కబుర్లు - మార్చి 20

ఇవ్వాళ్ళ పొద్దున కంప్యూటర్ తెరవంగానే గూగుల్ వాడు ఓ బుడబుక్కలాడి లాంటి బొమ్మొకటి పెట్టాడు. ఏంటబ్బా అని విచారిస్తే .. ఇవ్వాళ్ళ వెర్నల్ ఈక్వినాక్సుట .. అంతే కాక, అమెరికాలో సాధికారికంగా వసంతకాలపు ప్రారంభం. నేను పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదువుకున్నా. భూగోళ శాస్త్రంలో ఇవన్నీ చదువుకున్నట్టే గుర్తు గానీ ఈక్వినాక్సునీ, సాల్‌స్టిసునీ తెలుగులో ఏవంటారో గుర్తు రావట్లేదు. సరే పోనీండి. మనం సోషలు అంత శ్రద్ధగా చదువుకున్నామన్నమాట!

సరే వసంతకాల ఆరంభం అన్నారు గదాని సుమారు ఏడింటికి మా జోర్డను గాణ్ణి (కుక్క పిల్లని) తీసుకుని వాక్ కి బయల్దేరా. ఇల్లు దాటి నాలుగడుగులు నడిచేటప్పటికి పైనించి సన్నటి మంచు తుపరలూ, ఈ సైడునించి ఆ సైడుకి పీక కోసినంత పదునుగా రివ్వున చల్లగాలీ. జోర్డనుగాడీక్కూడా చలి తగిల్నట్టుంది, ఒక్క నిమిషంలో పని పూర్తిచేసి ఇంటి తలుపుకేసి పరిగెత్తాడు. సరే, ఏప్రిల్ దాటే దాకా ఇది మా ఊళ్ళో మామూలే. పెద్దగా ఆశ్చర్య పడలేదు.

ఏ న్యూసు ఛానల్ చూసినా ఏమున్నది గర్వకారణం అని న్యూసు చూడ్డమే మానుకున్నాను, కానీ ఈ మలేషియన్ విమానం మాయమవడం నిజంగా గుండెల్ని పిండేస్తున్నది. బ్రిటన్ మీద పేలిన పేన్ ఏం, అమెరికాలో 911 దుర్ఘటన, బ్రెజిల్ నించి బయల్దేరి సముద్రంలో కూలిన ఐర్ ఫ్రాన్స్ దుర్ఘటన .. ఆ తరవాత ప్రపంచవ్యాప్తంగా నిర్ఘాంత పరిచిన దుర్ఘటన ఇది. ఆ ప్రయాణికులేమయ్యారో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబ సభ్యుల బాధ తల్చుకుంటే కడుపు తరుక్కుపోతోంది.

ఒక వేపు ఉద్యోగపు వత్తిళ్ళు, ఇంకో వేపు ఇంటి బాధ్యతలు - ఏవేవో పనులు, పనుల ఆలోచనలు వేగిర పెడుతుంటే కూర్చుని రాసుకునే తీరికా, నిలకడా ఎక్కణ్ణించొస్తుందీ?  అందుకే మా వుల్ఫ్ పేక్ అంటే నాకిష్టం. వారానికో రోజు - బుధవారం సాయంత్రం రెండు గంటలు అందరం కలుసుకుని, ఒక చోట కూర్చుని రాతకే అంకితం. నిన్నటి సమావేశంలో ఆ మధ్య మొదలు పెట్టిన ఇంగ్లీషు కథని ఇంకో రెండు పేజీలు ముందుకు తీసుకెళ్లగలిగాను. తెలుగులో రాయాల్సినవి పేరుకు పోతున్నాయి. రాద్దామని కూర్చుంటే, ఒక్కొక్క వాక్యం ఆర్ద్రంగా, అర్ధవంతంగా రాయాలంటే .. ఎంత కష్టం? అదే రసాత్మకంగా రాయాలంటే .. చచ్చి ఇంకో జన్మ యెత్తినట్టే. అందుకే నన్ను అడిగిన వారికీ అడగని వారికీ కూడా చెబుతూ ఉంటా. పద్యాలు రాయడం సంగతి దేవుడెరుగు, చక్కగా కంటికీ, చెవికీ ఇంపుగా ఒక్క వాక్యం వచనం రాయడం ఎంత కష్టమో. ఆ మాత్రం భాష మీద పట్టు చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది. మహామహా రచయితలమని విర్రవీగే వారి రచనల్లో కూడా వాక్యం బహు నీరసంగా పటుత్వం లేకుండ ఉండడం సవాలక్షమాట్లు చూశాను. "కవిత్వమని బుకాయించకు, వచనమై పుడతావ్" అని త్రిపురనేని శ్రీనివాస్ శపిస్తే శపించాడు గానీ, ఆ మాత్రం వచనం నాకు తగిల్తే నా పాలిటి వరమనే అనుకుంటాన్నేను.

