మెక్సికో అప్సరస

సన్ పత్రికలో ఒక కథనం

నాకు పదిహేనేళ్ళప్పుడు మా కుటుంబం అంతా మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీకి ఒక వారం పాటు వెకేషన్‌కి వెళ్ళాం - మా నాన్న, మా మారుటి అమ్మ, నా ఇద్దరు తమ్ముళ్ళు, నేనూ.

ప్రయాణంలో ఉండగా మా నాన్న మాకు పదే పదే చెప్పారు, అక్కడి మంచి నీళ్ళు తాగవద్దని. తాగితే గనక మాంటజూమా పగ అనబడే భయంకరమైన పొట్టనెప్పి విరేచనాల జబ్బు పట్టుకుంటుందని. దానికి తగినట్టుగానే మేము చాలా జాగ్రత్తగా డబ్బాల్లో సీసాల్లో అమ్మే సోడాలు మాత్రమే తాగుతూ వచ్చాం ఐదురోజుల పాటు. రకరకాల ప్రదేశాలు చూశాం. రాత్రుళ్ళు నేనూ, నా తమ్ముళ్ళూ మా గదిలో ఎకసెక్కాలాడుకుంటూ, సరదా యుద్ధాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నాం.

ఐదోరోజు రాత్రి భోజనానికి ఒక మంచి రెస్టారెంటుకి తీసుకెళ్ళారు మా నాన్న. అక్కడ ఒక చిన్న స్టేజి. దాని మీద ఒక చిన్న మ్యూజిక్ బేండ్. ఆ బేండ్ లో పాట పాడుతున్న అమ్మాయి .. బహుశా పాతికేళ్ళుండచ్చు. చాలా అందంగా ఉన్నది. అంతకన్నా అందంగా అలంకరించుకున్నది. భుజాలు లేని ఎర్ర రంగు శాటిన్ గౌనులో, అలల్లా ఎగిసిపడుతున్న నల్లటి కురులతో అప్సరసలా కనబడుతోంది, కిన్నెరలా పాడుతోంది.

మా నాన్నే అందరి తరపునా ఆర్డరిచ్చారు. నా ముందు పెట్టిన వంటకం .. దాని పేరేమిటో, అందులో ఏముందో కూడా పట్టించుకోకుండా యాంత్రికంగా నముల్తూ ఉన్నా .. ఆ అప్సరసనే చూస్తూ. కొంత సేపయ్యాక ఆమె పాట పాడుతూనే స్టేజి దిగి ఒకటి రెండు టేబుల్స్ దగ్గర ఆగుతూ మా టేబుల్ దగ్గరికి వచ్చింది. నా కళ్ళు ఆమె చూపుల వలలో చిక్కుకు పోయాయి. ఆమె పాడుతున్న స్పానిష్ గీతం తేనెలా మధువులా నన్ను మంత్ర ముగ్ధుణ్ణి చేసేస్తోంది. నా మీద ఆమె కలిగిస్తున్న ప్రభావాన్ని ఆమె కూడా గ్రహించిందేమో అన్నట్టు టేబుల్ దగ్గరున్న మిగతా వారందరినీ వదిలేసి ఆమె నన్నే చూస్తూ పాడుతోంది. మా నాన్నా అమ్మా ఈ తమాషా అంతా చూస్తూ ముసిముసిగా నవ్వుకోవటం నాకు కనిపిస్తూనే ఉంది. ఇటు పక్కన నా తమ్ముళ్ళిద్దరూ నా అవస్థ చూస్తూ, పైకి ఏమీ అనకపోయినా .. రాత్రికి నీ పని పడతాములే .. అన్నట్టు తమలో తాము సైగలు చేసుకోవటమూ నా దృష్టిని దాటి పోలేదు. కానీ ఆమె పరిచిన మాయాజాలం మబ్బులా నన్నావరించి పోయింది. పాట ముగిస్తూ ఆమె నా ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా తట్టి తిరిగి తన స్టేజి మీదికి వెళ్ళిపోయింది.

ఆ రోజు రాత్రి మా హోటలు గదిలో నా తమ్ముళ్ళ ఎకసెక్కాలకంటే ఎక్కువగా బాధిస్తూ .. నా కడుపులో పోట్లు. వెంటనే టాయిలెట్టుకి పరిగెత్తాను. అప్పుడు గ్రహించాను .. ఆ అప్సరస మాయలో పడి అక్కడ గ్లాసులో పెట్టిన నీళ్ళు తాగేశానని.

ఆ రాత్రి మాంటెజూమా నా మీద పూర్తిగా పగ తీర్చుకున్నాడు.

Comments

Unknown said…
ఇది మీ అనుభవం అనుకుని నేను ముచ్చటపడేలోపు ఇది అనువాదం అని తెలిసింది :)