పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 2

బొంబాయి ఆసుపత్రిలో కోలుకుంటున్న మా పెద్దమ్మగారి సేవలో గడిచింది మొదటి రోజంతా. కొలాబా ప్రాంతం ఎప్పుడూ నన్ను అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఇక పెద్దమ్మ ఉన్న గది పన్నెండో అంతస్తులో ఉండడంతో ఏ గవాక్షాన్నించి బయటికి తొంగిచూసినా ఆ వ్యూ మా గొప్పగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది వారి వారి విధి నిర్వహణలో కనబరిచిన శ్రద్ధ చూసి ముచ్చటేసింది. పేషెంట్ల భోజనావసరాలు చూసే అతనయితే పాపం నాక్కూడా టీ యిచ్చాడు. సాయంత్రం ఏడింటికల్లా ఐఐటీ నించి అన్నయ్యా, అన్నయ్య కొడుకూ, ఇంటి నించి వదినా వచ్చేశారు. దూరంగా ఉంటున్న చెల్లెలూ కుటుంబంతో సహా వచ్చి చేరారు. పలకరింపుల కోలాహలంతో మా పెద్దమ్మని కూడా అందరూ ఓ గంటసేపు ఆహ్లాదపరిచి, ఆసుపత్రివాళ్ళు విజిటింగ్ సమయం ముగిసిందని అదిలించగా బయటపడ్డాము. అక్కడికి దగ్గర్లోనే బలవాస్ అనే పూటకూళ్ళింటో భోజనం చేశాం. ఒక్కో వంటకమూ రూ. 250 రేంజిలో ఉన్నాయి. ఈ రేట్లు దేశమంతటా సర్వసాధారణమని తరవాత మెల్లగా తెలిసి వచ్చింది. ఆ సాయంత్రమంతా మా చెల్లి కొడుకులిద్దరితోనూ, మా అన్నయ్య కొడుకుతోనూ ముచ్చట్లాడుతూ హాయిగా గడిచింది.

మర్నాడు మా పెద్దమ్మని మరొకసారి పలకరించి, ఇంటికొచ్చి మళ్ళీ విమానాశ్రయం దారి పట్టాను. మధ్యాన్నప్పూట కావడంతో ఈ సారి ప్రయాణం గంటమ్ముప్పావు పట్టింది. ఇండిగో విమానంలో హైదరాబాదు చేరాలి. నేనేమో విదేశీ ట్రంకు పెట్టెల్తో దిగాను కదా. అక్కడికీ వాళ్ళు కొంచెం బరువు కన్సెషను ఇచ్చారు కానీ మిగతా బరువుకి అదనపు ఛార్జీ అన్నారు. ఆ చెల్లింపు చెయ్యడానికి వెళితే, వాళ్ళు ఎంతకీ తెమలరే! ఒక్కొక్క చెల్లింపు తీసుకోడానికీ వాళ్ళకి సరిగ్గా పది నిమిషాలు పట్టింది. చాలా ఇనెఫిషియెంట్ సిస్టం. అలా బొంబాయి ఏర్పోర్టులో వాళ్ళు ఎలా నెగ్గుకొస్తున్నారో మరి! తొందరగా చెకిన్ చేసి లౌంజులో హాయిగా కూర్చుని ఒక కాఫీ తాగుదామనుకున్న నాకు అడియాసే మిగిలింది. విమానమూ, ప్రయాణమూ బానే ఉంది.

హైదరాబాదులో యువమిత్రుడు అమిత్ వచ్చి రిసీవ్ చేసుకుని హైటెక్ సిటీ దగ్గర నా కాలేజి మిత్రుడు చక్రి వాళ్ళింటో దిగబెట్టి, నా వాడుకకోసం ఒక సెల్ఫోనిచ్చి వెళ్ళాడు. ఇక ఆ పూట వేరే పనులేమీ పెట్టుకోలేదు. చక్రి కుటుంబంతో ముచ్చట్లాడుతూ ఉండిపోయాను.

