కర్నాటక సంగీతం - రాగాలు

రాగం
రంజింపచేసేది రాగం అని ఒక నిర్వచనం.
కర్నాటక సంగీతం గురించి మాట్లాడుకున్నప్పుడు రాగాల ప్రస్తావన లేకుండా కుదరదు. ప్రతి పాటా ఏదో ఒక రాగంలో ఉంటుంది. ఒక్కో రాగానికీ దాని రూపాన్ని నిర్వచించే కొన్ని లక్షణాలు ఉంటాయి. అంచేత ఒక గాత్రం విన్నప్పుడు, ఆ పాడుతున్నది ఏమి రాగమో తెలిస్తే, మన మనసులో ఆ రాగం యొక్క స్వరూపం ముద్రపడి ఉంటే, అప్పుడు ఆ వింటున్నదాన్ని హెచ్చు స్థాయిలో ఆస్వాదించే అవకాశం పెరుగుతుంది. ఒక చిన్న ఎనాలజీ చెప్పుకోవాలంటే, ఒక చిత్రకారుడు ఒక అమ్మాయి బొమ్మ గీశాడనుకుందాం. అలా చిత్రించిన బొమ్మని మనం చూస్తున్నాం. ఆ బొమ్మలో ఉన్న మనిషెవరో తెలియకుండా కూడా ఆ బొమ్మని ఆస్వాదించవచ్చు. కానీ బొమ్మకి మూలం ఎవరో తెలిస్తే - ఆమె మాధురీ దీక్షిత్ అనుకోండి, బొమ్మలో కను ముక్కుతీరు కలిసిందా, పోలికలు బాగా వచ్చాయా, భంగిమ సరిగ్గా కుదిరిందా, అవయవాలన్నీ పొందికగా చిత్రించారా - ఇలా ఆ చిత్రాన్ని ఆస్వాదించడంలో, చిత్రకారుని ప్రతిభని బేరీజు వెయ్యడంలో మరింత లీనమవుతాం కదా. రాగాన్ని గుర్తు పట్టడం వల్ల కూడ జరిగేది అదే.

ఏదన్నా రాగాలాపన వింటూ, ఒక్క నిమిషం పాటు వినగానే ఇది ఆనందభైరవి రాగం, ఇది మోహనరాగం అని తెలిసిన వాళ్ళు చెబుతుంటే ఇది అలవాటు లేని వాళ్ళకి ఏదో మాయ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో మాయగానీ అతీంద్రియ శక్తిగానీ ఏమీ లేదు. మనకి మామూలుగా దృష్టికి సంబంధించిన జ్ఞాపకం ఎక్కువ. మనుషుల్ని గుర్తు పట్టడం, దారులనీ స్థలాలనీ ఆనవాలు పట్టడం మనకి కొంత అలవోకగా జరిగి పోతుంటాయి. కానీ వినికిడికి సంబంధించిన జ్ఞాపకాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోము. ఐనప్పటికీ మనకి బాగా పరిచయమున్న గొంతుల్ని గుర్తు పడతాము. అలాగే ప్రముఖ గాయనీ గాయకుల్ని, నటుల గొంతుల్నీ గుర్తు పడతాము. అంటే ఆ ధ్వనికి సంబంధించిన జ్ఞాపకాలు మనలో ఉన్నాయన్నమాట. రాగాల్ని గుర్తు పట్టడం కూడా అంతే. బొమ్మలో ఐతే కళ్ళు, ముక్కు, వొంటి రంగు, ఇలా రకరకాల పోలికల్ని పోల్చుకుంటామో, అలాగే రాగాలకి కూడా రకరకాల లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క రాగాన్ని గురించీ, దాని లక్షణాలని (వినికిడి ద్వారా) ఎంత బాగా తెలుసుకుంటామో, ఎక్కడైనా విన్నప్పుడు అంత సులభంగా దాన్ని గుర్తు పట్టగలం, అంత హెచ్చుగా ఆస్వాదించగలం.

