కబుర్లు - ఏప్రిల్ 10

అరెరే, చూస్తూనే గతవారం కబుర్లు మిస్సయ్యాను. మిస్సవడమే కాదు .. అప్పుడప్పుడూ ఒక్కో సారి కుదరక పోవచ్చు .. కానీ మిస్సయ్యాననే స్పృహకూడా లేకపోయింది చూశారూ, అదీ దారుణం! ఇంతా చేసి గత వారంలో బుధ వారం నాడు గానీ, గురువారం నాడు గానీ ప్రత్యేకంగా వెలగబెట్టిన ఘనకార్యమేదీ లేదు. ఇదిగో ఇలాగే అయిపోతుంది, ఏమి చేస్తున్నామో స్పృహలేకుండా చేసుకుంటూ పోతుంటే.

తానా పత్రిక ఏప్రిల్ సంచిక అచ్చులో వెలువడింది. నాకు నేను చెప్పుకోవడం కాదుగానీ, చాలా బాగా వచ్చింది. వెబ్ సంచికని తానా వెబ్ సైటులో పొందవచ్చు.
మీరు కినిగే వినియోగదారులైతే అక్కణ్ణించి కూడ ఉచితంగా దింపుకోవచ్చు.

ఈ సారి కబుర్లు చెప్పడానికి నిన్న భలే గమ్మత్తయిన అనుభవం జరిగింది.

మిసోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్ నగరం దగ్గర ఉన్న వెంట్జ్ విల్ అనే పల్లెలో, జెనరల్ మోటర్స్ వాళ్ళ అసెంబ్లీ ప్లాంటులో మీటింగు కోసం నిన్న వెళ్ళాను. ఏదో కొద్ది గంటల మీటింగు, పర్లేదని చెప్పి సాయంత్రం ఆరున్నర ఫ్లైటుకి తిరుగు ప్రయాణం బుక్ చేసుకున్నా. అవసరమైన సమయానికంటే కొంచెం ముందే తిరుగు ప్రయాణానికి సెయింట్ లూయిస్ విమానాశ్రయానికి చేరుకున్నాను కూడాను. బోర్డింగ్ పాస్ తీసుకుని డెల్టా గేటు దగ్గరికి వెళ్ళాను. అంతా సవ్యంగానే ఉన్నది. తినడానికి ఏదన్నా తెచ్చుకుందామని ఓ ఇరవై గజాల అవతల ఉన్న రెస్టారెంటుకి వెళ్ళాను. ఇంతా చేసి నేను గేటుకి దూరంగా వెళ్ళింది అరగంట కూడా ఉండదు. భోజనం తెచ్చుకుని గేటు దగ్గరికొచ్చే సరికి అంతా ఖాళీగా ఉంది. డెస్కు వెనకాల ఏజెంటు అమ్మాయి ఏదో కంప్యూటరు మీటలు నొక్కుతోంది. నాకు అనుమానమొచ్చి ఆమెని అడిగాను, ఇదేంటి, అందరూ ఏమైపోయారు అని. విమానం వెళ్ళిపోయిందని చెప్పింది. అదేంటి, ఇంకా పావుగంట పైగా టైముంది కదా అన్నా విస్మయంతో. అదేదో వాతావరణ హెచ్చరిక వచ్చింది, అందుకని ప్రయాణ ముహూర్తాన్ని అరగంట ముందుకి జరిపారు. అక్కడికీ నాలుగు సార్లు మైకులో ప్రకటించాం .. ఇలా ఏదో సోది చెప్పుకొచ్చిందామె. ఆమె చెప్పే సోది ఏదైనా, పర్యవసానం ఏంటంటే నేను ఎక్క వలసిన విమానం నేను లేకుండానే బయల్దేరి వెళ్ళిపోయింది. మరి నా సంగతేవిటి అన్నా. ఈ రాత్రికి ఇంకేమీ లేవు, కావాలంటే రేప్పొద్దున్నే ఆరున్నర విమానంలో ఖాళీ ఉందేమో చూస్తానంది.

తల్లీ, నేను కేవలం ఒక్క రోజుకోసం వచ్చాను. ఒకేళ మీరు హోటలు గది ఇచ్చినా, నాకు వేసుకోడానికి వేరే బట్టలు కూడా లేవు. ఎలాగైనా ఈ రాత్రికి నేను ఇల్లు చేరే మార్గం చూడు అన్నా. ఏంటో చాలా సేపు మీటలు నొక్కింది, నిట్టూర్చింది, తల్లకిందులైంది - మొత్తానికి ఇక యేమీ లేదు అని తేల్చింది.