ఇక మర్నాడు మొదలైంది హడావుడి. కొన్ని తర్జన భర్జనల తరవాత దగ్గర్లోనే ఉన్న స్వాతి (బ్లాగరి, కవయిత్రి, కథకురాలు స్వాతి బండ్లమూడి) గారింటికి చేరుకున్నా సుమారు పదింటికల్లా. కొంతసేపటికి చావా కిరణ్ పుత్రికారత్నంతో సహా దర్శనమిచ్చారు. మరి కొంతసేపటికి బ్లాగాడిస్తా రవి రాకతో సందడి పెరిగింది. కాసేపు పాతకాలపు బ్లాగు జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. పెళ్ళి చేసుకుని ఎవరు రాయడం మానేశారు, పిల్లలు పుట్టి ఎవరు రాయడం మానేశారు, ఇప్పుడు ఎవరెవరు ఏమేం రాస్తున్నారు - ఇలాంటివన్నీ ఓ సారి తిరగేశాం. ఇస్మాయిల్ స్మారక పురస్కారం పొందినందుకు నేను ఆమెని అభినందించలేదని స్వాతి కొంచెం సేపు నామీద అలిగారు. అలక తీరినాక తాజా జామకాయ ముక్కలు పెట్టారు అందరికీ. రవితో కాసేపు ఆయనకిష్టం లేని విశ్వనాథ రచనలని గురించీ, కాసేపు ఆయనకిష్టమైన సంస్కృత రస గుళికల గురించీ మాట్లాడుకున్నాం - అంటే, ఆయన చెబుతుండగా మేం విన్నాం చాలా మట్టుకి. అక్కడే భోజనం చేసి బయల్దేరుతుంటే స్వాతిగారు డ్రైవర్నిచ్చి కారులో పంపారు. రవిని వాళ్ళ ఆఫీసు దగ్గర దింపేసి నేను మెహిదీపట్నం దగ్గర మా బాబాయిగారింటికి వెళ్ళాను.

బాబాయి వాళ్ళతో ఓ రెండు గంటలు కబుర్లాడుకున్నాక అక్కణ్ణించి ఆటోలో బంజారా హిల్సులోని సాక్షి కార్యాలయానికి వెళ్ళాను. ఆటో వందరూపాయలు అడిగాడు. ఎక్కువేననిపించింది గానీ బేరమాడే ఓపిక లేక, సరైన రిఫరెన్సు పాయింటూ లేక సరేనని వెళ్ళాను. ముస్లిం అబ్బాయి. ఆటో సంపాదన పరవాలేదు, అవసరాలు బాగానే గడుస్తున్నాయి. కానీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇద్దరు పిల్లల్లో అమ్మాయి పెద్దది, పదో తరగతి చదువుతోందిట ప్రభుత్వ పాఠశాలలో. బాగా చదువుతుంది, పైకి చదివించు అని టీచర్లు, పక్కవాళ్ళు సలహా ఇస్తున్నారుట. కాలేజి ఖర్చులు తట్టుకోగలనా అని ఇతను జంకుతున్నాడు పాపం. దిగేటప్పుడు ఒప్పుకున్న వందకి ఇంకో ఇరవయ్యిచ్చి, పిల్లలకిమ్మని నాలుగు చాక్లెట్ల్ఇచ్చి సాక్షి ఆఫీసులోకి నడిచాను.
 
మూడేళ్ళ కిందట సాక్షి ఆఫీసు బయట ఉన్న సెక్యూరిటీ హడావుడి ఇప్పుడు లేదు. సునాయాసంగానే అన్వరు డెస్కు చేరుకున్నాను. ముందు కాసేపు పాత కబుర్లు నెమరేసుకున్నాము - బ్లాగుల్లో పరిచయం, అతను నా కథల పుస్తకానికి బొమ్మలు వెయ్యడం, ఇవన్నీ. ఇంతలోకే బయటినించి అరిపిరాల సత్యప్రసాద్, సాక్షి లోనించే పూడూరి రాజిరెడ్డి, వేంపల్లి షరీఫ్ వచ్చి కలిశారు. ఏంటేంటో చాలా మాట్లాడేసుకున్నాం. అటు తిరిగి, ఇటు తిరిగి చర్చ - ఎందుకు రాస్తున్నాం? ఎవరు చదువుతారు? దగ్గరికొచ్చి ఆగింది. కవిసంగమం ద్వారా కవిత్వంలో మంచి చైతన్యం వచ్చింది, యువకవులు బాగా రాస్తున్నారు, కథలకి కూడా ఒక సక్రమ ప్రాతిపదికన ఇలాంటిదేదైనా చెయ్యాలి అని ఒక ప్రతిపాదన వచ్చింది. అటుపైన నా ఫేవరెట్ ప్రశ్న - ఎందుకు తెలుగు సాహిత్య పుస్తకాల్ని హెచ్చు సంఖ్యలో అమ్మలేకపోతున్నాం? అనేది వాళ్ళ ముందు పెట్టాను. ఈ ప్రయాణంలో నాకు దొరికిన ప్రతీ వేదిక మీదా ఈ ప్రశ్నని లేవనెత్తుతూనే వచ్చాను. అక్కడక్కడ చర్చల్లో రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి, కానీ ఏదైనా చివరికి కార్యాచరణగా పరిణమించాలి గదా! అన్వరు ఇప్పించిన టీ తాగి అందరం క్యూబికిల్ బయటికి వచ్చేప్పటికి అదే ఫ్లోరులో ఖదీర్ బాబు కూడా ఉన్నారని తెలిసింది. ఆయన క్యూబికిల్ కి వెళ్తే అక్కడ జి.ఆర్. మహర్షిగారు కూడా ఉన్నారు. ఇదేదో చారిత్రాత్మక సందర్భంలా ఉన్నదని చెప్పి, ఆ అవకాశం మిస్సవకుండా ఒక మంచి గ్రూప్ ఫొటో తీసుకున్నాం.
ఇందులో ఎడమనించి: అన్వర్, సత్యప్రసాద్, ఖదీర్ బాబు, నారాయణస్వామి, జి. ఆర్. మహర్షి, రాజిరెడ్డి, షరీఫ్
ఇంకా చెప్పుకోవాల్సిన కబుర్లు చాలానే ఉండిపోయినా (ఇలాంటి బృందాలతో కలిసినప్పుడు ఆ కబుర్లకి అసలు అంతు అంటూ ఉంటుందా?) ఎవరికీ వెళ్ళిపోవాలని లేకున్నా - వాళ్ళకేమో పని సమయం కావడం వల్లనూ, నేనేమో నా తరువాయి ఎపాయింటుమెంటుకి అప్పటికే ఆలస్యమయి ఉండడంతోనూ, ఇంక తప్పనిసరై శలవు పుచ్చుకున్నాం.

