పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 3

మర్నాడు (నవం. 22) కి ఎపాయింట్‌మెంట్లు ముందురోజునే ఫిక్సయిపోయినాయి. హైటెక్ సిటీ ఎం ఎం టియెస్ స్టేషన్లో రైలెక్కి, ఐదురూపాయల టిక్కెట్టుతో అరగంటలో సీతాఫల్ మండీ స్టేషన్లో దిగాను. వాటేనైడియా సర్ జీ! అని మనసులోనే సెల్యూట్ చేసుకున్నా. 2003-2004 ప్రాంతాల్లో ఈ ఎం ఎం టియెస్ నిర్మాణానికి పూర్వం జరిగిన తర్జన భర్జనలు, గోల, లీలగా గుర్తొచ్చాయి. ఇప్పుడు మెట్రో అని మరో నగర వ్యాప్త రైలు మార్గం రూపుదిద్దుకుంటున్నదిట. మావూళ్ళో నాకు ఆప్తమిత్రులైన పద్మ వాళ్ళ అమ్మగారింటికి చేరుకున్నా. డా. కుప్పా శ్రీనివాస శాస్త్రిగారు, డా. ఉషా శ్రీనివాస్ గారు ఇద్దరూ వారి వారి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులు. అంతేకాక తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఇద్దరికీనూ. యుగాది అనే పేరిట పుస్తక ప్రచురణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆసక్తికరమైన పుస్తకాలను ప్రచురించారు. వారమ్మాయికీ అల్లుడికీ స్నేహితుడిగానే కాక, నా పట్ల వారికి వాత్సల్యం కూడాను. ఉభయ కుశలోపరి పలకరింపులైపోయాక సుమారొక గంటన్నరసేపు వివిధ సాహిత్య విషయాలను గురించి మాట్లాడుకున్నాం. నాకు కొత్తగా పరిచయమవుతున్న యువ రచయితలని వారికీ పరిచయం చేస్తానని మాటిచ్చాను. తెలుగు సాహిత్యాన్ని ఉద్యమ ప్రాతిపదికమీద ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యవలసిన అవసరాన్ని గురించీ, ఈ మధ్య వెలువడిన అనువాదాల్లో లోపించిన నాణ్యతని గురించీ ముచ్చటించుకున్నాం. అసలు ఏ అనువాదమూ లేకపోవడం కంటే చెత్తదైనా ఏదో ఒక అనువాదం ఉండడమే మేలని తీర్మానించాం.

వారి మనవరాలు శ్రీకరి. నా మిత్రులు పద్మ సుధాకర్ల కూతురు. అమెరికాలో పుట్టి పెరిగి, 12 వ తరగతి విజయవంతంగా ముగించుకుని, కాలేజికి వెళ్ళేముందు ఒక సంవత్సరం భారత్ లో, హైదరాబాదులో, అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండి కొన్ని స్వఛ్ఛంద సేవా కార్యక్రమాలలో పనిచేస్తూ ఉన్నది కొన్ని నెలలుగా. పనిలో పనిగా తన నృత్యకౌశలానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్నది. ఆమె బాగులో ఆమె ఆలోచనలు, కొన్ని ఇండియా అనుభవాలు చదవచ్చు. ఆ రోజు కార్యక్రమం శ్రీకరిని నాకు మిత్రులైన ఒక స్వఛ్ఛంద సంస్థకి పరిచయం చెయ్యడం. వారి ఆఫీసు బర్కత్పురాలో ఉన్నది. ఆటోలో ప్రయాణం చెయ్యగలవా అనడిగితే శ్రీకరి నాకేసి వింతగా చూసి, నేను సిటీబస్సుల్లో కూడా తిరుగుతున్నా! అన్నది. నా ఎన్నారై మనస్తత్వాన్ని నేనే సైలెంటుగా మందలించుకుని ఆటో పిలిచాను. బర్కత్పురాలో నాకు చిరపరిచితమైన యుగాంతర్ ఆఫీసుని బయటి నుండి గుర్తు పట్టడం కొంచెం కష్టమయింది గానీ, ఆ వీధి చాలా చిన్నది కావడంతో తొందరగానే పట్టుకున్నాను. ఇక్కడనే కాదు, హైదరాబాదులో చాలా చోట్ల నాకు బాగా పరిచితమైన స్థలాలనే గుర్తు పట్టలేకపోయాను ఆ చుట్టు పట్ల బిల్డింగుల రూపు రేఖలు అనూహ్యంగా మారిపోవడం వల్ల.