ఇంతలో పక్క డెస్కులో పని చేస్తున్న ఆమె వచ్చి, ఉండు ఒక్క నిమిషం - ఇప్పుడే డెట్రాయిట్ కోసం ఏదో కనబడింది అని ఎవరికో కాల్ చేసి మాట్లాడి, మళ్ళీ కాసేపు మీటలు టక టకలాడించి, మొత్తానికి ఓ పది నిమిషాల తరవాత ఒక బోర్డింగ్ పాస్ నా చేతిలో పెట్టింది. ఆమె చెప్పగా నాకర్ధమైన సారాంశం - మామూలుగా ఐతే నేనెక్కవలసిన విమానమే ఆఖరుది. కానీ ఇవ్వాళ్ళ ఏదో జరిగి డెల్టా వాళ్ళు రాత్రి తొమ్మిదిన్నరికి ఈ కొత్త విమానాన్ని టైం టేబుల్లో చేర్చారు. ఆ చేర్చడం కూడా, ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే జరిగింది. అంచేత ఫ్లైటు ఉంది. ఇదిగో మీ బోర్డింగ్ పాస్ - అని చెప్పి ఆమె, ఆమె సహోద్యోగిని ఇద్దరూ వెళ్ళి పోయారు.

సరే ఇంక చేసేదేమీ లేక, అక్కడే చతికిల బడి చదువుకుంటూ కూర్చున్నా. ఓ గంట అయ్యాక గమనిస్తే, చుట్టూతా కాంకోర్స్ అంతా ఖాళీ అవుతోంది. అప్పటిదాకా కిటకిటలాడిన రెస్టారెంట్లు మూత వేసేందుకు సూచనగా కడుగుళ్ళు తుడుపుళ్ళు సాగిస్తున్నారు. డెల్టా గేట్లు వేటి దగ్గరా ఎవరూ లేరు. ఒక సమాచార దర్పణం దగ్గిరికి పోయి చూశా. అందులో నా ఫ్లైటు సమాచారం లేదు. నాకు మళ్ళీ అనుమానమొచ్చింది. ఇంత సేపూ ఇక్కడ కూర్చోవడం వృధా ప్రయాసేనేమో, నిజంగా ఫ్లైటు ఉన్నదో లేదోనని. డెల్టా వాళ్ళకి ఫోన్ చేశా. ఎత్తిన పిలగాడు మీ ఫ్లైటు ఉండడం నిజమే. దానిలో మీకు సీటుండడం నిజమే. కానీ అది ఏ గేటు దగ్గర్నించి బయల్దేరుతుందో మాత్రం మేము చెప్పలేక పోతున్నాం. అక్కడే ఎవరన్నా డెల్టా ఏజెంటుని కనుక్కోండి అని ఉచిత సలహా చెప్పాడు. 

ఇంతలో నేను కూర్చున్న చోట ఉన్న గేటుకి ఒక కుర్ర ఏజెంటు వచ్చాడు. ఏదో ఫ్లైటు దిగబోతోంది. అతన్ని కనుక్కున్నా. అతనూ తన మాయా దర్పణంలో చూసి ఫోను వాడు చెప్పినదాన్నే ధృవీకరించాడు. మరి ఏ గేటో తెలియాలి కదా అన్నా. అతను కొంచెం సేపు ఆలోచించి - డెట్రాయిట్ నించి ఒక ఫ్లైటు వస్తున్నది. బహుశా అదే విమానం తిరిగి వెళ్తుందేమో. అది యే గేటుకి వస్తున్నదో చూద్దాం అని మూడో నెంబరు గేటుని నిర్ధారించాడు. అతను చెప్పింది నాకు సబబుగానే అనిపించింది. అతని ఫ్లైటు దిగిన వాళ్ళందరూ వెళ్ళిపోయి, అతని పని ముగిసినా - ఇంకొంత సేపు ఉండగలవా అని అడిగాను. సరే ఉంటానన్నాడు.

ఇద్దరమూ మూడో నెంబరు గేటు దగ్గర కూర్చున్నాము. పావు తక్కువ తొమ్మిదయింది. ఇంతలో ఈ డెట్రాయిట్ విమానాన్ని రిసీవ్ చేసుకోవలసిన ఏజెంట్ వచ్చాడు. అతనితో నా విషయం చెప్పాను. అతని విస్తుపోయాడు. ఇప్పుడిలా దిగబోతున్న విమానం రాత్రంతా ఇక్కడుంది పొద్దున్నే వెళ్తుంది తప్ప వెంటనే డెట్రాయిట్ వెళ్ళదే అన్నాడు. ఏమో మరి, మీ వాళ్ళే ఈ బోర్డింగ్ పాస్ ఇచ్చారు అన్నా. నాకు తోడుగా ఉన్న కుర్రోడు కూడా చెప్పాడు తాను సిస్టంలో చూశానని. అప్పుడు అతనూ చూశాడు. నిజమే, ఫ్లైటు నమోదై ఉన్నది. అందులో నా పేరున్నది. నా ఒక్ఖడి పేరే ఉన్నది. అవును - అక్కడ డెట్రాయిట్ వెళ్ళ వలసిన ప్రయాణికులు ఇంకెవరూ లేరు.

