Friday, January 11, 2013

కర్నాటక సంగీతం - రాగాలు

రాగం
రంజింపచేసేది రాగం అని ఒక నిర్వచనం.
కర్నాటక సంగీతం గురించి మాట్లాడుకున్నప్పుడు రాగాల ప్రస్తావన లేకుండా కుదరదు. ప్రతి పాటా ఏదో ఒక రాగంలో ఉంటుంది. ఒక్కో రాగానికీ దాని రూపాన్ని నిర్వచించే కొన్ని లక్షణాలు ఉంటాయి. అంచేత ఒక గాత్రం విన్నప్పుడు, ఆ పాడుతున్నది ఏమి రాగమో తెలిస్తే, మన మనసులో ఆ రాగం యొక్క స్వరూపం ముద్రపడి ఉంటే, అప్పుడు ఆ వింటున్నదాన్ని హెచ్చు స్థాయిలో ఆస్వాదించే అవకాశం పెరుగుతుంది. ఒక చిన్న ఎనాలజీ చెప్పుకోవాలంటే, ఒక చిత్రకారుడు ఒక అమ్మాయి బొమ్మ గీశాడనుకుందాం. అలా చిత్రించిన బొమ్మని మనం చూస్తున్నాం. ఆ బొమ్మలో ఉన్న మనిషెవరో తెలియకుండా కూడా ఆ బొమ్మని ఆస్వాదించవచ్చు. కానీ బొమ్మకి మూలం ఎవరో తెలిస్తే - ఆమె మాధురీ దీక్షిత్ అనుకోండి, బొమ్మలో కను ముక్కుతీరు కలిసిందా, పోలికలు బాగా వచ్చాయా, భంగిమ సరిగ్గా కుదిరిందా, అవయవాలన్నీ పొందికగా చిత్రించారా - ఇలా ఆ చిత్రాన్ని ఆస్వాదించడంలో, చిత్రకారుని ప్రతిభని బేరీజు వెయ్యడంలో మరింత లీనమవుతాం కదా. రాగాన్ని గుర్తు పట్టడం వల్ల కూడ జరిగేది అదే.

ఏదన్నా రాగాలాపన వింటూ, ఒక్క నిమిషం పాటు వినగానే ఇది ఆనందభైరవి రాగం, ఇది మోహనరాగం అని తెలిసిన వాళ్ళు చెబుతుంటే ఇది అలవాటు లేని వాళ్ళకి ఏదో మాయ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో మాయగానీ అతీంద్రియ శక్తిగానీ ఏమీ లేదు. మనకి మామూలుగా దృష్టికి సంబంధించిన జ్ఞాపకం ఎక్కువ. మనుషుల్ని గుర్తు పట్టడం, దారులనీ స్థలాలనీ ఆనవాలు పట్టడం మనకి కొంత అలవోకగా జరిగి పోతుంటాయి. కానీ వినికిడికి సంబంధించిన జ్ఞాపకాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోము. ఐనప్పటికీ మనకి బాగా పరిచయమున్న గొంతుల్ని గుర్తు పడతాము. అలాగే ప్రముఖ గాయనీ గాయకుల్ని, నటుల గొంతుల్నీ గుర్తు పడతాము. అంటే ఆ ధ్వనికి సంబంధించిన జ్ఞాపకాలు మనలో ఉన్నాయన్నమాట. రాగాల్ని గుర్తు పట్టడం కూడా అంతే. బొమ్మలో ఐతే కళ్ళు, ముక్కు, వొంటి రంగు, ఇలా రకరకాల పోలికల్ని పోల్చుకుంటామో, అలాగే రాగాలకి కూడా రకరకాల లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క రాగాన్ని గురించీ, దాని లక్షణాలని (వినికిడి ద్వారా) ఎంత బాగా తెలుసుకుంటామో, ఎక్కడైనా విన్నప్పుడు అంత సులభంగా దాన్ని గుర్తు పట్టగలం, అంత హెచ్చుగా ఆస్వాదించగలం.