యుగాంతర్ ఆఫీసులో అప్పటి మా గురువుగారు డా. విఠల్ రాజన్ గారిని, యుగాంతర్ నేతలు డా. కె. లలిత (of Women Writing in India fame), ఎం. శశికుమార్ గారలను కలిశాను. శ్రీకరి అక్కడ పని చేస్తున్న యువతీయువకులతో చర్చల్లోకి వెళ్ళిపోయింది. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు యుగాంతర్ నడుపుతున్న ప్రాజెక్టులు (దేశ వ్యాప్తంగా రూరల్ డెవలప్మెంటుకి సంబంధించి ఒక కీలకమైన ప్రాజెక్టు), పాత స్నేహితులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇలా రకరకాల విషయాలు ముచ్చటించుకున్నాం. విఠల్ గారు ఇతర బాధ్యత లన్నింటినించీ విరమించి ఇప్పుడు తన ఇంగ్లీషు ఫిక్షన్ రచన మీదనే శ్రద్ధ పెడుతున్నానని చెప్పారు. శశి కుమార్ గారిని మళ్ళీ మంచి ఆరోగ్యంతో చూడ్డం బాగుంది. లలిత గారు ఎప్పటి వలెనే వైవిధ్య భరితమైన ప్రాజెక్టుల మీద పని చేస్తున్నారు. ఆ ఆఫీసు, అక్కడి ఉత్సాహకరమైన వైబ్స్, ఆ ముందటి చిన్న ఆవరణ, సరిగ్గా చూసుకుని నడవకపోతే నుదుటికి కొట్టుకునేట్టు గుమ్మం పక్కనే జామచెట్టు .. అమెరికా వదిలేసొచ్చి మళ్ళీ యుగాంతర్లో పని చేద్దాం అనిపించింది చాలా బలంగా .. ఒక్క క్షణం పాటు.

లంచికి నారాయణగూడ చౌరస్తాలోని తాజమహల్ హోటల్ని సూచించారు మిత్రులు. శ్రీకరీ నేనూ అక్కడికి వెళ్ళాం భోజనానికి. ఏసీ డైనింగ్ హాలు బానే ఉంది గానీ ఆ మెనూ మహా గందరగోళంగా ఉన్నది. వెతికి వెతికి ఏవో రెండు పంజాబీ కడాయి వంటకాలు ఆర్డరిచ్చాను రోటీతో. తినడానికి వచ్చే సరికి రోటీ అప్పడంలా ఉన్నది. కూరలకి ఒక రుచీ పచీ లేదు. ఈ సారి నాన్ ఆర్డరిస్తే అదీ అలాగే ఉన్నది. అసలు సాంప్రదాయకంగా ఇడ్లీ వడ దోస లాంటి టిఫిన్లూ, థాలీ భోజనాలూ వడ్డిస్తూ వచ్చిన హోటళ్ళకి ఈ కొత్త కాలంలో కొంత ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందనుకుంటా. వినియోగదారులు నిజంగానే మారేరో, లేక మారేరని వీళ్ళనుకున్నారో .. ప్రతి మెనూలోనూ పంజాబీ వంటకాల లిస్టు, చైనీసు వంటకాల లిస్టు .. ఇంకా సవాలక్ష వస్తువులు .. ఇంతకీ ఏదీ తినడానికి రుచిగా ఉండదు! మెస్సుల్లో తప్ప ఒక సింపుల్ థాలీ భోజనం ఈ హోటళ్ళలో కనుమరుగై పోయినట్లుంది. కాలే కడుపుకి మండే గంజి .. ఏదోలే .. అని సర్ది చెప్పుకుని (బిల్లు మాత్రం గంజి లాగా లేదు, బెంజి రేంజిలో ఉంది .. ఈ సంగతి ఇదివరకే రాశాను గదా!) బయటపడ్డాం. శ్రీకరిని తను వెళ్ళాల్సిన చోటికి దింపేసి నేను నా తరువాతి ఎపాయింట్‌మెంటుకి పరిగెత్తా. అప్పటికే ఆలస్యం అవనే అయింది.