అక్కణ్ణించి మళ్ళీ ఆటోలో పాత ఎమ్మెల్యే క్వార్టర్సు దగ్గర అక్షరసీత గారి ఆఫీసుకి చేరుకున్నా. అక్కడ తానాపత్రిక నిర్వహణలో నా తోటి శ్రామికులు సీత, వాసిరెడ్డి నవీన్ కలిశారు. కొంతసేపు తానాపత్రిక నిర్వహణ వ్యవహారాలు మాట్లాడుకున్నాక, కొత్త పుస్తకాలు ఏం వస్తున్నాయి, కథల్లో ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయి, పత్రికల స్టాండర్డ్ ఎలా ఉంది అని కాసేపు ముచ్చటించుకున్నాం. నా అదృష్టం బాగుండి నవీన్ తాను కూడా జుబిలీహిల్స్ వేపుకే వెళ్ళాలని బయల్దేరారు. సీతాగారిని ఇంట్లో దింపేశాక దాదాపు ముప్పావు గంత ప్రయాణంలో హైదరాబాదులో మాకిద్దరికీ కామన్ సాహిత్య మిత్రులందరినీ ఒకసారి తలపోసుకున్నాం.

జుబిలీహిల్స్ సెలబ్రేషన్స్ అనే పూటకూళ్ళింట్లో మా ఆర్యీసీ క్లాస్మేట్లు ఇరవైమంది సన్నిహిత మిత్రులతో విందు ఈ రోజు ఆనందానుభవానికి పరాకాష్ఠ. కవిమిత్రుడు విన్నకోట రవిశంకర్ కూడా ఆ సమయానికి హైదరాబాదులో ఉండి ఈ విందులో కలవడం చాలా ఆనందమైంది. సిబీఇ జేడీ లక్ష్మీనారాయణ, నెల్లూరు వాణిజ్య పన్నుల అధికారి మొహమ్మద్ ఇంతియాజ్, ఇటీవలే ఉద్యోగరీత్యా హైదరాబాదుకి బదిలీ అయి వచ్చిన మిత్రుడు కొండల్రావు - వీళ్ళంతా కలవడం అదనపు ఆనందం. మధ్య మధ్యలో భాస్కర్ సరికొత్తగా తీస్తున్న సినిమా విశేషాలు. ఆర్యీసీ వాళ్ళు నలుగురొక్క చోట చేరారంటేనే ఆ సందడి చెప్పనలవి గాదు. ఇక ఇరవైమందంటే మాటలా. సెలబ్రేషన్స్ లో భోజనం చాలా బావుంది. బహుశా ఈ ప్రయాణంలో ఇళ్ళల్లో తిన్నవి కాక నేను ఆస్వాదించిన మేలైన భోజనం ఇదే.

Comments

శ్రీ said…
బాగున్నాయండీ మీ కబుర్లు! కాళ్ళకి చక్రాలు కట్టుకుని బాగా తిరిగేసారు.
venkat said…
ఆ తర్వాత?