాలను కలిచి వేస్తుంది తప్ప సుందరాన్ని వీసమైన కదల్చినట్లు అనిపించదు. ఇదే మరి దగుల్బాజీతనం అంటే.

బహుశా హిందువుగా పుట్టి, పదేళ్ల వయసులో హిందువుగా ఉన్న సుందరం పాతికేళ్ల వయసులో క్రిస్టియన్ జోసెఫ్ గా ఎందుకు మారినట్టు. ఆ మార్పు కూడా పైన చెప్పిన హిందూ దేవుడి పై అపనమ్మకమో ద్వేషమో కలగడం వల్ల వచ్చినదేనా? అవునేమో అనుకోడానికి ఆస్కారం ఉంది. ఇక జోసెఫ్ పట్ల భైరవి ప్రేమ. సరే, ఆ వయసులో అటువంటి ఆకర్షణ కలగడం సహజం. నేను బ్రాహ్మణుల ఇంటి పిల్లని అని కచ్చితంగా చెప్పుకున్న భైరవి అంత సులభంగా నెత్తికి చున్నీ ముసుగేసుకుని సువార్త సభలకి ఎలా వెళ్లి పోతుంది? ఆ మాత్రం ఆత్మాభిమానం ఉండదా? అందులోనూ భైరవి లాంటి పిల్లకి?

ఆ భైరవి వాళ్ళ నాన్న అదే సమయంలో అదే వీధిలో లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మడానికి వచ్చి, క్లయంట్ కూడా క్రిస్టియన్ అని గ్రహించక వీధిలో జరుగుతున్న సువార్త సభ న్యూసెన్స్ గా ఉందని కామెంట్ చేసాడు. అదే ఒక మూర్ఖత్వం. వీధిలో సువార్త సభ జరుగుతోంది అంటే అది బహుశా క్రైస్తవులు ఎక్కువగా ఉండే వీధి ఏమో అనే స్పృహ ఉండక్కర్లేదా? తీరా క్లయంట్ తన పేరు వెల్లడించాక అతను క్రిస్టియన్ అని గ్రహించి సారీ అన్నాడు. అక్కడ జరుగుతున్న సోషల్ డైనమిక్స్ గమనిస్తే హైందవ బ్రాహ్మణుడు పరమత సహనం లేని జాత్యహంకారి. క్రిస్టియన్ క్లయంట్ అతని బలహీనతని అర్ధం చేసుకుని క్షమించే పరమ శాంత మూర్తి.  ఈ హాస్యాస్పదమైన తతంగం అంతా సాధారణంగా భారతీయ (అన్ని భాషల) సినిమాల్లో హిందువులకి, అందునా బ్రాహ్మణులకి వ్యతిరేకంగా జరుగుతన్న పాత్ర చిత్రణ మూసలోనే ఉంది. పైగా ఆ హైందవ బ్రాహ్మణ తండ్రి ఆత్మహత్య చేసుకుంటా అని కూతురుని బెదిరించి ఆమెకి బలవంతంగా వేరే పెళ్లి చేసాడు.

అటుపైన గడ్డం గాడి కథ. వాడి ప్రియురాలు సలీమా వేశ్య. మద్యం తాగుతుంది. అయినా వాడు ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటా అంటాడు. ఆమె కూడా వాడిని పరీక్షించి, వాడేమీ ఉత్తుత్తి సంఘ సంస్కరణ నినాదాలు పట్టుకుని వచ్చిన డొల్ల మనిషి కాదు అని రూఢి చేసుకుని పెళ్ళికి ఒప్పుకుంది. వచ్చిన గొడవేమిటంటే ఆమె ముస్లిం. ఇతను కూడా ఆమె చెయ్యి పట్టుకుని దర్గాలకీ మసీదులకీ వెళ్లి ప్రార్ధనలు చేసి వస్తాడు. పోనీ ఇంత చేసినా ఆ వాడ ముస్లిములకు జాలి కలగదు. ఎవరు చేశారో తెలియని పరిస్థితుల్లో సలీమా హత్య చెయ్యబడింది. పెళ్లి చేసుకోడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకి ఆమెని తీసుకెళ్లేందుకు వెదుకుతూ వచ్చిన గడ్డం గాడు, ఆమె శవాన్ని తీసుకెళ్లి ఖననం చేస్తాడు. అప్పటి దాకా జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటే, ఒక సగటు ప్రేక్షకుడిగా నాకు అనిపించింది, సలీమా ఇంటి చుట్టూ పక్కల ఉన్న ముస్లిం యువకులు, ముందు ఆమెను బెదిరించి, ఆమె మాట వినక పోయే సరికి ఆమెను హత్య చేశారని. ఐతే అదేమీ చూపించకుండా గాలిలో వదిలేసి దర్శకుడు ఏ ఆర్టిస్టిక్ ప్రయోజనం సాధించినట్టు?
దీన్నే దగుల్బాజీతనం అనేది.