నారాయణ గూడా నించి నాంపల్లి గాంధీ భవన్ మరీ దూరం కాదన్నట్టు నాకు గుర్తు, కానీ ఆ ఇరుకు రోడ్లలోనుండి వెళ్ళేప్పటికి అరగంట పైనే పట్టింది. గాంధీభవన్ గేటు బయట ఆటో దిగి హడావుడిగా ఆవరణలో ప్రవేశించి నాకు సూచించబడిన ఎర్రరంగు కారు ఎక్కడున్నదా అని పరికిస్తుండగా, ఒక పక్కనించి "కొత్తపాళీ గారూ!" అని పిలుపు వినబడింది. అటు తిరిగి చూడగా, ఒక ఎర్రకారులోంచి స్నేహపూర్వకమైన చిరునవ్వుతో చెయ్యి ఊపుతూ .. ఆయనే సుబ్బారావు గారయి ఉండాలి. ఇంతలో ఆయనే కారు దిగి పలకరించారు. నిలువెత్తున, విశ్రాంత ఉపాధ్యాయుడినే అని చెప్పకనే చెబుతున్న హుందా అయిన విగ్రహం. ఇంకా ఆలస్యం చెయ్యడం ఇష్టం లేక ఇద్దరం వెంటనే కారెక్కగా, డ్రైవరు మా గమ్యం వేపుకి దారి తీశాడు. ఏ మాత్రం జాప్యం లేకుండా భలే గుర్తు పట్టారే! అన్నా సుబ్బారావుగారితో. ఏముందీ? మీ రూపం చూస్తేనే, ఇక్కడి వారు కారనీ, విదేశాలనించి వచ్చారనీ తెలిసేట్టు ఉన్నది. అటుపైన ఆవరణలోకి రావడం కొంత హడావుడిగా, చూపులతో వెతుక్కుంటూ వచ్చారు. ఒకవేళ ఆ వ్యక్తి మీరు కాకపోయినా, పోయిందేముంది, నా పిలుపుని పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్తాడు, అంతే కదా! అని నవ్వారు. ఆయన చూపులోని తీక్ష్ణత నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఎంతైనా కవి గదా అనుకున్నాను.

సుబ్బారావుగారు గుంటూరు జిల్లా నగరం కాలేజినించి విశ్రాంత ఆంగ్లోపన్యాసకులు, స్వయంగా ఇంగ్లీషులో మంచి కవి, కవిత్వ విశ్లేషకులు. ముఖ్యంగా తిలక్ కవిత్వాన్ని ఎంతో ఆర్ద్రతతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు (ఈ సంపుటి త్వరలో విడుదల అవుతుంది). వీరి పెద్దమ్మాయి డా. వైదేహి శశిధర్, అమెరికాలో పేరున్న తెలుగు కవయిత్రి. వారు అమెరికా వచ్చినప్పుడల్లా అడపాదడపా ఫోనులో మాట్లాడుకుంటూ ఉన్నాము గానీ ఇదే ప్రత్యక్షంగా కలవడం. శ్రీపాదవారి వడ్లగింజలు కథలో రాజావారూ శంకరప్పా తొలిసారి ఎదురుపడినప్పటిలా ఉంది ఆ సన్నివేశం, కనీసం నా మనసులో. గాంధీభవన్ నించి బయల్దేరి త్వరలోనే విశ్వనాథ సాహితీ పీఠం కార్యాలయానికి చేరుకున్నాము. పాతకాలపు ఇల్లువంటి భవన సముదాయం, అయినా చాలా చక్కగా మెయింటేన్ చేస్తున్నారు. ముందు ఆవరణలో మూణ్ణాలుగు కార్లు పార్కు చేసుకునే స్థలమే కాక పూల మొక్కలతో, చిన్న చెట్లతో ఆహ్లాదకరమైన ప్రదేశం. కార్యాలయం ముఖ్య భాగం విశాలమైన హాలు. పదిమంది కూర్చోవడానికి అనువుగా సోఫాలు, కుర్చీలు. తెల్లని వొత్తైన జుట్టుతో అంతే తెల్లని బట్టలలో డా. వెల్చాల కొండల్రావుగారి దర్శనం. ఆయనకి ఎనభై దాటాయంటే నమ్మడం చాలా కష్టం. ప్రభుత్వ కళాశాలల్లోనూ, అటుపై ఉన్నత విద్యా శాఖలోనూ ఉన్నత పదవులు నిర్వహించి అటుపై తెలుగు ఎకాడామీ సారధిగా పలు సంవత్సరాలు భాషా సేవ చేసి, ఇప్పుడు కొన్నేళ్ళుగా ఈ విశ్వనాథ సాహితీ పీఠాన్ని నెలకొల్పి నడుపుతున్నారు. మహాకవి, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి రచనలను విస్తృతమైన ప్రచారంలోకి తీసుకురావాలనేది ఈ సంస్థ ముఖ్యోద్దేశం. విశ్వనాథవారి రచనల పునర్ముద్రణ నేరుగా వారి వంశజుల చేతుల్లో ఉండగా, ఆ పనిని మినహాయించి, ఇతరమైన అనేక వనరులను (ఉదాహరణకు అనేక విడియోలు, ఆడియోలు) సేకరించడం, అనువాదాలు, విశ్వనాథ సాహిత్యాన్ని గురించి విశ్లేషణలు - ఇత్యాది ప్రయత్నాలను బహుముఖంగా చురుకుగా చేస్తున్నారు. ఇప్పటికే ఆంగ్లంలో Viswanatha A Literary Legend అనే పెద్దపుస్తకం వేశారు. ఇదికాక జయంతి అనే పేర ఒక త్రైమాసిక సాహిత్య పత్రిక నడుపుతున్నారు.