ఇంతలో ఆ రావలసిన ఫ్లైటు రానే వచ్చింది. ఇక్కడ ఉన్న ఇద్దరికీ తోడు ఒక సీనియర్ ఏజెంటు ఒకామె కూడా వచ్చింది. ఆమె నా కథ అంతా మళ్ళి విని, సిస్టంలో చూసి, మళ్ళీ ఎవరితోనో మాట్లాడి, కాసేపు బుర్ర గోక్కుంది. ఏవిటి విషయం అంటే .. విమానం ఉంది, నువ్వూ ఉన్నావు. సిస్టంలో నువ్వు ఆ విమానంలో వెళ్తున్నట్టు ఉంది కానీ, ప్రయాణికులని విమానంలోకి అనుమతించే సిస్టంలో (గేటు దగ్గర బోర్డింగ్ పాస్ ని స్కాన్ చేసేది) మాత్రం ఈ విమానంలో ప్రయాణికులు వెళ్తున్నట్టు నమోదు కాలేదు. అని కాసేపు ఆలోచించి - ఏమైతే అయీందిలే, వెళ్ళి కూర్చో అని నన్ను ఆఖరికి విమానంలోకి అనుమతించింది. ఇంతలో బయటికొచ్చిన కో పైలట్ కి విషయమంతా చెప్పింది.

అలా సుమారు వంద మంది ప్రయాణించే ఫ్లైటు మొత్తానికి, నేనొక్కణ్ణే ప్రయాణికుడిగా రాత్రి పన్నెండింటికి డెట్రాయిట్లో దిగాను. నాకు సహాయం చేసిన డెస్క్ ఏజెంట్లు, విమానం సిబ్బందీ అందరూ ఏకగ్రీవంగా చెపారు, ఇట్లాంటి అనుభవం వాళ్ళకి ఎక్కడా తగల్లేదని. 

నన్ను క్షేమంగా .. అపురూపంగా ఇంటికి చేర్చిన డెల్టా సిబ్బందికి .. మనస్పూర్తిగా ధన్యవాదాలు.

Comments

Anonymous said…

జీవితం లో ఇట్లాంటి 'చార్టర్డ్ ఫ్లైట్ అనుభవం వేరే ఎవ్వరికి దొరకదు అనుకుంటా !!

రెండు, మీరు ఒక్కరే పెసంజరు అయినా విమానాన్ని నడిపేరు చూడండీ అదీ మరీ విశేషమే !

మూడు, అమెరికా లో కూడా ఇట్లాంటి కంఫ్యూషన్ ఉంటుందంటే మరీ ఆశ్చర్యం గా ఉంది ! (అయినా మరి అమెరికా ఈ భూప్రపపంచం లో లేదా మరి అనమాకండీ ! - !!)

జిలేబి
Madhu Pemmaraju said…
గురూజీ! మీకు టెన్షన్, మాకు సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది.. హల్లో ఒక్కడినీ కూర్చుని సినిమా చూసాను కానీ ఎప్పుడూ ఒక్క పాసేంజర్తో ఫ్లైట్ వెళ్లిందని వినలేదు..ఇప్పుడే మొదటిసారి చదివాను :-)
Kottapali said…
జిలేబి గారు, నా ఒక్కడి కోసం ఫ్లైటు నడపలేదు. ఎలాగా విమానం వెళ్తోంది గదాని నన్నూ అందులో వెళ్లనిచ్చారు. అదైనా సామాన్యమైన విషయం కాదనుకోండి. ఠాట్, కూడదు అంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు.