కొంచెం టెక్నికల్ ఫండాలు
స్వరములు ఏడైనా రాగాలెన్నో అని రాశారొక కవి.
స - రి - గ - మ - ప - ద - ని - స'
నిజానికి స్వరాలు పన్నెండు. ఏడింటిలో స, ప తప్ప మిగతా ఐదింటికీ రెండేసి స్థానాలున్నాయి. వీటిని సాధారణంగా 1, 2 అని సూచిస్తారు వాడుకలో. అంటే మొత్తం ఒక ఆవృత్తం స నించి స' వరకూ ఇలా ఉంటుందన్నమాట.
స - రి1 - రి2 - గ1 - గ2 - మ1 - మ2 - ప - ద1 - ద2 - ని1 - ని2 - స'
కర్నాటకసంగీతంలో, మరి ఎవరు నిర్దేశించారోగాని, ఒక్కో రాగానికి ఏడు స్వరాలకి మించి ఉండడానికి కుదరదని ఒక సూత్రం ఉన్నది. అంతే కాదు, పైన చెప్పినట్టు రెండేసి స్థానాలుండే స్వరాలున్నాయే - వాటిల్లో ఒక్కొక్కటి మాత్రమే ఉండాలి - అంటే ఒకే రాగంలో రి1, రి2 ఉండడానికి వీల్లేదు - అని ఇంకో సూత్రం. హిందుస్తానీ వాళ్ళు ఈ సూత్రాన్ని పట్టించుకోరు - వాళ్ళ రాగాలు కొన్నిటిలో రెండు ద-లు, రెండు ని-లు ఉండడం మామూలే.  కర్నాటక సంగీతంలో కూడా ఈ సూత్రానికి కొన్ని exceptions లేకపోలేదు గానీ, మొత్తమ్మీద కర్నాటక రాగాలు ఈ సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. ఇంకో తమాషా ఏంటంటే, చాలా రాగాల్లో ఏడు స్వరాలు అన్నీ ఉండవు. సాధారణంగా ఐదో ఆరో ఉంటాయి.

ఒక రాగంలో ఏమేమి స్వరాలున్నాయి అని ఆరోహణ - అవరోహణ ద్వారా చెప్పుకుంటాము.
ఉదాహరణకి హిందోళం అనే రాగాన్ని చూద్దాం. ఇందులో ఐదే స్వరాలున్నాయి.
ఆరోహణ: స - గ1 - మ1 - ద1 - ని1 - స'
అవరోహణ: స' - ని1 - ద1 - మ1 - గ1 - స
మీరీపాటికి ఒకటి గమనించి ఉండాలి - ఆరోహణ అంటే, కింది స్థాయి స నించి పై స్థాయి స' వరకు మెట్టు మెట్టుగా స్వరాలు పైకెక్కుతున్నాయని. అలాగే అవరోహణ అంటే, మెట్టు మెట్టుగా కిందికి దిగుతున్నాయి.  రాగానికి మొట్టమొదటి లక్షణం ఈ ఆరోహణ అవరోహణ.
మోహనం అని మరొక ప్రసిద్ధికెక్కిన రాగంలో కూడా ఐదు స్వరాలే ఉన్నాయి.
ఆరోహణ: స - రి2 - గ2 - ప - ద2 - స'
అవరోహణ: స' - ద2 - ప - గ2 - రి2 - స

దీన్ని చిత్ర రూపంగా చూస్తే


కానీ కేవలం ఆరోహణ అవరోహణ తెలిసినంత మాత్రాన రాగం మనకి అర్ధం కాదు. ఆ స్వరాల కలయిక రాగంగా ఎలా ఏర్పడుతుందో అర్ధం కావాలి. అది మనం తరువాతి టపాలో చూద్దాం.

ఈ వారం ఎసైన్మెంటు:
1) పైన చిత్రంలో హిందోళం స్వరాల అమరికని పరికించండి. ఎక్కడెక్కడ రెండు స్వరాల మధ్య జాగా వస్తున్నది?
అలాగే మోహన రాగంలో కూడా.
2) యూట్యూబులో ఈ రెండు రాగాల్లోనూ కొన్ని పాటలు వినండి.
మోహనంలో కనీసం రెండు పాటలు.
హిందోళంలో కనీసం రెండు పాటలు.
మీరు విన్న పాటని గురించి ఈ సమాచారం రాయండి: పాట మొదటి పదాలు, వాగ్గేయకారులు (composer), గాయకులు (లేదా వాద్యకారులు), ఆలాపన ఉన్నదా? స్వరప్రస్తారం ఉన్నదా?
3) ఆరోహణ క్రమాన్ని గ్రాఫులాగా చూడ్డం వల్ల రాగ స్వరూపాన్ని గురించి ఏమైనా అవగాహన వచ్చిందా?

Tuesday, January 1, 2013

నా కొత్త కథ: మంచుగూడు