వారు ఇటీవల పూనుకున్న ఒక బృహత్కార్యం వేయిపడగలు నవలను ఆంగ్లంలోకి అనువదింపజేసి ముద్రించడం.ఆ అనువాదకుల బృందంలో నేను కూడా ఒకణ్ణి కావడం కొంత నా పూర్వజన్మ సుకృతం, కొంత సుబ్బారావుగారికి నామీద ఏర్పడిన వాత్సల్యమూను. ఈ అనువాదక బృందంలో డా. వైదేహి శశిధర్ అమెరికాలో ఉండగా, హైదరాబాదు వాస్తవ్యులైన డా. అరుణ వ్యాస్, డా. రేవూరి అనంతపద్మనాభరావు, శ్రీ పి. ఆత్రేయ శర్మ, శ్రీ సి. సుబ్బారావు గారలతో ఇది తొలి సమావేశం. అరుణగారు అప్పటికే వచ్చి ఉన్నారు. పద్మనాభరావుగారు మాతోపాటే రంగప్రవేశం చేయగా ఆత్రేయశర్మగారు మరి కొంతసేపటికి వచ్చి చేరారు. ముందుగా పీఠం కార్యకలాపాలను గురించి కొండల్రావుగారు చెప్పారు. తాము సేకరించిన విశ్వనాథవారి శ్రవ్యకాలు, ముఖ్యంగా కిన్నెరసాని పాటలు పాడినవి వినిపించారు. అటుపైన అనువాద ప్రక్రియను గురించీ, వేయి పడగలు అనువాదంలో శ్రద్ధ వహించవలసిన అంశాలను గురించీ లోతైన చర్చ జరిగింది. త్వరలోనే ఈ ఆంగ్లానువాదం పుస్తకరూపంలో వెలువరించాలని కొండల్రావుగారు అన్నారు. అల్పాహార విందు తరవాత కొన్ని ఫొటోలు తీసుకుని శలవు పుచ్చుకున్నాం. సుబ్బారావుగారు నన్ను మళ్ళీ నారయణగూడా చౌరస్తాలో దింపి వెళ్ళిపోయారు.
ఎడమనించి: పద్మనాభరావు, ఆత్రేయశర్మ, నారాయణస్వామి, కొండల్రావు, సుబ్బారావు, అరుణ వ్యాస్

ఉదయం పూట యుగాంతర్ ఆఫీసులో కలవడం మిస్సయిన మిత్రులు మదన్మోహన్ రావుగారొచ్చి కలిశారు. మేం కలిసి పనిచేసినప్పటి పాత జ్ఞాపకాలతో పాటు ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ప్రాజెక్టులని గురించి కూడా ముచ్చటించుకున్నాము. ఇంతలో బ్లాగు మిత్రులు, విలక్షణమైన రచయిత, పాత్రికేయుడు, నరేష్ నున్న వచ్చి కలిశారు కానీ ఆయనతో ఎక్కువసేపు ముచ్చటించే అవకాశం లేకపోయింది.
ఎడమనించి: నారాయణస్వామి, నరేష్, మదన్

