ఇది మిత్రులు Ravi Env, Avineni N Bhaskar మొదలు పెట్టిన ఆలోచనాస్రవంతికి కొనసాగింపు.
Ravi's FB post
Bhaskar's FB post
తెలుగు వారికి, మనకి అంటూ ఒక సంగీత సంప్రదాయం ఉండేది. ఉదాహరణకి, దీని ప్రస్తావన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కథల్లోనూ, వారి ఆత్మకథలోనూ కనిపిస్తుంది.
కానీ అదిప్పుడు అంతరించిపోయిందని నా అనుమానం. కనీసం కచేరీ వేదికల మీద అయితే మాత్రం కచ్చితంగా లేదు. ప్రస్తుతం విరివిగా పాడుతూ, సంగీత విద్వాంసులు అని మనం తలుచుకునే తెలుగువారందరూ, పుట్టుకకి తెలుగువారే గాని వారి సంగీతం తెలుగు సంగీతం కాదు.
ఉదాహరణకి మల్లాది సోదరులని తీసుకుందాం.
వారు ముఖ్యంగా తండ్రిగారి వద్దా, తరవాత నేదునూరి కృష్ణమూర్తిగారి వద్దా నేర్చుకున్నారు. తండ్రి మల్లాది సూరిబాబుగారు రేడియో వృత్తిలో వోలేటి వారి దగ్గర శిష్యుడిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అంచేత రెండు దారులనుండీ మల్లాది సోదరుల సంగీతం వృద్ధి చెందింది శ్రీపాద పినాకపాణి గారి బాణీలో.
పినాకపాణి గారి కచేరీలు నేను నేరుగా గానీ, రికార్డింగులో కానీ పెద్దగా వినలేదు. నా దగ్గర ఉన్న కొద్దిపాటి రికార్డింగులు ఆయన సంగీత సాగరం లోనించి ఒక్క బిందువు కూడా కాదని నా నమ్మకం. కానీ వోలేటి వారిని, నేదునూరి వారిని పుష్కలంగా విన్నాను. వారి సంగీతానికి వీరాభిమానిని కూడా. కానీ వాస్తవం కఠోరంగానే ఉంటుంది. ఇద్దరూ కూడా కృతుల ఉచ్చారణలో, పద విభజనలో సాహిత్యం పట్ల తగినంత శ్రద్ధ చూపలేదనే నా అనుభవం. వోలేటి వారయితే కొన్ని చోట్ల వాక్యం మొత్తం మరిచిపోవడమో తప్పు పాడడమో జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేదునూరి వారి గాత్రంలో, ముఖ్యంగా త్యాగరాజ కృతుల్లో, తాళం ప్రకారం వచ్చే విరామానికి విలువ ఇచ్చినట్టు సాహిత్య పద విభజనకి విలువ ఇవ్వలేదనేది స్పష్టం. (ఉదా. నగుమోము లో అనుపల్లవిలో నగరాజ దగ్గర వచ్చే విరామం) అంతేకాక, వీరిద్దరూ, అటుపైన తరువాతి తరాల ప్రముఖ గాయకులూ అందరూ కూడా మద్రాసు వేదికల మీద పేరు సంపాయించుకున్న వారే.
డబ్బున్న రసికులు మెచ్చేదే కళ కాబట్టి ఆ విధంగా కూడా వారి సంగీతం మదరాసు సంగీతం అయిందే తప్ప తెలుగు సంగీతం కాలేదు.
ముక్తాయింపుగా .. ఈ విషయమ్మీద ఎప్పుడూ చెప్పేదే మరోసారి చెబుతున్నాను. ఎప్పుడైతే తెలుగువారము మన సంగీతానికి ఆర్ధిక అవలంబన ఇవ్వటం మానివేశామో, అప్పుడే ఇటువంటి విషయాలని గురించి డిమాండ్ చేసే అర్హత కోల్పోయాం. మా త్యాగయ్య, మా అన్నమయ్య .. హయ్యో! అని ఆక్రోశించడమే మనకి మిగిలింది. మదరాసు వేదిక మెచ్చిందే సంగీతం! అయ్యా, అదీ సంగతి!!
Comments
~సూర్యుడు
2) I have reservations on dual singing. ఇద్దరు కలిసి పాడడం వల్ల మాటలు అర్థమవ్వటం మరింత కష్టం. జంట గాయకు(ను)లు పాడే పద్ధతిలో కూడా కొంత మార్పు రావాలి అనిపిస్తుంది. ఒకరు ఒక phrase పాడితే రెందవ వారు గా తరువాతి పదం అందుకుంటూ...
