చేత చిల్లికానీ లేదు-2

Being Broke - 2nd real life story


ఆరు నూరైనా నూరు ఆరైనా కాలేజిలో చదువుకోవాలనే నా జీవన ధ్యేయాన్ని సాధించి తీరాలనే దృఢనిశ్చయంతో ఉన్నాను నేను. అది 1957 సంవత్సరం. అప్పటికే నేవీలో సర్వీసు ముగించుకుని, జి. ఐ. చట్టం పుణ్యమా అని కాలేజిలో చదువుకోడానికి తగిన ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం నించి పొందాను. ఆ వార్త తెలియగానే నా ఆనందానికి హద్దులు లేవు. మా కుటుంబం మొత్తంలో నేనే మొదటి సారిగా కాలేజి చదువుకి వెళ్తున్నది. కేలిఫోర్నియా పశ్చిమ విశ్వవిద్యాలయంలో నమోదయ్యాను. ఆర్ధిక సహాయం అందుతున్నా, విశ్వవిద్యాలయంలో ఫీజులు, పుస్తకాల ఖర్చు, రాను పోను ఖర్చులన్నీ పోగా మిగిలిన సొమ్ము నిత్యావసరాలకు బొటాబొటిగా సరిపొయ్యేది. డబ్బు ఆదా చెయ్యడం కోసమని మా అమ్మావాళ్ళు అద్దెకున్న ఇంటిలోకే నేను కూడా చేరాను.

ఒక రోజున మా అమ్మ నన్ను పక్కకి తీసుకెళ్ళి మెత్తగా నచ్చజెప్పింది. నా చదువుకి ఇబ్బంది కానంత వరకూ, వారానికో నెలకో ఇంత అని నేనూ కొంత డబ్బు ఆవిడకి ఇస్తుంటే ఇల్లు గడవడానికీ, కుటుంబ సభ్యులందరికీ భోజనం పెట్టడానికీ ఆవిడకీ కొంచెం వెసులుబాటుగా ఉంటుందని. కేవలం నా గురించే, నా ఆశలు ఆశయాల గురించే ఆలోచిస్తూ ఉండిపోయినందుకు సిగ్గు పడ్డాను. సరేనమ్మా అని చెప్పి అప్పటి నించీ నా ఖర్చులే కొంచెం తగ్గించుకుని మా అమ్మ చేతులో నెలనెలా కొంత డబ్బు పెడుతుండేవాణ్ణి. అదైనా పెద్ద మొత్తమేమీ కాదు, ఏదో నాకు చేతనైనది ఇస్తుండే వాణ్ణి.

ఇంతలో క్రిస్మస్ వచ్చింది. మా ఇంట్లో పండుగ వాతావరణం అంతంత మాత్రమే. నిజానికి కొంత దీనంగా ఉందనే చెప్పాలి. ఇంటికంతటికీ మా నాన్న నెలజీతమే ఆధారం. నిత్యావసరాలు గడవటమే కష్టంగా ఉన్న స్థితిలో పండుగ హెచ్చులు ఎక్కడ సాధ్యం. పెద్దగా అలంకారాలు లేఖుండా బోసిగా ఉన్న క్రిస్మస్ చెట్టు కింద పేరుకి తలా ఒక బహుమతి మాత్రం పేరుకున్నాయి ఎలాగొలా. క్రిస్మస్ ముందు సాయంత్రం (క్రిస్మస్ ఈవ్) పూట అందరమూ చేరి బహుమతులు తెరవ సాగాము. చిన్న పిల్లలు ఇద్దరికీ కొత్త సాక్సు దక్కాయి. టీనేజిలో ఉన్న నా తమ్ముడూ, మా అమ్మా నాన్నా పుచ్చుకున్న బహుమతులు ఇంకా తక్కువ ఖరీదువి. అందరి బహుమతులూ తెరిచేసి, ఆ చిన్న గది అంతా రాపింగ్ పేపర్ తో నిండిపోయాక, మా వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చి నా బహుమతి నా చేతిలో పెట్టారు.

ఆ డబ్బా బాగానే పెద్దది గా ఉంది. నేను అందుకునే సరికి బాగా బరువుగా కూడా ఉంది. నా చుట్టూ అందరి మొహాల్లో ఒక ఉత్సాహంతో కూడిన ఉత్కంఠ. అలా అందరూ చూస్తుండగా నేను రాపింగ్ పేపరు చించి ఆ పెట్టె తెరిచాను. నిర్ఘాంత పోయాను. అందులో నిగనిగలాడుతున్న సరికొత్త స్మిత్-కరోనా టైప్ రైటర్!

అందులోనూ చాలా మంచి క్వాలిటీది, ఖరీదైనది. 
నివ్వెరబోయి అందరివేపూ అయోమయంగా చూశాను. మా అమ్మా నాన్నా నా చెరోవేపు వచ్చి నా బుజాలు నిమిరారు. కాలేజిలో చేరావు కదా! ఆ పెద్ద పెద్ద రిపోర్టులూ అవీ చేత్తో రాయలేవు. కాలేజి విద్యార్ధికి టైప్ రైటర్ ఉండాలి. బాగా చదువుకో! అన్నారు. నా తమ్ముళ్ళు ముగ్గురూ సంతోషంతో చప్పట్లుఇ కొట్టారు. 

కూటికి కటకటలాడుతున్న ఆ పరిస్థితుల్లో మా వాళ్ళు ఎలా టైప్ రైటర్ కొన్నారో ఎప్పుడూ నాకు చెప్పనే లేదు.

ఆరు దశాబ్దాల తరవాత ఇప్పటికీ ఆ సంఘటన తల్చుకుంటే నా కళ్ళు చెమర్చుతాయి. 

Comments

Varaprasad.k said…
నాటి జీవన గాథలు,ఆర్థిక పరిమితిలో సాగే సామాన్యుల చదువులు, వారి అనుబంధాలు చక్కగా తెలియ చేశారు.