అప్పటికే జ్యోతిగారు రెండు సార్లు ఫోన్ చేశారు, ఏంటి, ఎక్కడున్నారు అని. మేం పరస్పరం వీడుకోళ్ళు పుచ్చుకుని బయల్దేరుతుంటే మదన్ ఆ పూటకి తన కారు వాడుకొమ్మన్నారు. సరేనని మేం బయటికి వచ్చి చూస్తే డ్రైవరూ కనబడ్డు, కారూలేదు. మొత్తానికి ఓ ఐదునిమిషాల వెతుకులాట తరవాత డ్రైవరు సెల్లులో దొరికాడు. ఎక్కడున్నావు నాయనా అంటే, హోటలు కింద సెల్లారు పార్కింగులోకి కారు పెట్టానని చెప్పాడు. సరే బయటికి రమ్మంటే, అంతకు ముందే అక్కడ జరుగుతున్న ఏదో బిల్డింగు పనిలోనించి పల్చగా సిమెంటు కలిసిన బోలెడు నీళ్ళు ఆ దారిలో వొంపారు పనివాళ్ళు. ఆ ఇరుకైన సెల్లారు స్లోపు మీద, ఆ జారుడులో ఆ కారుని పాపం నానా తంటాలూ పడి బయటికి తెచ్చాడు, ఉపద్రవమేమీ జరక్కుండానే. మదన్ కి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుని కారెక్కి బయల్దేరాను. జ్యోతిగారింటికి ఐదు నిమిషాల్లో చేరతానని అంచనా. అరగంట పట్టింది!

తనిష్క్ ఎదురుగా గల్లీ అని చెప్పారు. ముందసలు ఆ తనిష్క్ కనబళ్ళేదు. లిబర్టీ సర్కిల్ దాకా వెళ్ళి, మళ్ళి చాంద్రాయణం తిరిగొచ్చాం. ఈ సారి జాగ్రత్తగా చూస్తే, మిగతా షాపులన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతుండగా తనిష్కు వాళ్ళు అప్పటికే లైట్లార్పుకుని కొట్టు కట్టేసుకుని వెళ్ళిపోయారు. మొదటి సారి అలా మిస్సయ్యాం. సరే ఈ సారి గల్లీ దొరికిందని తిరగ్గానే, అందులో రెండు గల్లీలు తెరుచుకున్నాయి. ఇదేదో నిజంగా ఏలిస్ ఇంద వండర్లాండ్ లాగుందని .. మొత్తానికి వాళ్ళింటికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి అప్పటికి ఇల్లు పట్టుకోగలిగాను. అలా అరగంట వేస్టయింది. దారి సరిగ్గా తెలియకపోతే, గమ్యం మన పక్కనే ఉన్నా ఎంత గుడ్డితనంలో ఉంటామో కదా! జీవితంలో అనుభవించే అయోమయ అవస్థకి ప్రతీకలా అనిపించింది ఈ అనుభవం. జ్యోతిగారి భర్త గోవర్ధన్ గారు సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే ఆలస్యం అయిందని వెంటనేనే భోజనం వడ్డించారు. కొద్దిగా నా ప్రయాణ విశేషాలూ, ఇంకా రకరకాల విషయాలను గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశాము. ఆ రోజు భోజనంలో హైలైట్ కుబానీ కా మీఠా. నేనిది ఇంతకు మునుపెన్నడూ తినలేదు. అద్భుతంగా ఉన్నది. మరి కాసేపు కబుర్లు చెప్పుకుని ఇంక ఆ దంపతులవద్ద శలవు తీసుకున్నాను.

అప్పటికి పది దాటింది. హమ్మయ్య, రోజు ముగిసిందనుకున్నారా? తప్పులో కాలేశారు. రోజులోకెల్లా అతి ముఖ్యమైన, సరదా అయిన మీటింగుకి దారి తీశాను ఇక్కణ్ణించి.

