కబుర్లు మార్చి 13

పనికొచ్చే ఏ పనీ చెయ్యడానికి మనసొప్పని ఓ తమాషా సాయంకాలం.
యథాలాపంగా నా బ్లాగు తెరిచి పాత టపాలు చూసుకుంటూంటే కనబడ్డాయి - 2008 అక్టోబరు నించీ సుమారొక ఏడాది పాటు దాదాపు ప్రతీ వారమూ రాసుకుంటూ వచ్చిన "కబుర్లు" అనే వరస టపాలు. దాంతో, మనసుని ఆవరించి ఉన్న బద్ధకపు చిరాకు వీడిపోయి కొత్త ఆలోచన పుట్టింది, ఇలా వారం వారం కబుర్లని మళ్ళీ ఎందుకు రాయకూడదని. నిజ్జంగా ప్రతీ వారమూ క్రమం తప్పకుండా రాసేస్తానా అంటే చెప్పలేను కానీ రాద్దామని బుద్ధి ఐతే పుట్టింది.

పోయిన వారం కొద్దికొద్దిగా మా థర్మామీటర్లు తలలెత్తుకుంటున్నాయి అని మమ్మల్ని బాగా భ్రమింప చేశాయి. నిన్న రాత్రి మొదెలెట్టి ఇవ్వాళ్ళంతా భారీగా మంచు కురిసింది. ఈ సారి మాత్రం ఫోర్‌కాస్ట్ వాళ్ళు చాలా కచ్చితంగా చెప్పారు. వాళ్ళు ఘోషించినట్టే సుమారు అర్ధరాత్రప్పుడు మొదలై, తెల్లారేప్పటి ఓ రెండు మూడంగుళాలూ, అటుపైన రోజంతా ఇంకో నాలుగు అంగుళాలూ .. మొత్తమంతా ఆరేడంగుళాలు కురిసింది. శ్రీశ్రీ లేచి వస్తే, నిరుడు కురిసిన హిమసమూహాల కోసం వెతుక్కోనక్కర్లే .. ఇప్పుడు కురిసినవే సమృద్ధిగా ఉన్నాయి.

చాలా రోజుల తరవాత మోహనరాగం వినాలని బుద్ధి పుట్టి కంప్యూటర్లో వెతికి సంజయ్ సుబ్రమణ్యం పాడిన మోహనరామా అనే త్యాగరాజస్వామివారి కృతి వినడం మొదలు పెట్టాను. ఆలాపనా అదీ బాగా చేశాడు, పాట కూడా బాగా మొదలైంది. మధ్యలో తరమనూ జావ తార .. అంటూ తగులుకున్నాడు. ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలా. అప్పుడు వెలిగింది. ఇది ఏదో ప్రత్యక్ష కచేరీ రికార్డింగు నా దగ్గర చాలా కాలంగా ఉన్నదే. ఈ మధ్యకాలంలో వినక, మరపుకొచ్చింది కానీ. ఈ కృతి చరణం ధర మనుజావతార మహిమ విని .. అని నడుస్తుంది. దానికొచ్చిన తిప్పలన్న మాట ఇవి. ఖర్మకాలి నెరవులు విశదీకరించడానికి కూడా ఈ వరుసనే ఎంచుకున్నాడు మహాశయుడు. ఆ కాస్త కఠోరతని భరించగలిగితే రాగం అంతా బానే ఉంది. సాధారణంగా కర్నాటక సంగీతం వినేటప్పుడు ఉచ్చారణ దోషాలను విజయవంతంగా పక్కన పెట్టేస్తూంటాను కానీ మరీ ఇంత దారుణమైన వికృతులు జరిగినప్పుడూ మాత్రం అనిపిస్తూ ఉంటుంది, కొన్ని కొన్ని అందమైన వాటిని రక్షించుకోవడం కోసం ఒక సాంస్కృతిక రక్షణ దళం ఉండాలేమోనని. 

ఫిబ్రవరి నెలాఖరులో బంధువుల ఇంటి శుభకార్యానికి హ్యూస్టను వెళ్ళొచ్చాము కొద్ది రోజులు. ఆ వేడుకలు వారం నడి మధ్యలో జరిగినా దగ్గర దూరం భేదం లేకుండా చాలా మంది బంధువులు హాజరయ్యారు. ఆ దంపతులకి పనులు చేసుకోవడంలో అండదండ లందించారు. చాలా ముచ్చటేసింది. మానవ సంబంధాలంటే అంతే కదా - మనుషులు కావాలి అనుకోవటం. మనకి వాళ్ళు కావాలి అని మనం అనుకుంటే, అలా ప్రవర్తిస్తే, వాళ్ళు కూడా మనం కావాలనుకుంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత. ఇదే సందర్భంగా నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణారావు, కుటుంబంతో కూడా రెండ్రోజులు గడిపి వచ్చాము. కృష్ణారావు కూతురు పల్లవి, కొడుకు పృథ్వీ ఇద్దరూ తెలుగు ధారాళంగా మాట్లాడ్డమే కాదు, ఇద్దరూ చక్కగా చదవగలరు, రాయగలరు కూడాను. ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గరే నేర్చుకున్నారు.