నేను చదివిన ఒకటో రెండో సమీక్షలు ఈ సినిమా మంచి సందేశాల్ని ఇచ్చిందనీ, Such social messages are the need of the hour - అనీ తీర్మానించాయి.

ఎందుకు హిందూ మతం పట్ల ఇంత ద్వేషం?

నిజానికి రాజు ప్రేమ కథ నాకు చాలా నచ్చింది. రాజు కోసం ఆ మేడం కోసం సంతోష పడాలి అనుకున్నా.

నా వల్ల కాలేదు.

Comments

Ramarao said…
ఒక హిందూ మతం మీదనే కాదు... అసలు అన్ని మతాల మీద కూడా ఒక ఈ విధమైన నిరసన ప్రకటించింది ఈ చిత్రం.. అందుకే ఎవరికీ తగ్గకుండా అన్ని మతాలని కలుపుకు పోయాడా అని అనిపించింది.. ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి మూలకథను పక్కన పెడితే... కేవలం చెప్పదలుచుకున్న విధానానికి చాలానే మార్కులు ఇచ్చేయాల్సిందే...

మీరన్నట్టు ప్రేక్షకులను మోసం చేయడం అనేది మాత్రం చాలా పెద్ద విషయం..క్షమించరాని నేరమే...
శారద said…
ముందుగా welcome back.

నాకు ఈ సినిమా సందేశం కంటే ప్రేమ సార్వజనీకతను ప్రకటించిందనిపించింది. ఏ వయసులో కానీ, ఒక రకమైన అమాయకత్వం, నిష్కపటత్వం, అవతలి మనిషి మంచి కోరుకునే నిస్వార్థం వున్నదే ప్రేమ, అనే అర్థం నేను తీసుకున్నాను.
ప్రేమ పట్ల మన అవగాహనా, ఎక్స్పెక్టేషన్లూ వయసుతో పాటు మారుతూ వచ్చినా, దాని మౌలిక స్వరూపం మారదు, అని నా కనిపించింది, సినిమా చూసిన తరవాత.
హిందువులు/బ్రాహ్మణుల ఇన్సెన్సిటివిటీని హై లైట్ చేసే సన్నివేశాలూ సినిమాల్లోనూ, కథల్లోనూ ఇప్పుడు మామూలైపోయినవేమో.
చాలా మంది పొగడగా విని చూసిన సినిమా. నాకు సైద్ధాంతికంగా విభేధించాల్సిన అంశాలు ఎక్కువ వుండడంతో నేను కూడా రివ్యూ పెట్టలేదు. నా సమస్య మోసం అనే కాదు, ఈ 'ఒక్కడ' అనేవాడు ఎవాల్వ్ ఐన విధానం. రకరకాల వ్యక్తులని, వ్యక్తిత్వాలని ప్రేమించి రాజు అనే ఒక పరిపక్వత వచ్చిందా అంటే నాకు అక్కడ ఒక డిస్కనెక్ట్ కనిపిస్తోంది. బాగా తీసారనిపిస్తున్నా కన్విన్స్ అవ్వలేకపోయిన ఒక సినిమా..
హెలో,నమస్తే ఎలా ఉన్నారండి,బాగుంది మీ విశ్లేషణ.