మధు గారు, ఆ విమానం ఎక్కి కూర్చుని అది బయల్దేరే దాకా నాక్కూడ పిచ్చ సస్పెన్సే:)
chavera said…
1999 లో ఆర్మీ లో ఉండగా ఒక అర్ధ రాత్రి, డీల్లీ నుంచి అహ్మెదా బాద్ కి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వి.ఐ.పి ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ లో రావలిసిన వి.ఐ.పి వ్యక్తి రానందున,
నన్నొక్కడినే (వి.ఐ.పి గా) తీసుకెళ్ళిన విషయం గుర్తుకొచ్చింది. UNIQUE EXPERIENCE.
Akshith my son said…
అనుకోని అవకాశం, అద్భుత ప్రయాణం.
Anonymous said…
అందుకే అంటారు... దేనికైనా పెట్టిపుట్టాలని...
Oh, nice experience andi !!
అగ్రరాజ్యం అమేరికాలో ఇలాంటి మహారాజయోగం ఒక్ఖ భారతీయునికే, అదీ.. ఒక్ఖసారే సంభవిస్తుందని Nostradamus ముందే చెప్పేశారండీ. మాయాదర్పణం, సమాచార దర్పణం, మీటలు నొక్కడం... ఓహ్, ఇలాంటి తెలుగు పదాల్ని వింటే మా ఈనాడు వాళ్లు సగం చెవి అప్పటికప్పుడే, అక్కడికక్కడే కోసేసుకుంటారండీ :-))
తృష్ణ said…
Seat seat pe likha jaanewale ka naam :-)
(Daane daane pe likhaa hai khaanewale ka naam)
Unknown said…
మీరు పడ్డ ఇబ్బందులని పక్కన పెడితే.....అంత పెద్ద ఫ్లైట్లో మీరొక్కరే వెళ్ళటం..థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా సర్? మీ కబ్బుర్లు భలే ముచ్చటగా ఉన్నాయి సర్
Kottapali said…
chavera .. బాగుంది మీ అనుభవం. ఈ మధ్యన దేశాంతర ప్రయాణాల్లోనూ, స్థానిక విమానాల్లో కూడా రకరకాల సీట్ల విభాగాలు ఏర్పడడంతో, కాస్త మంచి సీటు (ఉదాహరణకి ఎగ్జిట్ రో సీటు) ఖాళీగా ఉన్నా సరే, మన టిక్కెట్టు అది కాకపోతే అందులో కూర్చోనివ్వడం లేదు. అది కాక గేటు దగ్గర ఏజెంట్ల ముభావ వైఖరి జగద్విదితం. ఈ రెండు అనుభవాల నేపథ్యంలో మొన్న నాకు జరిగిన అనుభవం నిజంగా అపురూపమే.
ranitha, harephala .. నెనర్లు. ఇంతకు మునుపు కొన్ని అంతర్జాతీయ ప్రయాణాల్లో అనుకోకుండా మొదటి తరగతి వైభోగం దక్కింది, కానీ ఇది మాత్రం నిజంగా అపురూపమైన అనుభవం.
నాగరాజ్ గారు, నా బ్లాగుకి స్వాగతం. నోస్ట్రడేమస్ ఇటువంటి మంచి ఫలితాలని కూడా చెప్పాడంటే .. భవిష్యత్తు బాగుంటుందన్న మాటే. మీరు నా బ్లాగుని కొద్దిగా పరిశీలిస్తే, నా తెలుగుని సజీవంగా ఉంచుకోడానికి నే చేస్తున్న అనేక ప్రయత్నాల్లో ఇదొకటని మీకు తెలుస్తుంది. ఇక పాత్రికేయులు రాసే తెలుగంటారా .. ఎందుకు లేండి, కడూపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది :)

Kottapali said…
Trushna .. good one :)
Suresh K - thank you. Glad you enjoyed it. Yes, it was a thrilling experience.
Anonymous said…
Sir, I had almost similar experience once
I did not miss the flight like you. It happened few years ago. I Was traveling from Detroit to Greensboro,NC. I had to change in Baltimore. First flight dropped me off at Baltimore, late in the day around 6 PM.
I was sitting at the gate for the next flight waiting, waiting ...fell asleep. I started in Detroit after 36 hours very busy work shift. When I woke up it was half hour past the take off time ..8:30 pm.
Nobody to be seen around. No passengers or staff at the gate..deserted place ..nervous and anxious..
I assumed the flight left and nobody bothered to wake me up...well , who cares this is not India. Tried to talk to a couple of people but no luck...they were all airport cleaners. I had nothing with me like you. I checked the only bag I had, cell phone battery died awhile ago..
To make it short..couldn't control sleep and slept again hoping something will happen in the morning.
When I woke up two airline staff were frowning on me..
It was 10:30 night , not AM. They dragged and dumped me in a seat...I was the only passenger booked on that flight. It came late from some city
So I didn't miss the flight. Had the pleasure enjoying nice sleep in a chartered flight..
Sujatha said…
మీ వ్యాసాలన్నీ చాలా బావున్నాయి. మీ బ్లాగు కూడా! మీతో మాట్లాడాలని చిన్న కోరిక.కుదిరితే ఫోన్ లేదా ఇమైలు ..
Kottapali said…
సుజాత గారు, సంతోషం. మాట్లాడ్డానికేం భాగ్యము. తప్పకుండా మాట్లాడవచ్చును. కానీ ఫోను - మెయిలు అనే ముందు మన మెయిలు ఎడ్రసు ఇవ్వడం మర్యాదేమో! :)