కొంచెం టెక్నికల్ ఫండాలు
స్వరములు ఏడైనా రాగాలెన్నో అని రాశారొక కవి.
స - రి - గ - మ - ప - ద - ని - స'
నిజానికి స్వరాలు పన్నెండు. ఏడింటిలో స, ప తప్ప మిగతా ఐదింటికీ రెండేసి స్థానాలున్నాయి. వీటిని సాధారణంగా 1, 2 అని సూచిస్తారు వాడుకలో. అంటే మొత్తం ఒక ఆవృత్తం స నించి స' వరకూ ఇలా ఉంటుందన్నమాట.
స - రి1 - రి2 - గ1 - గ2 - మ1 - మ2 - ప - ద1 - ద2 - ని1 - ని2 - స'
కర్నాటకసంగీతంలో, మరి ఎవరు నిర్దేశించారోగాని, ఒక్కో రాగానికి ఏడు స్వరాలకి మించి ఉండడానికి కుదరదని ఒక సూత్రం ఉన్నది. అంతే కాదు, పైన చెప్పినట్టు రెండేసి స్థానాలుండే స్వరాలున్నాయే - వాటిల్లో ఒక్కొక్కటి మాత్రమే ఉండాలి - అంటే ఒకే రాగంలో రి1, రి2 ఉండడానికి వీల్లేదు - అని ఇంకో సూత్రం. హిందుస్తానీ వాళ్ళు ఈ సూత్రాన్ని పట్టించుకోరు - వాళ్ళ రాగాలు కొన్నిటిలో రెండు ద-లు, రెండు ని-లు ఉండడం మామూలే.  కర్నాటక సంగీతంలో కూడా ఈ సూత్రానికి కొన్ని exceptions లేకపోలేదు గానీ, మొత్తమ్మీద కర్నాటక రాగాలు ఈ సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. ఇంకో తమాషా ఏంటంటే, చాలా రాగాల్లో ఏడు స్వరాలు అన్నీ ఉండవు. సాధారణంగా ఐదో ఆరో ఉంటాయి.

ఒక రాగంలో ఏమేమి స్వరాలున్నాయి అని ఆరోహణ - అవరోహణ ద్వారా చెప్పుకుంటాము.
ఉదాహరణకి హిందోళం అనే రాగాన్ని చూద్దాం. ఇందులో ఐదే స్వరాలున్నాయి.
ఆరోహణ: స - గ1 - మ1 - ద1 - ని1 - స'
అవరోహణ: స' - ని1 - ద1 - మ1 - గ1 - స
మీరీపాటికి ఒకటి గమనించి ఉండాలి - ఆరోహణ అంటే, కింది స్థాయి స నించి పై స్థాయి స' వరకు మెట్టు మెట్టుగా స్వరాలు పైకెక్కుతున్నాయని. అలాగే అవరోహణ అంటే, మెట్టు మెట్టుగా కిందికి దిగుతున్నాయి.  రాగానికి మొట్టమొదటి లక్షణం ఈ ఆరోహణ అవరోహణ.
మోహనం అని మరొక ప్రసిద్ధికెక్కిన రాగంలో కూడా ఐదు స్వరాలే ఉన్నాయి.
ఆరోహణ: స - రి2 - గ2 - ప - ద2 - స'
అవరోహణ: స' - ద2 - ప - గ2 - రి2 - స

దీన్ని చిత్ర రూపంగా చూస్తే


కానీ కేవలం ఆరోహణ అవరోహణ తెలిసినంత మాత్రాన రాగం మనకి అర్ధం కాదు. ఆ స్వరాల కలయిక రాగంగా ఎలా ఏర్పడుతుందో అర్ధం కావాలి. అది మనం తరువాతి టపాలో చూద్దాం.