అప్పటికి ట్రాఫిక్కు కొంచెం సద్దు మణగడంతో పదిహేను నిమిషాల్లోనే బంజారా హిల్సులో గమ్యస్థానం చేరుకున్నా. నా హోస్టులు సస్పెన్సు సినిమాలు తీస్తూ అదే బాగా అలవాటయిందేమో, అక్కడికొచ్చి ఫోన్ చెయ్యండన్నారు. ఫోన్ చేస్తే, అరె, అప్పుడే వచ్చేశారా అని ముందు ఆశ్చర్యపడి, ఇదిగో వచ్చేస్తున్నాం అని భరోసా ఇచ్చారు. నా దశ బాగుండి ఆ భరోసా వెనకాలే వాళ్ళూ సాక్షాత్కరించారు .. నవతరంగం నిర్వాహకులు, వర్ధమాన సినిమా దర్శకులు: వెంకట్ సిద్ధారెడ్డి, మహేశ్ కత్తి, సత్యప్రసాద్ అరిపిరాల. మధ్యలో సింగిల్ మాల్ట్ స్కాచి సీసా, చుట్టూ నాలుగు దప్పిక గొన్న మెదళ్ళు. సీసా ఖాళీ అయిందికానీ కబుర్ల బావి ఎండలేదు. నవతరంగం గురించీ, ఫేస్బుక్ గురించీ, సినిమాల్లో వాళ్ళ అనుభవాల గురించీ, ఎడారి వర్షం గురించీ, మునెమ్మ గురించీ, డా. కేశవరెడ్డి గురించీ, సాహిత్యాన్ని సినిమా తియ్యడంలో లోతుపాతుల గురించీ, సంగీతం గురించీ .. ఆ కబుర్లకి అంతులేదు.  నా డ్రైవర్ని వెనక్కి పంపేశాను, ఆలస్యమవుతోందని. రెండింటికి మహేశ్ శలవు తీసుకున్నారు. ఏ మూడున్నరకో సత్యప్రసాదూ, వెంకట్, నేనూ అక్కడే నడుం వాల్చాం.

 ఎడమనించి: మహేశ్ కత్తి, అరిపిరాల సత్యప్రసాద్, నారాయణస్వామి, వెంకట్ సిద్ధారెడ్డి.

Comments

శ్రీ said…
బాగుందండీ ఇంకో విడత కబుర్లు!
ఖుర్బానీ కా మీఠా, మన షికాగోలో దీవాన్ వీధిలో బాగా దొరుకుతుంది. అపుడపుడూ నమస్తే ఇండియాలో కూడా చేస్తూ ఉంటాడు.

ఇక రాత్రి పది అయినా ఆగని మీ ప్రయాణం సరదాగా ఉంది.

తరువాత తిరుపతేనా?
Kottapali said…
శ్రీ, తిరుపతికి ముందు ఇంకా చాలా కథుంది :)
Unknown said…
Baavundi mee moodo postu..migilina anni postuloo okka saare chooseyyaalanipistondi gaanee, bangaaru gudla baatu mandalistondi!!
DG said…
హైద్రాబాదులో అంత చలిగా ఉందాండీ మీరు అన్ని ఫోటోల్లోనూ స్వెట్టర్లో కనిపిస్తున్నారు? అక్కడివాళ్ళు మామూలుగానే ఉన్నారే? లేకపోతే ఇంకా విమానం దిగి నాల్రోజులు అవకుండానే ఎలా తీయడం అంటారా? :-)

అన్నట్టు చెప్పడం మర్చాను. నేను మే 2014 లో ఇండియా వెళ్ళినప్పుడు రాత్రి పది తర్వాత రోడ్డుమీదకి రావొద్దు అని స్టెర్న్ వర్నింగ్ ఇచ్చారు. ఇంటివాళ్ళు కూడా తలుపులు తాళాలు వేసేసుకుని అటునుంచే ఫోనులో అక్కడే పడుకుని పొద్దున్న రా అని కితాబిచ్చేవారు. మీరు అదృష్టవంతులే.
Kottapali said…
Amarendra garu, I too would like to finish it soon, but even putting down only the most essential details is still taking a lot of time/space/effort. BTW, the next part will start with our memorable get together :)

DG గారు, స్వెటరు ధారణ .. హమ్మ్. చెప్పేందుకేం లేదు. మే 2014లో?? అంకె తప్పు అయుండాలి. ఏ వూళ్ళో రాత్రిళ్ళు బయటికి వెళ్ళొద్దు అన్నది? నేనుకూడా ఆ రోజు పదిన్నరకల్లా గమ్యం చేరుకున్నాను. రోడ్ల భయం కాదుగానీ, నాకు ఆశ్రయమిచ్చిన మిత్రుణ్ణి తెల్లారి మూడింటికి నిద్ర లేపడం ఇష్టం లేక ఉన్నచోటే ఉండిపోయాను. మిగతా ఎక్కడా కూడా మరీ పొద్దుపోయి బయట తిరగలేదు, ఆ అవసరమూ రాలేదు.
Bhoopathi said…
చివరి పేరా లో అయిదో లైను చాలా బాగుంది.