3) అరవ గాయకులు సంగీతానికి పూర్తి న్యాయం చేసినా , తెలుగు శ్రోతలకు మాత్రం వారి ఉచ్చారణ శైలి నచ్చదు .
4) ముద్దుస్వామి, సదాశివ బ్రహ్మేంద్రస్వామి సంస్క్రుత కీర్తనలు, MSS విష్ణు సహస్రనామం, ఇతర స్తోత్రాలు అర్థం కాకపోయినా అమృత తుల్యమైన శబ్ద , సంగీత సౌందర్యంతో రసానందం కలిగిస్తాయి.
5) బాలమురళీ కృష్ణ సంగీత సాహిత్యాలు రెంటికీ సమన్యాయం చేశారు అనిపిస్తుంది. వోలేటి శైలి నాకు నచ్చుతుంది. స్వరకల్పన, నెరవులు, ఆలాపన short and sweet గా ఊంటాయి. violin support, తని ఆవర్తనం కూడా brief గా ఉంటేనే బాగుంటుంది.
6) కీర్తనలు పాడడం వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో సాహిత్యానికి పెద్దపీట వేస్తూ గమక ప్రాధాన్యాన్ని తగ్గించి, ఆలాపన నెరవులు, స్వరకల్పన పాడినప్పుడు తమ తమ సంగీత ప్రతిభ చూపితే బాగుంటుందా? కచ్చేరీలు చేసే మహా గాయకులే ఇటువంటి liberties తీసుకోగలుగుతారు.
కొత్తపాళీ గారు : ఒక మంచి point ప్రస్తావించారు. సుదీర్ఘ వ్యాఖ్య అయిపోయింది.
నేను విన్నవాటిల్లో egregious అనిపించిన ఉచ్చారణా దోషాలు:
1. TM కృష్ణ: "ఇంద్రుని బాననా" (ఇందునిభాననా), "సరస సల్లాభం" (సరస సల్లాపం)
2. రామవర్మ: "అన్నపూర్ణే నిషాలాక్షీ" (unforgivable, this one is)
3. రంజని హెబ్బార్ గురుప్రసాద్: "నీ చరణాంబుదము" (నీ చరణాంబుజము), "భగవానికి సోదరుడని" (పగవానికి సోదరుడని), "తారా ధనయులు" (దారా తనయులు")
4. బాంబే జయశ్రీ: "మేరు సమాన ధీర" చరణం (She just roughed it up: "అలగల ముద్దులు తిలక పుదీరులు తలుకూ జెకీలచే తనరు నెమ్మోమును", "కనీ ద దుర్మానవ")
బాలమురళి పాటల్లో నాకు వినిపించినవి: "ముఖ పీఠం" (ముఖ పీతం), "నిటిల చంద్ర దండం... విధృతేక్షు ఖండం" (ఖండం, దండం తారుమారు).
పినాకపాణిగారి "నారదముని" అనే ఆల్బంలో "పంచాశత్ పీఠరూపిణీ" పాడుతూ, "దేవరాజముని శాపమోచితే, దేవగాంధారి రాగపూజితే" దగ్గరికొచ్చేసరికి కన్‌ఫ్యూజయిపోయారు. "దేవరాగ, దేశగాంధారి" అంటూ గిరికీలు కొట్టారు కాస్సేపు. But then, he considered the సాహిత్యం to be just "పిప్పి", right?
KVN seems to be one of those musicians who always rendered the saahityam right. May be, I didn't listen enough. :)
మంచి సమర్థులైన టి. ఎం. కృష్ణ లాంటి సంగీతజ్ఞులు కూడా సాహిత్యం విస్మరించటమే కాకుండా, అది ఏ మాత్రం ముఖ్యం కాదు అని వాదించటం కొంచెం బాధాకరమైన విషయం. "గురులేక ఎటువంటి గుణికి తెలియగ బోదు" బదులు "తెలియక పోదు" అని పాడితే అర్థమే మారిపోతుంది. సంగీతజ్ఞులు సాహిత్యానికి సరైన ప్రాముఖ్యత ని ఇవ్వాలి. సాహిత్యాన్ని సంగీతం పరిమళింప చేయాలి కానీ, సంగీతానికి తగ్గట్టు పదాలు విరిచి అపభ్రంశం చెయ్యటం, అదీ తెలుగు వాళ్ళు చెయ్యటం విచారకరం.