ఈ వారం ఎసైన్మెంటు:
1) పైన చిత్రంలో హిందోళం స్వరాల అమరికని పరికించండి. ఎక్కడెక్కడ రెండు స్వరాల మధ్య జాగా వస్తున్నది?
అలాగే మోహన రాగంలో కూడా.
2) యూట్యూబులో ఈ రెండు రాగాల్లోనూ కొన్ని పాటలు వినండి.
మోహనంలో కనీసం రెండు పాటలు.
హిందోళంలో కనీసం రెండు పాటలు.
మీరు విన్న పాటని గురించి ఈ సమాచారం రాయండి: పాట మొదటి పదాలు, వాగ్గేయకారులు (composer), గాయకులు (లేదా వాద్యకారులు), ఆలాపన ఉన్నదా? స్వరప్రస్తారం ఉన్నదా?
3) ఆరోహణ క్రమాన్ని గ్రాఫులాగా చూడ్డం వల్ల రాగ స్వరూపాన్ని గురించి ఏమైనా అవగాహన వచ్చిందా?

Comments

Kottapali said…
For those living in Hyderabad - SICA hosts their annual festival
Feb 11th:Trichur V. Ramachandran (vocal),
Feb 12th: RAJAN & SAJAN MISHRA, Hindusthani Vocal Duet,
Feb 13th: DR SOBHA NAIDU with her disciples present s JAGADANANDAKAARAKA, Kuchupudi dance ballet,
Feb 14th: SIKKIL GURUCHARAN ,Vocal,
Feb 15th: KADRI GOPALNATH SAXOPHONE,
Feb 16th: A. KANYAKUMARI and party ,VIOLIN PANCHAGAM
Feb 17TH :PRIYA SISTERS,Chennai Devotional music (thematic presentation

All at Ravindra Bharathi starting at 6.30 PM
For any further details,pl contact 98491 24675/9440884863/8885151420
Srinivas said…
కొత్తపాళీ గారికి

స్వరాల గ్రాఫు గీసినందుకు చాలా థాంకులు.

ఇలా గ్రాఫు గీయొచ్చని నాకనిపించేది కానీ దాని స్వరూపం నా ఊహకి అందేది కాదు. "సైన్-కర్వ్ లాగా ఒక బేస్ లైన్‌కి అటూ-ఇటూగా స్వరాలు పడతాయేమో" అనుకునే వాణ్ణి. :)

హిందోళ మోహనాలను "చూసినప్పుడు" నాకు తట్టిన మాట - "మెట్ల అమరిక".

కొన్ని ప్రశ్నలు:

1. మీ గ్రాఫులో Y-అక్షపు సంఖ్యలు దేన్ని సూచిస్తాయి?

2. X అక్షం మీద స్వరాలు కొలత గీట్లతో అలైన్ అయినట్లు అనిపించలేదు. స్వరం ఒక పాయింటు కాదు, ఒక (శాబ్దిక) కంటిన్యువం అని దాని అర్థమా? (క్షమించాలి, చాలా లిటరల్‌గా అర్థం చేసుకుంటున్నాను)

3. ఇది కేవలం ఆరోహణ అవరోహణలను చూపే గ్రాఫు కదా? ఏ పాటకో స్థిర పరచిన నొటేషన్‌నీ, ఆలాపన, నిరవల్, స్వర ప్రస్తారాలతో కలుపుకొని ఆ పాటను పాడిన పద్ధతిని ఇలా గ్రాఫులో చూపిస్తే ఎలా ఉంటుందో? "రాగ స్వరూపానికి కట్టుబడి ఉండడం" అనే విషయం గ్రాఫికల్‌గా అర్థం చేసుకోగలమా?

4. స్థాయి, వేగం, గమకం ఇలాంటివి గ్రాఫులో చూపించడానికి కుదురుతుందా?

5. ఇవన్నీ తెలియకుండా సంగీతం మనల్ని కట్టి పారేస్తుంది కదా. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మన అనుభవపు స్థాయి పెరుగుతుందా?

హిందోళ మోహనాల గురించి మళ్ళీ రాస్తాను.