హ్యూస్టనులో జరిగిన మరొక చక్కటి అనుభవం సాహితీలోకం సభ్యులతో ఒక మధ్యాహ్నం గడపడం. టెక్సాసులో జరిగే సాహిత్య సమావేశాలని స్థానికులు నెలనెలా తెలుగు వెన్నెల అని పిలిచుకోవడం ఒక ముచ్చట. తీరా నేను హాజరైన మీటింగు రోజు అమావాస్య కావడంతో మిత్రులు సుధేష్ గారు అమావాస్య చంద్రుడు నారాయణస్వామితో ఈ ప్రత్యేకమైన వెన్నెల కార్యక్రమం అని ఆహ్వాన పత్రికలో చమత్కరించారు. సభ మొదలై నేను మాట్లాడ్డం మొదలు పెట్టగానే సభ్యులు అడిగారు - మీకు ఈ అమావాస్య చంద్రుడనే బిరుదు ఎందుకొచ్చిందో చెప్పండి ముందు అని. నెత్తి కొట్టుకుని, అపార్ధానికి నవ్వుకుని, సుధేష్ గారి కొంటె చమత్కారాన్ని వివరించి ముందుకు సాగాను. వంగూరి చిట్టెన్ రాజుగారు అంతుకు ముందు రోజునే భారత్ నించి తిరిగి వచ్చినా శ్రమచేసుకుని హాజరై నన్ను ఆశీర్వదించారు. చిరకాల మిత్రుడు, బ్లాగ్లోకపు శ్రీకృష్ణదేవరాయలు, డా, ఇస్మాయిల్ చిరంజీవులతో సహా దర్శనమిచ్చి సంతోషపెట్టాడు.   ఫేస్బుక్కు ద్వారా మాత్రమే అప్పటివరకూ తెలిసిన గోపరాజు కృష్ణ, వారి సతీమణి ఉమ గారిని ముఖా ముఖి కలవడం బాగుంది. కొత్తగా పరిచయమైన సత్యదేవ్ గారు, మధు పెమ్మరాజు కథలు రాస్తారని తెలిసి మహదానందమైంది. ఇద్దరి కథలూ త్వరలో చదవగలనని ఆశ. మధుగారు బ్లాగు కూడా రాశారు కొన్నాళ్ళు - కుడి ఎడమైతే ..

 కొన్ని నెల్ల కిందట మా డీటీయే వాళ్ళు రాజుల వేషాలేసుకుని చిన్న నాతికలాగా ఒక వీడియో పెడితే, అది చూస్తూ, ఇది తీసిందెవరో పని తెలిసిన వారు కానీ సరదాకి తీసినవాళ్లు కాదు, ఎవరబ్బా అని విచారిస్తే, వెంపటి శ్రీకాంత్ అనే యువకుడని తెలిసింది. ఆయన్ని ఫేస్బుక్కులో స్నేహించుకున్నాక ఆయన అప్పటికే ఒక చిన్న సినిమా తీసి ఉన్నారని తెలిసింది. అలా మొదట యూట్యూబులో ఈ లవ్ బై ఛాన్స్ చూశాను. చాలా నచ్చింది. టీవీలో పెట్టి మావాళ్ళకి కూడా చూపించాను. అందరం చాలా మెచ్చుకున్నాం. అడపాదడపా కొద్దికొద్దిగా ముచ్చటించుకున్నా, మొన్నొక పూట ఆయనే కాల్ చేసి మిమ్మల్ని కలుస్తానండీ అని చొరవతీసుకున్నారు. అంతకన్నానా, రమ్మంటే, సరిగ్గా అనుకున్నట్టుగా ఆదివారం సాయంత్రం వచ్చేశారు. ఓ రెండు గంటలపాటు రకరకాల విషయాలు ముచ్చటించుకున్నాం. నా పుస్తకాలు చూపించాను. ఇంట్లో పని జరుగుతూ ఉండడం వల్ల పుస్తకాల షెల్ఫులు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నై, అన్నీ అందుబాటులో లేవు. మళ్ళీ ఓ రెణ్ణెల్ల తరవాత రండి శ్రీకాంత్ గారు, అప్పటికి అన్నీ సర్దేసి ఉంటై. అన్నట్టు ఈ సినిమా ఎక్కడ చూడాలో చెప్పొద్దూ, ఇదిగోండి Love by chance!

 ఇప్పటికింతే. ఈ మధ్యలో కొత్త టపా రాయకపోతే, వచ్చేవారం కలుద్దాం.

Comments

అయ్యా. ఇదేమి కాకతాలీయమో తెలియదు. నిన్ననే గడి లింకు లు, తర్వాత మన తూర్పు పడమర కబుర్లూ, మీ బ్లాగు టపాలు (అందులోనూ కబుర్లూ) అలా మేస్తూ (బ్రౌజింగన్న మాట) పాత రోజులు నెమరేసుకున్నా.
Anonymous said…
"తరమనూ జావ తార .. "
ఏడుపుతో కలిసిన నవ్వు.
Anonymous said…
మాస్టారూ,

మన ఇద్దరికీ ఒకే టైములో మళ్ళీ బ్లాగులోకంలోకి రావాలని ఎందుకనిపించిందబ్బా?
ఉరికే పోలికకోసం అన్నాను కానీ, మీ అంత గొప్పగా వ్రాయడం కష్టమే.. ఏదో నేను కూడా మళ్ళీ బాతాఖానీ మొదలెడుతున్నాను..
Kottapali said…
సత్యసాయి గారు, ఈ మధ్యన ఫేస్బుక్కులో మీరు పోస్టుతున్న కొన్ని కొత్త ఫొటోలు చూసి నేనూ అదే అనుకున్నాను. Those were some good times.

Puranapanda Phani గారు, నిజం.

harephala, ఫణిబాబుగారు, ఎంతమాట. మీ సరదా కబుర్లు ఎంత పాపులరో నాకు తెలియదూ?