-- విహారి
రవి వీరెల్లి said…
సస్పెన్స్ కథలా భలే ఉంది.
"మధ్యలో సింగిల్ మాల్ట్ స్కాచి సీసా, చుట్టూ నాలుగు దప్పిక గొన్న మెదళ్ళు." ఇది హైలైట్. మీ వచనం చాలా బాగుంది.
DG said…
తప్పు నాదేనండి. మే 2013 అని రాయవల్సింది. హైద్రాబాదులోనే పది తర్వాత రావద్దని చెప్పినది. నేను వెళ్ళిన ప. గో. జిల్లాలో ఇలా లేదు. అర్ధరాత్రి, అపరాత్రి కూడా బాగానే తిరుగుతున్నారు రోడ్లమీద. హైద్రాబాదులో సాయంకాలం 5:30 కి మెడలో గొలుసులు లాగేస్తున్నారుట. అసలు బయట నడవొద్దు అని చెప్పేరు. గొలుసు పోతుందని కాదు కానీ, ఆ లాగడంలో మెడ తెగిపోతోంది. మా చుట్టాలకి అలా జరిగింది.

అదీకాక రోడ్డుమీద కుక్కలు దారుణం; అవును హైద్రాబాదులోనే. ఈ గ్రామ సింహాల గురించి ఒకసారి న్యూస్ లో వచ్చింది. కానీ ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. అన్నింటికీ స్టిక్కర్ షాకు ముందు నుంచే తగులుతోంది ఇండియా వెళ్తే. మొదటిది బాంబే ఎయిర్ పోర్టులోనే తగిలింది. కాఫీ అక్షరాలా 250 రూపాయలు (శాంతా క్రజ్). అంటే స్టార్ బక్స్ కన్నా ఎక్కువే. అయితే రోడ్డుమీద ఉన్న కొన్ని టిఫిన్ సెంటర్స్ లో రేట్లు ఫర్వాలేదు. దోశ 20, ఇడ్లీ 10 అలా దొరుకుతున్నాయి. మొత్తం ఫేమిలీ అంతా 150 కి ఫలహారం చేయవచ్చు ($3 అంటే చీపే మరి:-))

ఓ సారి డాలర్ రూపాయల కన్వర్షన్ మర్చిపోదామంటే కుదరదు. ఈ రేట్లు మనల్ని చంపుతూ ఉంటాయి వెనక్కి వచ్చేదాకా. ఇవి ఇలా ఉంటే ఇంక హైద్రాబాదే కాదు ఆంధ్రాలో ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశం కాదు, ధృవ నక్షత్రందాకా పాకిపోయేయి.

నేను ఒకప్పుడు ఇల్లు కొందామనుకున్నాను హైద్రాబాదులో. ఇప్పుడు కొనలేని స్తితిలోకి వచ్చేను. దానికేనా ఈ ఏడుపు అంటే కాదు కానీ, ఈ ధరలు మరీ దారుణం. ఒక్క రైతు బజార్ తప్ప ఆఖరికి అంబానీ గారి గ్రోసరీ షాపు కూడా మామూలు వాళ్ళకి అందదు.

మంచి జోకు ఇండియాలో ఏమిటంటే ఎక్కడైనా సరే బేరం ఆడవచ్చు. పట్టుచీరల దగ్గిర్నుంచి కరివేపాకు దాకా ఏ షాపులోనైనా సరే మీకు ఆ రేటు నచ్చకపోతే ఏదో డిస్కౌంట్ తో వాళ్ళే మొదలు పెడుతున్నారు బేరం. ఆ తర్వాత నడుమ్మీద చేతులు పెట్టి మన ఇష్టం వచ్చినంతసేపు బేరం సాగించవచ్చు. మేము అలాగ మా వాళ్ళు బేరం చేస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయేము. చాలా చిత్రంగా అనిపించింది.

ఏది ఏమైనా ఫైనన్షియల్ ఫ్రీడం (తెలుగులో ఏమనాలో మరి దీన్ని) ఉంటే ఇండియా వెళ్ళిపోవడం మంచిదే అనిపించింది నాకు. జననీ జన్మభూమీ, జయ జయోస్తు మాతృ భూమి అన్నారు కదా?