మరోసారి కృతజ్ఞతలతో
శ్రీనివాస్
Kottapali said…
శ్రీనివాస్ గారు, మంచి ప్రశ్నలు.
1. Y-అక్షం ఆ స్వరంయొక్క పౌనఃపున్యం సంఖ్య (frequency in Hz as measured from a piano key)
2. X-అక్షం విషయంలో మీరు అక్కడ ఉన్న విషయం కంటే ఎక్కువే ఊహించుకున్నారు. ఈ గ్రాఫులో ఇలా కనబడ్డం, ఎక్సెల్‌లో అంకెలు కాకుండా అక్షరాలని విలువలుగా ఇవ్వడం వలన అలా వచ్చింది. కానీ మీరు ఊహించినది కూడా కొంత వరకూ నిజమే కానీ అది ఇంకా బాగా లోతైన అంశం. మరికొన్ని మౌలికాంశాలు పూర్తయినాక వీలుంటే ఇలాంటి theoretical అంశాలకి వద్దాము.
3. పాటకి సంబంధించిన రాగస్వరూప అంశాలని ఇలా గ్రాఫుగా చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కొంతకాలంగా నా మనసులో మెదులుతున్నది. దానివల్ల రాగాన్ని గురించి అవగాహన పెరుగుతుందా అంటే అనుమానమే గానీ గ్రాఫు గీసి చూడావచ్చు. ప్రయత్నిస్తాను.
4. కుదురుతుంది. అటువంటి గ్రాఫులో X-మీద కాలం ఉంటుంది.
5. కేవలం ఇలా గ్రాఫులో చూడ్డం వల్ల సంగీత అనుభవం పెరగదు. నేను టపాల మొదట్లోనే చెప్పాను, వీలైనప్పుడూ మళ్ళి మళ్ళీ చెప్పాను. సంగీత అనుభవం పెరగడానికి ఒక్కటే మార్గం - వినడం.

అనుభవ స్థాయి ఎప్పుడూ పెరుగుతుంది అంటే, రాగ స్వరూపాన్ని గురించి మనకొక అవగాహన వచ్చినప్పుడు. ఇదికూడ ప్రధానంగా వినికిడిద్వారా రావాలి కానీ ఆ పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకునేందుకు ఇలాంటి సాధనాలు కూడా ఉపయోగపడతాయేమోనని ప్రయత్నం చేస్తున్నాను.
Vasu said…

నాది ఇంతకు ముందు (నాల్గవ పాఠం) అసైన్ మెంట్ మొత్తం అవ్వలేదు .. వెనకపడ్డాను .

అందుకే ఇన్నాళ్ళూ కామెంట్ పెట్టలేదు .

మోహనం లో బోలెడు కీర్తనలు పాటలు దొరికేస్తాయి తెలిసివని అనుకున్నా చాలా తక్కువ ఉన్నాయి ఆన్లైన్ తెలిసినవి, విన్నవి .

అది కూడా మోహన వర్ణం అని ఉన్నాయి .. వర్ణం కీర్తన కంటే ముందు వస్తుందని తెలుసు (సంగీతం సిలబస్ లో ) కానీ సరిగ్గా ఏంటో తెలియదు .


నేను విన్నవి .


మోహనం -


1) రా రా రాజీవ లోచన రామా ;

వాగ్గేయకారుడు - మైసూర్ వాసుదేవాచార్య ;

పాడినవారు - సుధా రంగనాథన్

ఆలాపన లేదు .. స్వర ప్రస్తారం (అంటే మధ్య మధ్య సాహిత్యం బదులు స్వరాలూ పాడడమేనా ) అయితే లేదు .

http://www.youtube.com/watch?v=n5jbvNIvSAk


2) నిన్ను కోరి

వాగ్గేయకారుడు - రామనాధ్ శ్రీనివాస అయంగార్ ;

పాడినవారు - ఎం డి రామనాథన్

http://www.youtube.com/watch?v=sDgv9-8dixs

ఆలాపన లేదు .. స్వర ప్రస్తారం - ఉందనుకుంటున్నా


పాడినవారు - శ్రీకాంత్ కృష్ణ మూర్తి

ఇతనిది ఫ్యూషన్ లా బానే ఉంది

ఆలాపన లేదు .. స్వర ప్రస్తారం - ఉందనుకుంటున్నా

http://www.youtube.com/watch?v=dB98XCzX00U

http://www.youtube.com/watch?v=jH5D_ctabyU&list=PL35A186A604D85FEB&index=18


నిన్ను కోరి కీర్తన /వర్ణం ఎవరు పాడినా కొంచం పదాలు విరిచేస్తున్నారు .. ఈ రాగం లో అలా చెయ్యకుండా పాడడం కష్టమా ??