కర్నాటక సంగీతం వినే అలవాటున్న వారిలో మోహన రాగం పెద్దగా నచ్చదు అన్న వాళ్ళెవరూ నాకింతవరకూ తారసపళ్ళేదు. పేరు ఎవరు పెట్టారోగానీ, ఆ రాగం మాత్రం సార్ధక నామధేయం. అందులోనూ ఆ పేరుకి ప్రాణం పోసేటటువంటి కృతి త్యాగరాజస్వామి వారి మోహన రామా అనే కృతి. దీన్నే పోయినవారం కబుర్లలో కూడా ప్రస్తావించాను. మొన్ననొక ఫేస్బుక్ మిత్రుల పుణ్యమా అని యూట్యూబు లింకు ఒకటి దొరికింది. ఇది ఒక LP రికార్డు, ఆ తరవాత కేసెట్టుగా ఉండేది. వయొలిన్ మీద లాల్గూడి జయరామన్, వేణువు మీద ఎన్. రమణి, వీణ మీద వెంకట్రామన్, రెండు మృదంగాల మీద ఉమయాల్పురం శివరామన్, టి. కె. మూర్తి గారలు కలిసి వాయించిన వాద్య బృందం. ఇంత మధురమైన మోహన రాగం, అందులో ఈ కృతి నేను ఇంకెక్కడా వినలేదు.
మీరూ విని ఆనందిస్తారని ..

Comments

Ram said…
Equinox సి తెలుగులో, విషవత్తులు అంటారనుకుంటా, స్వామి గారూ...
రామారావ్ said…
ఈక్వినాక్స్ ని తెలుగులో విషవత్తులు అంటారనుకుంటా స్వామిగారూ...
Sanath Sripathi said…
"రాద్దామని కూర్చుంటే, ఒక్కొక్క వాక్యం ఆర్ద్రంగా, అర్ధవంతంగా రాయాలంటే .. ఎంత కష్టం? అదే రసాత్మకంగా రాయాలంటే .. చచ్చి ఇంకో జన్మ యెత్తినట్టే". చాలా బాగా చెప్పారు.

శుభ్రమైన తెలుగు చదివే తీరిక, తెలుగు వినే అవకాశం లేక.. స్పష్టమైన ఉచ్చారణ కరవైపోయింది.. భావం ఇంగ్లీషు మాటల్లో తెలుగు పదాలైపోయింది ... ఎఫ్ ఎం ఒరవడితో బ్రతుకొక మణిప్రవాళం అయిపోయింది..భగవన్ !! ఏదీ దారి ??
నారాయణ స్వామి గారు, మోహన రాగంలో త్యాగయ్య రాసిన 'మోహన రామా' కృతి, శ్రీ మహారాజపురం విశ్వనాధ అయ్యర్ పాడినది వినండి,నా భూతో న భవిష్యతి అని మీరూ అంటారు .

Kottapali said…
ram గారూ మీరు చెప్పిన తరవాత అనిపిస్తున్నది, ఈ మాట విన్నట్టుగానే ఉన్నది.
సనత్ - నిజం నిజం.
సాంబయ్య గారు, విశ్వనాథయ్యరుగారిది ఒక రికార్డింగు మా అమ్మ దగ్గర ఉండేదండి. ఇప్పుడు గుర్తు లేదు నెట్ లో ఉన్నదేమో చూస్తాను.