హిందోళం -

1) సామజ వరగమనా

త్యాగరాజ కృతి ;

సుధా రంగానాథన్ .

http://www.youtube.com/watch?v=-XO0hV4yAEk

2) కొండలలో నెలకొన్న

అన్నమయ్య కీర్తన

శోభారాజు ; ఉన్ని కృష్ణన్ ; ప్రియ సిస్టర్స్

మిగతావి విన్నాకా ఈ కీర్తన కొంచం సంగీత పరంగా తేలిపోయిందని పించింది .. అన్నమయ్య కీర్తనలలో కంటే త్యాగయ్య కీర్తనలలో సంగీతానికి ప్రాముఖ్యత ఎక్కువేమో (సాహిత్యానికంటే ) అనిపించింది ..ఆ తరువాత ఇది తెలిసీ తెలియని వాగుడేమో అని కూడా అనిపించింది :)

http://www.youtube.com/watch?v=c5M-QL5GSRc


ప్రశ్నలు --

1) రాగానికి సంబంధంచిన ఆరోహణ అవరోహణ కీర్తన లో ఉంటే , కీర్తన ఆ రాగం లో ఉన్నట్టేనా మధ్యలో వేరే స్వరాలూ వచ్చినా ఫర్వాలేదా.


2) ఇంకోటి చొప్ప ప్రశ్నేమో - వాయిద్యం అయితే ట్యూన్ చేసుకున్నాకా మీటితే ఒక కరెక్ట్ ఫ్రీక్వెన్సీ స్వరం వస్తున్దనుకోవచ్చు .. గాత్రం లో అదెలా వస్తుంది .. అందరిది తలో రకంగా ఉంటుంది కదా గొంతు ..

పిచ్/శృతి సరి చేసుకోవడం అంటే ట్యూనింగ్ లాటి దేనా ..

ఆ శృతి చేసుకోవడం కూడా నాకు విచిత్రంగానే ఉంటుంది .. ఎలా తెలుస్తుంది .. వీళ్ళ పిచ్ శృతిబాక్స్ తో మ్యాచ్ అవుతుందని .


మీరు కొన్ని పాపులర్ కీర్తనలు చెబితే ఈ రెండు రాగాల్లో ఉన్నవి బావుంటుంది .. ఇంకా ఏమైనా తప్పక వినాల్సినవి మిస్ అయితే వినడానికి .


Kottapali said…
Dear Vasu,
I already like you very much. With this comment, I like you even more - if that is even possible.
Will answer your questions in the next post. Keep them coming.
Srinivas said…
నారాయణ స్వామి గారికి

"అనుభవపు స్థాయి" గురించి నేను అడగాల్సిన ప్రశ్న సరిగ్గా అడగలేదు. నేను అడగాలనుకున్నది ఇది: "జ్ఞ్ఞానం పెరిగినప్పుడు - nuances ఇంకా బాగా తెలిసి సంగీతాన్ని ఎక్కువ ఆస్వాదించగలమా? లేక సవిమర్శకంగా వినడం వల్ల ఆనందించడానికి ఇంకా ఎక్కువ "కష్టపడాల్సి ఉంటుందా"?" ప్రశ్న ఇర్రెలెవెంట్ అనిపిస్తే వదిలేయండి.
హిందోళం, మోహనం నేను తరచూ వింటుంటాను (యూ ట్యూబులో కాదు). ఇటీవల విన్నవి ఇవీ -

1. హిందోళం -
అ. "సామ గానలోలే" GN బాలసుబ్రమణ్యం గారి కృతి. అరుణా సాయిరాం పాడారు. ఆలాపనా, స్వరప్రస్తారం ఉన్నాయి. ఆవిడ పాట చాలా ఎనర్జెటిగ్గా ఉంటుంది.
ఆ. "నీరజాక్షి కామాక్షి" - ముత్తుస్వామి దీక్షితార్ రచన. బాలమురళి పాడారు. ఆలాపనా, స్వరప్రస్తారం ఉన్నాయి. ఆలాపన అర్థం కాలేదు (as usual). సాహిత్యం పాడేప్పుడు ముఖ్యంగా, స్వర ప్రస్తారంలో ఎంతో హాయి అనిపించింది. "గౌరీ హిందోళ ద్యుతి..." అని పాడుతూ ఉంటే ఉయ్యాల తూగు వినిపించింది.
2. మోహనం
అ. నను పాలింపగ - త్యాగరాజ కృతి. బాలమురళి గానం. ఆలాపనా, స్వర ప్రస్తారం ఉన్నాయి.
ఆ. ఎమ్మెల్వీ పాడిన ఓ రాగం తానం పల్లవి. ఆలాపనా స్వర ప్రస్తారాలు ఉన్నాయి.
రెండు మోహనాలూ బావున్నాయి. ఎందుకో తెలియదు కానీ నేను మోహనం ఆనందించడం హిందోళమంత చప్పున జరగలేదు.

శ్రీనివాస్
Kottapali said…
శ్రీనివాస్ గారు, సంతోషం. కొంచెం పని వత్తిడిలో ఉన్నాను. త్వరలో వివరంగా రాస్తాను.
Kottapali said…
శ్రీనివాస్ గారు, మీ ప్రశ్నలో ఉన్న రెండు భాగాలు - అవి ఛాయిస్ కాదు. నా దృష్టిలో రెండూ నిజమే.
Nuances బాగా తెలిస్తే ఎక్కువ ఆస్వాదించగలమా? కచ్చితంగా.
ఆస్వాదన అనేది పూర్తిగా వ్యక్తిగతమే. ఏమీ తెలియకుండా కూడా ఒక వ్యక్తి ఒక పాటని గొప్పగా ఆస్వాదించవచ్చు. వినగా వినగా అందులో కొత్తలోతులు అనుభవానికి వస్తే ఆ ఆస్వాదన హెచ్చు స్థాయిలో ఉంటుందని నా నమ్మకము, అనుభవమూ.
కష్టపడటం - ఇంతకు మునుపు అనుభవంలో లేని దాన్ని ఇప్పుడు తెచ్చుకోవడానికి కొంత సాధన అవసరం. అయితే ఏ కళ విషయంలో అయినా కళాస్రష్ట చెయ్యవలసిన సాధన వేరు, ఆస్వాదకులు చెయ్యవలసిన సాధన వేరు. సంగీతం విషయంలో రాసిఉన్న సాహిత్యం ఏది చూసినా అది కాబోయే సంగీత విద్వాంసుల కొరకు రాసినట్టు ఉన్నాయి తప్ప వినేవారి ఉపయోగం కొరకు రాసినట్టు లేవు. కొంతవరకైనా ఆలోటు పూరించాలనే ఈ టపాల వరుస, నా చిన్న ప్రయత్నం.
Kottapali said…
శ్రీనివాస్ గారు, దయచేసి ఈ పాట వినండి. ఈ కృతికి నాకు చాలా నచ్చిన రూపం ఇది.
వినేప్పుడు రెండు అంశాలమీద దృష్టి పెట్టండి.
1) మొదట ఆలాపనలో వయొలిన్ వాదన (మొదటి మూడు నాలుగు నిమిషాలు)
2) కృతి మొదలైనాక పల్లవికీ అనుపల్లవికీ వచ్చే సంగతులు (from 9.30 to 10.32 , again from 12.15 to 13.10)
Kottapali said…
Here is the link
http://www.youtube.com/watch?v=RfakrN8DgHY